అపొస్తలుల కార్యములు 21

21
1మేము వారిని విడిచిపెట్టి ఓడ ఎక్కి తిన్నగా వెళ్లి కోసుకును, మరునాడు రొదుకును, అక్కడనుండి పతరకును వచ్చితిమి. 2అప్పుడు ఫేనీకేకు వెళ్ల బోవుచున్న ఒక ఓడను చూచి దానిని ఎక్కి బయలుదేరితిమి. 3కుప్రకు ఎదురుగా వచ్చి, దానిని ఎడమతట్టున విడిచి, సిరియవైపుగా వెళ్లి, తూరులో దిగితిమి; అక్కడ ఓడ సరుకు దిగుమతి చేయవలసియుండెను. 4మేమక్కడ నున్న శిష్యులను కనుగొని యేడుదినములక్కడ ఉంటిమి. వారు–నీవు యెరూషలేములో కాలు పెట్టవద్దని ఆత్మ ద్వారా పౌలుతో చెప్పిరి. 5ఆ దినములు గడిపిన తరువాత ప్రయాణమై పోవుచుండగా, భార్యలతోను పిల్లలతోను వారందరు మమ్మును పట్టణము వెలుపలివరకు సాగనంపవచ్చిరి. వారును మేమును సముద్రతీరమున మోకాళ్లూని ప్రార్థనచేసి యొకరియొద్ద ఒకరము సెలవు పుచ్చుకొంటిమి. 6అంతట మేము ఓడ ఎక్కితిమి, వారు తమతమ యిండ్లకు తిరిగి వెళ్లిరి.
7మేము తూరునుండి చేసిన ప్రయాణము ముగించి, తొలెమాయికి వచ్చి, సహోదరులను కుశలమడిగి వారి యొద్ద ఒక దినముంటిమి. 8మరునాడు మేము బయలుదేరి కైసరయకు వచ్చి, యేడుగురిలో నొకడును సువార్తి కుడునైన ఫిలిప్పు ఇంట ప్రవేశించి అతనియొద్ద ఉంటిమి. 9కన్యకలుగా ఉన్న నలుగురు కుమార్తెలు అతనికుండిరి, వారు ప్రవచించువారు. 10మేమనేక దినములక్కడ ఉండగా, అగబు అను ఒక ప్రవక్త యూదయనుండి వచ్చెను. 11అతడు మాయొద్దకు వచ్చి పౌలు నడికట్టు తీసికొని, తన చేతులను కాళ్లను కట్టుకొని–యెరూషలేములోని యూదులు ఈ నడికట్టుగల మనుష్యుని ఈలాగు బంధించి, అన్యజనులచేతికి అప్పగింతురని పరిశుద్ధాత్మ చెప్పుచున్నాడనెను. 12ఈ మాట వినినప్పుడు మేమును అక్కడివారును–యెరూషలేమునకు వెళ్లవద్దని అతని బతిమాలుకొంటిమి గాని 13పౌలు– ఇదెందుకు? మీరు ఏడ్చి నా గుండె బద్దలు చేసెదరేల? నేనైతే ప్రభువైన యేసు నామము నిమిత్తము యెరూషలేములో బంధింపబడుటకు మాత్రమే గాక చనిపోవుటకును సిద్ధముగా ఉన్నానని చెప్పెను. 14అతడు ఒప్పుకొన నందున మేము–ప్రభువు చిత్తము జరుగునుగాక అని ఊరకుంటిమి.
15ఆ దినములైన తరువాత మాకు కావలసిన సామగ్రి తీసికొని యెరూషలేమునకు ఎక్కిపోతిమి. 16మరియు కైసరయనుండి కొందరు శిష్యులు, మొదటనుండి శిష్యుడుగా ఉండిన కుప్రీయుడైన మ్నాసోను ఇంట మేము దిగవలెనను ఉద్దేశముతో అతనిని వెంటబెట్టుకొని మాతోకూడ వచ్చిరి.
17మేము యెరూషలేమునకు వచ్చినప్పుడు సహోదరులు మమ్మును సంతోషముతో చేర్చుకొనిరి. 18మరునాడు పెద్దలందరు అక్కడికి వచ్చియుండగా పౌలు మాతోకూడ యాకోబునొద్దకు వచ్చెను. 19అతడు వారిని కుశల మడిగి, తన పరిచర్యవలన దేవుడు అన్యజనులలో జరిగించిన వాటిని వివరముగా తెలియజెప్పెను. 20వారు విని దేవుని మహిమపరచి అతని చూచి–సహోదరుడా, యూదులలో విశ్వాసులైనవారు ఎన్ని వేలమంది యున్నారో చూచుచున్నావుగదా? వారందరును ధర్మశాస్త్రమందు ఆసక్తి గలవారు. 21అన్యజనులలో ఉన్న యూదులు తమ పిల్లలకు సున్నతి చేయకూడదనియు, మన ఆచారముల చొప్పున నడువకూడదనియు నీవు చెప్పుటవలన వారందరు మోషేను విడిచిపెట్టవలెనని నీవు బోధించుచున్నట్టు వీరు నిన్నుగూర్చి వర్తమానము వినియున్నారు. 22కావున మన మేమి చేయుదుము? నీవు వచ్చిన సంగతి వారు తప్పక విందురు. 23కాబట్టి మేము నీకు చెప్పినట్టు చేయుము. మ్రొక్కుబడియున్న నలుగురు మనుష్యులు మాయొద్ద ఉన్నారు. 24నీవు వారిని వెంటబెట్టుకొనిపోయి వారితోకూడ శుద్ధిచేసికొని, వారు తలక్షౌరము చేయించుకొనుటకు వారికయ్యెడి తగులుబడి పెట్టుకొనుము; అప్పుడు నిన్నుగూర్చి తాము వినిన వర్తమానము నిజము కాదనియు, నీవును ధర్మశాస్త్రమును గైకొని యథావిధిగా నడుచుకొనుచున్నావనియు తెలిసికొందురు 25అయితే విశ్వసించిన అన్యజనులనుగూర్చి–వారు విగ్రహములకు అర్పించిన వాటి రక్తమును గొంతు పిసికి చంపినదానిని జారత్వమును మానవలసినదని నిర్ణయించి వారికి వ్రాసియున్నామని చెప్పిరి. 26అంతట పౌలు మరునాడు ఆ మనుష్యులను వెంట బెట్టుకొనిపోయి, వారితోకూడ శుద్ధిచేసికొని, దేవాలయములో ప్రవేశించి, వారిలో ప్రతివానికొరకు కానుక అర్పించువరకు శుద్ధిదినములు నెరవేర్చుదుమని తెలిపెను.
27ఏడు దినములు కావచ్చినప్పుడు ఆసియనుండి వచ్చిన యూదులు దేవాలయములో అతని చూచి, సమూహ మంతటిని కలవరపరచి అతనిని బలవంతముగా పట్టుకొని 28–ఇశ్రాయేలీయులారా, సహాయము చేయరండి; ప్రజ లకును ధర్మశాస్త్రమునకును ఈ స్థలమునకును విరోధముగా అందరికిని అంతటను బోధించుచున్నవాడు వీడే. మరియు వీడు గ్రీసుదేశస్థులను దేవాలయములోనికి తీసికొనివచ్చి యీ పరిశుద్ధ స్థలమును అపవిత్రపరచియున్నాడని కేకలు వేసిరి. 29ఏలయనగా ఎఫెసీయుడైన త్రోఫిమును అతనితోకూడ పట్టణములో అంతకుముందువారు చూచియున్నందున పౌలు దేవాలయములోనికి అతని తీసికొని వచ్చెనని ఊహించిరి. 30పట్టణమంతయు గలిబిలిగా ఉండెను. జనులు గుంపులు గుంపులుగా పరుగెత్తికొని వచ్చి, పౌలును పట్టుకొని దేవాలయములోనుండి అతనిని వెలుపలికి ఈడ్చిరి; వెంటనే తలుపులు మూయబడెను. 31వారతని చంపవలెనని యత్నించుచుండగా యెరూషలేమంతయు గలిబిలిగా ఉన్నదని పటాలపు పై యధికారికి వర్తమానము వచ్చెను; 32వెంటనే అతడు సైనికులను శతాధిపతులను వెంట బెట్టుకొని వారియొద్దకు పరుగెత్తివచ్చెను; వారు పై యధికారిని సైనికులను రాణువవారిని చూచి పౌలును కొట్టుట మానిరి. 33పై యధికారి దగ్గరకు వచ్చి అతని పట్టుకొని, రెండు సంకెళ్లతో బంధించుమని ఆజ్ఞా పించి–ఇతడెవడు? ఏమిచేసెనని అడుగగా, 34సమూహములో కొందరీలాగు కొందరాలాగు కేకలువేయు చున్నప్పుడు అల్లరిచేత అతడు నిజము తెలిసికొనలేక కోటలోనికి అతని తీసికొనిపొమ్మని ఆజ్ఞాపించెను. 35పౌలు మెట్లమీదికి వచ్చినప్పుడు జనులు గుంపుకూడి బలవంతము చేయుచున్నందున సైనికులు అతనిని మోసికొని పోవలసి వచ్చెను. 36ఏలయనగా–వానిని చంపుమని జనసమూహము కేకలువేయుచు వెంబడించెను.
37వారు పౌలును కోటలోనికి తీసికొనిపోవనై యుండగా అతడు పైయధికారిని చూచి–నేను నీతో ఒకమాట చెప్పవచ్చునా? అని అడిగెను. అందుకతడు–గ్రీకుభాష నీకు తెలియునా? 38ఈ దినములకుమునుపు రాజద్రోహమునకు రేపి, నరహంతకులైన నాలుగువేలమంది మనుష్యులను అరణ్యమునకు వెంటబెట్టుకొనిపోయిన ఐగుప్తీయుడవు నీవు కావా? అని అడిగెను. 39అందుకు పౌలు–నేను కిలికియలోని తార్సువాడనైన యూదుడను; ఆ గొప్ప పట్టణపు పౌరుడను. జనులతో మాటలాడుటకు నాకు సెలవిమ్మని వేడుకొనుచున్నానని చెప్పెను. 40అతడు సెలవిచ్చిన తరువాత పౌలు మెట్లమీద నిలువబడి జనులకు చేసైగ చేసెను. వారు నిశ్శబ్దముగా ఉన్నప్పుడు అతడు హెబ్రీభాషలో ఇట్లనెను–

ప్రస్తుతం ఎంపిక చేయబడింది:

అపొస్తలుల కార్యములు 21: TELUBSI

హైలైట్

షేర్ చేయి

కాపీ

None

మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి