YouVersion logo
Dugme za pretraživanje

లూకా సువార్త 15

15
తప్పిపోయి దొరికిన గొర్రె అనే ఉపమానం
1ఒక రోజు పన్ను వసూలు చేసేవారు పాపులు యేసు మాటలను వినాలని ఆయన చుట్టూ గుమికూడారు. 2అయితే పరిసయ్యులు ధర్మశాస్త్ర ఉపదేశకులు అది చూసి, “ఇతడు పాపులతో కూర్చుని వారితో కలిసి తింటున్నాడు” అని సణుగుకొన్నారు.
3అప్పుడు యేసు వారితో ఈ ఉపమానం చెప్పారు: 4“మీలో ఎవనికైనా వంద గొర్రెలు ఉండి, వాటిలో ఒకటి తప్పిపోతే అతడు తొంభై తొమ్మిది గొర్రెలను అరణ్యంలో వదిలేసి, తప్పిపోయిన ఆ ఒక్క గొర్రె దొరికే వరకు వెదకడా? 5అది దొరికినప్పుడు అతడు సంతోషంతో దానిని తన భుజం మీద వేసుకుని, 6ఇంటికి వెళ్లి, తన స్నేహితులను తన పొరుగువారిని పిలిచి, ‘నేను పోగొట్టుకున్న నా గొర్రె దొరికింది, రండి నాతో కలిసి సంతోషించండి’ అని అంటాడు. 7అదే విధంగా, పశ్చాత్తాపం అవసరంలేని తొంభై తొమ్మిది నీతిమంతుల కంటే, పశ్చాత్తాపపడిన ఒక పాపిని బట్టి పరలోకంలో ఎక్కువ సంతోషం కలుగుతుంది అని నేను మీతో చెప్తున్నాను” అన్నారు.
పోయి దొరికిన నాణెం అనే ఉపమానం
8“లేదా ఉదాహరణకు ఒక స్త్రీ దగ్గర పది వెండి నాణాలు ఉండి, వాటిలో ఒకటి పోగొట్టుకుంది. అప్పుడు ఆమె దాని కోసం ఒక దీపం వెలిగించి తన ఇల్లును ఊడ్చి, అది దొరికే వరకు జాగ్రత్తగా వెదకదా? 9అది దొరకగానే, ఆమె తన స్నేహితులను, పొరుగువారిని పిలిచి, వారితో, ‘పోయిన నా నాణెము దొరికింది, రండి నాతో కూడా సంతోషించండి’ అని చెప్తుంది కదా! 10అలాగే పశ్చాత్తాపపడి దేవుని వైపు తిరిగిన ఒక పాపిని గురించి దేవుని దూతల మధ్య సంతోషం కలుగుతుంది అని మీతో చెప్తున్నాను” అన్నారు.
తప్పిపోయి తిరిగివచ్చిన కుమారుడు గురించిన ఉపమానం
11యేసు ఇంకా మాట్లాడుతూ: “ఒక మనుష్యునికి ఇద్దరు కుమారులున్నారు. 12వారిలో చిన్నవాడు తన తండ్రితో, ‘నాన్నా, ఆస్తిలో నాకు రావలసిన భాగం నాకు ఇవ్వు’ అని అడిగాడు. కాబట్టి తండ్రి తన ఆస్తిని వారిద్దరికి పంచి ఇచ్చాడు.
13“కొన్ని రోజుల్లోనే, ఆ చిన్నకుమారుడు తన దగ్గర ఉన్నదంతా పోగుచేసుకుని, సుదూర దేశానికి బయలుదేరాడు అక్కడ తన ఇష్టం వచ్చినట్లు జీవిస్తూ తన సంపదను విచ్చలవిడిగా ఖర్చు చేశాడు. 14అతడు అంతా ఖర్చు చేసిన సమయంలోనే, ఆ దేశంలో తీవ్రమైన కరువు రావడం వలన అతనికి ఇబ్బందులు మొదలయ్యాయి. 15కాబట్టి అతడు ఆ దేశస్థులలో ఒకని పొలంలో పందులను మేపే పనిలో చేరాడు. 16అతనికి బాగా ఆకలివేస్తూ ఉండింది, కాని తినడానికి ఎవరూ ఏమి ఇవ్వలేదు కాబట్టి అతడు పందులు మేస్తున్న పొట్టుతో తన కడుపు నింపుకోవాలని చూశాడు.
17“అయితే వానికి బుద్ధి వచ్చినప్పుడు వాడు, ‘నా తండ్రి దగ్గర పని చేసే చాలామంది కూలివారికి కూడా సమృద్ధిగా ఆహారం ఉంది, కానీ నేను ఇక్కడ ఆకలితో చస్తున్నాను. 18నేను నా తండ్రి దగ్గరకు వెళ్లి అతనితో, నాన్నా, నీకు పరలోకానికి విరోధంగా నేను పాపం చేశాను. 19నీ కుమారుడనని అనిపించుకునే అర్హత కూడా నాకు లేదు, నన్ను నీ పనివారిలో ఒకనిగా పెట్టుకో అని చెప్తాను’ అనే ఆలోచనతో లేచి, 20అతని తండ్రి దగ్గరకు వెళ్లాడు.
“వాడు ఇంకా దూరంగా ఉండగానే, వాని తండ్రి వాన్ని చూసి, వానిపై జాలిపడి, పరుగెత్తుకొని వచ్చి వాని కౌగిలించుకుని వాని మెడ మీద ముద్దు పెట్టుకున్నాడు.
21“అప్పుడు వాడు తన తండ్రితో, ‘నాన్నా, నీకు పరలోకానికిని విరోధంగా నేను పాపం చేశాను. ఇప్పటినుండి నేను నీ కుమారుడను అని అనిపించుకోడానికి కూడా అర్హున్ని కాను’ అని అన్నాడు.
22“కాని వాని తండ్రి తన పనివారితో, ‘త్వరగా! విలువైన వస్త్రాలను తెచ్చి ఇతనికి ధరింపచేయండి, వీని చేతికి ఉంగరం పెట్టి, కాళ్లకు చెప్పులను తొడిగించండి. 23ఒక క్రొవ్విన దూడను తెచ్చి వధించండి. మనం విందు చేసుకుని ఆనందిద్దాము. 24ఈ నా కుమారుడు చనిపోయి తిరిగి బ్రతికాడు, వీడు తప్పిపోయి దొరికాడు’ అని అన్నాడు. అలా వారందరు అతనితో ఆనందించడం మొదలుపెట్టారు.
25“ఆ సమయంలో, పెద్ద కుమారుడు పొలం నుండి ఇంటికి వస్తున్నాడు. అతడు ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు, సంగీత నాట్యాల ధ్వని వినిపించింది. 26అప్పుడు అతడు తన పనివారిలో ఒకన్ని పిలిచి, ‘ఇంట్లో ఏం జరుగుతోంది?’ అని అడిగాడు. 27అందుకు ఆ పనివాడు, ‘నీ తమ్ముడు క్షేమంగా ఇంటికి తిరిగి వచ్చాడని నీ తండ్రి సంతోషంతో విందు చేయడానికి క్రొవ్విన దూడను వధించాడు’ అని చెప్పాడు.
28“దానితో పెద్ద కుమారుడు కోప్పడి ఇంట్లోకి వెళ్లడానికి ఇష్టపడలేదు. కాబట్టి అతని తండ్రి బయటకు వచ్చి అతన్ని ఇంట్లోకి రమ్మని బ్రతిమాలాడు. 29కాని అతడు తన తండ్రితో, ‘చూడు, ఇన్ని సంవత్సరాల నుండి నీకు దాస్యం చేస్తూ వచ్చాను, నీ మాటను ఎప్పుడూ నిర్లక్ష్యం చేయలేదు. అయినా నా స్నేహితులతో కలిసి సంతోషించడానికి ఒక చిన్న మేకపిల్లను కూడా నీవు ఎప్పుడు నాకు ఇవ్వలేదు. 30కానీ నీ చిన్నకుమారుడు నీ ఆస్తినంతా వేశ్యలతో తిరిగి పాడుచేసి, ఇంటికి తిరిగి వస్తే వీని కోసం క్రొవ్విన దూడను వధించి విందు చేస్తున్నావా?’ అని అన్నాడు.
31“అందుకు అతని తండ్రి, ‘నా కుమారుడా, నీవు ఎల్లప్పుడూ నాతోనే ఉన్నావు, నాకున్నదంతా నీదే. 32కాని ఈ నీ తమ్ముడు చనిపోయి తిరిగి బ్రతికాడు, అతడు తప్పిపోయి దొరికాడు కాబట్టి మనం సంతోషించి ఆనందించాలి’ అని చెప్పాడు.”

Istaknuto

Podijeli

Kopiraj

None

Želiš li da tvoje istaknuto bude sačuvano na svim tvojim uređajima? Kreiraj nalog ili se prijavi