మత్తయి 17:1-9

మత్తయి 17:1-9 TELUBSI

ఆరు దినములైన తరువాత యేసు పేతురును యాకోబును అతని సహోదరుడైన యోహానును వెంట బెట్టుకొని యెత్తయిన యొక కొండమీదికి ఏకాంతముగా పోయి వారి యెదుట రూపాంతరము పొందెను. ఆయన ముఖము సూర్యునివలె ప్రకాశించెను; ఆయన వస్త్రములు వెలుగువలె తెల్లనివాయెను. ఇదిగో మోషేయు ఏలీయాయు వారికి కనబడి ఆయనతో మాటలాడుచుండిరి. అప్పుడు పేతురు – ప్రభువా, మన మిక్కడ ఉండుట మంచిది; నీకిష్టమైతే ఇక్కడ నీకు ఒకటియు మోషేకు ఒకటియు ఏలీయాకు ఒకటియు మూడు పర్ణశాలలు కట్టుదుమని యేసుతో చెప్పెను. అతడు ఇంకను మాటలాడుచుండగా ఇదిగో ప్రకాశమానమైన యొక మేఘము వారిని కమ్ముకొనెను; ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు, ఈయనయందు నేనానందించుచున్నాను, ఈయన మాట వినుడని యొక శబ్దము ఆ మేఘములోనుండి పుట్టెను. శిష్యులు ఈ మాట విని బోర్లబడి మిక్కిలి భయపడగా యేసు వారియొద్దకు వచ్చి వారిని ముట్టి లెండి, భయపడకుడని చెప్పెను. వారు కన్నులెత్తి చూడగా, యేసు తప్ప మరి ఎవరును వారికి కనబడలేదు. వారు కొండ దిగి వచ్చుచుండగా–మనుష్యకుమారుడు మృతులలోనుండి లేచువరకు ఈ దర్శనము మీరు ఎవరితోను చెప్పకుడని యేసు వారికాజ్ఞాపించెను.