Logoja YouVersion
Ikona e kërkimit

మత్తయి సువార్త 19

19
విడాకులు
1యేసు ఈ మాటలను చెప్పి ముగించిన తర్వాత గలిలయ ప్రాంతం నుండి యొర్దాను నది అవతల ఉన్న యూదయ ప్రాంతానికి వెళ్లారు. 2గొప్ప జనసమూహం ఆయనను వెంబడించింది, యేసు వారి రోగాలను బాగుచేశారు.
3కొందరు పరిసయ్యులు ఆయనను పరీక్షించడానికి ఆయన దగ్గరకు వచ్చి, “ఏ కారణంగానైనా ఒక పురుషుడు తన భార్యకు విడాకులు ఇవ్వడం చట్టప్రకారం న్యాయమేనా?” అని అడిగారు.
4అందుకు యేసు, “ఆదిలో సృష్టికర్త వారిని ‘పురుషునిగాను స్త్రీగాను సృజించారు’#19:4 ఆది 1:27 అని మీరు చదువలేదా? 5‘ఈ కారణంచేత పురుషుడు తన తల్లిదండ్రులను విడిచి తన భార్యను హత్తుకుంటాడు. అలా వారిద్దరు ఏకశరీరం అవుతారు.’#19:5 ఆది 2:24 6కాబట్టి వారు ఇక ఇద్దరు కారు, కాని ఒక శరీరమే అవుతారు. కాబట్టి దేవుడు జతపరచినవారిని ఏ మనుష్యుడు వేరు చేయకూడదు” అని చెప్పారు.
7అయితే వారు, “అలాంటప్పుడు, ఒక వ్యక్తి తన భార్యకు విడాకుల ధృవీకరణ పత్రం ఇచ్చి ఆమెను పంపించవచ్చని మోషే ఆజ్ఞాపించాడా?” అని ఆయనను అడిగారు.
8అందుకు యేసు ఇలా సమాధానం ఇచ్చారు, “మీ హృదయ కాఠిన్యాన్ని బట్టి, మీ భార్యను విడిచిపెట్ట వచ్చునని మోషే అనుమతించాడు గాని ఆది నుండి అలా జరగలేదు. 9అయితే నేను మీతో చెప్పేది ఏంటంటే, లైంగిక అనైతికత కారణంతో కాకుండా, తన భార్యను విడిచి మరొక స్త్రీని పెళ్ళి చేసుకునేవాడు వ్యభిచారం చేస్తున్నాడు.”
10ఆయన శిష్యులు ఆయనతో, “భార్యా భర్తల మధ్య పరిస్థితి ఇలా ఉంటే అసలు పెళ్ళి చేసుకోకుండా ఉండడమే మంచిది” అని అన్నారు.
11అందుకు యేసు, “ఈ మాటను అందరు అంగీకరించలేకపోవచ్చు కానీ ఈ మాటలు ఎవరి కోసం చెప్పబడ్డాయో వారికి మాత్రమే. 12ఎందుకంటే తల్లి గర్భం నుండే నపుంసకులుగా పుట్టిన వారు ఉన్నారు, నపుంసకులుగా చేయబడినవారు ఉన్నారు, పరలోక రాజ్యం కోసం నపుంసకులగా జీవిస్తున్నవారు ఉన్నారు. కాబట్టి దీనిని అంగీకరించగలవాడు అంగీకరించును గాక!” అని వారితో చెప్పారు.
చిన్న పిల్లలు, యేసు
13అప్పుడు ప్రజలు తమ చిన్నపిల్లలపై యేసు తన చేతులుంచి ప్రార్థించాలని ఆయన దగ్గరకు తీసుకువచ్చారు. కాని శిష్యులు వారిని గద్దించారు.
14అప్పుడు యేసు, “చిన్న పిల్లలను నా దగ్గరకు రానివ్వండి, వారిని ఆటంకపరచకండి, ఎందుకంటే పరలోక రాజ్యం ఇలాంటి వారిదే” అని చెప్పి, 15ఆ చిన్నపిల్లల మీద తన చేతులుంచిన తర్వాత ఆయన అక్కడినుండి వెళ్లిపోయారు.
ధనవంతులు, దేవుని రాజ్యం
16అంతలో ఒకడు యేసు దగ్గరకు వచ్చి, “బోధకుడా, నిత్యజీవం పొందుకోవాలంటే నేను ఏ మంచిని చేయాలి?” అని అడిగాడు.
