Chapa ya Youversion
Ikoni ya Utafutaji

మత్తయి 5

5
కొండ మీది ప్రసంగం
1ఒక రోజు యేసు జనసమూహాన్ని చూసి, కొండ మీదికి వెళ్లి కూర్చున్నారు, ఆయన శిష్యులు ఆయన దగ్గరకు వచ్చారు. 2అప్పుడు ఆయన వారికి బోధించడం మొదలుపెట్టారు.
ధన్యతలు
ఆయన అన్నారు:
3“ఆత్మ కొరకు దీనులైన వారు ధన్యులు,
పరలోక రాజ్యం వారిదే.
4దుఃఖించే వారు ధన్యులు,
వారు ఓదార్చబడతారు.
5సాత్వికులు ధన్యులు,
వారు భూమిని స్వతంత్రించుకుంటారు.
6నీతికొరకు ఆకలిదప్పులు గలవారు ధన్యులు,
వారు తృప్తిపొందుతారు.
7కనికరం చూపేవారు ధన్యులు,
వారు కనికరం పొందుకొంటారు.
8హృదయశుధ్ధి గలవారు ధన్యులు,
వారు దేవుని చూస్తారు.
9సమాధానపరచేవారు ధన్యులు,
వారు దేవుని బిడ్డలుగా పిలువబడతారు.
10నీతికొరకు హింసల పాలయ్యేవారు ధన్యులు,
పరలోక రాజ్యం వారిదే.
11“నా నిమిత్తం ప్రజలు మిమ్మల్ని అవమానించి, హింసించి మీరు చెడ్డవారని అబద్ధ సాక్ష్యం చెప్పినప్పుడు మీరు ధన్యులు. 12సంతోషించి ఆనందించండి, ఎందుకంటే పరలోకంలో మీ బహుమానం గొప్పది, మీకన్నా ముందు వచ్చిన ప్రవక్తలను కూడా వారు ఇలాగే హింసించారు.
ఉప్పు మరియు వెలుగు
13“మీరు లోకానికి ఉప్పై ఉన్నారు. కాని ఉప్పు తన సారం కోల్పోతే, అది తిరిగి సారవంతంగా ఎలా చేయబడుతుంది? అది బయట పడవేయబడి పాదాల క్రింద త్రొక్కబడడానికే తప్ప మరి దేనికి పనికిరాదు.
14“మీరు లోకానికి వెలుగై ఉన్నారు. కొండ మీద కట్టబడిన పట్టణం కనబడకుండ ఉండలేదు. 15అదే విధంగా, ఎవ్వరూ దీపాన్ని వెలిగించి దానిని పాత్ర క్రింద పెట్టరు, కాని దానిని దీపస్తంభం మీద పెడతారు, అప్పుడది ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరికి వెలుగు ఇస్తుంది. 16అదే విధంగా, ఇతరులు మీ మంచి పనులను చూసి పరలోకమందు ఉన్న మీ తండ్రిని మహిమపరిచేలా, ఇతరుల ముందు మీ వెలుగును ప్రకాశింపనివ్వండి.
ధర్మశాస్త్ర నెరవేర్పు
17“నేను ధర్మశాస్త్రాన్ని లేదా ప్రవక్తల మాటలను రద్దు చేయడానికి వచ్చానని అనుకోవద్దు. నేను వాటిని నెరవేర్చడానికే కాని రద్దు చేయడానికి రాలేదు. 18భూమ్యాకాశాలు గతించిపోకముందు, ధర్మశాస్త్రం అంతా నెరవేరే వరకు అందులో నుండి ఒక పొల్లు కానీ, ఒక సున్నా కానీ తప్పిపోదని నేను మీతో ఖచ్చితంగా చెప్తున్నాను. 19కనుక ఈ ఆజ్ఞలలో అతి చిన్నదాన్ని పాటించకుండానే ఇతరులకు బోధించేవారు పరలోకరాజ్యంలో చాలా తక్కువవారిగా పిలువబడతారు, అయితే ఎవరైతే ఈ ఆజ్ఞలను పాటిస్తూ బోధిస్తారో వారు పరలోకరాజ్యంలో గొప్పవారిగా పిలువబడతారు. 20ధర్మశాస్త్ర ఉపదేశకుల నీతి కంటే, పరిసయ్యుల నీతి కంటే, మీ నీతి అధికంగా లేకపోతే మీరు పరలోకరాజ్యంలో ప్రవేశించలేరని నేను మీతో ఖచ్చితంగా చెప్తున్నాను.
హత్య
21“ ‘మీరు నరహత్య చేయకూడదు, ఎవరైనా నరహత్య చేస్తే వారు తీర్పుకు గురవుతారు’#5:21 నిర్గమ 20:13 అని మీ పూర్వీకులకు చెప్పిన మాట మీరు విన్నారు. 22కాని నేను చెప్పేది, తన సహోదరుని మీద కాని, సహోదరి మీద కాని కోపపడే ప్రతివాడు తీర్పుకు గురవుతాడు. అంతేకాక తన సహోదరుని కాని సహోదరిని కాని చూసి ద్రోహి అని పలికేవాడు న్యాయస్థానానికి సమాధానం చెప్పుకోవాలి. వెర్రివాడ లేదా వెర్రిదాన అని పలికే ప్రతివాడు నరకాగ్నికి గురవుతాడు.
23“కాబట్టి నీవు బలిపీఠం మీద కానుకను అర్పిస్తూ వుండగా నీ సహోదరునికైనా సహోదరికైనా నీ పట్ల ఏదైన విరోధం ఉందని జ్ఞాపకం వస్తే, 24అక్కడ బలిపీఠం ముందే నీ కానుకను పెట్టి, మొదట వెళ్లి నీ సహోదరునితో లేక సహోదరితో సమాధానపడి ఆ తర్వాత వచ్చి నీ కానుకను అర్పించాలి.
25“నిన్ను న్యాయస్థానానికి తీసుకువెళ్తున్న నీ విరోధితో నీకున్న వివాదాన్ని త్వరగా పరిష్కరించుకోవాలి. ఆ పని మీరిద్దరు ఇంకా దారిలో ఉండగానే చేయాలి. లేకపోతే నీ విరోధి నిన్ను న్యాయాధిపతికి అప్పగించవచ్చు, ఆ న్యాయాధిపతి నిన్ను అధికారికి అప్పగించవచ్చు, మరియు నీవు చెరసాలలో వేయబడవచ్చు. 26నిజంగా నీతో నేను చెప్తున్నా, నీవు చివరి పైసా చెల్లించే వరకు బయట పడలేవు.
వ్యభిచారము
27“ ‘వ్యభిచారం చేయకూడదు’ అని చెప్పిన మాట మీరు విన్నారు.#5:27 నిర్గమ 20:14 28అయితే నేను మీతో చెప్పేది, ఒక స్త్రీని కామంతో చూసే ప్రతివాడు అప్పటికే తన మనస్సులో ఆమెతో వ్యభిచరించాడు. 29నీవు పొరపాట్లు చేయడానికి ఒకవేళ నీ కుడికన్ను కారణమైతే, దానిని పెరికి పారవేయి. నీ శరీరమంతా నరకంలో పడవేయబడటం కంటే, నీ శరీరంలో ఒక అవయవాన్ని పోగొట్టుకోవడం నీకు మేలు. 30నీవు పొరపాట్లు చేయడానికి ఒకవేళ నీ కుడి చెయ్యి కారణమైతే, దానిని నరికి పారవేయి. నీ శరీరమంతా నరకంలో పడవేయబడే కంటే నీ శరీరంలో ఒక అవయవాన్ని పోగొట్టుకోవడం నీకు మేలు.
విడాకులు
31“ ‘తన భార్యను విడిచిపెట్టేవాడు ఆమెకు ధృవీకరణ పత్రం వ్రాసివ్వాలి’#5:31 ద్వితీ 24:1 అని చెప్పబడింది. 32అయితే నేను మీతో చెప్పేది ఏంటంటే, లైంగిక అనైతికత కారణంతో కాకుండా తన భార్యను విడిచిపెట్టేవాడు ఆమెను వ్యభిచార బాధితురాలిగా చేస్తున్నాడు, అలాగే విడిచిపెట్టబడిన స్త్రీని వివాహం చేసుకొనేవాడు వ్యభిచారం చేస్తున్నాడు.
ప్రమాణాలు
33“అంతేకాక, ‘నీవు మాట తప్పకూడదు, చేసిన ప్రమాణాలను ప్రభువును బట్టి నిలబెట్టుకోవాలి’ అని పూర్వీకులతో చెప్పిన మాట మీరు విన్నారు. 34అయితే నేను మీతో చెప్పేది ఏంటంటే, అసలు మీరు ప్రమాణమే చేయవద్దు: ఆకాశంతోడని అనవద్దు, ఎందుకంటే అది దేవుని సింహాసనం; 35లేక భూమి తోడని అనవద్దు, ఎందుకంటే అది ఆయన పాదపీఠం; లేక యెరూషలేము తోడని అనవద్దు, ఎందుకంటే అది మహారాజు పట్టణం. 36నీ తల మీద ప్రమాణం చేయవద్దు, ఎందుకంటే నీవు కనీసం ఒక్క వెంట్రుకనైనా తెల్లగా కాని నల్లగా కాని చేయలేవు. 37నీవు కేవలం ‘అవునంటే అవును’ లేక ‘కాదంటే కాదు’ అని చెప్పాలి; దీనికి మించింది ఏదైనా దుష్టుని నుండి వస్తుంది.
కంటికి కన్ను
38“ ‘కంటికి కన్ను, పంటికి పన్ను’#5:38 నిర్గమ 21:24; లేవీ 24:20; ద్వితీ 19:21 అని చెప్పిన మాట మీరు విన్నారు. 39అయితే నేను మీతో చెప్పేది ఏంటంటే, ఒక దుష్ట వ్యక్తిని ఎదిరించవద్దు. ఎవరైనా నిన్ను కుడిచెంప మీద కొడితే, వానికి నీ మరో చెంపను కూడ చూపించు. 40ఎవరైనా నీతో వివాదం పెట్టుకోవాలనుకొని నీ అంగీ తీసుకుంటే, వానికి నీ పైవస్త్రాన్ని కూడా ఇవ్వు. 41ఎవరైనా ఒక మైలు దూరం రమ్మని నిన్ను బలవంతం చేస్తే, వానితో రెండు మైళ్ళు వెళ్లు. 42నిన్ను అడిగేవానికి ఇవ్వు, మరియు నీ నుండి అప్పు పొందాలనుకొనే వారి నుండి తప్పించుకోవద్దు.
శత్రువుల పట్ల ప్రేమ
43“ ‘నీ పొరుగువారిని ప్రేమించి, నీ శత్రువును ద్వేషించు’#5:43 లేవీ 19:18 అని చెప్పిన మాటలను మీరు విన్నారు. 44-45అయితే నేను మీతో చెప్పేది ఏంటంటే, మీరు పరలోకంలోని మీ తండ్రికి పిల్లలగునట్లు, మీ శత్రువులను ప్రేమించండి, మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థించండి. ఆయన చెడ్డవారి మీద, అలాగే మంచివారి మీద తన సూర్యుని ఉదయింప చేస్తున్నారు, నీతిమంతుల మీద, అనీతిమంతుల మీద వర్షం కురిపిస్తున్నారు. 46ఒకవేళ మిమ్మల్ని ప్రేమించేవారినే మీరు ప్రేమిస్తే, మీరు ఏం ప్రతిఫలం పొందుకుంటారు? పన్ను వసూలు చేసేవారు కూడా అలాగే చేయడం లేదా? 47మరియు ఒకవేళ మీరు మీ సొంతవారినే పలకరిస్తే, ఇతరులకంటే మీరు ఏం ఎక్కువ చేసినట్టు? యూదేతరులు కూడా అలాగే చేయడం లేదా? 48మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడై యున్నట్లు, మీరు కూడ పరిపూర్ణులై ఉండండి.

Iliyochaguliwa sasa

మత్తయి 5: TCV

Kuonyesha

Shirikisha

Nakili

None

Je, ungependa vivutio vyako vihifadhiwe kwenye vifaa vyako vyote? Jisajili au ingia