యాకోబు 2:14-26

యాకోబు 2:14-26 TELUBSI

నా సహోదరులారా, క్రియలు లేనప్పుడు ఎవడైనను తనకు విశ్వాసము కలదని చెప్పినయెడల ఏమి ప్రయోజనము? అట్టి విశ్వాసమతని రక్షింపగలదా? సహోదరుడైనను సహోదరియైనను దిగంబరులై ఆ నాటికి భోజనము లేక యున్నప్పుడు. మీలో ఎవడైనను శరీరమునకు కావలసినవాటిని ఇయ్యక–సమాధానముగా వెళ్లుడి, చలి కాచుకొనుడి, తృప్తిపొందుడని చెప్పినయెడల ఏమి ప్రయోజనము? ఆలాగే విశ్వాసము క్రియలులేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమైనదగును. అయితే ఒకడు –నీకు విశ్వాసమున్నది, నాకు క్రియలున్నవి; క్రియలులేకుండ నీ విశ్వాసము నాకు కనుపరచుము, నేను నా క్రియలచేత నా విశ్వాసము నీకు కనుపరతునని చెప్పును. దేవుడొక్కడే అని నీవు నమ్ముచున్నావు. ఆలాగు నమ్ముట మంచిదే; దయ్యములును నమ్మి వణకుచున్నవి. వ్యర్థుడా, క్రియలులేని విశ్వాసము నిష్ఫలమైనదని తెలిసి కొనగోరుచున్నావా? మన పితరుడైన అబ్రాహాము తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠముమీద అర్పించి నప్పుడు అతడు క్రియలవలన నీతిమంతుడని తీర్పు పొంద లేదా? విశ్వాసము అతని క్రియలతోకూడి కార్యసిద్ధి కలుగజేసెననియు, క్రియలమూలముగా అతని విశ్వాసము పరిపూర్ణమైనదనియు గ్రహించుచున్నావుగదా? కాబట్టి –అబ్రాహాము దేవుని నమ్మెను అది అతనికి నీతిగా ఎంచబడెను అను లేఖనము నెరవేర్చబడెను. మరియు దేవుని స్నేహితు డని అతనికి పేరుకలిగెను. మనుష్యుడు విశ్వాసమూలమున మాత్రముకాక క్రియల మూలమునను నీతిమంతుడని యెంచబడునని, మీరు దీనివలన గ్రహించితిరి. అటువలెనే రాహాబను వేశ్య కూడ దూతలను చేర్చుకొని వేరొకమార్గమున వారిని వెలుపలికి పంపివేసినప్పుడు క్రియలమూలముగా నీతిమంతురాలని యెంచబడెను గదా? ప్రాణములేని శరీరమేలాగు మృతమో ఆలాగే క్రియలు లేని విశ్వాసమును మృతము.