యోహాను 11:1-21

యోహాను 11:1-21 TELUBSI

మరియ, ఆమె సహోదరియైన మార్త, అనువారి . గ్రామమైన బేతనియలోనున్న లాజరు అను ఒకడు రోగియాయెను. ఈ లాజరు ప్రభువునకు అత్తరుపూసి తల వెండ్రుకలతో ఆయన పాదములు తుడిచిన మరియకు సహోదరుడు. అతని అక్కచెల్లెండ్రు – ప్రభువా, యిదిగో నీవు ప్రేమించువాడు రోగియై యున్నాడని ఆయనయొద్దకు వర్తమానము పంపిరి. యేసు అది విని–యీ వ్యాధి మరణముకొరకు వచ్చినదికాదు గాని దేవుని కుమారుడు దానివలన మహిమ పరచబడునట్లు దేవుని మహిమకొరకు వచ్చినదనెను. యేసు మార్తను ఆమె సహోదరిని లాజరును ప్రేమించెను. అతడు రోగియై యున్నాడని యేసు వినినప్పుడు తానున్నచోటనే యింక రెండు దినములు నిలిచెను. అటుపిమ్మట ఆయన–మనము యూదయకు తిరిగి వెళ్లుదమని తన శిష్యులతో చెప్పగా ఆయన శిష్యులు–బోధకుడా, యిప్పుడే యూదులు నిన్ను రాళ్లతో కొట్ట చూచుచుండిరే; అక్కడికి తిరిగి వెళ్లుదువా అని ఆయన నడిగిరి. అందుకు యేసు–పగలు పండ్రెండు గంటలున్నవి గదా, ఒకడు పగటివేళ నడిచినయెడల ఈ లోకపు వెలుగును చూచును గనుక తొట్రు పడడు. అయితే రాత్రివేళ ఒకడు నడిచినయెడల వానియందు వెలుగులేదు గనుక వాడు తొట్రుపడునని చెప్పెను. ఆయన యీ మాటలు చెప్పిన తరువాత–మన స్నేహితుడైన లాజరు నిద్రించుచున్నాడు; అతని మేలుకొలుప వెళ్లుచున్నానని వారితో చెప్పగా శిష్యులు– ప్రభువా, అతడు నిద్రించినయెడల బాగుపడుననిరి. యేసు అతని మరణమునుగూర్చి ఆ మాట చెప్పెను గాని వారు ఆయన నిద్ర విశ్రాంతిని గూర్చి చెప్పెననుకొనిరి. కావున యేసు–లాజరు చనిపోయెను, మీరు నమ్మునట్లు నేనక్కడ ఉండలేదని మీ నిమిత్తము సంతోషించుచున్నాను; అయినను అతనియొద్దకు మనము వెళ్లుదము రండని స్పష్టముగా వారితో చెప్పెను. అందుకు దిదుమ అనబడిన తోమా–ఆయనతోకూడ చనిపోవుటకు మనమును వెళ్లుదమని తనతోడి శిష్యులతో చెప్పెను. యేసు వచ్చి అదివరకే అతడు నాలుగు దినములు సమాధిలో ఉండెనని తెలిసికొనెను. బేతనియ యెరూషలేమునకు సమీపమై యుండెను; దానికి ఇంచుమించు కోసెడు దూరము గనుక యూదులలో అనేకులు వారి సహోదరునిగూర్చి మార్తను మరియను ఓదార్చుటకై వారి యొద్దకు వచ్చియుండిరి. మార్త యేసు వచ్చుచున్నాడని విని ఆయనను ఎదుర్కొన వెళ్లెనుగాని మరియ యింటిలో కూర్చుండి యుండెను. మార్త యేసుతో–ప్రభువా, నీవిక్కడ ఉండినయెడల నా సహోదరుడు చావకుండును.

Free Reading Plans and Devotionals related to యోహాను 11:1-21