ఆదికాండము 30

30
1రాహేలు తాను యాకోబునకు పిల్లలు కనక పోవుట చూచి తన అక్కయందు అసూయపడి యాకోబుతో–నాకు గర్భఫలము నిమ్ము; లేనియెడల నేను చచ్చెదననెను. 2యాకోబు కోపము రాహేలుమీద రగులుకొనగా అతడు–నేను నీకు గర్భఫలమును ఇయ్యక పోయిన దేవునికి ప్రతిగా నున్నానా అనెను. 3అందు కామె–నా దాసియైన బిల్హా ఉన్నది గదా; ఆమెతో పొమ్ము; ఆమె నా కొరకు పిల్లలను కనును; ఆలాగున ఆమె వలన నాకును పిల్లలు కలుగుదురని చెప్పి 4తన దాసియైన బిల్హాను అతనికి భార్యగా ఇచ్చెను. యాకోబు ఆమెతో పోగా 5బిల్హా గర్భవతియై యాకోబునకు కుమారుని కనెను. 6అప్పుడు రాహేలు–దేవుడు నాకు తీర్పు తీర్చెను; ఆయన నా మొరను విని నాకు కుమారుని దయ చేసెననుకొని అతనికి దాను అని పేరు పెట్టెను. 7రాహేలు దాసియైన బిల్హా తిరిగి గర్భవతియై యాకోబుకు రెండవ కుమారుని కనెను. 8అప్పుడు రాహేలు–దేవుని కృప విషయమై నా అక్కతో పోరాడి గెలిచితిననుకొని అతనికి నఫ్తాలి అను పేరు పెట్టెను. 9లేయా తనకు కానుపు ఉడుగుట చూచి తన దాసియైన జిల్పాను తీసికొని యాకోబునకు ఆమెను భార్యగా ఇచ్చెను. 10లేయా దాసియైన జిల్పా యాకోబునకు కుమారుని కనగా 11లేయా–ఇది అదృష్టమేగదా అనుకొని అతనికి గాదు అను పేరుపెట్టెను. 12లేయా దాసియైన జిల్పా యాకోబునకు రెండవ కుమారుని కనగా 13లేయా నేను భాగ్యవంతురాలను–స్త్రీలు నన్ను భాగ్యవతి అందురు గదా అని అతనికి ఆషేరు అను పేరు పెట్టెను. 14గోధుమల కోతకాలములో రూబేను వెళ్లి పొలములో పుత్రదాతవృక్షపు పండ్లు చూచి తన తల్లియైన లేయాకు తెచ్చి యిచ్చెను. అప్పుడు రాహేలు–నీ కుమారుని పుత్రదాతవృక్షపు పండ్లలో కొన్ని నాకు దయచేయుమని లేయాతో అనగా 15ఆమె –నా భర్తను తీసికొంటివే అది చాలదా? ఇప్పుడు నా కుమారుని పుత్రదాత వృక్షపు పండ్లను తీసికొందువా అని చెప్పెను. అందుకు రాహేలు–కాబట్టి నీ కుమారుని పుత్రదాతవృక్షపు పండ్ల నిమిత్తము అతడు ఈ రాత్రి నీతో శయనించునని చెప్పెను. 16సాయంకాలమందు యాకోబు పొలమునుండి వచ్చునప్పుడు లేయా అతనిని ఎదుర్కొన బోయి–నీవు నా యొద్దకు రావలెను, నా కుమారుని పుత్రదాతవృక్షపు పండ్లతో నిన్ను కొంటినని చెప్పెను. కాబట్టి అతడు ఆ రాత్రి ఆమెతో శయనించెను. 17దేవుడు లేయా మనవి వినెను గనుక ఆమె గర్భవతియై యాకోబునకు అయిదవ కుమారుని కనెను. 18లేయా–నేను నా పెనిమిటికి నా దాసి నిచ్చినందున దేవుడు నాకు ప్రతిఫలము దయచేసెననుకొని అతనికి ఇశ్శాఖారు అను పేరు పెట్టెను. 19లేయా మరల గర్భవతియై యాకోబునకు ఆరవ కుమారుని కనెను. 20అప్పుడు లేయా–దేవుడు మంచి బహుమతి నాకు దయచేసెను; నా పెనిమిటికి ఆరుగురు కుమారులను కనియున్నాను గనుక అతడికను నాతో కాపురము చేయుననుకొని అతనికి జెబూలూను అను పేరు పెట్టెను. 21ఆ తరువాత ఆమె కొమార్తెను కని ఆమెకు దీనా అను పేరు పెట్టెను. 22దేవుడు రాహేలును జ్ఞాపకము చేసికొని ఆమె మనవి విని ఆమె గర్భము తెరిచెను. 23అప్పుడామె గర్భవతియై కుమారుని కని–దేవుడు నా నింద తొలగించెననుకొనెను. 24మరియు ఆమె–యెహోవా మరియొక కుమారుని నాకు దయచేయునుగాక అనుకొని అతనికి యోసేపు అను పేరు పెట్టెను.
25రాహేలు యోసేపును కనిన తరువాత యాకోబు లాబానుతో–నన్ను పంపివేయుము; నా చోటికిని నా దేశమునకును వెళ్లెదను. 26నా భార్యలను నా పిల్లలను నా కప్పగించుము; అప్పుడు నేను వెళ్లెదను; వారి కోసము నీకు కొలువుచేసితిని; నేను నీకు కొలువు చేసిన విధమును నీ వెరుగుదువుగదా అని చెప్పెను. 27అందుకు లాబాను అతనితో–నీ కటాక్షము నా మీదనున్నయెడల నా మాట వినుము; నిన్నుబట్టి యెహోవా నన్ను ఆశీర్వదించె నని శకునము చూచి తెలిసికొంటినని చెప్పెను. 28మరియు అతడు–నీ జీత మింతయని నాతో స్పష్టముగా చెప్పుము అది యిచ్చెదననెను. 29అందుకు యాకోబు అతని చూచి–నేను నీకెట్లు కొలువు చేసితినో నీ మందలు నాయొద్ద ఎట్లుండెనో అది నీకు తెలియును; 30నేను రాకమునుపు నీకుండినది కొంచెమే; అయితే అది బహుగా అభివృద్ధి పొందెను; నేను పాదముపెట్టిన చోటెల్ల యెహోవా నిన్ను ఆశీర్వదించెను; నేను నా యింటి వారికొరకు ఎప్పుడు సంపాద్యము చేసికొందుననెను. 31అప్పుడతడు–నేను నీకేమి ఇయ్యవలెనని యడిగినందుకు యాకోబు–నీవు నాకేమియు ఇయ్యవద్దు; నీవు నాకొరకు ఈ విధముగా చేసినయెడల నేను తిరిగి నీ మందను మేపి కాచెదను. 32నేడు నేను నీ మంద అంతటిలో నడచి చూచి పొడలైనను మచ్చలైనను గల ప్రతి గొఱ్ఱెను, గొఱ్ఱెపిల్లలలో నల్లని ప్రతిదానిని, మేకలలో మచ్చలైనను పొడలైనను గలవాటిని వేరుపరచెదను; అట్టివి నాకు జీతమగును. 33ఇకమీదట నాకు రావలసిన జీతమునుగూర్చి నీవు చూడవచ్చినప్పుడు నా న్యాయప్రవర్తనయే నాకు సాక్ష్యమగును; మేకలలో పొడలైనను మచ్చలైనను లేనివన్నియు, గొఱ్ఱెపిల్లలలో నలుపు లేనివన్నియు నా యొద్దనున్నయెడల నేను దొంగిలితినని చెప్పవచ్చుననెను. 34అందుకు లాబాను –మంచిది, నీ మాటచొప్పుననే కాని మ్మనెను. 35ఆ దినమున లాబాను చారయైనను మచ్చ యైనను గల మేకపోతులను, పొడలైనను మచ్చలైనను గల పెంటిమేకలన్నిటిని కొంచెము తెలుపుగల ప్రతిదానిని గొఱ్ఱెపిల్లలలో నల్లవాటినన్నిటిని వేరుచేసి తన కుమారులచేతి కప్పగించి 36తనకును యాకోబునకును మధ్య మూడుదినముల ప్రయాణమంత దూరము పెట్టెను; లాబానుయొక్క మిగిలిన మందను యాకోబు మేపు చుండెను. 37యాకోబు చినారు జంగి సాలు అను చెట్ల చువ్వలను తీసికొని ఆ చువ్వలలో తెల్లచారలు కనబడునట్లు అక్కడక్కడ వాటి తొక్కలు ఒలిచి 38మందలు నీళ్లు త్రాగ వచ్చినప్పుడు అవి చూలు కట్టుటకు అతడు తాను ఒలిచిన చువ్వలను మందలు త్రాగుటకు వచ్చు కాలువలలోను నీళ్లగాళ్లలోను వాటియెదుట పెట్టగా 39మందలు ఆ చువ్వల యెదుట చూలు కట్టి చారలైనను పొడలైనను మచ్చలైనను గల పిల్లలను ఈనెను. 40యాకోబు ఆ గొఱ్ఱెపిల్లలను వేరుచేసి, చారలుగల వాటితట్టును లాబాను మందలలో నల్లని వాటితట్టును మందల ముఖములు త్రిప్పి తన మందలను లాబాను మందలతో నుంచక వాటిని వేరుగా ఉంచెను. 41మందలో బలమైనవి చూలు కట్టినప్పుడెల్లను అవి ఆ చువ్వల యెదుట చూలు కట్టునట్లు యాకోబు మంద కన్నుల యెదుట కాలువలలో ఆ చువ్వలు పెట్టెను. 42మంద బలహీనమైనప్పుడు పెట్టలేదు. అట్లు బలహీనమైనవి లాబానుకును బలమైనవి యాకోబునకును వచ్చెను. 43ఆప్రకారము ఆ మనుష్యుడు అత్యధికముగా అభివృద్ధిపొంది విస్తారమైన మందలు దాసీలు దాసులు ఒంటెలు గాడిదలు గలవాడాయెను.

ప్రస్తుతం ఎంపిక చేయబడింది:

ఆదికాండము 30: TELUBSI

హైలైట్

షేర్ చేయి

కాపీ

None

మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి