యోహాను సువార్త 4

4
సమరయ స్త్రీతో మాట్లాడిన యేసు
1యోహాను కంటే యేసు ఎక్కువమందిని శిష్యులుగా చేసుకుని బాప్తిస్మం ఇస్తున్నట్లు పరిసయ్యులు విన్నారని యేసుకు తెలిసింది. 2నిజానికి బాప్తిస్మం ఇచ్చింది యేసు కాదు ఆయన శిష్యులు ఇస్తున్నారు. 3కాబట్టి ఆయన యూదయ ప్రాంతాన్ని విడిచి మరొకసారి గలిలయ ప్రాంతానికి తిరిగి వెళ్లారు.
4ఆయన సమరయ ప్రాంతం గుండా వెళ్లవలసివచ్చింది. 5కాబట్టి యాకోబు తన కుమారుడైన యోసేపుకు ఇచ్చిన భూమి దగ్గరగా ఉన్న సమరయలోని సుఖారనే ఊరికి ఆయన వచ్చారు. 6అక్కడ యాకోబు బావి ఉంది. యేసు ప్రయాణం చేసి అలసిపోయి ఆ బావి ప్రక్క కూర్చున్నారు. అది మిట్టమధ్యాహ్న సమయము.
7-8ఒక సమరయ స్త్రీ నీరు తోడుకోడానికి అక్కడికి వచ్చినప్పుడు యేసు ఆమెతో, “నాకు త్రాగడానికి నీళ్లు ఇవ్వగలవా?” అని అడిగారు. ఆయన శిష్యులు ఆహారం కొనడానికి ఊరిలోనికి వెళ్లారు.
9ఆ సమరయ స్త్రీ ఆయనతో, “నీవు యూదుడవు, నేను సమరయ స్త్రీని. నీవు నన్ను త్రాగడానికి ఇవ్వమని ఎలా అడుగుతావు?” అన్నది. ఎందుకంటే యూదులు సమరయులతో సహవాసం చేయరు.
10యేసు, “నీవు దేవుని బహుమానం గురించి, నిన్ను నీళ్లు అడుగుతున్న వ్యక్తి గురించి తెలుసుకుంటే నీవే ఆయనను అడిగేదానివి. ఆయన నీకు జీవజలాన్ని ఇచ్చి ఉండేవాడు” అని ఆమెకు జవాబిచ్చారు.
11అందుకు ఆమె, “అయ్యా, ఈ బావి చాలా లోతైనది. పైగా నీళ్లు తోడుకోడానికి నీ దగ్గర ఏమి లేదు. మరి ఆ జీవజలం నీకు ఎక్కడ దొరుకుతుంది? 12మా పితరుడైన యాకోబు ఈ బావిని మాకిచ్చాడు. ఈ బావి నీళ్లను అతడు, అతని కుమారులు త్రాగారు; అతని పశువులు కూడా త్రాగాయి. నీవు అతనికంటే గొప్పవాడివా?” అని అడిగింది.
13అందుకు యేసు, “ఈ నీళ్లు త్రాగిన వారందరికి మళ్ళీ దాహం వేస్తుంది. 14కానీ నేనిచ్చే నీళ్లు త్రాగే వారికి ఇక ఎప్పటికీ దాహం వేయదు. నిజానికి, నేనిచ్చే నీళ్లు వారిలో నిత్యజీవానికి నీటి ఊటగా ఉంటుంది” అన్నారు.
15ఆ స్త్రీ ఆయనతో, “అయ్యా, నాకు దాహం వేయకుండా, నీళ్లు చేదుకోడానికి ఇంత దూరం రానవసరం లేకుండ ఆ నీటిని నాకు ఇవ్వండి” అన్నది.
16ఆయన ఆమెతో, “వెళ్లి, నీ భర్తను పిలుచుకొనిరా” అని చెప్పారు.
17అందుకు ఆమె, “నాకు భర్త లేడు” అన్నది.
యేసు ఆమెతో, “నీకు భర్త లేడని నీవు చెప్పింది వాస్తవమే. 18నిజానికి, నీకు అయిదుగురు భర్తలు ఉండేవారు. ఇప్పుడు నీతో ఉన్నవాడు నీ భర్త కాడు. నీవు సత్యమే చెప్పావు” అన్నారు.
19అప్పుడు ఆ స్త్రీ, “అయ్యా, నీవు ప్రవక్తవని నేను గ్రహిస్తున్నాను. 20మా పితరులు ఈ పర్వతం మీద ఆరాధించారు, కానీ యూదులైన మీరు ఆరాధించవలసిన స్థలం యెరూషలేములో ఉందని అంటారు” అన్నది.
21అప్పుడు యేసు ఆమెతో, “అమ్మా, నన్ను నమ్ము. ఒక సమయం వస్తుంది అప్పుడు మీరు తండ్రిని ఈ పర్వతం మీద గాని యెరూషలేములో గాని ఆరాధించరు. 22సమరయులైన మీరు మీకు తెలియని దానిని ఆరాధిస్తున్నారు; మేము మాకు తెలిసిన దానిని ఆరాధిస్తున్నాం, ఎందుకంటే రక్షణ యూదులలో నుండే వస్తుంది. 23అయినా నిజమైన ఆరాధికులు పరలోక తండ్రిని ఆత్మతో, సత్యంతో ఆరాధించే ఒక సమయం వస్తుంది. అది ఇప్పటికే వచ్చేసింది. ఎందుకంటే అలాంటి ఆరాధికుల కోసమే తండ్రి చూస్తున్నారు. 24దేవుడు ఆత్మ కాబట్టి ఆయనను ఆరాధించేవారు ఆత్మతో సత్యంతో ఆరాధించాలి” అని చెప్పారు.
25అప్పుడు ఆ స్త్రీ ఆయనతో, “క్రీస్తు#4:25 క్రీస్తు అంటే మెస్సీయా వస్తాడని నాకు తెలుసు. ఆయన వచ్చినప్పుడు అన్ని విషయాలను మాకు వివరిస్తాడు” అని అన్నది.
26అప్పుడు యేసు, “నీతో మాట్లాడుతున్న నేనే ఆయనను” అని చెప్పారు.
యేసు దగ్గరకు తిరిగివచ్చిన శిష్యులు
27ఇంతలో ఆయన శిష్యులు అక్కడికి వచ్చి యేసు ఆ స్త్రీతో మాట్లాడుతూ ఉండడం చూసి ఆశ్చర్యపడ్డారు. కానీ, “నీకు ఏమి కావాలి? అని గాని, ఆమెతో ఎందుకు మాట్లాడుతున్నావు?” అని గాని ఎవరు అడగలేదు.
28అప్పుడు ఆ స్త్రీ తన నీటి కుండను అక్కడే వదిలిపెట్టి ఊరిలోనికి వెళ్లి ప్రజలతో, 29“రండి, నేను చేసిందంతా నాతో చెప్పిన ఆయనను చూడండి, ఈయనే క్రీస్తు కాడా?” అని చెప్పింది. 30వారు ఊరి నుండి బయలుదేరి ఆయన దగ్గరకు వచ్చారు.
31ఇంతలో ఆయన శిష్యులు, “రబ్బీ, కొంచెం తినండి” అని ఆయనను వేడుకున్నారు.
32అయితే ఆయన, “తినడానికి మీకు తెలియని ఆహారం నా దగ్గర ఉంది” అని వారితో చెప్పారు.
33అందుకు శిష్యులు ఒకరితో ఒకరు, “ఎవరైనా ఈయనకు ఆహారం తెచ్చారేమో?” అని చెప్పుకున్నారు.
34యేసు వారితో, “నన్ను పంపినవాని చిత్తప్రకారం చేసి ఆయన పనిని ముగించడమే నా ఆహారము. 35‘కోతకు రావడానికి ఇంకా నాలుగు నెలలు ఉంది’ అని మీరు చెప్పుతారు కదా! నేను మీతో చెప్పేది ఏంటంటే, కళ్లు తెరిచి పొలాలను చూడండి! పంట పండి కోతకు సిద్ధంగా ఉంది. 36విత్తినవాడు కోసేవాడు ఇద్దరూ సంతోషించేలా, పంటను కోసేవాడు తన జీతం తీసుకుని పంట అంతా కోసి నిత్యజీవం కోసం కూర్చుకుంటాడు. 37ఈ విషయంలో ‘విత్తువాడు ఒకడు, కోసేవాడు మరొకడు’ అనే సామెత నిజమే. 38మీరు పని చేయని పొలంలో పంటను కోయడానికి నేను మిమ్మల్ని పంపించాను. అక్కడ ఇతరులు కష్టపడి పని చేశారు. వారి కష్ట ఫలాన్ని మీరు కోసుకొని అనుభవిస్తున్నారు” అన్నారు.
విశ్వసించిన అనేకమంది సమరయులు
39ఆ ఊరిలోని సమరయులలో అనేకమంది, “నేను చేసిందంతా నాతో చెప్పారు” అని ఆ స్త్రీ ఆయనను గురించి ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి ఆయనను నమ్మారు. 40ఆ సమరయులు ఆయన దగ్గరకు వచ్చి తమతో ఉండమని వేడుకున్నప్పుడు ఆయన అక్కడ రెండు రోజులు ఉన్నారు. 41ఆయన మాటలు విని ఇంకా చాలామంది విశ్వాసులయ్యారు.
42వారు ఆ స్త్రీతో, “నీవు చెప్పిన దానిని బట్టి కాదు; కాని మాకు మేమే విని నిజంగా ఈయన లోక రక్షకుడని తెలుసుకుని నమ్ముతున్నాం” అన్నారు.
అధికారి కుమారుడిని స్వస్థపరచిన యేసు
43రెండు రోజుల తర్వాత ఆయన గలిలయ ప్రాంతానికి వెళ్లారు. 44ఒక ప్రవక్త తన స్వదేశంలో గౌరవం పొందడని యేసే స్వయంగా సాక్ష్యమిచ్చారు. 45ఆయన గలిలయకు చేరగానే గలిలయులు ఆయనను ఆహ్వానించారు. పస్కా పండుగ సమయంలో వారందరు అక్కడే ఉన్నారు కాబట్టి యెరూషలేములో ఆయన చేసిన కార్యాలన్నిటిని వారు చూశారు.
46ఆయన నీటిని ద్రాక్షరసంగా మార్చిన గలిలయలోని కానాకు మరలా వచ్చారు. కపెర్నహూములో ఒక రాజ్యాధికారి కుమారుడు అనారోగ్యంతో ఉన్నాడు. 47యేసు యూదయ ప్రాంతం నుండి గలిలయకు వచ్చాడని ఆ రాజ్యాధికారి విని ఆయన దగ్గరకు వెళ్లి, చనిపోతున్న తన కుమారుని స్వస్థపరచుమని బ్రతిమాలుకున్నాడు.
48యేసు అతనితో, “మీరు అద్భుతకార్యాలు, మహత్కార్యాలను చూస్తేనే తప్ప నమ్మరు” అన్నారు.
49ఆ రాజ్యాధికారి, “అయ్యా, నా బిడ్డ చనిపోకముందే దయచేసి రండి” అని వేడుకున్నాడు.
50యేసు, “వెళ్లు, నీ కుమారుడు బ్రతుకుతాడు” అని చెప్పారు.
యేసు మాటను నమ్మి అతడు వెళ్లిపోయాడు. 51అతడు ఇంకా దారిలో ఉండగానే, అతని పనివారు అతన్ని కలిసి అతని కుమారుడు బాగయ్యాడని చెప్పారు. 52అతడు తన కుమారుడు ఏ సమయంలో బాగుపడ్డాడని వారిని అడిగినప్పుడు, “నిన్న మధ్యాహ్నం ఒంటి గంటకు అతని జ్వరం తగ్గిపోయింది” అని వారు చెప్పారు.
53అప్పుడు ఆ తండ్రి యేసు తనతో, “నీ కుమారుడు బ్రతుకుతాడు” అని సరిగ్గా అదే సమయంలో చెప్పారని గ్రహించి అతడు, అతని ఇంటివారందరు నమ్మారు.
54యేసు యూదయ ప్రాంతం నుండి గలిలయకు వచ్చిన తర్వాత ఆయన చేసిన రెండవ సూచకక్రియ ఇది.

தற்சமயம் தேர்ந்தெடுக்கப்பட்டது:

యోహాను సువార్త 4: TSA

சிறப்புக்கூறு

பகிர்

நகல்

None

உங்கள் எல்லா சாதனங்களிலும் உங்கள் சிறப்பம்சங்கள் சேமிக்கப்பட வேண்டுமா? பதிவு செய்யவும் அல்லது உள்நுழையவும்