మత్తయి 21:1-11

మత్తయి 21:1-11 TELUBSI

తరువాత యెరూషలేమునకు సమీపించి ఒలీవచెట్ల కొండదగ్గర ఉన్న బేత్పగేకు వచ్చినప్పుడు యేసు తన శిష్యులలో ఇద్దరిని చూచి మీ యెదుటనున్న గ్రామమునకు వెళ్లుడి; వెళ్లగానే కట్టబడియున్న యొక గాడిదయు దానితోనున్న యొక గాడిదపిల్లయు మీకు కనబడును. వాటిని విప్పి నాయొద్దకు తోలుకొని రండి; ఎవడైనను మీతో ఏమైనను అనినయెడల–అవి ప్రభువు నకు కావలసియున్నవని చెప్పవలెను, వెంటనే అతడు వాటిని తోలి పెట్టునని చెప్పి వారిని పంపెను. ప్రవక్తవలన చెప్పబడినది నెరవేరునట్లు ఇది జరిగెను, అదేమనగా –ఇదిగో నీ రాజు సాత్వికుడై, గాడిదను భారవాహక పశువుపిల్లైయెన చిన్న గాడిదను ఎక్కి నీయొద్దకు వచ్చుచున్నాడని సీయోను కుమారితో చెప్పుడి అనునది. శిష్యులు వెళ్లి యేసు తమకాజ్ఞాపించిన ప్రకారము చేసి ఆ గాడిదను దాని పిల్లను తోలుకొని వచ్చి వాటిమీద తమ బట్టలు వేయగా ఆయన బట్టలమీద కూర్చుండెను. జనసమూహములోను అనేకులు తమ బట్టలు దారిపొడుగునపరచిరి; కొందరు చెట్లకొమ్మలు నరికి దారిపొడుగునపరచిరి. జనసమూహములలో ఆయనకు ముందు వెళ్లుచుండినవారును వెనుక వచ్చుచుండినవారును –దావీదు కుమారునికి జయము ప్రభువు పేరట వచ్చువాడు స్తుతింపబడునుగాక సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయుచుండిరి. ఆయన యెరూషలేములోనికి వచ్చినప్పుడు పట్టణమంతయు–ఈయన ఎవరో అని కలవరపడెను. జనసమూహము–ఈయన గలిలయలోని నజరేతువాడగు ప్రవక్తయైన యేసు అని చెప్పిరి.