2 సమూయేలు 8

8
1దావీదు ఫిలిష్తీయులను ఓడించి లోపరచుకొని వారి వశములోనుండి మెతెగమ్మాను పట్టుకొనెను. 2మరియు అతడు మోయాబీయులను ఓడించి, (పట్టుబడిన వారిని) నేలపొడుగున పండజేసి, తాడుతో కొలిచి రెండుతాడుల పొడుగుననున్నవారు చావవలెననియు, ఒకతాడు పొడుగున నున్నవారు బ్రతుకవచ్చుననియు నిర్ణయించెను. అంతట మోయాబీయులు దావీదునకు దాసులై కప్పము చెల్లించుచుండిరి. 3సోబారాజును రెహోబు కుమారుడునగు హదదెజెరు యూఫ్రటీసు నదివరకు తన రాజ్యమును వ్యాపింపజేయవలెనని బయలుదేరగా దావీదు అతని నోడించి 4అతనియొద్దనుండి వెయ్యిన్ని యేడు వందలమంది గుఱ్ఱపు రౌతులను ఇరువది వేల కాల్బలమును పట్టుకొని, వారి గుఱ్ఱములలో నూటిని ఉంచుకొని, మిగిలిన వాటికి చీలమండ నరములను తెగవేయించెను. 5మరియు దమస్కులోనున్న సిరియనులు సోబారాజగు హదదెజెరునకు సహాయము చేయరాగా దావీదు సిరియనులలో ఇరువదిరెండు వేలమందిని ఓడించి 6దమస్కువశముననున్న సిరియదేశమందు దండును ఉంచగా, సిరియనులు దావీదునకు దాసులై కప్పము చెల్లించుచుండిరి. దావీదు ఎక్కడికి పోయినను యెహోవా అతనిని కాపాడుచుండెను. 7హదదెజెరు సేవకులకున్న బంగారు డాళ్లు దావీదు పట్టుకొని యెరూషలేమునకు తీసికొని వచ్చెను. 8మరియు బెతహు బేరోతై అను హదదెజెరు పట్టణములలో దావీదు రాజు విస్తారమైన యిత్తడిని పట్టుకొనెను.
9దావీదు హదదెజెరు దండు అంతయు ఓడించిన సమాచారము హమాతు రాజైన తోయికి వినబడెను. 10హదదె జెరునకును తోయికిని యుద్ధములు జరుగుచుండెను గనుక దావీదు హదదెజెరుతో యుద్ధము చేసి అతనిని ఓడించి యుండుట తోయి విని, తన కుమారుడగు యోరాము చేతికి వెండి బంగారు ఇత్తడి వస్తువులను కానుకలుగా అప్పగించి కుశల ప్రశ్నలడిగి దావీదుతోకూడ సంతోషించుటకై అతనిని దావీదు నొద్దకు పంపెను. 11రాజైన దావీదు తాను జయించిన జనములయొద్ద పట్టుకొనిన వెండి బంగారములతో వీటినిచేర్చి యెహోవాకు ప్రతిష్ఠించెను. 12వాటిని అతడు సిరియనులయొద్దనుండియు మోయాబీయుల యొద్దనుండియు అమ్మోనీయుల యొద్దనుండియు ఫిలిష్తీయుల యొద్దనుండియు అమాలేకీయుల యొద్దనుండియు రెహోబు కుమారుడగు హదదెజెరు అను సోబారాజునొద్ద నుండియు పట్టుకొని యుండెను. 13దావీదు ఉప్పు లోయలో సిరియనులగు పదునెనిమిది వేలమందిని హతము చేసితిరిగి రాగా అతని పేరు ప్రసిద్ధమాయెను. 14మరియు ఎదోము దేశమందు అతడు దండు నుంచెను. ఎదోమీయులు దావీదునకు దాసులుకాగా ఎదోము దేశమంతట అతడు కావలిదండుంచెను; దావీదు ఎక్కడికి పోయినను యెహోవా అతనిని కాపాడుచుండెను.
15దావీదు ఇశ్రాయేలీయులందరిమీద రాజై తన జనుల నందరిని నీతి న్యాయములనుబట్టి యేలుచుండెను. 16సెరూయా కుమారుడగు యోవాబు సైన్యమునకు అధిపతియైయుండెను. అహీలూదు కుమారుడగు యెహోషాపాతు రాజ్యపు దస్తావేజులమీద నుండెను. 17అహీ టూబు కుమారుడగు సాదోకును అబ్యాతారు కుమారుడగు అహీమెలెకును యాజకులు; శెరాయా లేఖకుడు; 18యెహోయాదా కుమారుడగు బెనాయా కెరేతీయులకును పెలేతీయులకును అధిపతి; దావీదు కుమారులు సభా ముఖ్యులు.

ప్రస్తుతం ఎంపిక చేయబడింది:

2 సమూయేలు 8: TELUBSI

హైలైట్

షేర్ చేయి

కాపీ

None

మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి