2 సమూయేలు 22
22
1యెహోవా తన్ను సౌలుచేతిలోనుండియు, తన శత్రువులందరి చేతిలోనుండియు తప్పించిన దినమున దావీదు ఈ గీత వాక్యములను చెప్పి యెహోవాను స్తోత్రించెను.
అతడిట్లనెను.
2యెహోవా నా శైలము, నా కోట, నా రక్షకుడు.
3నా దుర్గము, నేను ఆయనను ఆశ్రయించుదును. నా కేడెము నా రక్షణశృంగము నా ఉన్నతదుర్గము నా ఆశ్రయస్థానము. ఆయనే నాకు రక్షకుడు బలాత్కారులనుండి నన్ను రక్షించువాడవు నీవే.
4కీర్తనీయుడైన యెహోవాకు నేను మొఱ్ఱపెట్టితిని నా శత్రువుల చేతిలోనుండి ఆయన నన్ను రక్షించెను.
5మృత్యువుయొక్క అలలు నన్ను చుట్టుకొనగను వరదపొర్లువలె భక్తిహీనులు నా మీదికి వచ్చి నన్ను బెదరించగను
6పాతాళపాశములు నన్ను అరికట్టగను మరణపు ఉరులు నన్ను ఆవరించగను
7నా శ్రమలో నేను యెహోవాకు మొఱ్ఱ పెట్టితిని నా దేవునికి ప్రార్థన చేసితిని ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థన అంగీకరించెను నా మొఱ్ఱ ఆయన చెవులలో చొచ్చెను.
8అప్పుడు భూమి కంపించి అదిరెను పరమండలపు పునాదులు వణకెను ఆయన కోపింపగా అవి కంపించెను.
9ఆయన నాసికారంధ్రములలోనుండి పొగ పుట్టెను ఆయన నోటనుండి అగ్నివచ్చి దహించెను నిప్పు కణములను రాజబెట్టెను.
10మేఘములను వంచి ఆయన వచ్చెను ఆయన పాదముల క్రింద గాఢాంధకారము కమ్మి యుండెను.
11కెరూబుమీద ఎక్కి ఆయన యెగిరి వచ్చెను. గాలి రెక్కలమీద ప్రత్యక్షమాయెను.
12గుడారమువలె అంధకారము తనచుట్టు వ్యాపింప జేసెను. నీటిమబ్బుల సముదాయములను, ఆకాశపు దట్టపు మేఘములను వ్యాపింపజేసెను.
13ఆయన సన్నిధికాంతిలోనుండి నిప్పుకణములు పుట్టెను.
14యెహోవా ఆకాశమందు గర్జించెను సర్వోన్నతుడు ఉరుముధ్వని పుట్టించెను.
15తనబాణములను ప్రయోగించి శత్రువులను చెదర గొట్టెను మెరుపులను ప్రయోగించి వారిని తరిమివేసెను యెహోవా గద్దింపునకు తన నాసికారంధ్రముల శ్వాసము వడిగా విడువగా ఆయన గద్దింపునకు ప్రవాహముల అడుగుభాగములు కనబడెను
16భూమి పునాదులు బయలుపడెను.
17ఉన్నతస్థలములనుండి చెయ్యి చాపి ఆయన నన్ను పట్టుకొనెను నన్ను పట్టుకొని మహాజలరాసులలోనుండి తీసెను.
18బలవంతులగు పగవారు, నన్ను ద్వేషించువారు, నాకంటె బలిష్ఠులై యుండగా వారి వశమునుండి ఆయన నన్ను రక్షించెను.
19ఆపత్కాలమందువారు నామీదికి రాగా యెహోవా నన్ను ఆదుకొనెను. విశాలమైన స్థలమునకు నన్ను తోడుకొని వచ్చెను.
20నేను ఆయనకు ఇష్టుడను గనుక ఆయన నన్ను తప్పించెను.
21నా నీతినిబట్టి ఆయన నాకు ప్రతిఫలమిచ్చెను నా నిర్దోషత్వమునుబట్టియే నాకు ప్రతిఫల మిచ్చెను.
22యెహోవా మార్గములను నేను అనుసరించుచున్నాను. భక్తిహీనుడనై నా దేవుని విడచినవాడను కాను.
23ఆయన న్యాయవిధుల నన్నిటిని నేను లక్ష్యపెట్టు చున్నాను ఆయన కట్టడలను త్రోసివేసిన వాడనుకాను.
24దోషక్రియలు నేను చేయనొల్లకుంటిని ఆయన దృష్టికి యథార్థుడనైతిని.
25కావున నేను నిర్దోషినై యుండుట యెహోవా చూచెను తన దృష్టికి కనబడిన నా చేతుల నిర్దోషత్వమునుబట్టి నాకు ప్రతిఫలమిచ్చెను.
