అపొస్తలుల కార్యములు 2:14-41

అపొస్తలుల కార్యములు 2:14-41 TELUBSI

అయితే పేతురు ఆ పదునొకరితోకూడ లేచి నిలిచి బిగ్గరగా వారితో ఇట్లనెను–యూదయ మనుష్యులారా, యెరూషలేములో కాపురమున్న సమస్త జనులారా, యిది మీకు తెలియుగాక, చెవియొగ్గి నా మాటలు వినుడి. మీరు ఊహించునట్టు వీరు మత్తులు కారు, ప్రొద్దుబొడిచి జామయిన కాలేదు. యోవేలు ప్రవక్త ద్వారా చెప్ప బడిన సంగతి యిదే, ఏమనగా –అంత్యదినములయందు నేను మనుష్యులందరిమీద నా ఆత్మ ను కుమ్మరించెదను మీ కుమారులును మీ కుమార్తెలును ప్రవచించెదరు మీ యౌవనులకు దర్శనములు కలుగును మీ వృద్ధులు కలలు కందురు. ఆ దినములలో నా దాసులమీదను నా దాసురాండ్ర మీదను నా ఆత్మ ను కుమ్మరించెదను గనుక వారు ప్రవచించెదరు. పైన ఆకాశమందు మహత్కార్యములను క్రింద భూమిమీద సూచకక్రియలను రక్తమును అగ్నిని పొగ ఆవిరిని కలుగజేసెదను. ప్రభువు ప్రత్యక్షమగు ఆ మహాదినము రాకమునుపు సూర్యుడు చీకటిగాను చంద్రుడు రక్తముగాను మారుదురు. అప్పుడు ప్రభువు నామమునుబట్టి ప్రార్థనచేయు వారందరును రక్షణపొందుదురు అని దేవుడు చెప్పుచున్నాడు. ఇశ్రాయేలువారలారా, యీ మాటలు వినుడి. దేవుడు నజరేయుడగు యేసుచేత అద్భుతములను మహత్కార్యములను సూచకక్రియలను మీమధ్యను చేయించి, ఆయనను తనవలన మెప్పుపొందినవానిగా మీకు కనబర చెను; ఇది మీరే యెరుగుదురు. దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్యద్ జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన యీయనను మీరు దుష్టులచేత సిలువ వేయించి చంపితిరి. మరణము ఆయనను బంధించి యుంచుట అసాధ్యము గనుక దేవుడు మరణవేదనలు తొలగించి ఆయనను లేపెను. ఆయననుగూర్చి దావీదు ఇట్లనెను –నేనెల్లప్పుడు నా యెదుట ప్రభువు ను చూచు చుంటిని ఆయన నా కుడిపార్శ్వముననున్నాడు గనుక నేను కదల్చబడను. కావున నా హృదయము ఉల్లసించెను; నా నాలుక ఆనందించెను మరియు నా శరీరము కూడ నిరీక్షణ గలిగి నిలకడగా ఉండును. నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు నీ పరిశుద్ధుని కుళ్లుపట్టనియ్యవు. నాకు జీవమార్గములు తెలిపితివి నీ దర్శన మనుగ్రహించి నన్ను ఉల్లాసముతో నింపెదవు. సహోదరులారా, మూలపురుషుడగు దావీదునుగూర్చి మీతో నేను ధారాళముగ మాటలాడవచ్చును. అతడు చనిపోయి సమాధిచేయబడెను; అతని సమాధి నేటివరకు మన మధ్య నున్నది. అతడు ప్రవక్తయైయుండెను గనుక –అతని గర్భఫలములోనుండి అతని సింహాసనముమీద ఒకని కూర్చుండబెట్టుదును అని దేవుడు తనతో ప్రమాణపూర్వకముగా ఒట్టుపెట్టుకొనిన సంగతి అతడెరిగి, క్రీస్తు పాతాళములో విడువబడలేదనియు, ఆయన శరీరము కుళ్లిపోలేదనియు దావీదు ముందుగా తెలిసికొని ఆయన పునరుత్థానమునుగూర్చి చెప్పెను. ఈ యేసును దేవుడు లేపెను; దీనికి మేమందరము సాక్షులము. కాగా ఆయన దేవుని కుడి పార్శ్వమునకు హెచ్చింపబడి, పరిశుద్ధాత్మనుగూర్చిన వాగ్దానమును తండ్రివలన పొంది, మీరు చూచుచు వినుచునున్న దీనిని కుమ్మరించియున్నాడు. దావీదు పరలోకమునకు ఎక్కి పోలేదు; అయితే అతడిట్లనెను– నేను నీ శత్రువులను నీ పాదములక్రింద పాదపీఠ ముగా ఉంచువరకు నీవు నా కుడిపార్శ్వమున కూర్చుండుమని ప్రభువు నా ప్రభువుతో చెప్పెను. మీరు సిలువవేసిన యీ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. ఇది ఇశ్రాయేలు వంశ మంతయు రూఢిగా తెలిసికొనవలెనని చెప్పెను. వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకొని –సహోదరులారా, మేమేమి చేతుమని పేతురును కడమ అపొస్తలులను అడుగగా పేతురు–మీరు మారుమనస్సు పొంది, పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి; అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు. ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును దూరస్థులందరికిని, అనగా ప్రభువైన మన దేవుడు తనయొద్దకు పిలిచిన వారికందరికిని చెందునని వారితో చెప్పెను. ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యమిచ్చి–మీరు మూర్ఖులగు ఈ తరమువారికి వేరై రక్షణపొందుడని వారిని హెచ్చరించెను. కాబట్టి అతని వాక్యము అంగీకరించినవారు బాప్తిస్మము పొందిరి, ఆ దినమందు ఇంచుమించు మూడువేలమంది చేర్చబడిరి.