Chapa ya Youversion
Ikoni ya Utafutaji

యోహాను 4

4
సమరయ స్త్రీతో మాట్లాడిన యేసు
1యోహాను కంటే యేసు ఎక్కువమందిని శిష్యులుగా చేసుకొని బాప్తిస్మం ఇస్తున్నట్లు పరిసయ్యులు విన్నారని యేసుకు తెలిసింది. 2నిజానికి బాప్తిస్మం ఇచ్చింది యేసు కాదు, కాని ఆయన శిష్యులు. 3కనుక ఆయన యూదయ ప్రాంతాన్ని విడిచి మరొకసారి గలిలయ ప్రాంతానికి తిరిగి వెళ్లారు.
4ఆయన సమరయ ప్రాంతం గుండా వెళ్లవలసివచ్చింది. 5కనుక యాకోబు తన కుమారుడైన యోసేపునకు ఇచ్చిన పొలానికి దగ్గరగా ఉన్న సమరయలోని సుఖారనే ఊరికి ఆయన వచ్చారు. 6అక్కడ యాకోబు బావి ఉంది, యేసు, ప్రయాణం వలన అలసి, ఆ బావి ప్రక్క కూర్చున్నారు. అది మిట్టమధ్యాహ్న సమయం.
7-8ఒక సమరయ స్త్రీ నీరు తోడుకోడానికి అక్కడికి వచ్చినప్పుడు, యేసు ఆమెతో, “నాకు త్రాగడానికి నీళ్లు ఇవ్వగలవా?” అని అడిగారు. ఆయన శిష్యులు ఆహారం కొనడానికి ఊరిలోనికి వెళ్లారు.
9ఆ సమరయ స్త్రీ ఆయనతో, “నీవు యూదుడవు, నేను సమరయ స్త్రీని. నీవు నన్ను త్రాగడానికి ఇవ్వుమని ఎలా అడుగుతావు?” అన్నది. ఎందుకంటే యూదులు సమరయులతో సహవాసం చేయరు.
10యేసు, “దేవుని బహుమానం మరియు నిన్ను నీళ్ళు అడిగింది ఎవరో నీకు తెలిస్తే, నీవే ఆయనను అడిగియుండేదానివి, ఆయన నీకు జీవజలాన్ని ఇచ్చి ఉండేవాడు” అని ఆమెకు జవాబిచ్చారు.
11అందుకు ఆమె, “అయ్యా, ఈ బావి చాలా లోతు, పైగా నీళ్ళు తోడుకోడానికి నీ దగ్గర ఏమీ లేదు. మరి ఆ జీవజలం నీకు ఎక్కడ దొరుకుతుంది? 12మా పితరుడైన యాకోబు ఈ బావిని మాకిచ్చాడు. ఈ బావి నీళ్ళను అతడు, అతని కుమారులు త్రాగారు మరియు అతని పశువులు కూడా త్రాగాయి. నీవు అతనికంటే గొప్పవాడివా?” అని అడిగింది.
13అందుకు యేసు, “ఈ నీళ్ళు త్రాగిన ప్రతి ఒక్కరికి మళ్ళీ దాహం వేస్తుంది, 14కానీ నేనిచ్చే నీళ్ళను త్రాగే వారికి ఇక ఎప్పటికీ దాహం వేయదు. నిజానికి, నేనిచ్చే నీళ్ళు వారికి నిత్యజీవానికి నీటి ఊటగా ఉంటుంది” అన్నారు.
15ఆ స్త్రీ ఆయనతో, “అయ్యా, నాకు దాహం వేయకుండా మరియు నీళ్ళు చేదుకోడానికి ఇంత దూరం రాకుండా ఉండడానికి ఆ నీటిని నాకు ఇవ్వండి” అన్నది.
16ఆయన ఆమెతో, “వెళ్లి, నీ భర్తను పిలుచుకొనిరా” అని చెప్పారు.
17అందుకు ఆమె, “నాకు భర్త లేడు” అన్నది.
యేసు ఆమెతో, “నీకు భర్త లేడని నీవు చెప్పింది వాస్తవమే. 18నిజానికి, నీకు ఐదుగురు భర్తలు ఉండేవారు, ఇప్పుడు నీతో ఉన్న వాడు నీ భర్త కాడు. నీవు సత్యమే చెప్పావు” అన్నారు.
19అప్పుడు ఆ స్త్రీ, “అయ్యా, నీవు ప్రవక్తవని నేను గ్రహిస్తున్నాను. 20మా పితరులు ఈ పర్వతం మీద ఆరాధించారు, కానీ యూదులైన మీరు ఆరాధించవలసిన స్థలం యెరూషలేమని అంటారు” అన్నది.
21అప్పుడు యేసు ఆమెతో, “అమ్మా, నన్ను నమ్ము, ఒక సమయం వస్తుంది అప్పుడు మీరు తండ్రిని ఈ పర్వతం మీద గాని యెరూషలేములో గాని ఆరాధించరు. 22సమరయులైన మీరు మీకు తెలియని దానిని ఆరాధిస్తున్నారు; మేము మాకు తెలిసిన దానిని ఆరాధిస్తున్నాం, ఎందుకంటే రక్షణ యూదులలో నుండే వస్తుంది. 23అయినా నిజమైన ఆరాధికులు పరలోక తండ్రిని ఆత్మతో, సత్యంతో ఆరాధించే ఒక సమయం వస్తుంది, అది ఇప్పటికే వచ్చేసింది, ఎందుకంటే అలాంటి ఆరాధికుల కొరకే తండ్రి చూసేది. 24దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించే వారు ఆత్మతో సత్యంతో ఆరాధించాలి” అని చెప్పారు.
25అప్పుడు ఆ స్త్రీ ఆయనతో, “క్రీస్తు#4:25 క్రీస్తు అనగా మెస్సీయ వస్తాడని నాకు తెలుసు, ఆయన వచ్చినప్పుడు, ఆయన అన్ని విషయాలను మాకు వివరిస్తాడు” అని అన్నది.
26అప్పుడు యేసు, “నీతో మాట్లాడుతున్న నేనే ఆయనను” అని తెలియజేసారు.
యేసు వద్దకు తిరిగి వచ్చిన శిష్యులు
27ఇంతలో ఆయన శిష్యులు అక్కడ చేరుకొని యేసు ఆ స్త్రీతో మాట్లాడుతున్నాడని చూసి ఆశ్చర్యపడ్డారు. కానీ, “నీకు ఏమి కావాలి? లేక ఆమెతో ఎందుకు మాట్లాడుతున్నావు?” అని కాని ఎవరు అడగలేదు.
28అప్పుడు ఆ స్త్రీ తన నీటి కుండను వదిలిపెట్టి ఊరిలోనికి వెళ్లి ప్రజలతో, 29“రండి, నేను చేసిందంతా నాతో చెప్పిన వ్యక్తిని చూడండి, ఈయనే క్రీస్తు అయి ఉంటాడా?” అని చెప్పింది. 30వారు ఊరి నుండి బయలుదేరి ఆయన దగ్గరకు వచ్చారు.
31ఇంతలో ఆయన శిష్యులు, “రబ్బీ, కొంచెం తినండి” అని ఆయనను వేడుకొన్నారు.
32అయితే ఆయన, “నా దగ్గర తినడానికి మీకు తెలియని ఆహారం ఉంది” అని వారితో చెప్పారు.
33అందుకు శిష్యులు ఒకరితో ఒకరు, “ఎవరైనా ఈయనకు ఆహారం తెచ్చారేమో?” అని చెప్పుకొన్నారు.
34యేసు వారితో, “నన్ను పంపినవాని చిత్తప్రకారం చేసి ఆయన పనిని ముగించడమే నా ఆహారం. 35‘కోతకు రావడానికి ఇంకా నాలుగు నెలలు ఉంది’ అని మీరు చెప్పుతారు కదా! నేను మీతో చెప్పేది ఏంటంటే, కళ్ళు తెరిచి పొలాలను చూడండి! పంట పండి కోతకు సిద్ధంగా ఉంది. 36పంటను కోసేవాడు తన జీతం తీసుకొని, పంటను విత్తినవాడు మరియు కోసేవాడు ఇద్దరూ సంతోషించేలా, పంట అంతా కోసి నిత్యజీవం కొరకు కూర్చుకొంటాడు. 37ఈ విధంగా ‘విత్తువాడు ఒకడు, కోసేవాడు మరొకడు’ అనే సామెత నిజమే. 38మీరు పని చేయని పొలంలో పంటను కోయడానికి నేను మిమ్మల్ని పంపించాను. అక్కడ ఇతరులు కష్టపడి పనిచేశారు, వారి కష్ట ఫలాన్ని మీరు కోసుకొని అనుభవిస్తున్నారు” అన్నారు.
విశ్వసించిన అనేకమంది సమరయులు
39ఆ ఊరిలోని సమరయులలో అనేకమంది, “నేను చేసింది అంతా ఆయన నాతో చెప్పారు” అని ఆ స్త్రీ ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి ఆయనను నమ్మారు. 40ఆ సమరయులు ఆయన దగ్గరకు వచ్చి, వారితో ఉండుమని వేడుకొన్నప్పుడు ఆయన అక్కడ రెండు రోజులు ఉన్నారు. 41ఆయన మాటలను బట్టి అనేకమంది విశ్వాసులయ్యారు.
42వారు ఆ స్త్రీతో, “నీవు చెప్పిన దానిని బట్టి కాదు; కాని మాకు మేమే విని నిజంగా ఈయన లోక రక్షకుడని తెలుసుకొని నమ్ముతున్నాం” అన్నారు.
అధికారి కుమారుడిని స్వస్థపరచిన యేసు
43రెండు రోజుల తర్వాత ఆయన గలిలయ ప్రాంతానికి వెళ్లారు. 44ఒక ప్రవక్త తన స్వదేశంలో గౌరవం పొందడని యేసు తెలిపారు. 45ఆయన గలిలయ చేరగానే, గలిలయులు ఆయనను ఆహ్వానించారు. పస్కా పండుగ సమయంలో వారందరు అక్కడే ఉన్నారు కనుక యెరూషలేములో ఆయన చేసిన కార్యాలన్నిటిని వారు చూసారు.
46ఆయన నీటిని ద్రాక్షరసంగా మార్చిన గలిలయలోని కానాను, మరలా దర్శించారు. కపెర్నహూములో ఒక రాజ్యాధికారి కొడుకు అనారోగ్యంతో ఉన్నాడు. 47యేసు యూదయ ప్రాంతం నుండి గలిలయకు వచ్చాడని ఆ రాజ్యాధికారి విని, అతడు ఆయన దగ్గరకు వెళ్లి, చనిపోతున్న తన కొడుకును స్వస్థపరచుమని బ్రతిమాలుకొన్నాడు.
48యేసు అతనితో, “మీరు అద్బుత క్రియలు, మహత్కార్యాలను చూస్తేనే తప్ప నమ్మరు” అన్నారు.
49ఆ రాజ్యాధికారి, “అయ్యా, నా బిడ్డ చనిపోకముందే దయచేసి రండి” అని వేడుకొన్నాడు.
50యేసు, “వెళ్లు, నీ కొడుకు బ్రతుకుతాడు” అని చెప్పారు.
యేసు మాటను నమ్మి అతడు వెళ్లిపోయాడు. 51అతడు ఇంకా దారిలో ఉండగానే, అతని పనివారు అతన్ని కలిసి, అతని కొడుకు బాగయ్యాడని తెలియచేశారు. 52అతడు తన కొడుకు ఏ సమయంలో బాగుపడ్డాడని వారిని అడిగినప్పుడు, “నిన్న మధ్యాహ్నం ఒంటి గంటకు అతని జ్వరం తగ్గిపోయింది” అని వారు చెప్పారు.
53అప్పుడు ఆ తండ్రి, యేసు తనతో, “నీ కొడుకు బ్రతుకుతాడు” అని సరిగ్గా అదే సమయంలో చెప్పారని గ్రహించి, అతడు, అతని ఇంటి వారు నమ్మారు.
54యేసు యూదయ ప్రాంతం నుండి గలిలయకు వచ్చిన తర్వాత ఆయన చేసిన రెండవ సూచక క్రియ ఇది.

Iliyochaguliwa sasa

యోహాను 4: TCV

Kuonyesha

Shirikisha

Nakili

None

Je, ungependa vivutio vyako vihifadhiwe kwenye vifaa vyako vyote? Jisajili au ingia