6
అవసరంలో ఉన్నవారికి సహాయపడుట
1“మీరు ఇతరులకు కనబడాలని వారి ముందు మీ నీతి క్రియలను చేయకుండ జాగ్రత్తపడండి. ఎందుకంటే మీరు అలా చేస్తే పరలోకంలో ఉన్న మీ తండ్రి దగ్గర ఫలం పొందరు.
2“కాబట్టి మీరు ఎవరికైనా దానం చేస్తే ఇతరుల నుండి ఘనత పొందాలని సమాజమందిరాల్లోను వీధుల్లోను ప్రకటించుకునే వేషధారుల్లా బూరలు ఊదించుకోకండి. అలాంటివారు తమ పూర్తి ప్రతిఫలం పొందుకున్నారని మీతో నేను ఖచ్చితంగా చెప్తున్నాను. 3అయితే మీరు అవసరంలో ఉన్నవారికి సహాయం చేస్తే, మీ కుడి చేయి చేసేది మీ ఎడమ చేతికి తెలియనివ్వకండి. 4మీరు చేసే సహాయం రహస్యంగా ఉండాలి. ఎందుకంటే రహస్యంగా చేసింది కూడా చూసే మీ తండ్రి మీకు ప్రతిఫలం ఇస్తారు.
ప్రార్థన
5“మీరు ప్రార్థన చేసేటప్పుడు వేషధారుల్లా ఉండకండి. ఎందుకంటే వారు సమాజమందిరాల్లోను వీధుల మూలల్లోను నిలబడి అందరికి కనబడేలా ప్రార్థించడం వారికి ఇష్టం. వారు తమ ప్రతిఫలం పూర్తిగా పొందుకున్నారని నేను మీతో ఖచ్చితంగా చెప్తున్నాను. 6అయితే మీరు ప్రార్థన చేసేటప్పుడు, మీ గదిలోకి వెళ్లి తలుపు వేసుకుని, కనిపించని మీ తండ్రికి ప్రార్థన చేయండి. మీరు రహస్యంగా చేసేది చూసే మీ తండ్రి మీకు ప్రతిఫలం ఇస్తారు. 7మీరు ప్రార్థన చేసేటప్పుడు ఎక్కువ మాటలు మాట్లాడితే తమ ప్రార్థన ఆలకించబడుతుందని భావించే యూదేతరుల్లా అనవసరమైన మాటలు పలుకుతూ ప్రార్థించకండి. 8మీ తండ్రిని మీరు అడగడానికి ముందే మీకు ఏమి అవసరమో ఆయనకు తెలుసు కాబట్టి మీరు వారిలా ఉండకండి.
9“మీరు ఈ విధంగా ప్రార్థన చేయాలి:
“ ‘పరలోకమందున్న మా తండ్రీ,
మీ నామం పరిశుద్ధపరచబడును గాక,
10మీ రాజ్యం వచ్చును గాక;
పరలోకంలో జరుగునట్లు భూమి మీద,
మీ చిత్తం జరుగును గాక.
11మా అనుదిన ఆహారం ఈ రోజు మాకు ఇవ్వండి.
12మా రుణస్థులను మేము క్షమించినట్లు
మా రుణాలను క్షమించండి.
13మమ్మల్ని శోధనలోనికి నడిపించకండి,
దుష్టుని నుండి మమ్మల్ని తప్పించండి.’
14మీరు ఇతరుల పాపాలను క్షమిస్తే మీ పరలోకపు తండ్రి కూడ మిమ్మల్ని క్షమిస్తారు. 15ఒకవేళ మీరు ఇతరుల పాపాలను క్షమించకపోతే మీ పరలోకపు తండ్రి కూడ మీ పాపాలను క్షమించరు.
ఉపవాసం
16“మీరు ఉపవాసం ఉన్నప్పుడు, తాము ఉపవాసం ఉంటున్నామని ఇతరులకు తెలియాలని తమ ముఖాలను నీరసంగా పెట్టుకొనే వేషధారుల్లా నీరసంగా ఉండవద్దు. అలా చేసినవారు తమ ప్రతిఫలం పూర్తిగా పొందుకున్నారని నేను మీతో ఖచ్చితంగా చెప్తున్నాను. 17అయితే మీరు ఉపవాసం ఉన్నప్పుడు మీ తలకు నూనె రాసుకొని ముఖం కడుక్కోండి. 18అప్పుడు మీరు ఉపవాసం ఉన్నారని కనిపించని మీ తండ్రికి తప్ప ఇతరులకు తెలియదు; రహస్యంగా చేసింది చూసే మీ తండ్రి మీకు ప్రతిఫలం ఇస్తారు.
పరలోకంలో ధనం
19“భూమి మీద మీ కోసం ధనం కూడపెట్టుకోకండి. ఇక్కడ చెదలు తుప్పు తినివేస్తాయి, దొంగలు కన్నం వేసి దొంగిలిస్తారు. 20అయితే మీ కోసం పరలోకంలో ధనం కూడపెట్టుకోండి. అక్కడ చెదలు తుప్పు తినివేయవు, దొంగలు కన్నం వేసి దొంగిలించలేరు. 21ఎందుకంటే ఎక్కడ మీ ధనం ఉంటుందో అక్కడే మీ హృదయం ఉంటుంది.
22“కన్ను దేహానికి దీపం. మీ కళ్లు ఆరోగ్యంగా#6:22 గ్రీకులో ఆరోగ్యంగా ఇక్కడ ధారాళమైన గుణాన్ని సూచిస్తుంది ఉంటే మీ దేహమంతా వెలుగుతో నిండి ఉంటుంది. 23మీ కళ్లు పాడైతే మీ దేహమంతా చీకటితో నిండి ఉంటుంది. మీలో ఉన్న వెలుగు చీకటైతే ఆ చీకటి ఎంత భయంకరంగా ఉంటుందో!
24“ఎవ్వరూ ఇద్దరు యజమానులకు సేవచేయలేరు. వారు ఒకరిని ద్వేషించి మరొకరిని ప్రేమిస్తారు లేదా ఒక యజమానికి అంకితమై మరొకనిని తృణీకరిస్తారు. మీరు దేవున్ని ధనాన్ని రెండింటిని ఒకేసారి సేవించలేరు.
చింతించకండి
25“కాబట్టి నేను మీతో చెప్పేదేంటంటే, మీరు ఏమి తినాలి ఏమి త్రాగాలి? అని మీ ప్రాణం గురించి గాని లేదా ఏమి ధరించాలి అని మీ దేహం గురించి గాని చింతించకండి. ఆహారం కంటే ప్రాణం, బట్టల కంటే దేహం గొప్పవి. 26గాలిలో ఎగిరే పక్షులను చూడండి; అవి విత్తనాలు నాటవు, కోత కోయవు, కొట్లలో కూర్చుకోవు. అయినా మీ పరలోకపు తండ్రి వాటిని పోషిస్తున్నారు. మీరు వాటికన్నా ఇంకా ఎంతో విలువైన వారు కారా? 27మీలో ఒక్కరైనా చింతిస్తూ మీ ఆయుష్షును ఒక గంట#6:27 ఒక గంట లేదా మీ ఎత్తులో ఒక అడుగు పొడిగించుకోగలరా?
28“మీరు బట్టల గురించి ఎందుకు చింతిస్తున్నారు? పొలంలో పువ్వులు ఎలా ఎదుగుతున్నాయో చూడండి. అవి కష్టపడవు బట్టలు నేయవు. 29అయినా గొప్ప వైభవం కలిగి ఉన్న సొలొమోను కూడా ఈ పూలలో ఒక దానిలా అలంకరించబడలేదని నేను మీతో చెప్తున్నాను. 30అల్పవిశ్వాసులారా, ఈ రోజు ఉండి రేపు అగ్నిలో పడవేయబడే పొలంలోని గడ్డినే దేవుడు అంతగా అలంకరించినప్పుడు, ఆయన మిమ్మల్ని ఇంకెంత ఎక్కువగా అలంకరిస్తారు! 31కాబట్టి ‘ఏమి తినాలి? ఏమి త్రాగాలి? ఏమి ధరించుకోవాలి?’ అంటూ చింతించకండి. 32దేవుని ఎరుగని ప్రజలు అలాంటి వాటి వెంటపడతారు, కాని అవన్నీ మీకు అవసరమని మీ పరలోకపు తండ్రికి తెలుసు. 33కాబట్టి మొదట ఆయన రాజ్యాన్ని ఆయన నీతిని వెదకండి. అప్పుడు ఇవన్నీ మీకు ఇవ్వబడతాయి. 34రేపటి గురించి చింతించకండి; ఎందుకంటే రేపటి సంగతి గురించి రేపు చింతింస్తుంది; ఏ రోజు కష్టం ఆ రోజుకు చాలు.