యోహాను 6

6
ఐదు వేలమందికి భోజనం పెట్టిన యేసు
1ఈ సంగతులు జరిగిన కొంతకాలానికి, యేసు గలిలయ సముద్రాన్ని దాటి అవతలి తిబెరియ సముద్రతీరానికి వెళ్లారు. 2అక్కడ ఆయన రోగులను స్వస్థపరచడం ద్వారా ఆయన చేసిన అసాధారణ సూచక క్రియలను చూసిన గొప్ప జనసమూహం ఆయనను వెంబడించింది. 3అప్పుడు యేసు కొండ ఎక్కి తన శిష్యులతో పాటు అక్కడ కూర్చొని ఉన్నారు. 4యూదుల పస్కా పండుగ సమీపించింది.
5యేసు గొప్ప జనసమూహం తన దగ్గరకు రావడం చూసినప్పుడు, ఫిలిప్పుతో, “ఈ ప్రజలు తినడానికి రొట్టెలను ఎక్కడ కొందాము?” అన్నారు. 6తాను చేయబోయేది ఆయనకు ముందుగానే తెలుసు, కేవలం అతన్ని పరీక్షించడానికి మాత్రమే ఆయన అడిగారు.
7ఫిలిప్పు ఆయనతో, “అందరికి ఒక చిన్నముక్క ఇవ్వడానికి సరిపడే రొట్టెలను కొనాలంటే రెండువందల దేనారాల కంటే ఎక్కువవుతుంది” అని చెప్పాడు.
8ఆయన శిష్యులలో మరొకడు, సీమోను పేతురు సోదరుడైన అంద్రెయ మాట్లాడుతూ, 9“ఇక్కడ ఒక బాలుని దగ్గర ఐదు బార్లీ రొట్టెలు, రెండు చిన్న చేపలు ఉన్నాయి, కానీ ఇంత మందికి అవి ఎలా సరిపోతాయి?” అన్నాడు.
10అప్పుడు యేసు, “ప్రజలను కూర్చోబెట్టండి” అని చెప్పారు. అక్కడ చాలా పచ్చిక ఉంది కనుక, ప్రజలు కూర్చున్నారు. అక్కడ సుమారు ఐదు వేలమంది పురుషులు ఉన్నారు. 11అప్పుడు యేసు రొట్టెలను తీసుకుని, కృతజ్ఞతలు చెల్లించి, అక్కడ కూర్చున్న వారికి కావలసినంత పంచిపెట్టారు. చేపలు కూడా అలాగే పంచిపెట్టారు.
12వారందరూ సరిపడినంత తిన్న తర్వాత, ఆయన తన శిష్యులతో, “ఏదీ వృధా కాకుండా మిగిలిన ముక్కలను పోగు చేయండి” అని చెప్పారు. 13అందరూ తిన్న తర్వాత మిగిలిన ఐదు బార్లీ రొట్టె ముక్కలను పన్నెండు గంపలలో నింపారు.
14యేసు చేసిన అద్బుత క్రియను చూసిన ప్రజలు, “నిజంగా ఈ లోకానికి రావలసివున్న ప్రవక్త ఈయనే” అని చెప్పుకోవడం మొదలుపెట్టారు. 15వారు తనను బలవంతంగా రాజును చేయాలని చూస్తున్నారని గ్రహించి, తాను తప్పించుకొని ఒంటరిగా కొండపైకి వెళ్లారు.
యేసు నీటిపై నడచుట
16సాయంకాలమైనప్పుడు, ఆయన శిష్యులు సముద్రతీరానికి వెళ్లి, 17ఒక పడవ ఎక్కి ఆ సరస్సును దాటుతూ కపెర్నహూముకు వెళ్తున్నారు. అప్పటికే చీకటి పడింది, కానీ యేసు వారిని ఇంకా చేరుకోలేదు. 18బలమైన గాలి వీస్తూ అలల ఉధృతి పెరిగింది. 19#6:19 లేక సుమారు 5 లేదా 6 కిలోమీటర్లువారు సుమారు మూడు, నాలుగు మైళ్ళ దూరం ప్రయాణం చేసిన తర్వాత, యేసు నీటి మీద నడస్తూ పడవ దగ్గరకు రావడం చూసి, వారు భయపడ్డారు. 20అయితే ఆయన వారితో, “నేనే, భయపడకండి” అన్నారు. 21అప్పుడు వారు ఆయనను పడవలోనికి ఎక్కించుకోడానికి ఒప్పుకొన్న వెంటనే ఆ పడవ వారు వెళ్లవలసిన తీరాన్ని చేరింది.
22తర్వాత రోజు సరస్సు అవతలి వైపు ఉన్న జనసమూహం అక్కడ ఒకే ఒక పడవ ఉండడం చూసి, యేసు తన శిష్యులతో కలిసి పడవలో ఎక్కి వెళ్లలేదని, కేవలం శిష్యులు మాత్రమే వెళ్లారని గ్రహించారు. 23ప్రభువు కృతఙ్ఞతలు చెల్లించిన తర్వాత వారు రొట్టెలను తిన్న ప్రాంతానికి కొన్ని చిన్న పడవలు తిబెరియ నుండి వచ్చాయి. 24ఆ పడవలలో వచ్చిన ఆ జనసమూహం యేసు మరియు ఆయన శిష్యులు అక్కడ లేరని గ్రహించి, వారు మళ్ళీ పడవలను ఎక్కి యేసును వెదుకుతూ కపెర్నహూముకు వెళ్లారు.
పరలోకం నుండి దిగి వచ్చిన రొట్టె
25వారు ఆయనను సరస్సు అవతలి ఒడ్డున చూసినప్పుడు, “రబ్బీ, నీవు ఇక్కడికి ఎప్పుడు వచ్చావు?” అని వారు ఆయనను అడిగారు.
26అందుకు యేసు వారితో, “మీరు రొట్టెలను తిని తృప్తి పొందారు కనుక నన్ను వెదుకుతున్నారు తప్ప, నేను చేసిన అద్బుత క్రియలను చూసినందుకు కాదని నేను మీతో ఖచ్చితంగా చెప్తున్నాను. 27మీరు పాడైపోయే ఆహారం కొరకు ప్రయాసపడకండి కానీ మనుష్యకుమారుడు మీకిచ్చే నిరంతరం నిలిచివుండే ఆహారం కొరకు ప్రయాసపడండి. ఎందుకంటే తండ్రియైన దేవుడు దానిని మీకు ఇవ్వడానికే ఆయనపై తన ఆమోద ముద్ర వేసారు” అని చెప్పారు.
28అప్పుడు వారు ఆయనను, “దేవుని పనులను చేయడానికి మేమేమి చేయాలి?” అని అడిగారు.
29అందుకు యేసు, “ఆయన పంపినవానిని నమ్మడమే దేవుని పని” అని చెప్పారు.
30కనుక వారు, “మేము చూసి నిన్ను నమ్మడానికి నీవు ఏ అద్బుత క్రియను చేస్తావు? ఏమి చేస్తావు? 31మన పితరులు అరణ్యంలో మన్నాను తిన్నారని, ‘వారికి తినుటకు పరలోకం నుండి ఆహారాన్ని ఆయన ఇచ్చారని#6:31 నిర్గమ 16:4; నెహెమ్యా 9:15; కీర్తన 78:24,25’ వ్రాయబడి ఉంది కదా!” అని ఆయనను అడిగారు.
32యేసు వారితో, “మీకు పరలోకం నుండి ఆహారం ఇచ్చింది మోషే కాదు, పరలోకం నుండి నిజమైన ఆహారం మీకిచ్చేది నా తండ్రి. 33ఎందుకంటే పరలోకం నుండి దిగి వచ్చి లోకానికి జీవం ఇచ్చేది దేవుని యొక్క ఆహారమని నేను మీతో ఖచ్చితంగా చెప్తున్నాను” అని చెప్పారు.
34అందుకు వారు “అయ్యా, ఈ ఆహారం మాకు ఎల్లప్పుడు ఇవ్వు” అన్నారు.
35అప్పుడు యేసు వారితో ఇట్లన్నాడు: “జీవాహారం నేనే. నా దగ్గరకు వచ్చే వారికి ఎప్పుడు ఆకలివేయదు, నన్ను నమ్మేవారికి ఎప్పుడు దాహం వేయదు. 36అయితే నేను మీకు చెప్పిన రీతిగానే మీరు నన్ను చూసి కూడా నమ్మలేదు. 37తండ్రి నాకు ఇచ్చే వారందరు నా దగ్గరకు వస్తారు. నా దగ్గరకు వచ్చేవారిని నేను ఎప్పుడు త్రోసివేయను. 38ఎందుకనగా నేను నాకిష్టమైనది చేయడానికి పరలోకం నుండి దిగిరాలేదు కానీ నన్ను పంపినవానికి ఇష్టమైనది చేయడానికే వచ్చాను. 39ఆయన నాకిచ్చిన వారిలో ఎవరినీ పోగొట్టుకోకుండా, చివరి రోజున వారిని జీవంతో లేపాలని నన్ను పంపినవాని చిత్తమై ఉంది. 40కుమారుని వైపు చూసి ఆయనను నమ్మిన ప్రతి ఒక్కరు నిత్యజీవాన్ని పొందుకోవాలని, వారిని చివరి రోజున జీవంతో నేను లేపాలని నా తండ్రి చిత్తమై ఉంది.”
41“పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారం నేనే” అని ఆయన చెప్పినందుకు, యూదులు ఆయనపై సణుగుకోవడం మొదలుపెట్టారు. 42వారు, “ఈ యేసు యోసేపు కుమారుడు కాడా? ఇతని తల్లిదండ్రులు మనకు తెలియదా? ‘నేను పరలోకం నుండి దిగి వచ్చాను’ అని ఎలా చెప్తున్నాడు?” అని చెప్పుకొన్నారు.
43యేసు, “మీలో మీరు సణుగుకోవడం ఆపండి” అన్నారు. 44ఇంకా మాట్లాడుతూ, “నన్ను పంపిన తండ్రి ఆకర్షిస్తేనే తప్ప ఎవరూ నా దగ్గరకు రాలేరు, చివరి రోజున నేను వారిని జీవంతో లేపుతాను. 45‘వారందరు దేవునిచే బోధింపబడుతారు#6:45 యెషయా 54:13’ అని ప్రవక్తలచే వ్రాయబడిన విధంగా, తండ్రి మాటలను విని ఆయన నుండి నేర్చుకొన్న ప్రతివాడు నా దగ్గరకు వస్తాడు. 46దేవుని నుండి వచ్చినవాడు తప్ప మరి ఎవరు తండ్రిని చూడలేదు; ఆయన మాత్రమే తండ్రిని చూసారు 47నమ్మినవాడే నిత్యజీవాన్ని కలిగి ఉంటాడని నేను మీతో ఖచ్చితంగా చెప్తున్నాను. 48జీవాహారం నేనే. 49మీ పితరులు అరణ్యంలో మన్నాను తిని కూడా చనిపోయారు. 50అయితే పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారం ఇక్కడ ఉంది, దీన్ని తినే వారెవరు చనిపోరు. 51పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారం నేనే. ఎవరైనా ఈ ఆహారం ఎవరు తింటారో వారు నిరంతరం జీవిస్తారు. ఈ లోకాన్ని జీవింపచేసే ఈ జీవాహారం నా శరీరమే” అని చెప్పారు.
52అందుకని యూదులు తమలో తాము, “ఈయన తన శరీరాన్ని మనం తినడానికి ఎలా ఇవ్వగలడు?” అని తీవ్రంగా వాదించుకోవడం మొదలుపెట్టారు.
53అందుకు యేసు వారితో, “నేను మీతో ఖచ్చితంగా చెప్తున్నాను, మీరు మనుష్యకుమారుని శరీరాన్ని తిని, ఆయన రక్తాన్ని త్రాగితేనే తప్ప మీలో జీవం ఉండదు. 54నా శరీరాన్ని తిని నా రక్తాన్ని త్రాగినవారు నిత్యజీవం కలిగి ఉంటారు, చివరి రోజున నేను వానిని జీవంతో లేపుతాను. 55నా శరీరం నిజమైన ఆహారం మరియు నా రక్తం నిజమైన పానీయము. 56నా శరీరాన్ని తిని, నా రక్తాన్ని త్రాగినవారు నాలో నిలిచి ఉంటారు, అలాగే నేను వారిలో నిలిచి ఉంటాను. 57సజీవుడైన తండ్రి నన్ను పంపినందుకు, నేను తండ్రి వలననే జీవిస్తున్నాను, కనుక నన్ను తినేవారు నా వలన జీవిస్తారు. 58పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారం ఇదే. మీ పితరులు మన్నాను తిని చనిపోయారు, అయితే ఈ ఆహారం ఎవరు తింటారో వారు నిరంతరం జీవిస్తారు” అని చెప్పారు. 59కపెర్నహూములోని సమాజమందిరంలో బోధిస్తూ యేసు ఈ మాటలను చెప్పారు.
యేసును విడిచిపెట్టిన అనేకమంది శిష్యులు
60అది విన్న ఆయన శిష్యులలో అనేకమంది, “ఇది కష్టమైన బోధ, ఎవరు దీనిని అంగీకరిస్తారు?” అన్నారు.
61యేసు తన శిష్యులు దీని గురించి సణుగుకొంటున్నారని గ్రహించి వారితో, “ఈ మాటలు మీకు అభ్యంతరకరంగా ఉన్నాయా? 62అయితే మనుష్యకుమారుడు తాను ఇంతకు ముందు ఉన్న చోటికే ఎక్కిపోవడం చూస్తే ఏమంటారు? 63ఆత్మ జీవాన్ని ఇస్తుంది; శరీరం వలన ప్రయోజనం లేదు. నేను మీతో పలికిన మాటలు ఆత్మతో జీవంతో నిండి ఉన్నాయి. 64అయినా మీలో కొందరు నమ్మడం లేదు” అన్నారు. ఎందుకనగా, వారిలో ఎవరు మొదటి నుండి నమ్మడం లేదో, ఎవరు తనను అప్పగిస్తారో యేసుకు తెలుసు. 65ఆయన వారితో, “ఈ కారణంగానే, తండ్రి రానిస్తేనే తప్ప మరి ఎవరు నా దగ్గరకు రాలేరని నేను మీతో చెప్తున్నాను” అన్నారు.
66అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకమంది వెనుకకు తిరిగి, ఇక ఎప్పుడు ఆయనను వెంబడించలేదు.
67యేసు పన్నెండు మందిని, “మీరు కూడ వెళ్లాలనుకుంటున్నారా?” అని అడిగారు.
68అందుకు సీమోను పేతురు ఆయనతో, “ప్రభువా, మేము ఎవరి దగ్గరకు వెళ్లాలి? నిత్యజీవపు మాటలను నీవే కలిగివున్నావు. 69నీవే దేవుని పరిశుద్ధుడవని మేము నమ్మి తెలుసుకున్నాము” అని చెప్పాడు.
70అప్పుడు యేసు, “మీ పన్నెండు మందిని నేను ఎన్నుకోలేదా? అయినా మీలో ఒకడు దుష్టుడు” అని వారితో చెప్పారు. 71ఆయన చెప్పింది, సీమోను ఇస్కరియోతు కుమారుడైన యూదా గురించి, అతడు పన్నెండుమందిలో ఒక్కడైనప్పటికి, తర్వాత ఆయనను అప్పగిస్తాడు.

Выделить

Поделиться

Копировать

None

Хотите, чтобы то, что вы выделили, сохранялось на всех ваших устройствах? Зарегистрируйтесь или авторизуйтесь