Logótipo YouVersion
Ícone de pesquisa

ఆదికాండము 21

21
చివరికి శారాకు ఒక శిశువు పుట్టుట
1యెహోవా శారాకు కుమారున్ని అనుగ్రహిస్తానని ఆమెకు వాగ్దానం చేశాడు. ఆయన వాగ్దానం చేసినట్లే ఆమెపై అనుగ్రహాన్ని చూపాడు. 2అబ్రాహాము వృద్ధాప్యంలో శారా గర్భవతి అయ్యింది, అతనికి ఒక కుమారుని కన్నది. ఈ సంగతులన్నీ సరిగ్గా దేవుడు వాగ్దానం చేసినట్టే జరిగాయి. 3శారా కుమారుని కన్నది, అబ్రాహాము వానికి ఇస్సాకు అని పేరు పెట్టాడు. 4దేవుడు ఆజ్ఞాపించినట్లు, ఇస్సాకుకు ఎనిమిది రోజులు నిండగానే అబ్రాహాము అతనికి సున్నతి చేశాడు.
5తన కుమారుడు ఇస్సాకు పుట్టినప్పుడు అబ్రాహాము వయస్సు 100 సంవత్సరాలు. 6“దేవుడు నన్ను సంతోషపెట్టాడు. ఇది విన్న ప్రతి ఒక్కరూ నాతో సంతోషిస్తారు. 7నేను శారాను. అబ్రాహాము కుమారుణ్ణి పొందుతాడని ఏ ఒక్కరూ తలంచలేదు. కానీ ఆయన వృద్ధుడుగా ఉన్నప్పుడు అబ్రాహాముకు నేను ఒక కుమారుని కన్నాను” అంది శారా.
ఇంట్లో సమస్య
8ఇస్సాకు ఎదుగుతున్నాడు. త్వరలోనే గట్టి పదార్థాలు భోజనం చేసేటంతటి పెద్దవాడయ్యాడు. అప్పట్లో అబ్రాహాము ఒక మహా గొప్ప విందు చేశాడు. 9గతంలో ఈజిప్టు బానిస స్త్రీయైన హాగరు ఒక కుమారుని కన్నది. ఆ కుమారునికి కూడా అబ్రాహామే తండ్రి. అయితే ఆ కుమారుడు ఇప్పుడు ఇస్సాకును వేధించడం శారా చూసింది. 10కనుక “ఆ బానిస స్త్రీని, ఆమె కుమారుణ్ణి బలవంతంగా వెళ్లగొట్టు. మన మరణం తరువాత మన కుమారుడు ఇస్సాకు మన ఆస్తి అంతటికి వారసుడవుతాడు. దానిలో దాసీ కుమారుడు ఇస్సాకుతో భాగం పంచుకోవటం నాకు ఇష్టం లేదు” అంటూ శారా అబ్రాహాముతో చెప్పింది.
11ఇదంతా అబ్రాహాముకు బాధ కలిగించింది. తన కుమారుడైన ఇష్మాయేలును గూర్చి అతడు చింతించాడు. 12కానీ అబ్రాహాముతో దేవుడన్నాడు: “ఆ పిల్లవాణ్ణి గూర్చి నీవు చింతించకు. ఆ బానిస స్త్రీని గూర్చి నీవు చింతపడకు. శారా కోరినట్టే చేయి. ఇస్సాకు మాత్రమే నీకు వారసుడయిన కుమారుడు. 13అయితే నీ బానిస స్త్రీ కుమారుణ్ణి కూడా నేను ఆశీర్వదిస్తాను. అతడూ నీ కుమారుడే, కనుక అతని వంశం నుండి గూడ నేను ఒక గొప్ప జనాన్ని చేస్తాను.”
14మర్నాడు వేకువనే అబ్రాహాము కొంత భోజనాన్ని, తిత్తిలో నీళ్లను తెచ్చాడు. అబ్రాహాము వాటిని హాగరుకు ఇచ్చాడు. హాగరు వాటిని తీసుకొని, తన కుమారునితో కలసి వెళ్లిపోయింది. హాగరు ఆ చోటు విడిచి బెయేర్షెబా అరణ్యంలో సంచరించింది.
15కొన్నాళ్లకు తిత్తిలోని నీళ్లన్నీ అయిపోయాయి. త్రాగటానికి ఏమీ మిగలలేదు. కనుక హాగరు తన కుమారుణ్ణి ఒక పొద పక్కన పెట్టింది. 16హాగరు కొంచెం దూరం నడచి వెళ్లింది. అక్కడ ఆగిపోయి కూర్చుంది. నీళ్లు లేవు గనుక తన కుమారుడు చనిపోతాడనుకొంది హాగరు. వాడు చస్తుంటే చూడటం ఆమెకు ఇష్టం లేదు. ఆమె అక్కడ కూర్చొని ఏడ్వటం మొదలు పెట్టింది.
17ఆ పిల్లవాడు ఏడ్వడం దేవుడు విన్నాడు. పరలోకంనుండి దేవుని దూత హాగరును పిలిచాడు. అతడన్నాడు, “హాగరూ, ఏం జరిగింది? భయపడకు. అక్కడ పిల్లవాడు ఏడ్వడం యెహోవా విన్నాడు. 18వెళ్లి, పిల్లవాడికి సహాయం చేయి. వాడి చేయి పట్టి నడిపించు. ఒక గొప్ప జనాంగానికి నేను అతణ్ణి తండ్రిగా చేస్తాను.”
19అంతలో హాగరుకు ఒక బావి కనబడేటట్లు చేశాడు దేవుడు. కనుక హాగరు ఆ బావి దగ్గరకు వెళ్లి, తన తిత్తిని నీళ్లతో నింపుకొన్నది. తర్వాత పిల్లవాడు త్రాగటానికి ఆమె నీళ్లు ఇచ్చింది.
20ఆ పిల్లవాడు ఎదుగుతూ ఉండగా దేవుడు వానికి తోడుగానే ఉన్నాడు. ఇష్మాయేలు అరణ్యంలో జీవిస్తూ, వేటగాడయ్యాడు. బాణం కొట్టడంలో నిపుణత నేర్చుకొన్నాడు. 21అతని తల్లి అతని కోసం ఈజిప్టులో భార్యను కనుగొన్నది. వారు పారాను అరణ్యంలోనే జీవిస్తూ ఉన్నారు.
అబీమెలెకుతో అబ్రాహాము బేరం
22అంతట అబీమెలెకు, ఫీకోలు అబ్రాహాముతో మాట్లాడారు. అబీమెలెకు, అతని సైన్యాధిపతి ఫీకోలు అబ్రాహాముతో ఇలా చెప్పారు: “నీవు చేసే ప్రతి దానిలోను దేవుడు నీతో ఉన్నాడు. 23కనుక ఇక్కడ దేవుని యెదుట నాకు ఒక వాగ్దానం చేయాలి. నాతో, నా పిల్లలతో నీవు న్యాయంగా వ్యవహరిస్తానని వాగ్దానం చేయాలి. నీవు నివసించిన ఈ దేశం మీద, నా మీద నీవు దయగలిగి ఉంటానని వాగ్దానం చేయాలి. నీపైన నేను ఎంత దయ చూపెట్టానో, నాపైన నీవు కూడా అంత దయ చూపెడ్తానని వాగ్దానం చేయాలి.”
24“నన్ను నీవు ఎలా పరామర్శించావో నేను కూడా నిన్ను అలాగే పరామర్శిస్తానని నేను వాగ్దానం చేస్తున్నాను” అన్నాడు అబ్రాహాము. 25అప్పుడు అబ్రాహాము అబీమెలెకుతో ఒక ఫిర్యాదు చేశాడు. అబీమెలెకు సేవకులు ఒక మంచినీటి బావిని స్వాధీనం చేసుకొన్నందుచేత అబ్రాహాము అబీమెలెకుతో ఫిర్యాదు చేశాడు.
26కానీ అబీమెలెకు, “ఇది ఎవరు చేశారో నాకు తెలియదు. ఇంతకు ముందు ఈ విషయం నీవు నాతో చెప్పలేదు” అన్నాడు.
27కనుక అబ్రాహాము, అబీమెలెకు ఒక ఒడంబడిక చేసుకొన్నారు. ఆ ఒడంబడికకు సూచనగా కొన్ని గొర్రెలను, పశువులను అబ్రాహాము అబీమెలెకుకు ఇచ్చాడు. 28ఏడు#21:28 ఏడు “ఏడు” అనే అర్థం ఇచ్చే హీబ్రూ పదం, “ప్రమాణం” లేక “ఒప్పందం” అనే అర్థం ఇచ్చే హీబ్రూ పదం ఒక్కటే. అందుకు ఏడు గొర్రెలు ఈ వాగ్దానానికి రుజువు. ఆడ గొర్రె పిల్లల్ని కూడా అబ్రాహాము అబీమెలెకు ఎదుట ఉంచాడు. 29“ఈ ఏడు ఆడ గొర్రెపిల్లల్ని ఇలా ప్రత్యేకంగా ఎందుకు పెట్టావు?” అని అబీమెలెకు అబ్రాహామును అడిగాడు.
30“ఈ గొర్రెపిల్లల్ని నా దగ్గర నుండి నీవు స్వీకరించినప్పుడు, ఈ బావిని నేను తవ్వించినట్లు రుజువు అవుతుంది” అని అబ్రాహాము జవాబిచ్చాడు.
31కనుక ఆ తర్వాత ఆ బావి బెయేర్షెబా#21:31 బెయేర్షెబా “ప్రమాణపు బావి” అని దీని అర్థం. అని పిలువబడింది. వారిద్దరు ఒకరికి ఒకరు ఆ స్థలంలో వాగ్దానం చేసుకొన్న చోటు గనుక దానికి వారు ఆ పేరు పెట్టారు. 32కనుక అబ్రాహాము, అబీమెలెకు బెయేర్షెబా దగ్గర ఒక ఒడంబడిక చేసుకొన్నారు. అప్పుడు అబీమెలెకు, అతని సైన్యాధిపతి తిరిగి ఫిలిష్తీ ప్రజల దేశం వెళ్లిపోయారు.
33బెయేర్షెబాలో అబ్రాహాము ఒక అలంకారపు చెట్టు#21:33 అలంకారపు చెట్టు పొడవుగా సన్నగా వెంట్రుకలవలె ఎల్లప్పుడు పచ్చగావుండే ఆకులుగల పొద. నాటాడు. అప్పుడు అబ్రాహాము, ప్రభువును, ఎల్లప్పుడు జీవిస్తున్న దేవుడునైన యెహోవాకు అక్కడ ప్రార్థన చేశాడు. 34ఫిలిష్తీయుల దేశంలో అబ్రాహాము చాలాకాలం నివసించాడు.

Destaque

Partilhar

Copiar

None

Quer salvar os seus destaques em todos os seus dispositivos? Faça o seu registo ou inicie sessão