Logoja YouVersion
Ikona e kërkimit

యోహాను సువార్త 21

21
ఏడుగురు శిష్యులకు కనిపించిన యేసు
1ఆ తర్వాత యేసు మరల తన శిష్యులకు తిబెరియ సముద్రం#21:1 లేదా గలలీ సముద్రం తీరంలో కనిపించారు. 2సీమోను పేతురు, దిదుమా అని పిలువబడే తోమా, గలిలయలోని కానాకు చెందిన నతనయేలు, జెబెదయి కుమారులు, మరో ఇద్దరు శిష్యులు కలిసి ఉన్నప్పుడు, 3సీమోను పేతురు వారందరితో, “నేను చేపలను పట్టడానికి వెళ్తున్నాను” అని చెప్పగా వారు, “మేము కూడ నీతో వస్తాము” అన్నారు. కాబట్టి వారు పడవలో ఎక్కి వెళ్లి, రాత్రంతా కష్టపడినా కానీ వారు ఏమీ పట్టుకోలేదు.
4తెల్లవారుజామున, యేసు సరస్సు ఒడ్డున నిలబడి ఉన్నారు, కానీ శిష్యులు ఆయనను యేసు అని గుర్తించలేదు.
5ఆయన వారిని పిలిచి, “పిల్లలారా, మీ దగ్గర చేపలు ఏమైనా ఉన్నాయా?” అని అడిగారు.
అందుకు వారు, “లేవు” అని జవాబిచ్చారు.
6ఆయన, “పడవకు కుడి వైపున మీ వలలు వేయండి, మీకు దొరుకుతాయి” అని చెప్పగా వారు అలాగే చేశారు. అప్పుడు విస్తారంగా చేపలు పడ్డాయి కాబట్టి వారు ఆ వలలను లాగలేకపోయారు.
7యేసు ప్రేమించిన శిష్యుడు సీమోను పేతురుతో, “ఆయన ప్రభువు!” అన్నాడు. “ఆయన ప్రభువు” అని పేతురు విన్న వెంటనే ఇంతకుముందు తీసి వేసిన పైబట్టను తన చుట్టూ వేసుకుని నీటిలోనికి దూకాడు. 8పడవలో ఉన్న మిగతా శిష్యులు చేపలున్న వలను లాగుతూ ఉన్నారు. అప్పుడు వారు ఒడ్డుకు సుమారు వంద గజాల#21:8 లేదా సుమారు 90 మీటర్లు దూరంలో మాత్రమే ఉన్నారు. 9వారు ఒడ్డుకు రాగానే, అక్కడ నిప్పులో కాలుతుండిన చేపలను కొన్ని రొట్టెలను చూశారు.
10యేసు వారితో, “మీరు ఇప్పుడు పట్టిన చేపలలో కొన్నిటిని తీసుకురండి” అని చెప్పారు. 11సీమోను పేతురు పడవ ఎక్కి వలను ఒడ్డుకు లాగాడు. ఆ వలలో 153 పెద్ద చేపలున్నాయి. అన్ని చేపలు ఉన్నా ఆ వలలు చిరిగిపోలేదు. 12యేసు వారితో, “రండి, భోజనం చేయండి” అని పిలిచారు. ఆయనే ప్రభువని వారికి తెలిసింది కాబట్టి ఆ శిష్యులలో ఎవరు ఆయనను, “నీవు ఎవరు?” అని అడగడానికి ధైర్యం చేయలేదు. 13యేసు వచ్చి రొట్టెను తీసుకుని వారికి పంచారు. అదే విధంగా చేపలను కూడ పంచారు. 14యేసు తాను చనిపోయి సజీవునిగా లేచిన తర్వాత ఆయన తన శిష్యులకు కనబడడం ఇది మూడవసారి.
యేసు పేతురుతో సంభాషణ
15వారు తిని ముగించిన తర్వాత యేసు సీమోను పేతురుతో, “యోహాను కుమారుడవైన సీమోనూ, వీరికంటే నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా?” అని అడిగారు.