26దయగలవారియెడల నీవు దయ చూపించుదువు యథార్థవంతులయెడల నీవు యథార్థవంతుడవుగా నుందువు.
27సద్భావముగల వారియెడల నీవు సద్భావము చూపు దువు మూర్ఖులయెడల నీవు వికటముగా నుందువు.
28శ్రమపడువారిని నీవు రక్షించెదవు గర్విష్ఠులకు విరోధివై వారిని అణచి వేసెదవు
29యెహోవా, నీవు నాకు దీపమై యున్నావు యెహోవా చీకటిని నాకు వెలుగుగా చేయును.
30నీ సహాయముచేత నేను సైన్యములను జయింతును నా దేవుని సహాయమువలన నేను ప్రాకారములను దాటుదును.
31దేవుడు యథార్థవంతుడు యెహోవా వాక్కు నిర్మలము ఆయన శరణుజొచ్చువారికందరికి ఆయన కేడెము.
32యెహోవా తప్ప దేవుడేడి? మన దేవుడు తప్ప ఆశ్రయదుర్గమేది?
33దేవుడు నాకు బలమైన కోటగా ఉన్నాడు ఆయన తన మార్గమునందు యథార్థవంతులను నడిపించును.
34ఆయన నా కాళ్లు జింకకాళ్లవలె చేయును ఎత్తయిన స్థలములమీద నన్ను నిలుపును.
35నా చేతులకు యుద్ధముచేయ నేర్పువాడు ఆయనే నా బాహువులు ఇత్తడి విల్లును ఎక్కు బెట్టును.
36నీవు నీ రక్షణ కేడెమును నాకు అందించుదువు నీ సాత్వికము నన్ను గొప్పచేయును.
37నా పాదములకు చోటు విశాలపరచుదువు నా చీలమండలు బెణకలేదు.
38నా శత్రువులను తరిమి నాశనము చేయుదును వారిని నశింపజేయువరకు నేను తిరుగను.
39నేను వారిని మ్రింగివేయుదును వారిని తుత్తినియలుగా కొట్టుదును వారు నా పాదముల క్రిందపడి లేవలేకయుందురు.
40యుద్ధమునకు బలము నీవు నన్ను ధరింపజేయుదువు నామీదికి లేచినవారిని నీవు అణచివేయుదువు.
41నా శత్రువులను వెనుకకు మళ్లచేయుదువు నన్ను ద్వేషించువారిని నేను నిర్మూలము చేయుదును.
42వారు ఎదురు చూతురుగాని రక్షించువాడు ఒకడును లేకపోవును వారు యెహోవాకొరకు కనిపెట్టుకొనినను ఆయన వారికి ప్రత్యుత్తరమియ్యకుండును.
43నేల ధూళివలె వారిని నలుగగొట్టెదను పొడిగా వారిని కొట్టెదను వీధిలోని పెంటవలె నేను వారిని పారపోసి అణగ ద్రొక్కెదను.
44నా ప్రజల కలహములలో పడకుండ నీవు నన్ను విడిపించితివి జనులకు అధికారిగా నన్ను నిలిపితివి నేను ఎరుగని జనులు నన్ను సేవించెదరు.
45అన్యులు నాకు లోబడినట్టు వేషము వేయుదురు వారు నన్నుగూర్చి వినిన మాత్రముచేత నాకు విధే యులగుదురు
46అన్యులు దుర్బలులై వణకుచు తమ దుర్గములను విడచి వచ్చెదరు. యెహోవా జీవముగలవాడు
47నా ఆశ్రయదుర్గమైనవాడు స్తోత్రార్హుడు నాకు రక్షణాశ్రయ దుర్గమైన దేవుడు మహోన్నతు డగును గాక
48ఆయన నా నిమిత్తము ప్రతిదండనచేయు దేవుడు ఆయన నా నిమిత్తము పగ తీర్చు దేవుడు జనములను నాకు లోపరచువాడు ఆయనే.
49ఆయనే నా శత్రువుల చేతిలోనుండి నన్ను విడి పించును నామీదికి లేచినవారికంటె ఎత్తుగా నీవు నన్ను హెచ్చించుదువు. బలాత్కారము చేయువారి చేతిలోనుండి నీవు నన్ను విడిపించుదువు.
50అందువలన యెహోవా, అన్యజనులలో నేను నిన్ను ఘనపరచెదను. నీ నామకీర్తన గానముచేసెదను.
51నీవు నియమించిన రాజునకు గొప్ప రక్షణ కలుగ జేయువాడవు అభిషేకించిన దావీదునకును అతని సంతానమునకును నిత్యము కనికరము చూపువాడవు.
ప్రస్తుతం ఎంపిక చేయబడింది:
2 సమూయేలు 22: TELUBSI
హైలైట్
షేర్ చేయి
కాపీ
మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి
Telugu Old Version Bible - పరిశుద్ధ గ్రంథము O.V. Bible
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide.