YouVersion
Pictograma căutare

యోహాను 9

9
పుట్టు గ్రుడ్డివాడు చూపు పొందుట
1యేసు దారిలో వెళ్తున్నప్పుడు, పుట్టుకతో గ్రుడ్డివాడుగా ఉన్న ఒక వ్యక్తిని చూసారు 2ఆయన శిష్యులు ఆయనను, “రబ్బీ, అతడు గ్రుడ్డివాడిగా పుట్టడానికి ఎవరు పాపం చేశారు అతడా లేక అతని తల్లిదండ్రులా?” అని అడిగారు.
3యేసు, “అతడు కానీ అతని తల్లిదండ్రులు కాని పాపం చేయలేదు, కానీ దేవుని కార్యాలు అతనిలో వెల్లడి కావడానికి ఇలా జరిగింది. 4పగలున్నంత వరకు నన్ను పంపినవాని పనులను మనం చేస్తూ ఉండాలి, రాత్రి వస్తుంది, అప్పుడు ఎవరూ పని చేయలేరు. 5ఈ లోకంలో ఉన్నంత వరకు నేను ఈ లోకానికి వెలుగు” అని చెప్పారు.
6ఆయన ఇది చెప్పి, నేల మీద ఉమ్మివేసి, ఆ ఉమ్మితో కొంత బురద చేసి, అతని కళ్ళ మీద దానిని పూసారు. 7ఆయన అతనితో, “వెళ్లు, సిలోయము అనే కోనేటిలో కడుగుకో” అని చెప్పారు. సిలోయం అనగా “పంపబడెను” అని అర్థం. అందుకతడు వెళ్లి కడుగుకొని, చూపుతో ఇంటికి వచ్చాడు.
8అతని పొరుగువారు మరియు అంతకు ముందు గ్రుడ్డిభిక్షవానిగా అతన్ని చూసినవారు, “వీడు ఇక్కడ కూర్చుని భిక్షం అడుక్కున్నవాడు కాడా?” అని చెప్పుకొన్నారు. 9వారిలో కొందరు వాడే అన్నారు.
మరికొందరు “కాదు, వాడిలా ఉన్నాడు” అన్నారు.
అయితే వాడు “ఆ వానిని నేనే” అని ఒప్పుకొన్నాడు.
10వారు అతన్ని, “అయితే నీ కళ్ళు ఎలా తెరుచుకున్నాయి?” అని అడిగారు.
11అతడు వారితో, “యేసు అనే ఆయన కొంత బురదను చేసి దానిని నా కళ్ళ మీద పూసారు. తర్వాత సిలోయము కోనేటికి వెళ్లి కడుగుకో అని చెప్పాడు. కనుక నేను వెళ్లి కడుక్కున్నాను, తర్వాత చూడగలుగుతున్నాను” అని చెప్పాడు.
12వారు, “ఆయన ఎక్కడ?” అని అతన్ని అడిగారు.
వాడు, “నాకు తెలియదు” అని చెప్పాడు.
స్వస్థతను గురించి పరిశోధన జరిపిన ధర్మశాస్త్ర ఉపదేశకులు
13అంతకు ముందు గ్రుడ్డివానిగా ఉండిన వానిని వారు పరిసయ్యుల దగ్గరకు తీసుకువెళ్ళారు. 14అయితే యేసు బురద చేసి అతని కళ్ళను తెరిచిన రోజు సబ్బాతు దినం. 15అందుకు పరిసయ్యులు ఎలా చూపు పొందావని వానిని అడిగారు. అందుకు అతడు, “ఆయన నా కళ్ళ మీద బురదను పూసాడు, నేను దానిని కడుక్కొన్నాను, ఇప్పుడు నేను చూడగల్గుతున్నాను” అని చెప్పాడు.
16పరిసయ్యులలో కొందరు, “ఇతడు సబ్బాతు దినాన్ని పాటించడంలేదు. కనుక ఇతడు దేవుని నుండి రాలేదు” అన్నారు.
కానీ మరికొందరు ఒక పాపి ఇలాంటి అద్బుత క్రియలను ఎలా చేయగలుగుతాడు? అన్నారు. కనుక వారిలో భేదాలు ఏర్పడ్డాయి.
17చివరికి వారు గ్రుడ్డివానితో, “నీ కళ్ళను తెరిచిన ఈ వ్యక్తి గురించి నీ అభిప్రాయం ఏమిటి?” అని అడిగారు.
వాడు, “ఆయన ఒక ప్రవక్త” అన్నాడు.
18అయినా వారు ఆ గ్రుడ్డివాడు చూపు పొందాడని నమ్మలేదు కనుక వాని తల్లిదండ్రులను పిలిపించారు. 19వారు తల్లిదండ్రులతో, “ఇతడు మీ కుమారుడేనా? పుట్టు గ్రుడ్డివాడని మీరు చెప్పే కొడుకు వీడేనా? అయితే వీడు ఇప్పుడెలా చూడగలుగుతున్నాడు?” అని అడిగారు.
20అందుకు వాని తల్లిదండ్రులు, “వీడు మా కొడుకే, వీడు గ్రుడ్డివానిగానే పుట్టాడని మాకు తెలుసు. 21అయితే ఇప్పుడు వీడు ఎలా చూస్తున్నాడో, వీని కళ్ళను ఎవరు తెరిచారో మాకు తెలియదు. వీడు పెద్దవాడే కాబట్టి వీనినే అడగండి. తన సంగతి తానే చెప్పుకోగలడు” అన్నారు. 22యేసును క్రీస్తు అని అంగీకరించిన వారిని సమాజమందిరం నుండి బయటకు వెలివేయాలని యూదా అధికారులు ముందుగానే నిర్ణయించారని, అతని తల్లిదండ్రులు వారికి భయపడి అలా చెప్పారు. 23అందుకే అతని తల్లిదండ్రులు, “అతడు పెద్దవాడు అతనినే అడగండి” అన్నారు.
24గ్రుడ్డివానిగా ఉండిన వానిని యూదా అధికారులు మరలా రెండవ సారి పిలిపించారు. “నీవు సత్యం చెప్పి దేవుని మహిమపరచు, మాకైతే ఆ మనుష్యుడు పాపి అని తెలుసు” అన్నారు.
25అందుకు అతడు, “ఆయన పాపియో కాడో నాకు తెలియదు. కానీ నాకు తెలిసింది ఒక్కటే. గ్రుడ్డివాడనై ఉండిన నేను ఇప్పుడు చూడగలుగుతున్నాను” అని చెప్పాడు.
26అప్పుడు వారు వానిని, “ఆయన నీకేమి చేశాడు? నీ కళ్ళను అతడు ఎలా తెరిచాడు?” అని అడిగారు.
27వాడు వారితో, “నేను మీకు ముందే చెప్పాను కానీ మీరు వినలేదు. మీరు మరలా ఎందుకు వినాలని అనుకుంటున్నారా? మీరు కూడ ఆయన శిష్యులు కావాలనుకుంటున్నారా?” అని అడిగాడు.
28అప్పుడు వారు అతన్ని దూషించి, “నీవే వాని శిష్యుడవు. మేము మోషే శిష్యులం! 29దేవుడు మోషేతో మాట్లాడాడని మాకు తెలుసు, కానీ వీడు ఎక్కడి నుండి వచ్చాడో కూడ మాకు తెలియదు” అన్నారు.
30అందుకు అతడు, “ఆయన ఎక్కడి నుండి వచ్చాడో మీకు తెలియక పోవడం ఆశ్చర్యమే! అయినా ఆయన నా కళ్ళను తెరిచాడు. 31దేవుడు పాపుల మనవి వినడని మనకు తెలుసు. తన చిత్తాన్ని చేసే భక్తుల మనవి ఆయన వింటాడు. 32భూమి మొదలైనప్పటి నుండి ఏ పుట్టు గ్రుడ్డివాని కళ్ళు తెరవబడ్డాయని ఎవరు వినలేదు. 33ఒకవేళ ఇతడు దేవుని నుండి కానట్లైతే, ఏమి చేయగలిగేవాడు కాదు” అని చెప్పాడు.
34దానికి వారు, “పుట్టుకతోనే పాపిగా ఉండి నీవు మాకు బోధిస్తున్నావా?” అని వానిని సమాజమందిరం నుండి బయటకు వెలివేసారు.
ఆత్మీయ గ్రుడ్డితనము
35అతన్ని సమాజమందిరం నుండి బయటకు వెలివేసారని యేసు విని, అతన్ని కనుగొని, “నీవు మనుష్యకుమారుని నమ్ముతున్నావా?” అని అడిగారు.
36అప్పుడు అతడు, “అయ్యా, ఆయన ఎవరు? నాతో చెబితే నేను ఆయనను నమ్ముతానేమో” అన్నాడు.
37యేసు, “నీవు ఆయనను చూస్తున్నావు, నీతో మాట్లాడుతున్న నేనే ఆయనను” అన్నారు.
38అప్పుడు అతడు “ప్రభువా, నేను నమ్ముతున్నాను” అని చెప్పి, ఆయనను ఆరాధించాడు.
39అప్పుడు యేసు, “నేను గ్రుడ్డివారు చూసేలా మరియు చూసేవారు గ్రుడ్డివారయ్యేలా, ఈ లోకానికి తీర్పు ఇవ్వడానికి వచ్చాను” అన్నారు.
40అక్కడ ఉన్న కొందరు పరిసయ్యులు ఆయన చెప్పిన ఈ మాటలను విని, “అయితే మేము కూడ గ్రుడ్డివారమేనా?” అని అడిగారు.
41అందుకు యేసు, “మీరు గ్రుడ్డివారైతే మీ మీద ఈ పాపం ఉండేది కాదు; కాని చూడగలం అని మీరు చెప్పుకుంటున్నారు, కనుక మీ పాపం నిలిచి వుంటుంది” అని చెప్పారు.

Evidențiere

Partajează

Copiază

None

Dorești să ai evidențierile salvate pe toate dispozitivele? Înscrie-te sau conectează-te