17అందుకు యేసు, “మంచిని గురించి నన్నెందుకు అడుగుతున్నావు? మంచివాడు ఒక్కడే ఉన్నాడు. నీవు జీవంలోనికి ప్రవేశించాలి అంటే ఆజ్ఞలను పాటించు” అని చెప్పారు.
18అతడు, “ఏ ఆజ్ఞలు?” అని అడిగాడు.
అందుకు యేసు, ఈ విధంగా చెప్పారు, “ ‘మీరు హత్య చేయకూడదు, వ్యభిచారం చేయకూడదు, దొంగతనం చేయకూడదు, అబద్ధసాక్ష్యం చెప్పకూడదు, 19మీ తండ్రిని తల్లిని గౌరవించాలి’#19:19 నిర్గమ 20:12-16; ద్వితీ 5:16-20 ‘మీకులా మీ పొరుగువారిని ప్రేమించాలి’#19:19 లేవీ 19:18 అనే ఆజ్ఞలు.”
20అందుకు ఆ యవ్వనస్థుడు, “నేను వీటన్నిటిని పాటిస్తూనే ఉన్నాను. ఇంకా నాలో ఏ కొరత ఉంది?” అని ఆయనను అడిగాడు.
21అందుకు యేసు, “నీవు ఇంకా పరిపూర్ణతలోనికి రావాలి అంటే వెళ్లి, నీకున్న ఆస్తి అంతా అమ్మి పేదవారికి పంచిపెట్టు అప్పుడు పరలోకంలో నీవు ధనం కలిగి ఉంటావు. తర్వాత వచ్చి నన్ను వెంబడించు” అని చెప్పారు.
22అయితే ఆ యవ్వనస్థుడు ఆ మాట విని, విచారంగా వెళ్లిపోయాడు, ఎందుకంటే గొప్ప ఆస్తి కలవాడు.
23అప్పుడు యేసు తన శిష్యులతో, “ఒక ధనవంతుడు పరలోకరాజ్యంలో ప్రవేశించడం చాలా కష్టం అని, నేను మీతో ఖచ్చితంగా చెప్తున్నాను. 24ఒక ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించడం కంటే ఒంటె సూది రంధ్రం గుండా దూరడం సులభం” అని చెప్పారు.
25శిష్యులు ఈ మాట విని చాలా ఆశ్చర్యంతో, “అయితే మరి ఎవరు రక్షణ పొందగలరు?” అని అడిగారు.
26యేసు వారివైపు చూసి, “ఇది మనుష్యులకు అసాధ్యమే కాని దేవునికి సమస్తం సాధ్యమే” అని చెప్పారు.
27అప్పుడు పేతురు, “ఇదిగో, మేము సమస్తాన్ని విడిచిపెట్టి నిన్ను వెంబడిస్తున్నాం కదా, మరి మాకేమి దొరకుతుంది” అని ఆయనను అడిగాడు.
28అందుకు యేసు వారితో, “అన్ని నూతన పరచబడిన తర్వాత మనుష్యకుమారుడు తన మహిమగల సింహాసనం మీద ఆసీనుడై ఉన్నప్పుడు నన్ను వెంబడించిన మీరు పన్నెండు సింహాసనాల మీద కూర్చుని ఇశ్రాయేలు పన్నెండు గోత్రాల వారిని తీర్పుతీర్చుతారు. 29నా నామాన్ని కలిగి ఉన్నందుకు తన కుటుంబాన్ని, అనగా సహోదరులను, సహోదరీలను, తల్లిని, తండ్రిని, పిల్లలను లేదా పొలాలను గృహాలను నా కోసం విడిచిపెట్టిన ప్రతివాడు నూరురెట్లు పొందుకొని, నిత్యజీవానికి వారసుడు అవుతాడు. 30అయితే చాలామంది మొదటివారు చివరివారవుతారు, చివరి వారు మొదటివారవుతారు” అని చెప్పారు.

Thekso

Ndaje

Kopjo

None

A doni që theksimet tuaja të jenë të ruajtura në të gjitha pajisjet që keni? Regjistrohu ose hyr