అతడు, “అవును, ప్రభువా! నేను నిన్ను ప్రేమిస్తున్నానని నీకు తెలుసు” అన్నాడు.
అయితే, “నా గొర్రెపిల్లలను మేపుము” అని యేసు చెప్పారు.
16మరల యేసు, “యోహాను కుమారుడవైన సీమోనూ, నన్ను నిజంగా ప్రేమిస్తున్నావా?” అని రెండవసారి అడిగారు.
అతడు, “అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమిస్తున్నానని నీకు తెలుసు” అని చెప్పాడు.
అందుకు యేసు, “నా గొర్రెలను కాయుము” అన్నారు.
17యేసు మూడవసారి అతనితో, “యోహాను కుమారుడవైన సీమోనూ, నన్ను ప్రేమిస్తున్నావా?” అని అడిగారు.
యేసు తనను మూడవసారి, “నన్ను ప్రేమిస్తున్నావా?” అని అడిగినందుకు బాధపడిన పేతురు, “ప్రభువా, నీవు అన్ని తెలిసినవాడవు, నేను నిన్ను ప్రేమిస్తున్నానని నీకే తెలుసు” అని చెప్పాడు.
అందుకు యేసు, “నా గొర్రెలను మేపుము” 18నేను మీతో చెప్పేది నిజం, “నీవు యవ్వనస్థునిగా ఉన్నప్పుడు, నీకు నీవే నీ నడుము కట్టుకుని నీకిష్టమైన స్థలాలకు వెళ్లేవాడివి. కాని నీవు ముసలి వాడవైనప్పుడు నీవు నీ చేతులను చాపుతావు, అప్పుడు మరొకడు నీ నడుమును కట్టి నీకు ఇష్టం లేని చోటికి నిన్ను మోసుకువెళ్తాడు” అని చెప్పారు. 19పేతురు ఎలాంటి మరణం పొంది దేవుని మహిమపరుస్తాడో సూచిస్తూ యేసు ఈ విషయాలను చెప్పారు. ఇలా చెప్పి ఆయన అతనితో, “నన్ను వెంబడించు” అని చెప్పారు.
20పేతురు వెనుకకు తిరిగి యేసు ప్రేమించిన శిష్యుడు తమను వెంబడిస్తున్నాడని చూశాడు. భోజనం చేసేప్పుడు యేసు దగ్గరగా ఆనుకుని కూర్చుని, “ప్రభువా, నిన్ను అప్పగించేది ఎవరు?” అని అడిగినవాడు ఇతడే. 21పేతురు అతన్ని చూసి, “ప్రభువా, అతని సంగతి ఏమిటి?” అని అడిగాడు.
22అందుకు యేసు, “నేను తిరిగి వచ్చేవరకు అతడు జీవించి ఉండడం నాకు ఇష్టమైతే నీకు ఏమి? నీవు నన్ను వెంబడించాలి” అని జవాబిచ్చారు. 23అందుకని ఆ శిష్యుడు చనిపోడు అనే మాట విశ్వాసుల మధ్య పాకిపోయింది. అయితే యేసు అతడు చావడు అని చెప్పలేదు కానీ, ఆయన, “నేను తిరిగి వచ్చేవరకు అతడు జీవించి ఉండడం నాకు ఇష్టమైతే నీకు ఏమి?” అని మాత్రమే అన్నారు.
24ఈ విషయాల గురించి సాక్ష్యమిస్తూ వీటిని వ్రాసిన శిష్యుడు ఇతడే. అతని సాక్ష్యం నిజం అని మనకు తెలుసు.
25యేసు చేసిన కార్యాలు ఇంకా చాలా ఉన్నాయి. వాటిలో ప్రతిదాన్ని వివరించి వ్రాస్తే, వ్రాసిన గ్రంథాలను ఉంచడానికి ఈ ప్రపంచమంతా కూడా సరిపోదు అని నేను భావిస్తున్నాను.

Thekso

Ndaje

Copy

None

A doni që theksimet tuaja të jenë të ruajtura në të gjitha pajisjet që keni? Regjistrohu ose hyr