–పారసీకదేశపు రాజైన కోరెషు ఆజ్ఞాపించునదేమనగా – ఆకాశమందలి దేవుడైన యెహోవా లోకమందున్న సకల జనములను నా వశము చేసి, యూదాదేశమందున్న యెరూషలేములో తనకు మందిరమును కట్టించుమని నాకు ఆజ్ఞ ఇచ్చియున్నాడు. కావున మీలో ఎవరు ఆయన జనులైయున్నారో వారు యూదాదేశమందున్న యెరూషలేమునకు బయలుదేరి, యెరూషలేములోని దేవుని మందిరమును, అనగా ఇశ్రాయేలీయులదేవుడైన యెహోవా మందిరమును కట్టవలెను; వారి దేవుడు వారికి తోడై యుండునుగాక.