ఆదికాండము 39:1-12

ఆదికాండము 39:1-12 TELUBSI

యోసేపును ఐగుప్తునకు తీసికొని వచ్చినప్పుడు ఫరోయొక్క ఉద్యోగస్థుడును రాజసంరక్షక సేనాధిపతియు నైన పోతీఫరను నొక ఐగుప్తీయుడు, అక్కడికి అతని తీసికొని వచ్చిన ఇష్మాయేలీయులయొద్ద నతని కొనెను. యెహోవా యోసేపునకు తోడైయుండెను గనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడగు ఆ ఐగుప్తీయుని యింట నుండెను. యెహోవా అతనికి తోడై యుండెననియు, అతడు చేసినదంతయు అతనిచేతిలో యెహోవా సఫలము చేసెననియు అతని యజమానుడు చూచినప్పుడు యోసేపుమీద అతనికి కటాక్షము కలిగెను గనుక అతని యొద్ద పరిచర్య చేయువాడాయెను. మరియు అతడు తన యింటిమీద విచారణకర్తగా అతని నియమించి తనకు కలిగినదంతయు అతనిచేతి కప్పగించెను. అతడు తన యింటిమీదను తనకు కలిగినదంతటిమీదను అతని విచారణ కర్తగా నియమించినకాలము మొదలుకొని యెహోవా యోసేపు నిమిత్తము ఆ ఐగుప్తీయుని యింటిని ఆశీర్వదించెను. యెహోవా ఆశీర్వాదము ఇంటిలోనేమి పొలములోనేమి అతనికి కలిగిన సమస్తముమీదను ఉండెను. అతడు తనకు కలిగినదంతయు యోసేపు చేతి కప్పగించి, తాను ఆహారము తినుట తప్ప తనకేమి ఉన్నదో ఏమి లేదో విచారించినవాడు కాడు. యోసేపు రూపవంతుడును సుందరుడునై యుండెను. అటుతరువాత అతని యజమానుని భార్య యోసేపుమీద కన్నువేసి–తనతో శయ నించుమని చెప్పెను అయితే అతడు ఒప్పక–నా యజమానుడు తనకు కలిగినదంతయు నా చేతికప్పగించెనుగదా, నా వశమున తన యింటిలో ఏమి ఉన్నదో అతడెరుగడు; ఈ యింటిలో నాకంటె పైవాడు ఎవడును లేడు. నీవు అతని భార్యవైనందున నిన్ను తప్ప మరి దేనిని నా కప్ప గింపక యుండలేదు. కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టు కొందునని తన యజమానుని భార్యతో అనెను. దిన దినము ఆమె యోసేపుతో మాటలాడుచుండెనుగాని అతడు ఆమెతో శయనించుటకైనను ఆమెతో నుండుట కైనను ఆమె మాట విన్నవాడుకాడు. అట్లుండగా ఒక నాడు అతడు తన పనిమీద ఇంటిలోపలికి వెళ్లినప్పుడు ఇంటి మనుష్యులలో ఎవరును అక్కడ లేరు. అప్పు డామె ఆతని వస్త్రము పట్టుకొని తనతో శయనింపుమని చెప్పగా అతడు తన వస్త్రమును ఆమె చేతిలో విడిచి పెట్టి తప్పించుకొని బయటికి పారిపోయెను.