న్యాయాధిపతులు 2:10-19

న్యాయాధిపతులు 2:10-19 TELUBSI

ఆ తరమువారందరు తమపితరులయొద్దకు చేర్చబడిరి. వారి తరువాత యెహోవానైనను ఆయన ఇశ్రాయేలీయుల కొరకు చేసిన కార్యములనైనను ఎరుగని తరమొకటి పుట్టగా ఇశ్రాయేలీయులు యెహోవా కన్నులయెదుట కీడుచేసి, ఐగుప్తుదేశములోనుండి వారిని రప్పించిన తమపితరుల దేవుడైన యెహోవాను విసర్జించి బయలుదేవతలను పూజించి తమ చుట్టునుండు జనుల దేవతలలో ఇతరదేవతలను అనుసరించి వాటికి నమస్కరించి యెహోవాకు కోపము పుట్టించిరి. వారు యెహోవాను విసర్జించి బయలును అష్తారోతును పూజించిరి. కాబట్టి యెహోవా కోపాగ్ని ఇశ్రాయేలీయులమీద మండెను; ఆయన దోచుకొనువారిచేతికి వారిని అప్పగించెను. వారు ఇశ్రాయేలీయులను దోచుకొనిరి; ఆయన వారి చుట్టునున్నవారి శత్రువులచేతికి వారిని అప్పగించెను గనుక వారు తమ శత్రువుల యెదుట నిలువలేకపోయిరి. యెహోవావారితో చెప్పినట్లు, యెహోవావారితో ప్రమాణము చేసినట్లు, వారు పోయిన ప్రతి స్థలమున వారికి బాధ కలుగజేయుటకు యెహోవావారికి శత్రువాయెను గనుక వారికి మిక్కిలి యిబ్బంది కలిగెను. ఆ కాలమున యెహోవావారికొరకు న్యాయాధిపతులను పుట్టించెను. వీరు దోచుకొనువారి చేతిలోనుండి ఇశ్రాయేలీయులను రక్షించిరి. అయితే వారు ఇంక న్యాయాధిపతుల మాట వినక తమపితరులు యెహోవా ఆజ్ఞలను అనుసరించి నడిచిన మార్గమునుండి త్వరగా తొలగి పోయి యితర దేవతలతో వ్యభిచరించి వాటికి నమస్క రించిరి; తమపితరులు ఆ ఆజ్ఞలను అనుసరించినట్లువారు నడవకపోయిరి. తమ శత్రువులు తమ్మును బాధింపగా వారు విడిచిన నిట్టూర్పులు యెహోవా విని సంతాపపడి వారికొరకు న్యాయాధిపతులను పుట్టించి, ఆయా న్యాయాధిపతులకు తోడైయుండి వారి దినములన్నిటను వారిశత్రువుల చేతులలోనుండి ఇశ్రాయేలీయులను రక్షించెను. ఒక్కొక్క న్యాయాధిపతి చనిపోగా వారు వెనుకకు తిరిగి యితర దేవతలను అనుసరించి పూజించుచు వాటికి సాగిలపడుచు ఉండుటవలన తమ క్రియలలోనేమి తమ మూర్ఖప్రవర్తనలోనేమి దేనిని విడువక తమ పూర్వికులకంటె మరి మిగుల చెడ్డవారైరి.