1 రాజులు 4

4
1రాజైన సొలొమోను ఇశ్రాయేలీయులందరిమీద రాజాయెను. 2అతనియొద్దనున్న అధిపతులు ఎవరెవరనగా సాదోకు కుమారుడైన అజర్యా యాజకుడు; 3షీషా కుమారులైన ఎలీహోరెపును అహీయాయును ప్రధాన మంత్రులు; అహీలూదు కుమారుడైన యెహోషాపాతు లేఖకుడై యుండెను; 4యెహోయాదా కుమారుడైన బెనాయా సైన్యాధిపతి; సాదోకును అబ్యాతారును యాజకులు. 5నాతాను కుమారుడైన అజర్యా అధికారులమీద ఉండెను; నాతాను కుమారుడైన జాబూదు రాజు సముఖములోని మిత్రుడును మంత్రియునైయుండెను; 6అహీషారు గృహ నిర్వాహకుడు; అబ్దా కుమారుడైన అదోనీరాము వెట్టి పని విషయములో అధికారి. 7ఇశ్రాయేలీయులందరిమీద సొలొమోను పన్నిద్దరు అధికారులను నియమించెను. వీరు రాజునకును అతని ఇంటివారికిని ఆహారము సంగ్రహము చేయువారు. సంవత్సరమందు ఒక్కొక్క నెలకు వారిలో ఒక్కొక్కడు ఆహారమును సంగ్రహము చేయుచుండెను. 8వారి పేళ్లు ఇవే; ఎఫ్రాయిము మన్యమందు హూరు కుమారుడు; 9మాకస్సులోను షయల్బీములోను బేత్షెమెషులోను ఏలోన్బెధానానులోను దెకెరు కుమారుడు; 10అరుబ్బోతులో హెసెదు కుమారుడు; వీనికి శోకో దేశమును హెపెరు దేశమంతయు నియమింపబడెను. 11మరియు అబీనాదాబు కుమారునికి దోరు మన్యప్రదేశమంతయు నియమింపబడెను; సొలొమోను కుమార్తెయైన టాపాతు ఇతని భార్య. 12మరియు అహీలూదు కుమారుడైన బయనాకు తానాకును మెగిద్దోయును బేత్షెయాను ప్రదేశమంతయును నియమింపబడెను. ఇది యెజ్రెయేలు దగ్గరనున్న సారెతానుండి బేత్షెయాను మొదలుకొని ఆబేల్మేహోలావరకును యొక్నెయాము అవతలి స్థలమువరకును వ్యాపించుచున్నది. 13గెబెరు కుమారుడు రామోత్గిలాదునందు కాపురముండెను; వీనికి గిలాదులోనుండిన మనష్షే కుమారుడైన యాయీరు గ్రామములును బాషానులోనున్న అర్గోబు దేశమును నియమింప బడెను; అది ప్రాకారములును ఇత్తడి అడ్డగడలునుగల అరువది గొప్ప పట్టణములుగల ప్రదేశము. 14ఇద్దో కుమారుడైన అహీనాదాబు మహనయీములో నుండెను. 15నఫ్తాలీ దేశమందు అహిమయస్సు ఉండెను; వీడు సొలొమోను కుమార్తెయైన బాశెమతును వివాహము చేసికొనెను. 16ఆషేరులోను ఆలోతులోను హూషై కుమారుడైన బయనా యుండెను. 17ఇశ్శాఖారు దేశమందు పరూయహు కుమారుడైన యెహోషాపాతు ఉండెను. 18బెన్యామీను దేశమందు ఏలా కుమారుడైన షిమీ యుండెను. 19గిలాదు దేశమందును అమోరీయులకు రాజైన సీహోను దేశమందును బాషానురాజైన ఓగు దేశమందును ఊరి కుమారుడైన గెబెరు ఉండెను; అతడు ఒక్కడే ఆ దేశమందు అధికారి. 20అయితే యూదావారును ఇశ్రాయేలు వారును సముద్రపు దరినున్న యిసుక రేణువులంత విస్తార సమూహమై తినుచు త్రాగుచు సంభ్రమపడుచు నుండిరి.
21నది (యూఫ్రటీసు) మొదలుకొని ఐగుప్తు సరిహద్దువరకు ఈ మధ్యనున్న రాజ్యములన్నిటిమీదను ఫిలిష్తీయుల దేశమంతటిమీదను సొలొమోను ప్రభుత్వము చేసెను. ఆ జనులు పన్ను చెల్లించుచు సొలొమోను బ్రదికిన దినములన్నియు అతనికి సేవచేయుచు వచ్చిరి. 22ఒక్కొక్క దినమునకు సొలొమోను భోజనపు సామగ్రి యెంత యనగా, ఆరువందల తూముల సన్నపు గోధుమపిండియు, వేయిన్ని రెండువందల తూముల ముతకపిండియు, 23క్రొవ్విన యెడ్లు పదియు, విడియెడ్లు ఇరువదియు, నూరు గొఱ్ఱెలును, ఇవియుగాక ఎఱ్ఱదుప్పులు దుప్పులు జింకలు క్రొవ్విన బాతులును తేబడెను. 24యూఫ్రటీసునది యివతల తిప్సహు మొదలుకొని గాజావరకును నది యివతలనున్న రాజులందరిమీదను అతనికి అధికారముండెను. అతని కాలమున నలుదిక్కుల నెమ్మది కలిగియుండెను. 25సొలొమోను దినములన్నిటను ఇశ్రాయేలువారేమి యూదా వారేమి దాను మొదలుకొని బెయేర్షెబా వరకును తమతమ ద్రాక్షచెట్ల క్రిందను అంజూరపుచెట్ల క్రిందను నిర్భయముగా నివసించుచుండిరి. 26సొలొమోను రథములకు నలువదివేల గుఱ్ఱపు శాలలును రౌతులకు పండ్రెండువేల గుఱ్ఱములును ఉండెను. 27మరియు రాజైన సొలొమోనునకునురాజైన సొలొమోను భోజనపు బల్లయొద్దకు వచ్చిన వారికందరికిని ఏమియు తక్కువకాకుండ అధికారులలో ఒకడు తాను నియమింపబడిన మాసమునుబట్టి ఆహారము సంగ్రహముచేయుచు వచ్చెను. 28మరియు గుఱ్ఱములును పాటుపశువులును ఉన్న ఆయాస్థలములకు ప్రతివాడును తనకు చేయబడిన నిర్ణయము చొప్పున యవలును గడ్డిని తెప్పించుచుండెను.
29దేవుడు జ్ఞానమును బుద్ధిని వర్ణింప శక్యము కాని వివేచనగల మనస్సును సొలొమోనునకు దయచేసెను 30గనుక సొలొమోనునకు కలిగిన జ్ఞానము తూర్పుదేశస్థుల జ్ఞానముకంటెను ఐగుప్తీయుల జ్ఞానమంతటికంటెను అధికమై యుండెను. 31అతడు సమస్తమైన వారికంటెను, ఎజ్రా హీయుడైన ఏతానుకంటెను మహోలు కుమారులైన హేమాను కల్కోలు దర్ద అను వారికంటెను జ్ఞానవంతుడై యుండెను గనుక అతని కీర్తి చుట్టునున్న జనములన్నిటిలో వ్యాపితమాయెను. 32అతడు మూడువేలసామెతలు చెప్పెను, వెయ్యిన్ని యయిదు కీర్తనలు రచించెను. 33మరియు లెబానోనులోఉండు దేవదారు వృక్షమునేగాని గోడలోనుండి మొలుచు హిస్సోపు మొక్కనేగాని చెట్లన్నిటిని గూర్చి అతడు వ్రాసెను; మరియు మృగములు పక్షులు ప్రాకు జంతువులు జలచరములు అనువాటినన్నిటిని గూర్చియు అతడు వ్రాసెను. 34అతని జ్ఞానపుమాటలు తెలిసికొనుటకై అతని జ్ఞానమునుగూర్చి వినిన భూపతులందరిలోనుండియు, జనులందరిలోనుండియు మనుష్యులు సొలొమోను నొద్దకు వచ్చిరి.

ప్రస్తుతం ఎంపిక చేయబడింది:

1 రాజులు 4: TELUBSI

హైలైట్

షేర్ చేయి

కాపీ

None

మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి