1 రాజులు 14

14
1ఆ కాలమున యరొబాము కుమారుడైన అబీయా కాయిలాపడగా 2యరొబాము తన భార్యతో ఇట్లనెను –నీవు లేచి యరొబాము భార్యవని తెలియబడకుండ మారువేషము వేసికొని షిలోహునకు పొమ్ము; ఈ జనులమీద నేను రాజునగుదునని నాకు సమాచారము తెలియ జెప్పిన ప్రవక్తయగు అహీయా అక్కడ ఉన్నాడు. 3కాబట్టి నీవు పది రొట్టెలును అప్పములును ఒక బుడ్డి తేనెయు చేతపట్టుకొని అతని దర్శించుము. బిడ్డయేమగునో అతడు నీకు తెలియజేయునని చెప్పగా 4యరొబాము భార్య ఆప్రకారము లేచి షిలోహునకు పోయి అహీయా యింటికి వచ్చెను. అహీయా వృద్ధాప్యముచేత కండ్లు కానరాని వాడై యుండెను. 5అంతట యెహోవా అహీయాతో సెలవిచ్చినదేమనగా–యరొబాము కుమారుడు కాయిలాగా ఉన్నాడు గనుక అతనిగూర్చి నీచేత విచారించుటకై యరొబాము భార్య వచ్చుచున్నది ఆమె మారువేషము వేసికొని మరియొకతెయైనట్టుగా వచ్చు చున్నది గనుక నేను నీకు సెలవిచ్చునట్టు నీవు ఆమెతో చెప్పవలెను. 6అంతలో అహీయా ద్వారము లోపలికి వచ్చు నామె కాలిచప్పుడు విని ఆమెతో ఇట్లనెను– యరొబాము భార్యా, లోపలికి రమ్ము; నీవు వేషము వేసికొని వచ్చుటయేల? కఠినమైన మాటలు నీకు చెప్పవలెనని నాకు ఆజ్ఞయాయెను. 7నీవు వెళ్లి యరొబాముతో చెప్ప వలసినదేమనగా–ఇశ్రాయేలీయులదేవుడైన యెహోవా ఈ ప్రకారము సెలవిచ్చుచున్నాడు–నేను నిన్ను జనులలోనుండి తీసి హెచ్చింపజేసి, ఇశ్రాయేలువారను నా జనులమీద నిన్ను అధికారిగా నియమించి 8దావీదు సంతతి వారియొద్దనుండి రాజ్యమును తీసి నీకిచ్చి యుండినను, నా ఆజ్ఞలను గైకొని మనఃపూర్తిగా నన్ను అనుసరించి నా దృష్టికి ఏది అనుకూలమో దాని మాత్రమే చేసిన నా సేవకుడైన దావీదు చేసినట్టు నీవు చేయక 9నీకంటె ముందుగా ఉండిన వారందరికంటెను అధికముగా కీడుచేసియున్నావు; నన్ను బొత్తిగా విసర్జించి యితర దేవతలను పోతవిగ్రహములను పెట్టుకొని నాకు కోపము పుట్టించియున్నావు. 10కాబట్టి యరొబాము సంతతి వారిమీదికి నేను కీడు రప్పించుచు, ఇశ్రాయేలు వారిలో అల్పులుగాని ఘనులుగానిలేకుండ మగవారినందరిని యరొబాము వంశమునుండి నిర్మూలముచేసి,పెంట అంతయు పోవునట్లుగా ఒకడు అవతలకు దానిని ఊడ్చి వేసినట్లు యరొబాము సంతతిలో శేషించినవారిని నేను ఊడ్చివేయుదును. 11పట్టణమందు యరొబాము సంబంధులలో మరణమగువారిని కుక్కలు తినును; బయట భూమిలో మరణమగువారిని ఆకాశపక్షులు తినును; యెహోవా మాటయిచ్చియున్నాడు. 12కాబట్టి నీవు లేచి నీ యింటికి పొమ్ము, నీ పాదములు పట్టణములో ప్రవేశించునప్పుడే నీ బిడ్డ చని పోవును; 13అతని నిమిత్తము ఇశ్రాయేలువారందరు అంగలార్చుచు, సమాధిలో అతనిని పెట్టుదురు; ఇశ్రాయేలీయులదేవుడైన యెహోవా యరొబాము సంబంధులలో ఇతనియందు మాత్రమే అనుకూలమైన దాని కనుగొనెను గనుక యరొబాము సంతతివారిలో ఇతడు మాత్రమే సమాధికి వచ్చును. 14ఇదియుగాక యెహోవా తన నిమిత్తము ఒకని ఇశ్రాయేలువారిమీద రాజుగా నియమింపబోవుచున్నాడు; ఆ దినముననే అతడు యరొబాము సంతతి వారిని నిర్మూలము చేయును; కొద్దికాలములోనే ఆయన అతని నియమింపబోవును. 15ఇశ్రాయేలువారు దేవతాస్తంభములను నిలిపి యెహోవాకు కోపము పుట్టించియున్నారు గనుక నీటియందు రెల్లు అల్లలాడునట్లు యెహోవా ఇశ్రాయేలు వారిని మొత్తి, ఒకడు వేరును పెల్లగించినట్లు వారి పితరులకు తాను ఇచ్చిన యీ మంచి దేశములోనుండి వారిని పెల్లగించి వారిని యూఫ్రటీసునది అవతలకు చెదర గొట్టును. 