యోహాను సువార్త 12
12
బేతనియలో యేసు అభిషేకించబడుట
1ఏ లాజరు చనిపోతే యేసు మళ్ళీ బ్రతికించారో ఆ లాజరు ఉండే బేతనియ అనే ఊరికి పస్కా పండుగకు ఆరు రోజుల ముందు యేసు వచ్చారు. 2ఇక్కడ యేసు కోసం విందు సిద్ధం చేయబడింది. ఆ భోజనపు బల్ల దగ్గర ఆయనతో పాటు కూర్చున్నవారిలో లాజరు కూడా ఉన్నాడు. మార్త వారికి వడ్డిస్తూ ఉంది. 3మరియ సుమారు అయిదువందల గ్రాముల,#12:3 లేదా సుమారు అర లీటర్ అత్యంత విలువైన జటామాంసి చెట్ల నుండి తీసిన అత్తరు తెచ్చి యేసు పాదాల మీద పోసి తన తలవెంట్రుకలతో ఆయన పాదాలను తుడిచింది. అప్పుడు ఆ ఇల్లంతా పరిమళద్రవ్యపు వాసనతో నిండిపోయింది.
4అయితే ఆయనను అప్పగించబోతున్న ఆయన శిష్యులలో ఒకడైన ఇస్కరియోతు యూదా ఆమె చేసిన దానికి అభ్యంతరం చెప్తూ, 5“ఈ అత్తరును అమ్మి ఆ డబ్బును పేదవారికి ఇవ్వాల్సింది కదా! దాని ఖరీదు ఒక సంవత్సర జీతానికి సరిపడుతుంది.” 6అతడు ఈ మాటలు మాట్లాడింది బీదల మీద ఉన్న శ్రద్ధతో కాదు; అతడు ఒక దొంగ; డబ్బు సంచి తన దగ్గరే ఉండేది కాబట్టి అందులో ఉన్న డబ్బు వాడుకునేవాడు.
7అందుకు యేసు, “ఆమె చేస్తుంది చేయనివ్వండి, ఎందుకంటే నా భూస్థాపన రోజు వరకు ఆమె ఈ అత్తరును ఉంచుకోవాలి. 8బీదలు మీ మధ్య ఎప్పుడూ ఉంటారు#12:8 ద్వితీ 15:11 కాని నేను మీతో ఉండను” అన్నారు.
9అంతలో యేసు అక్కడ ఉన్నాడని తెలుసుకున్న యూదులు గుంపుగా ఆయన కోసం మాత్రమే కాక చనిపోయి తిరిగి లేపబడిన లాజరును కూడా చూడాలని వచ్చారు. 10ముఖ్య యాజకులు లాజరును కూడా చంపాలని ఆలోచన చేశారు. 11ఎందుకంటే చనిపోయిన లాజరును యేసు బ్రతికించారని విన్న యూదులలో చాలామంది తమ వారిని విడిచిపెట్టి యేసును నమ్మారు.
యెరూషలేములో యేసు విజయోత్సవ ప్రవేశం
12మరునాడు పండుగకు వచ్చిన గొప్ప జనసమూహం యేసు యెరూషలేముకు వస్తున్నారని విని, 13ఖర్జూరపు మట్టలు తీసుకుని,
“హోసన్నా!”
“ప్రభువు పేరట వచ్చేవాడు స్తుతింపబడును గాక!”
“ఇశ్రాయేలు రాజు స్తుతింపబడును గాక!”#12:13 కీర్తన 118:25,26
అని కేకలువేస్తూ ఆయనను కలుసుకోడానికి వెళ్లారు.
14యేసు ఒక గాడిద పిల్లను చూసి దానిపై కూర్చున్నారు. ఎందుకంటే లేఖనాల్లో ఈ విధంగా వ్రాయబడి ఉంది:
15“సీయోను కుమారీ, భయపడకు!
ఇదిగో, గాడిదపిల్ల మీద కూర్చుని
నీ రాజు వస్తున్నాడు.”#12:15 జెకర్యా 9:9
16మొదట ఆయన శిష్యులు ఈ సంగతులను గ్రహించలేదు. కాని యేసు మహిమ పరచబడిన తర్వాత మాత్రమే ఈ సంగతులన్ని ఆయన గురించే వ్రాయబడ్డాయని, అందుకే అవన్నీ ఆయనకు జరిగాయని జ్ఞాపకం చేసుకున్నారు.
17యేసు సమాధిలో నుండి పిలిచి లాజరును మళ్ళీ బ్రతికించిన యేసుతో పాటు ఉన్న ప్రజలందరు ఆ విషయాన్ని ఇతరులకు చెప్తూనే ఉన్నారు. 18ఆయన ఈ అద్భుత కార్యాన్ని చేశారని విన్న జనసమూహం ఆయనను కలుసుకోడానికి వస్తూనే ఉన్నారు. 19దీని గురించి పరిసయ్యులు, “చూడండి, లోకమంతా ఆయన వెనుక ఎలా వెళ్తుందో! అయినా మనమేమి చేయలేకపోతున్నాం!” అని ఒకరితో ఒకరు అనుకున్నారు.
తన మరణాన్ని గురించి ముందే చెప్తున్న యేసు
20ఆ పండుగలో ఆరాధించడానికి వచ్చిన వారిలో కొందరు గ్రీసుదేశస్థులున్నారు. 21వారు గలిలయలోని బేత్సయిదా గ్రామానికి చెందిన ఫిలిప్పు దగ్గరకు వచ్చి, “అయ్యా, మాకు యేసును చూడాలని ఉంది” అని అన్నారు. 22ఫిలిప్పు వెళ్లి ఆ విషయం అంద్రెయతో చెప్పాడు. ఫిలిప్పు అంద్రెయ కలిసి వెళ్లి యేసుతో చెప్పారు.
23అందుకు యేసు వారితో, “మనుష్యకుమారుడు మహిమ పొందే సమయం వచ్చింది. 24నేను మీతో ఖచ్చితంగా చెప్తున్నాను, ఒక గోధుమ గింజ భూమిలో పడి చావకపోతే అది గింజగానే ఉండిపోతుంది. అది చస్తేనే విస్తారంగా ఫలిస్తుంది. 25తన ప్రాణాన్ని ప్రేమించేవారు దానిని పోగొట్టుకుంటారు, ఈ లోకంలో తన ప్రాణాన్ని ద్వేషించేవారు దాన్ని నిత్యజీవం కోసం కాపాడుకుంటారని నేను మీతో ఖచ్చితంగా చెప్తున్నాను. 26నన్ను సేవించేవారు నన్ను వెంబడించాలి; అప్పుడు నేను ఎక్కడ ఉన్నానో నా సేవకులు అక్కడ ఉంటారు. ఇలా నన్ను సేవించే వానిని నా తండ్రి ఘనపరుస్తాడు.
27“ఇప్పుడు నా ప్రాణం ఆందోళన చెందుతూ ఉంది, నేనేం చెప్పాలి? ‘తండ్రీ, ఈ గడియ నుండి నన్ను తప్పించవా?’ కానీ దీని కోసమే కదా నేను ఈ గడియకు చేరుకున్నాను. 28తండ్రీ, నీ పేరుకు మహిమ కలిగించుకో!” అన్నారు.
అప్పుడు పరలోకం నుండి ఒక స్వరం, “నేను దాన్ని మహిమపరిచాను, మళ్ళీ నేను మహిమపరుస్తాను” అని వినిపించింది. 29అప్పుడు అక్కడ నిలబడి ఉన్న జనసమూహం అది విని, ఇప్పుడు ఉరిమింది కదా అన్నారు. మిగిలిన వారు, “ఒక దేవదూత అతనితో మాట్లాడాడు” అని అన్నారు.
30అప్పుడు యేసు, “ఆ స్వరం నా కోసం రాలేదు అది మీ కోసమే వచ్చింది. 31ఇప్పుడు లోకానికి తీర్పు తీర్చే సమయం. ఇది ఈ లోకాధికారిని తరిమి వేసే సమయం. 32నేను భూమిమీది నుండి మీదికి ఎత్తబడినప్పుడు, మానవులందరిని నా దగ్గరకు ఆకర్షించుకుంటాను” అని అన్నారు. 33ఆయన తాను పొందబోయే మరణాన్ని సూచిస్తూ ఈ మాటను చెప్పారు.
34ఆ జనసమూహం, “క్రీస్తు ఎల్లప్పుడు ఉంటాడని ధర్మశాస్త్రంలో ఉందని మేము విన్నాం, మరి మనుష్యకుమారుడు మీదికి ఎత్తబడాలని నీవెలా చెప్తావు? ఈ మనుష్యకుమారుడు ఎవరు?” అని అడిగారు.
35అందుకు యేసు వారితో, “ఇంకా కొంతకాలం మాత్రమే మీ మధ్య వెలుగు ఉంటుంది. చీకటిలో నడిచేవానికి తాను ఎక్కడికి వెళ్తున్నాడో తెలియదు కాబట్టి మిమ్మల్ని చీకటి కమ్ముకోక ముందే వెలుగు ఉన్నప్పుడే నడవండి. 36మీరు వెలుగు కుమారులుగా మారడానికి మీకు వెలుగు ఉన్నప్పుడే వెలుగును నమ్మండి” అని అన్నారు. యేసు ఈ మాటలను చెప్పి ముగించిన తర్వాత, అక్కడినుండి వెళ్లి వారికి కనబడకుండా రహస్యంగా ఉన్నారు.
యూదులలో విశ్వాసం, అవిశ్వాసం
37యేసు వారి ఎదుట అనేక అద్భుత కార్యాలను చేసిన తర్వాత కూడ వారు ఆయనను నమ్మలేదు.
38దానికి కారణం, “ప్రభువా, మా సందేశాన్ని ఎవరు నమ్మారు,
ప్రభువు హస్తం ఎవరికి వెల్లడయింది?”#12:38 యెషయా 53:1
అని యెషయా ప్రవక్త చెప్పిన మాటలు నెరవేరాలి.
39అందుకే వారు నమ్మలేకపోయారు, ఎందుకంటే మరొక చోట యెషయా ఇలా అన్నాడు:
40“ఆయన వారి కళ్ళకు గ్రుడ్డితనాన్ని,
వారి హృదయాలకు కాఠిన్యాన్ని కలుగజేశారు.
అలా చేసి ఉండకపోతే వారు తమ కళ్లతో చూసి
హృదయాలతో గ్రహించి, వారు నా తట్టు తిరిగి ఉండేవారు
అప్పుడు నేను వారిని స్వస్థపరచే వానిని.”#12:40 యెషయా 6:10
41యెషయా యేసు మహిమను చూశాడు కాబట్టి ఆయనను గురించి ఈ మాట చెప్పాడు.
42అధికారులలో కూడ చాలామంది ఆయనను నమ్మారు. కాని వారు తమ విశ్వాసాన్ని బహిరంగంగా ఒప్పుకుంటే పరిసయ్యులు తమను సమాజమందిరం నుండి వెలివేస్తారని భయపడ్డారు. 43ఎందుకంటే వారు దేవుని మెప్పు కన్నా, ప్రజల మెప్పునే ఎక్కువగా ఇష్టపడ్డారు.
44అప్పుడు యేసు బిగ్గరగా, “ఎవరైతే నన్ను నమ్ముతారో, వారు నన్ను మాత్రమే కాదు, నన్ను పంపినవానిని కూడ నమ్ముతారు. 45నన్ను చూసేవాడు నన్ను పంపినవానిని చూస్తున్నాడు. 46నన్ను నమ్మిన ఏ ఒక్కరు చీకటిలో ఉండకూడదని, నేను ఈ లోకానికి వెలుగుగా వచ్చాను.
47“ఎవరైనా నా మాటలు విని వాటిని పాటించకపోతే నేను వానికి తీర్పు తీర్చను. ఎందుకంటే నేను ఈ లోకాన్ని రక్షించడానికే వచ్చాను తప్ప తీర్పు తీర్చడానికి రాలేదు. 48నన్ను తిరస్కరించి నా మాటలు స్వీకరించని వాని కోసం ఒక న్యాయాధిపతి ఉన్నాడు; నేను పలికిన ఈ మాటలే చివరి రోజున వాన్ని తీర్పు తీరుస్తాయి. 49నా అంతట నేను మాట్లాడడం లేదు; నేను ఏమి మాట్లాడాలని నన్ను పంపిన తండ్రి నన్ను ఆజ్ఞాపించాడో దాన్నే నేను మాట్లాడాను. 50తండ్రి ఆజ్ఞ నిత్యజీవానికి నడిపిస్తుందని నాకు తెలుసు. అందుకే తండ్రి చెప్పమని నాకు చెప్పిన మాటలనే నేను చెప్తున్నాను” అని చెప్పారు.
Iliyochaguliwa sasa
యోహాను సువార్త 12: TSA
Kuonyesha
Shirikisha
Nakili
Je, ungependa vivutio vyako vihifadhiwe kwenye vifaa vyako vyote? Jisajili au ingia
తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం
ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
అనుమతితో ఉపయోగించబడింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని హక్కులు ప్రత్యేకించబడ్డాయి.
Telugu Contemporary Version, Holy Bible
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Used with permission. All rights reserved worldwide.