2 కొరింథీయులకు 1

1
1దేవుని చిత్తమువలన క్రీస్తు#1:1 క్రీస్తు అను శబ్దమునకు అభిషిక్తుడని అర్థము. యేసుయొక్క అపొస్తలుడైన పౌలును, మన సహోదరుడైన తిమోతియును, కొరింథులో నున్న దేవుని సంఘమునకును, అకయయందంతటనున్న పరిశుద్ధులకందరికిని శుభమని చెప్పి వ్రాయునది. 2మన తండ్రియైన దేవునినుండియు ప్రభువైన యేసుక్రీస్తు నుండియు కృపయు సమాధానమును మీకు కలుగును గాక. 3కనికరము చూపు తండ్రి, సమస్తమైన ఆదరణను అనుగ్రహించు దేవుడు, మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రియునైన దేవుడు స్తుతింపబడునుగాక. 4దేవుడు మమ్మును ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో, ఆ ఆదరణతో ఎట్టి శ్రమలలో ఉన్నవారినైనను ఆదరించుటకు శక్తిగలవారమగునట్లు, ఆయన మా శ్రమ అంతటిలో మమ్మును ఆదరించుచున్నాడు. 5క్రీస్తుయొక్క శ్రమలు మాయందేలాగు విస్తరించుచున్నవో, ఆలాగే క్రీస్తుద్వారా ఆదరణయు మాకు విస్తరించుచున్నది. 6మేము శ్రమ పొందినను మీ ఆదరణకొరకును రక్షణకొరకును పొందుదుము; మేమాదరణ పొందినను మీ ఆదరణకొరకై పొందుదుము. ఈ ఆదరణ, మేము కూడ పొందుచున్నట్టి ఆ శ్రమలను ఓపికతో సహించుటకు కార్యసాధకమై యున్నది. 7మీరు శ్రమలలో ఏలాగు పాలివారైయున్నారో, ఆలాగే ఆదరణలోను పాలివారైయున్నారని యెరుగుదుము గనుక మిమ్మునుగూర్చిన మా నిరీక్షణ స్థిరమైయున్నది. 8సహోదరులారా, ఆసియలో మాకు తటస్థించినశ్రమనుగూర్చి మీకు తెలియకుండుట మాకిష్టములేదు; అదేదనగా మేము బ్రదుకుదుమను నమ్మకములేక యుండునట్లుగా, మా శక్తికి మించిన అత్యధిక భారమువలన క్రుంగిపోతిమి. 9మరియు మృతులను లేపు దేవునియందేగాని, మాయందే మేము నమ్మిక యుంచకుండునట్లు మరణమగుదుమను నిశ్చయము మామట్టుకు మాకు కలిగియుండెను. 10ఆయన అట్టి గొప్ప మరణమునుండి మమ్మును తప్పించెను, ఇక ముందుకును తప్పించును. మరియు మాకొరకు ప్రార్థనచేయుటవలన మీరు కూడ సహాయము చేయుచుండగా, ఆయన ఇక ముందుకును మమ్మును తప్పించునని ఆయనయందు నిరీక్షణ గలవారమై యున్నాము. 11అందువలన అనేకుల ప్రార్థన ద్వారా, మాకు కలిగిన కృపావరముకొరకు అనేకులచేత మా విషయమై కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబడును.
12మా అతిశయమేదనగా, లౌకిక జ్ఞానము ననుసరింపక, దేవుడనుగ్రహించు పరిశుద్ధతతోను నిష్కాపట్యముతోను దేవుని కృపనే అనుసరించి లోకములో నడుచుకొంటి మనియు, విశేషముగా మీయెడలను నడుచుకొంటిమనియు, మా మనస్సాక్షి సాక్ష్యమిచ్చుటయే 13మీరు చదువుకొని పూర్తిగా గ్రహించిన సంగతులు తప్ప, మరేవియు మీకు వ్రాయుట లేదు; కడవరకు వీటిని ఒప్పుకొందురని నిరీ క్షించుచున్నాము. 14మరియు మన ప్రభువైన యేసుయొక్క దినమందు మీరు మాకేలాగో, ఆలాగే మేము మీకును అతిశయకారణమై యుందుమని, మీరు కొంత మట్టుకు మమ్మును ఒప్పుకొనియున్నారు.
15-16మరియు ఈ నమ్మికగలవాడనై మీకు రెండవ కృపావరము లభించునట్లు మొదట మీయొద్దకు వచ్చి, మీ యొద్దనుండి మాసిదోనియకు వెళ్లి మాసిదోనియనుండి మరల మీయొద్దకు వచ్చి, మీచేత యూదయకు సాగనంప బడవలెనని ఉద్దేశించితిని. 17కావున నేనీలాగు ఉద్దేశించి చపలచిత్తుడనుగా నడుచుకొంటినా? అవును అవునని చెప్పుచు, కాదు కాదనునట్టు ప్రవర్తింపవలెనని నా యోచనలను శరీరానుసారముగా యోచించుచున్నానా? 18దేవుడు నమ్మదగినవాడు గనుక మేము మీకు చెప్పిన వాక్యము అవునని చెప్పి కాదనునట్టుగా ఉండలేదు. 19మాచేత, అనగా నా చేతను సిల్వాను చేతను తిమోతిచేతను, మీలో ప్రకటింపబడిన దేవుని కుమారుడగు యేసుక్రీస్తు అవునని చెప్పి కాదనువాడై యుండలేదు గాని ఆయన అవుననువాడై యున్నాడు. 20దేవుని వాగ్దానములు ఎన్నియైనను అన్నియు క్రీస్తునందు అవునన్నట్టుగానే యున్నవి గనుక మనద్వారా దేవునికి మహిమ కలుగుటకై అవి ఆయనవలన నిశ్చయములై యున్నవి.#1:20 మూలభాషలో–ఆమేన్ అని యున్నవి. 21మీతోకూడ క్రీస్తునందు నిలిచియుండునట్లుగా మమ్మును స్థిరపరచి అభిషేకించినవాడు దేవుడే. 22ఆయన మనకు ముద్రవేసి, మన హృదయములలో మనకు ఆత్మ అను సంచకరువును అనుగ్రహించియున్నాడు.
23మీయందు కనికరము#1:23 రక్షింప నొల్లక. కలిగినందున నేను మరల కొరింథునకు రాలేదు. నా ప్రాణముతోడు ఇందుకు దేవునిని సాక్షిగా పెట్టుచున్నాను. 24మీ విశ్వాసము మీద మేము ప్రభువులమని యీలాగు చెప్పుటలేదు గాని మీ ఆనందమునకు సహకారులమై యున్నాము; విశ్వాసముచేతనే మీరు నిలుకడగా ఉన్నారు.

ప్రస్తుతం ఎంపిక చేయబడింది:

2 కొరింథీయులకు 1: TELUBSI

హైలైట్

షేర్ చేయి

కాపీ

None

మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి