YouVersion
Pictograma căutare

మలాకీ 3

3
1సైన్యాలకు యెహోవా చెప్పేదేమంటే, “నేను నా దూతను పంపుతాను, అతడు నా ముందర మార్గాన్ని సిద్ధపరుస్తాడు. ఆ తర్వాత మీరు వెదుకుతున్న ప్రభువు అంటే మీరు కోరే నిబంధన దూత తన ఆలయానికి హఠాత్తుగా వస్తాడు.”
2అయితే ఆయన రాకడ దినం ఎవరు తట్టుకోగలరు? ఆయన కనబడేటప్పుడు ఎవరు నిలబడి ఉండగలరు? ఆయన కంసాలి నిప్పులాంటి వాడు, బట్టలను శుద్ధి చేసే చాకలివాని సబ్బు లాంటివాడు. 3ఆయన వెండిని పరీక్షించి, పుటం పెట్టి శుద్ధి చేసే కంసాలిలా కూర్చుంటారు, వెండి బంగారాలను పుటం పెట్టే విధంగా ఆయన లేవీ వారిని శుద్ధి చేస్తారు. అప్పుడు వారు నీతి నిజాయితీ అనుసరించి యెహోవాకు నైవేద్యాలు అర్పిస్తారు. 4గతించిన రోజుల్లో, పూర్వకాలంలో ఉన్నట్లు యూదా వారు యెరూషలేము నివాసులు చేసే అర్పణలు యెహోవాకు అంగీకారమవుతాయి.
5“తీర్పు తీర్చడానికి నేను మీ దగ్గరికి వస్తాను, మాంత్రికుల మీద, వ్యభిచారుల మీద, అప్రమాణికుల మీద సాక్ష్యం చెప్పడానికి సిద్ధంగా ఉంటాను. నాకు భయపడక జీతాల విషయంలో కూలివారిని మోసం ఉద్యోగులను మోసం చేసేవారికి, విధవరాండ్రను అనాధలను అణచివేసే వారికి, మీ మధ్య నివసిస్తున్న విదేశీయులకు న్యాయం జరుగకుండ చేసేవారికి వ్యతిరేకంగా నేను మాట్లాడతాను” అని సైన్యాల యెహోవా అంటున్నారు.
దశమభాగాలు ఇవ్వక ఒడంబడికను ఉల్లంఘించుట
6“నేను యెహోవాను, నేను మార్పు చెందను. కాబట్టే యాకోబు సంతతివారలారా, మీరు నాశనం కాలేదు. 7మీ పూర్వికుల కాలం నుండి మీరు నా శాసనాల విషయంలో త్రోవ తప్పి వాటిని పాటించలేదు. నా వైపుకు తిరగండి, అప్పుడు నేను మీవైపుకు తిరుగుతాను” అని సైన్యాల యెహోవా చెప్తున్నారు.
“కాని మీరు, ‘మేము ఏ విషయంలో తిరగాలి?’ అని అడుగుతారు.
8“మానవులు దేవున్ని దోచుకుంటారా? కాని మీరు నన్ను దోచుకుంటున్నారు.
“అయినా మీరు, ‘మేము మిమ్మల్ని ఎలా దోచుకుంటున్నాము?’ అని అడుగుతారు.
“పదవ భాగాన్ని కానుకలను ఇవ్వక దోచుకుంటున్నారు. 9ఈ ప్రజలంతా నా దగ్గర దొంగతనం చేస్తున్నారు కాబట్టి శాపగ్రస్థులయ్యారు. 10నా మందిరంలో ఆహారం ఉండేలా పదవ భాగాన్నంతా నా ఆలయానికి తీసుకురండి. ఇలా చేసి నన్ను పరీక్షించండి, నేను పరలోక ద్వారాలను తెరచి పట్టలేనంతగా దీవెనలు కుమ్మరిస్తానో లేదో చూడండి అని సైన్యాల యెహోవా ప్రకటిస్తున్నారు. 11మీ పైరును పురుగులు తినివేయకుండా చేస్తాను, అవి మీ పొలం పంటను నాశనం చేయవు, మీ ద్రాక్ష చెట్ల పండ్లు అకాలంలో రాలవు” అని సైన్యాల యెహోవా ప్రకటిస్తున్నారు. 12“అప్పుడు మీ దేశం ఆనందంగా ఉంటుంది కాబట్టి అన్ని దేశాల ప్రజలు మిమ్మల్ని ధన్యులంటారు” అని సైన్యాలకు యెహోవా ప్రకటిస్తున్నాడు.
ఇశ్రాయేలీయులు దేవునికి వ్యతిరేకంగా గర్వంగా మాట్లాడుట
13యెహోవా చెప్పేదేమంటే, “నాకు వ్యతిరేకంగా మీరు చాలా గర్వించి మాట్లాడారు.”
“అయినా మేము నీకు వ్యతిరేకంగా ఏం మాట్లాడాము?” అని మీరు అడుగుతున్నారు.
14“మీరు ఇలా అంటారు, ‘దేవునికి సేవ చేయడం వ్యర్థం, ఆయన ఆజ్ఞ ప్రకారం ప్రవర్తిస్తూ సైన్యాలకు అధిపతియైన యెహోవా ఎదుట దుఃఖా క్రాంతులై తిరుగుతూ ఉండి ప్రయోజనం ఏంటి? 15ఇప్పుడు గర్విష్ఠులనే ధన్యులని పిలుస్తున్నాము. చెడు చేసేవారు వర్ధిల్లుతూ ఉన్నారు, వారు దేవున్ని పరీక్షించినప్పుడు కూడా వారికి ఏ హాని కలగడం లేదు.’ ”
నమ్మకస్థులైన శేషం
16అప్పుడు, యెహోవా పట్ల భయభక్తులు కలిగినవారు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్నప్పుడు యెహోవా విన్నారు. యెహోవా పట్ల భయభక్తులు కలిగి ఆయన పేరును గౌరవించే వారి విషయం ఆయన సన్నిధిలో జ్ఞాపకార్థమైన గ్రంథంలో వ్రాయబడింది.
17“నేను నియమించిన ఆ రోజున వారు నాకు విలువైన స్వాస్థ్యంగా ఉంటారు. తండ్రి తనను సేవించే తన కుమారుని కనికరించినట్టు నేను వారిని కనికరిస్తాను” అని అంటూ సైన్యాల యెహోవా ఇలా చెప్తున్నారు. 18అప్పుడు నీతిమంతులకు, దుర్మార్గులకు, దేవున్ని సేవించేవారికి, సేవించని వారికి మధ్య వ్యత్యాసాన్ని మీరు మళ్ళీ చూస్తారు.

Evidențiere

Partajează

Copiază

None

Dorești să ai evidențierile salvate pe toate dispozitivele? Înscrie-te sau conectează-te