ఆదివారమున తెల్లవారుచుండగా (ఆ స్ర్తీలు) తాము సిద్ధపరచిన సుగంధ ద్రవ్యములను తీసికొని సమాధి యొద్దకు వచ్చి సమాధిముందర ఉండిన రాయి దొరలింప బడియుండుట చూచి లోపలికి వెళ్లిరి గాని ప్రభువైన యేసు దేహము వారికి కనబడలేదు. ఇందునుగూర్చి వారికేమియు తోచకయుండగా, ప్రకాశమానమైన వస్త్రములు ధరించిన యిద్దరు మనుష్యులు వారియొద్ద నిలువబడిరి. వారు భయపడి ముఖములను నేల మోపి యుండగా వీరు–సజీవుడైన వానిని మీ రెందుకు మృతులలో వెదకుచున్నారు? ఆయన ఇక్కడలేడు, ఆయన లేచియున్నాడు; ఆయన ఇంక గలిలయలో ఉండి నప్పుడు –మనుష్యకుమారుడు పాపిష్టులైన మనుష్యుల చేతికి అప్పగింపబడి, సిలువవేయబడి, మూడవ దినమందు లేవవలసియున్నదని ఆయన మీతో చెప్పిన మాట జ్ఞాపకము చేసికొనుడని వారితో అనిరి. అప్పుడు వారాయన మాటలు జ్ఞాపకము చేసికొని సమాధి యొద్దనుండి తిరిగి వెళ్లి యీ సంగతులన్నియు పదునొకండుగురు శిష్యులకును తక్కినవారికందరికిని తెలియజేసిరి. ఈ సంగతులు అపొస్తలులతో చెప్పిన వారెవరనగా–మగ్దలేనే మరియయు యోహన్నయు యాకోబు తల్లియైన మరియయు వారితోకూడ ఉన్న యితర స్ర్తీలును. అయితే వారి మాటలు వీరి దృష్టికి వెఱ్ఱిమాటలుగా కనబడెను గనుక వీరు వారి మాటలు నమ్మలేదు. అయితే పేతురు లేచి, సమాధి యొద్దకు పరుగెత్తికొనిపోయి వంగిచూడగా, నారబట్టలు మాత్రము విడిగా కనబడెను. అతడు జరిగినదానిని గూర్చి ఆశ్చర్యపడుచు ఇంటికి వెళ్లెను. ఇదిగో ఆ దినమందే వారిలో ఇద్దరు యెరూషలేమునకు ఆమడదూరమున ఉన్న ఎమ్మాయు అను ఒక గ్రామమునకు వెళ్లుచు జరిగిన ఈ సంగతులన్నిటినిగూర్చి యొక రితో నొకరు సంభాషించుచుండిరి. వారు సంభాషించుచు ఆలోచించుకొనుచుండగా, యేసు తానే దగ్గరకువచ్చి వారితోకూడ నడిచెను; అయితే వారాయనను గుర్తు పట్టలేకుండ వారి కన్నులు మూయబడెను. ఆయన– మీరు నడుచుచు ఒకరితో ఒకరు చెప్పుకొనుచున్న యీ మాట లేమని అడుగగా వారు దుఃఖముఖులై నిలిచిరి. వారిలో క్లెయొపా అనువాడు–యెరూషలేములో బస చేయుచుండి, యీ దినములలో అక్కడ జరిగిన సంగతులు నీవొకడవే యెరుగవా? అని ఆయనను అడిగెను. ఆయన –అవి ఏవని వారిని అడిగినప్పుడు వారు–నజరేయుడైన యేసునుగూర్చిన సంగతులే; ఆయన దేవునియెదుటను ప్రజలందరియెదుటను క్రియలోను వాక్యములోను శక్తి గల ప్రవక్తయైయుండెను. మన ప్రధానయాజకులును అధికారులును ఆయనను ఏలాగు మరణశిక్షకు అప్పగించి, సిలువవేయించిరో నీకు తెలియదా? ఇశ్రాయేలును విమోచింపబోవువాడు ఈయనే అని మేము నిరీక్షించి యుంటిమి; ఇదిగాక యీ సంగతులు జరిగి నేటికి మూడుదినములాయెను. అయితే మాలో కొందరు స్ర్తీలు తెల్ల వారగానే సమాధియొద్దకు వెళ్లి, ఆయన దేహమును కానక వచ్చి –కొందరు దేవదూతలు తమకు కనబడి ఆయన బ్రదికియున్నాడని చెప్పిరని మాతో చెప్పి మాకు విస్మయము కలుగజేసిరి. మాతోకూడ ఉన్నవారిలో కొందరు సమాధియొద్దకు వెళ్లి ఆ స్ర్తీలు చెప్పినట్టు కనుగొనిరి గాని, ఆయనను చూడలేదని ఆయనతో చెప్పిరి. అందుకాయన–అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలనన్నిటిని నమ్మని మందమతులారా, క్రీస్తు ఈలాగు శ్రమపడి తన మహిమలో ప్రవేశించుట అగత్యము కాదా అని వారితో చెప్పి మోషేయు సమస్త ప్రవక్తలును మొదలుకొని లేఖనములన్నిటిలో తన్నుగూర్చిన వచనముల భావము వారికి తెలిపెను. ఇంతలో తాము వెళ్లుచున్న గ్రామము దగ్గరకు వచ్చినప్పుడు ఆయన యింక కొంతదూరము వెళ్లునట్లు అగపడగా వారు–సాయంకాలము కావచ్చినది, ప్రొద్దు గ్రుంకినది, మాతోకూడ ఉండుమని చెప్పి, ఆయనను బలవంతముచేసిరి గనుక ఆయన వారితోకూడ ఉండుటకు లోపలికి వెళ్లెను. ఆయన వారితోకూడ భోజనమునకు కూర్చున్నప్పుడు, ఒక రొట్టెను పట్టుకొని స్తోత్రము చేసి దాని విరిచి వారికి పంచి పెట్టగా వారి కన్నులు తెరవబడి ఆయనను గుర్తుపెట్టిరి; అంతట ఆయన వారికి అదృశ్యుడాయెను. అప్పుడు వారు–ఆయన త్రోవలో మనతో మాటలాడుచు లేఖనములను మనకు బోధపరచుచున్నప్పుడు మన హృదయము మనలో మండుచుండలేదా అని యొకనితో ఒకడు చెప్పుకొనిరి. ఆ గడియలోనే వారు లేచి, యెరూషలేమునకు తిరిగి వెళ్లగా, పదునొకొండుగురు శిష్యులును వారితోకూడ ఉన్నవారును కూడివచ్చి –ప్రభువు నిజముగా లేచి సీమోనునకు కనబడెనని చెప్పుకొనుచుండిరి. వారిది విని త్రోవలో జరిగిన సంగతులును, ఆయన రొట్టె విరుచుటవలన తమ కేలాగు తెలియబడెనో అదియు తెలియజేసిరి.
Read లూకా 24
వినండి లూకా 24
షేర్ చేయి
అన్ని అనువాదాలను సరిపోల్చండి: లూకా 24:1-35
వచనాలను సేవ్ చేయండి, ఆఫ్‌లైన్‌లో చదవండి, బోధన క్లిప్‌లను చూడండి ఇంకా మరెన్నో చేయండి!
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు