షేబదేశపురాణి యెహోవా నామమునుగూర్చియు, సొలొమోనునకు కలిగిన కీర్తినిగూర్చియు విని, గూఢార్థముగల మాటలచేత అతనిని శోధించుటకై వచ్చెను. ఆమె గొప్ప పరివారముతో, గంధవర్గమును విస్తారమైన బంగారమును రత్నములను ఒంటెలమీద ఎక్కించుకొని యెరూషలేమునకు వచ్చెను. సొలొమోను దర్శనముచేసి తనకు తోచినదానినంతటినిబట్టి అతనితో మాటలాడగా ఆమె వేసిన ప్రశ్నలన్నిటికి సొలొమోను ప్రత్యుత్తరము చెప్పెను; రాజునకు మరుగైనదేదియు లేనందున ఆమె ప్రశ్న వేసినవాటన్నిటి భావము చెప్పెను. షేబరాణి సొలొమోనుయొక్క జ్ఞానమును అతడు కట్టించిన మందిరమును, అతని బల్లమీదనున్న భోజనద్రవ్యములను, అతని సేవకులు కూర్చుండు పీఠములను, అతని ఉపచారులు కనిపెట్టుటను, వారి వస్త్రములను, అతనికి గిన్నెనందించువారిని, యెహోవామందిరమందు అతడు అర్పించు దహనబలులను చూచి విస్మయమొందినదై రాజుతో ఇట్లనెను–నీ కార్యములనుగూర్చియు జ్ఞానమునుగూర్చియు నా దేశమందు నేను వినిన మాట నిజమే; అయినను నేను వచ్చి కన్నులార చూడకమునుపు ఆ మాటలను నమ్మకయుంటిని; ఉన్నదానిలో సగమైనను నాతో చెప్పబడలేదని యిప్పుడు నేను తెలిసికొనుచున్నాను. నీ జ్ఞానమును నీ భాగ్యమును నేను వినినదానిని బహుగా మించియున్నవి; నీ జనులు భాగ్యవంతులు, నీ ముందర ఎల్లప్పుడును నిలిచి నీ జ్ఞానవచనములను వినుచుండు నీ సేవకులును భాగ్యవంతులు. నీయందు ఆనందించి నిన్ను ఇశ్రాయేలీయులమీద రాజుగా నియమించిన నీ దేవుడైన యెహోవాకు స్తోత్రము కలుగునుగాక. యెహోవా ఇశ్రాయేలీయులందు శాశ్వత ప్రేమయుంచెను గనుక నీతిన్యాయములను అనుసరించి రాజకార్యములను జరిగిం చుటకు ఆయన నిన్ను నియమించెను అనెను. మరియు ఆమె రాజునకు రెండువందల నలువది మణుగుల బంగారమును, బహువిస్తారమైన గంధవర్గమును, రత్నములను ఇచ్చెను. షేబదేశపు రాణి రాజైన సొలొమోనునకు ఇచ్చిన గంధ వర్గములంత విస్తారము మరి ఎన్నడైనను రాలేదు. మరియు ఓఫీరు దేశమునుండి బంగారము తెచ్చిన హీరాము ఓడలు ఓఫీరునుండి చందనపు మ్రానులను రత్నములను బహు విస్తారముగా తెచ్చెను. ఈ చందనపు మ్రానులచేత రాజు యెహోవా మందిరమునకును రాజనగరునకును స్తంభములను, గాయకులకు సితారాలను స్వరమండలములను చేయించెను. ఇప్పుడు అటువంటి చందనపు మ్రానులు దొరకవు, ఎక్కడను కనబడవు. సొలొమోను తన ప్రభావమునకు తగినట్టు షేబదేశపు రాణికిచ్చినదిపోగ ఆమె కోరినప్రకారము ఆమె యిచ్ఛాపూర్తిగా ఆమె కిచ్చెను; అప్పుడు ఆమెయు ఆమె సేవకులును తమ దేశమునకు తిరిగి వెళ్లిరి.
Read 1 రాజులు 10
వినండి 1 రాజులు 10
షేర్ చేయి
అన్ని అనువాదాలను సరిపోల్చండి: 1 రాజులు 10:1-13
వచనాలను సేవ్ చేయండి, ఆఫ్‌లైన్‌లో చదవండి, బోధన క్లిప్‌లను చూడండి ఇంకా మరెన్నో చేయండి!
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు