అపొస్తలుల కార్యములు 10:9-23

అపొస్తలుల కార్యములు 10:9-23 TELUBSI

మరునాడు వారు ప్రయాణమైపోయి పట్టణమునకు సమీపించినప్పుడు పగలు ఇంచుమించు పండ్రెండు గంట లకు పేతురు ప్రార్థనచేయుటకు మిద్దెమీది కెక్కెను. అతడు మిక్కిలి ఆకలిగొని భోజనము చేయగోరెను; ఇంటివారు సిద్ధముచేయుచుండగా అతడు పరవశుడై ఆకాశము తెరవబడుటయు, నాలుగు చెంగులుపెట్టి దింప బడిన పెద్ద దుప్పటివంటి యొకవిధమైన పాత్ర భూమి మీదికి దిగివచ్చుటయు చూచెను. అందులో భూమియందుండు సకల విధములైన చతుష్పాద జంతువులును, ప్రాకుపురుగులును, ఆకాశపక్షులును ఉండెను. అప్పుడు –పేతురూ, నీవు లేచి చంపుకొని తినుమని ఒక శబ్దమత నికి వినబడెను. అయితే పేతురు–వద్దు ప్రభువా, నిషిద్ధమైనది అపవిత్రమైనది ఏదైనను నేనెన్నడును తినలేదని చెప్పగా –దేవుడు పవిత్రము చేసినవాటిని నీవు నిషిద్ధమైన వాటినిగా ఎంచవద్దని మరల రెండవ మారు ఆ శబ్దము అతనికి వినబడెను. ఈలాగు ముమ్మారు జరిగెను. వెంటనే ఆ పాత్ర ఆకాశమునకెత్తబడెను. పేతురు తనకు కలిగిన దర్శనమేమై యుండునో అని తనలో తనకు ఎటుతోచక యుండగా, కొర్నేలి పంపిన మనుష్యులు సీమోను ఇల్లు ఏదని విచారించి తెలిసికొని, వాకిట నిలిచి యింటివారిని పిలిచి –పేతురు అను మారుపేరుగల సీమోను ఇక్కడ దిగియున్నాడా? అని అడిగిరి పేతురు ఆ దర్శనమునుగూర్చి యోచించుచుండగా ఆత్మ–ఇదిగో ముగ్గురు మనుష్యులు నిన్ను వెదకుచున్నారు. నీవు లేచి క్రిందికిదిగి, సందేహింపక వారితోకూడ వెళ్లుము; నేను వారిని పంపియున్నానని అతనితో చెప్పెను. పేతురు ఆ మనుష్యులయొద్దకు దిగి వచ్చి–ఇదిగో మీరు వెదకువాడను నేనే; మీరు వచ్చిన కారణ మేమని అడిగెను. అందుకు వారు–నీతిమంతుడును, దేవునికి భయపడువాడును, యూద జనులందరివలన మంచిపేరు పొందినవాడునైన శతాధిపతియగు కొర్నేలి యను ఒక మనుష్యుడున్నాడు; అతడు నిన్ను తన యింటికి పిలువనంపించి నీవు చెప్పు మాటలు వినవలెనని పరిశుద్ధదూత వలన బోధింపబడెనని చెప్పిరి; అప్పుడు అతడు వారిని లోపలికి పిలిచి ఆతిథ్యమిచ్చెను. మరునాడు అతడు లేచి, వారితోకూడ బయలుదేరెను; యొప్పేవారైన కొందరు సహోదరులును వారితోకూడ వెళ్లిరి.