16మరియు తానే పాపముచేసి ఇశ్రాయేలువారు పాపము చేయుటకై కారకుడైన యరొబాము పాపములనుబట్టి ఆయన ఇశ్రాయేలువారిని అప్పగింప బోవుచున్నాడు. 17అప్పుడు యరొబాము భార్య లేచి వెళ్లిపోయి తిర్సా పట్టణమునకు వచ్చెను; ఆమె లోగిటి ద్వారపు గడపయొద్దకు రాగానే ఆ చిన్నవాడు చని పోయెను. 18జనులు అతనిని సమాధిలోపెట్టి, యెహోవా తన సేవకుడైన ప్రవక్తయగు అహీయాద్వారా సెలవిచ్చిన ప్రకారముగ ఇశ్రాయేలువారందరును అతనికొరకు అంగలార్చిరి. 19యరొబాము చేసిన యితర కార్యములనుగూర్చియు, అతడు జరిగించిన యుద్ధములనుగూర్చియు, ప్రభుత్వమునుగూర్చియు ఇశ్రాయేలువారి రాజులవృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి యున్నది. 20యరొబాము ఏలిన దినములు ఇరువది రెండు సంవత్సరములు; అతడు తన పితరులతోకూడ నిద్రించగా అతనికి మారుగా అతని కుమారుడైన నాదాబు రాజాయెను.
21యూదాదేశమందు సొలొమోను కుమారుడైన రెహబాము ఏలుచుండెను. రెహబాము నలువదియొక సంవత్సరములవాడైనప్పుడు ఏలనారంభించెను. తన నామము నుంచుటకై ఇశ్రాయేలీయుల గోత్రములన్నిటిలోనుండి యెహోవా కోరుకొనిన యెరూషలేమను పట్టణమందు అతడు పదునేడు సంవత్సరములు ఏలెను; అతని తల్లి అమ్మోనీయురాలు, ఆమె పేరు నయమా. 22యూదావారు యెహోవా దృష్టికి కీడుచేసి తమపితరులు చేసినదానంతటిని మించునట్లుగా పాపము చేయుచు ఆయనకు రోషము పుట్టించిరి. 23ఎట్లనగా వారును ఎత్తయిన ప్రతి పర్వతము మీదను పచ్చని ప్రతి వృక్షముక్రిందను బలిపీఠములను కట్టి, విగ్రహములను నిలిపి, దేవతాస్తంభములను ఉంచిరి. 24మరియు పురుషగాములు సహా దేశమందుండిరి. ఇశ్రాయేలీయులయెదుట నిలువకుండ యెహోవా వెళ్లగొట్టిన జనులుచేయు హేయక్రియల ప్రకారముగా యూదావారును చేయుచు వచ్చిరి. 25రాజైన రెహబాముయొక్క అయిదవ సంవత్సరమందు ఐగుప్తురాజైన షీషకు యెరూషలేము మీదికి వచ్చి 26యెహోవా మందిరపు ఖజానాలోని పదార్థములను, రాజనగరుయొక్క ఖజానాలోని పదార్థములను, ఎత్తికొని పోయెను, అతడు సమస్తమును ఎత్తికొని పోయెను; సొలొమోను చేయించిన బంగారపు డాళ్లను అతడు ఎత్తికొని పోయెను. 27రాజైన రెహబాము వీటికి మారుగా ఇత్తడి డాళ్లను చేయించి, రాజనగరు ద్వారపాలకులైన తన దేహసంరక్షకుల అధిపతుల వశము చేసెను. 28రాజు యెహోవా మందిరమునకు వెళ్లునప్పుడెల్ల రాజదేహ సంరక్షకులు వాటిని మోసికొనిపోయి అతడు తిరిగి రాగా వాటిని తమ గదిలో ఉంచిరి. 29రెహబాము చేసిన యితర కార్యములనుగూర్చియు, అతడు చేసిన వాటన్నిటిని గూర్చియు యూదారాజులయొక్క వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి యున్నది. 30వారు బ్రదికినంత కాలము రెహబామునకును యరొబామునకును యుద్ధము జరుగుచుండెను. 31రెహబాము తన పితరులతోకూడ నిద్రించి దావీదు పురమందున్న తన పితరుల సమాధిలో పాతిపెట్టబడెను; అతని తల్లి నయమా యను ఒక అమ్మోనీయురాలు; అతని కుమారుడైన అబీయాము అతనికి మారుగా రాజాయెను.

ప్రస్తుతం ఎంపిక చేయబడింది:

1 రాజులు 14: TELUBSI

హైలైట్

షేర్ చేయి

కాపీ

None

మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి