1 దిన 5

5
రూబేను వంశం
1ఇశ్రాయేలుకు పెద్దకొడుకైన రూబేను సంతానం గూర్చిన వివరాలు. ఇతడు పెద్ద కొడుకే గానీ అతని ప్రథమ సంతానపు జన్మహక్కును అతని నుండి తీసివేసి ఇశ్రాయేలుకు మరో కొడుకైన యోసేపు కొడుకులకు బదలాయించడం జరిగింది. ఎందుకంటే రూబేను తన తండ్రి మంచాన్ని అపవిత్రం చేశాడు. 2తన సోదరులందరికంటే యూదా ప్రముఖుడు. యూదా వంశంలోనుండే పరిపాలకుడు రానున్నాడు. అయినా ప్రథమ సంతానపు జన్మహక్కు యోసేపు పరమయింది. 3ఇశ్రాయేలుకు పెద్ద కొడుకుగా పుట్టిన రూబేను కొడుకులు ఎవరంటే హనోకు, పల్లూ, హెస్రోను, కర్మీ అనే వారు.
4యోవేలు వారసుల వివరాలిలా ఉన్నాయి.
యోవేలు కొడుకు షెమయా, షెమయా కొడుకు గోగు, గోగు కొడుకు షిమీ, 5షిమీ కొడుకు మీకా, మీకా కొడుకు రెవాయా, రెవాయా కొడుకు బయలు, 6బయలు కొడుకు బెయేర. ఇతడు రూబేనీయులకు నాయకుడు. అష్షూరు రాజు తిగ్లత్పిలేసెరు ఇతణ్ణి బందీగా చేసి తీసుకు వెళ్ళాడు.
7వాళ్ళ వంశావళి లెక్కల్లో ఉన్న తమ కుటుంబాల ప్రకారం అతని సోదరులెవరంటే ప్రధాని అయిన యెహీయేలూ, జెకర్యా, 8యోవేలు కొడుకైన షెమ మనుమడూ ఆజాజు కొడుకూ అయిన బెల అనే వాళ్ళు. వీళ్ళు అరోయేరు లోనూ, నెబో, బయల్మెయోనుల వరకూ నివాసం ఏర్పరచుకున్నారు.
9వాళ్ళ పశువులు గిలాదు దేశంలో అతి విస్తారమయ్యాయి. కాబట్టి వాళ్ళు తూర్పున యూఫ్రటీసు నది దగ్గరనుండి అరణ్యపు సరిహద్దుల వరకూ నివాసాలు ఏర్పరచుకున్నారు.
10సౌలు పరిపాలనా కాలంలో వాళ్ళు హగ్రీ జాతి వారితో యుద్ధం చేసి వాళ్ళను హతమార్చారు. గిలాదు తూర్పు వైపు వరకూ ఉన్న ప్రాంతమంతా నివాసమున్నారు.
గాదు వంశం
11వాళ్ళకెదురుగా ఉన్న బాషాను దేశంలో సలేకా వరకూ గాదు గోత్రం వాళ్ళు నివసించారు. 12వాళ్ళ నాయకులు యోవేలు, షాపాము అనేవాళ్ళు. వీళ్ళు తమ తమ కుటుంబాల నాయకులు. వీళ్ళ తరువాత షాపాతు, యహనై అనే వాళ్ళు కూడా ఉన్నారు. వీళ్ళు బాషానులో నివసించారు. 13వీళ్ళ తండ్రుల వైపు కుటుంబాల బంధువులు మొత్తం ఏడుగురున్నారు. వాళ్ళు మిఖాయేలు, మెషుల్లాము, షేబా, యోరై, యకాను, జీయా, ఏబెరు అనే వాళ్ళు.
14వీళ్ళు హూరీ అనే వాడికి పుట్టిన అబీహాయిలు కొడుకులు. ఈ హూరీ యరోయకీ, యారోయ గిలాదుకీ, గిలాదు మిఖాయేలుకీ, మిఖాయేలు యెషీషైకీ, యెషీషై యహదోకీ, యహదో బూజుకీ పుట్టారు.
15గూనీకి పుట్టిన అబ్దీయేలు కుమారుడు అహీ వాళ్ళ తండ్రుల కుటుంబాలకు నాయకుడు.
16వారు బాషానులోని గిలాదులోనూ, మిగిలిన ఊళ్లలోనూ, షారోను సరిహద్దుల వరకూ ఉన్న పచ్చని భూముల్లోనూ నివాసమున్నారు. 17యూదా రాజు యోతాము కాలంలోనూ ఇశ్రాయేలు రాజు యరొబాము కాలంలోనూ వీళ్ళను వాళ్ళ వంశావళి లెక్కల్లో నమోదు చేశారు.
18రూబేను గోత్రం, గాదు గోత్రం, మనష్షే అర్థ గోత్రం వాళ్ళల్లో బల్లెం, కత్తి పట్టగలిగిన వాళ్ళూ, బాణాలు వేయడంలో నేర్పరులూ, యుద్ధం చేయడానికి సన్నద్ధమైన వాళ్ళూ మొత్తం నలభై నాలుగు వేల ఏడు వందల అరవైమంది ఉన్నారు. 19వీళ్ళు హగ్రీ జాతి వాళ్ళ పైనా, యెతూరు వాళ్ళపైనా, నాపీషు వాళ్ళపైనా, నోదాబు వాళ్ళపైనా దాడులు చేసారు.
20యుద్ధంలో వాళ్ళకు దేవుడు సహాయం చేశాడు. ఈ విధంగా హగ్రీ జాతి వాళ్ళూ, వాళ్ళతో ఉన్న వాళ్ళంతా ఓడిపోయారు. యుద్ధంలో ఇశ్రాయేలీయులు దేవునికి విజ్ఞాపన చేశారు. వాళ్ళు తన పైన నమ్మకముంచారు గనక దేవుడు వాళ్ళ ప్రార్థనను అంగీకరించాడు. 21కాబట్టి ఇశ్రాయేలీయులు జయించడానికి దేవుడు సహాయం చేశాడు. వాళ్ళు యాభై వేల ఒంటెలనూ, రెండు లక్షల యాభై వేల గొర్రెలనూ, రెండు వేల గాడిదలనూ, లక్ష మంది మనుషులనూ స్వాధీనం చేసుకున్నారు. 22దేవుడు యుద్ధంలో వారికి సహాయం చేశాడు గనుక వాళ్ళు అనేక మందిని హతమార్చారు. తరువాత కాలంలో చెరలోకి వెళ్ళేంత వరకూ రూబేను గోత్రం, గాదు గోత్రం, మనష్షే అర్థగోత్రం వాళ్ళంతా హగ్రీ జాతి వాళ్ళ దేశంలోనే నివాసం ఉన్నారు.
మనష్షే అర్థగోత్రం
23మనష్షే అర్థగోత్రం వాళ్ళు ఆ బాషాను దేశంలో నివసించి అభివృద్ధి చెందారు. బాషాను నుండి బయల్హెర్మోను వరకూ ఇంకా హెర్మోను పర్వతం అయిన శెనీరు వరకూ వ్యాపించారు. 24వాళ్ళ కుటుంబాలకు నాయకులు ఎవరంటే ఏఫెరు, ఇషీ, ఎలీయేలు, అజ్రీయేలు, యిర్మీయా, హోదవ్యా, యహదీయేలు అనే వాళ్లు. వీళ్ళు ధైర్యవంతులు, బలవంతులు, ప్రసిద్ధులైన వాళ్ళు. తమ తమ కుటుంబాలకు నాయకులు.
25కానీ వాళ్ళు తమ పూర్వీకుల దేవునిపై తిరుగుబాటు చేశారు. దేవుడు తమ కళ్ళెదుట ఏ జాతులనైతే నాశనం చేశాడో ఆ జాతుల దేవుళ్ళను పూజించారు. 26కాబట్టి ఇశ్రాయేలీయుల దేవుడు అష్షూరు రాజు పూలు (అంటే అష్షూరు రాజు తిగ్లత్పిలేసెరు) ను రెచ్చగొట్టాడు. ఆ రాజు రూబేను గోత్రం, గాదు గోత్రం, మనష్షే అర్థగోత్రం వాళ్ళనందర్నీ బందీలుగా హాలహుకీ, హాబోరుకీ, హారాకుకీ, గోజాను నదీ ప్రాంతాలకీ పట్టుకుని పోయాడు. ఈ రోజుకీ వీళ్ళు అక్కడ కనిపిస్తున్నారు.

ప్రస్తుతం ఎంపిక చేయబడింది:

1 దిన 5: IRVTel

హైలైట్

షేర్ చేయి

కాపీ

None

మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి