1 సమూ 14
14
యోనాతాను ఫిలిష్తీయులను ఎదుర్కొవడం
1ఆ రోజున సౌలు కొడుకు యోనాతాను తన తండ్రితో ఏమీ చెప్పకుండా తన ఆయుధాలు మోసేవాణ్ణి పిలిచి “అటువైపు ఉన్న ఫిలిష్తీయుల సైన్యం కావలి వారిని చంపడానికి వెళ్దాం పద” అన్నాడు.
2సౌలు గిబియా అవతల మిగ్రోనులో దానిమ్మ చెట్టు కింద డేరా వేసుకున్నాడు. అతని దగ్గర సుమారు ఆరు వందలమంది మనుషులు ఉన్నారు. 3షిలోహులో యెహోవా యాజకుడైన ఏలీ కుమారుడు ఫీనెహాసుకు పుట్టిన ఈకాబోదు సహోదరుడు అహీటూబుకు పుట్టిన అహీయా ఏఫోదు ధరించుకుని అక్కడ ఉన్నాడు. యోనాతాను వెళ్లిన విషయం ఎవ్వరికీ తెలియదు.
4యోనాతాను ఫిలిష్తీయుల సైన్యానికి కావలి వారున్న స్థలానికి వెళ్ళాలనుకున్న దారికి రెండు ప్రక్కలా నిటారుగా ఉన్న కొండలు ఉన్నాయి. వాటిలో ఒకదాని పేరు బొస్సేసు, రెండవదాని పేరు సెనే. 5మిక్మషుకు ఉత్తరంగా ఒక కొండ శిఖరం, రెండవ శిఖరం గిబియాకు ఎదురుగా దక్షిణం వైపున ఉన్నాయి.
6యోనాతాను “ఈ సున్నతి లేనివారి శిబిరంపైకి వెళ్దాం పద. ఒకవేళ యెహోవా మన కార్యాన్ని సఫలం చేస్తాడేమో. అనేకమంది చేతనైనా, కొద్దిమంది చేతనైనా రక్షించడం యెహోవాకు అసాధ్యమా?” అని తన ఆయుధాలు మోసేవాడితో అన్నాడు. 7వాడు “నీ మనస్సుకు తోచింది చెయ్యి. వెళ్దాం పద, నీకు నచ్చినట్టు చేయడానికి నేను నీతోపాటే ఉంటాను” అన్నాడు.
8అప్పుడు యోనాతాను “మనం వారి దగ్గరికి వెళ్ళి వారు మనలను చూసేలా చేద్దాం. 9వారు మనలను చూసి, ‘మేము మీ దగ్గరికి వచ్చేవరకూ అక్కడే నిలిచి ఉండండి’ అని చెప్పినట్టైతే వాళ్ళ దగ్గరికి వెళ్ళకుండా మనం ఉన్న చోటే ఉండిపోదాం. 10‘మా దగ్గరకి రండి’ అని వాళ్ళు పిలిస్తే దానివల్ల యెహోవా వారిని మన చేతికి అప్పగించాడని అర్థం చేసుకుని మనం వెళ్దాం” అని చెప్పాడు.
11వారిద్దరూ తమను తాము ఫిలిష్తీయుల సైన్యం కావలి వారికి కనపరచుకున్నారు. అప్పుడు ఫిలిష్తీయులు “చూడండి, దాక్కున్న గుహల్లో నుండి హెబ్రీయులు బయలుదేరి వస్తున్నారు” అని చెప్పుకొంటూ, 12యోనాతానును, అతని ఆయుధాలు మోసేవాడిని పిలిచి “మేము మీకు ఒకటి చూపిస్తాం రండి” అన్నారు. యోనాతాను “నా వెనకే రా, యెహోవా ఇశ్రాయేలీయుల చేతికి వారిని అప్పగించాడు” అని తన ఆయుధాలు మోసేవాడితో చెప్పి 13అతడూ, అతని వెనుక అతని ఆయుధాలు మోసేవాడూ తమ చేతులతో, కాళ్లతో పాకి పైకి ఎక్కారు. ఫిలిష్తీయులు యోనాతాను దెబ్బకు పడిపోగానే అతని వెనకాలే అతని ఆయుధాలు మోసేవాడు వారిని చంపివేశాడు.
14యోనాతాను, అతని ఆయుధాలు మోసేవాడు చేసిన ఆ మొదటి సంహారంలో దాదాపు ఇరవై మంది చనిపోయారు. ఒక రోజులో ఒక కాడి యెడ్లు దున్నగలిగే అర ఎకరం నేల విస్తీర్ణంలో ఇది జరిగింది.
ఫిలిష్తీయుల మీద విజయం
15ఆ సమూహంలో, పొలంలో ఉన్నవారందరిలో తీవ్రమైన ఆందోళన ఏర్పడింది. సైన్యానికి కావలివారు, దోచుకొనేవారూ భయపడ్డారు, నేల కంపించింది. ఇదంతా దేవుడు జరిగించిన పని అని వారు అనుకున్నారు.
16బెన్యామీనీయుల ప్రాంతమైన గిబియాలో ఉన్న సైనికులు చెదిరిపోయి పూర్తిగా ఓడిపోవడం సౌలు గూఢచారులు చూసి ఆ సమాచారం సౌలుకు తెలిపారు. 17సౌలు “మన దగ్గర లేనివాళ్ళెవరో తెలుసుకోడానికి అందరినీ లెక్కపెట్టండి” అని చెప్పాడు. వారు చూసి యోనాతాను, అతని ఆయుధాలు మోసేవాడు అక్కడ లేరని కనుగొన్నారు.
18ఆ సమయంలో దేవుని మందసం ఇశ్రాయేలీయుల దగ్గరే ఉంది. “దేవుని మందసాన్ని ఇక్కడికి తీసుకురండి” అని సౌలు అహీయాకు ఆజ్ఞాపించాడు. 19సౌలు యాజకునితో మాట్లాడుతుండగా, ఫిలిష్తీయుల శిబిరంలో అలజడి ఎక్కువ కాసాగింది. అప్పుడు సౌలు యాజకునితో “నీ చెయ్యి వెనక్కి తీసుకో” అని చెప్పి 20అతడూ, అతనితో ఉన్నవారంతా కలిసి యుద్ధానికి బయలుదేరారు. వారిని చూసి ఫిలిష్తీయులు తికమకపడి ఒకరినొకరు చంపుకున్నారు.
21అంతకు ముందు ఫిలిష్తీయుల ఆధీనంలో చుట్టుపక్కల శిబిరాల్లో ఉన్న హెబ్రీయులు ఇశ్రాయేలీయులను కలుసుకోడానికి ఫిలిష్తీయులను విడిచిపెట్టి సౌలు దగ్గరకి, యోనాతాను దగ్గరకి వచ్చారు. 22అంతేకాక, ఫిలిష్తీయ సైన్యం పారిపోతున్నదని విని వారిని తరమడానికి ఎఫ్రాయిం కొండ ప్రాంతంలో దాక్కొన్న ఇశ్రాయేలీయులు యుద్ధంలో చేరారు.
23ఆ రోజున ఇశ్రాయేలీయులను యెహోవా ఈ విధంగా కాపాడాడు. యుద్ధం బేతావెను అవతల వరకూ సాగింది. ఇశ్రాయేలీయులు బాగా అలసిపోయారు.
యోనాతాను తేనె తాగటం
24“నేను నా శత్రువులపై పగ సాధించే వరకూ, సాయంత్రమయ్యే దాకా భోజనం చేసేవాడు శాపానికి గురి అవుతారు” అని సౌలు ప్రజల చేత ఒట్టు పెట్టించాడు. అందుకని ప్రజలు ఏమీ తినకుండా ఉన్నారు. 25సైన్యం మొత్తం అడవిలోకి వచ్చినప్పుడు ఒకచోట నేలమీద తేనె కనబడింది. 26వారు ఆ అడవిలోకి వెళ్తున్నప్పుడు తేనె ధారగా కారుతూ ఉంది. తాము చేసిన ప్రమాణానికి లోబడి ఎవ్వరూ ఆ తేనె ముట్టుకోలేదు.
27అయితే యోనాతానుకు తన తండ్రి ప్రజలచేత చేయించిన ప్రమాణం గురించి తెలియదు. అతడు తన చేతికర్ర చాచి దాని అంచును తేనెపట్టులో ముంచి దాన్ని నోటిలో పెట్టుకోగానే అతని కళ్ళకు వెలుగు#14:27 కళ్ళకు వెలుగు శక్తి వచ్చింది. 28అక్కడి వారిలో ఒకడు “నీ తండ్రి ప్రజలచేత ఒట్టు పెట్టించి ‘ఈ రోజున ఆహారం తీసుకొనేవాడు కచ్చితంగా శాపానికి గురవుతాడు’ అని ఆజ్ఞాపించాడు. అందుకే ప్రజలు బాగా అలసిపోయారు” అని చెప్పాడు.
29అందుకు యోనాతాను “నా తండ్రి మనుషులను కష్టపెట్టిన వాడయ్యాడు. నేను ఈ తేనె కొంచెం తినగానే నా కళ్ళు ఎంతగా వెలిగిపోయాయో చూడు. 30మన మనుషులు శత్రువుల దగ్గర దోచుకున్నది బాగా తిని ఉంటే వారు ఇంకా ఎక్కువగా సంహరించేవాళ్ళు గదా” అన్నాడు.
31ఆ రోజు ఇశ్రాయేలు వారు ఫిలిష్తీయులను మిక్మషు నుండి అయ్యాలోను వరకూ తరిమి హతం చేసినందువల్ల బాగా అలసిపోయారు. 32వారు దోపిడీ సొమ్ము మీద ఎగబడి, గొర్రెలను, ఎద్డులను, దూడలను నేలమీద పడవేసి వాటిని వధించి రక్తంతోనే తిన్నారు.
33“ప్రజలు రక్తంతోనే తిని యెహోవాకు వ్యతిరేకంగా పాపం చేస్తున్నారు” అని కొందరు సౌలుకు చెప్పినప్పుడు అతడు “మీరు దేవునికి విశ్వాస ఘాతకులయ్యారు. ఒక పెద్ద రాయి నా దగ్గరకి దొర్లించి తీసుకురండి” అని చెప్పి, 34“అందరూ తమ తమ ఎద్దులను, గొర్రెలను నా దగ్గరికి తీసుకు వచ్చి ఇక్కడే వధించి వాటిని తినాలి. రక్తంతో కలసిన మాసం తిని యెహోవా దృష్టిలో పాపం చేయవద్దు” అని వారితో చెప్పడానికి అతడు కొంతమందిని పంపించాడు. ప్రజలంతా ఆ రాత్రి తమ తమ ఎద్దులను తెచ్చి అక్కడ వధించారు.
35అక్కడ సౌలు యెహోవాకు ఒక బలిపీఠం కట్టించాడు. అతడు యెహోవాకు కట్టించిన మొదటి బలిపీఠం అదే.
36సౌలు “మనం ఈ రాత్రి ఫిలిష్తీయులను తరుముతూ తెల్లవారేదాకా దోచుకుని వాళ్ళలో ఒక్కడు కూడా లేకుండా చేద్దాం రండి” అని ఆజ్ఞ ఇచ్చినప్పుడు వారంతా “నీకు ఏది మంచిదని అనిపిస్తే దాన్ని చెయ్యి” అని అన్నారు. అప్పుడు సౌలు “యాజకుడు ఇక్కడే ఉన్నాడు, అతని ద్వారా దేవుని దగ్గర విచారణ చేద్దాం రండి” అని చెప్పాడు. 37సౌలు “నేను ఫిలిష్తీయులను వెంబడిస్తే వారిని నీవు ఇశ్రాయేలీయుల చేతికి అప్పగిస్తావా” అని దేవుని దగ్గర విచారణ చేసినప్పుడు ఆ రోజున ఆయన అతనికి ఎలాంటి జవాబు ఇయ్యలేదు.
38అందుకు సౌలు “ప్రజల పెద్దలు నా దగ్గరకి వచ్చి ఈ రోజు ఎవరి ద్వారా తప్పిదం జరిగిందో దాన్ని కనుక్కోవాలి. 39అది నా కొడుకు యోనాతాను వల్ల జరిగినా సరే, వాడు తప్పకుండా చనిపోతాడని ఇశ్రాయేలీయులను కాపాడే యెహోవా తోడని నేను ఒట్టు పెడుతున్నాను” అని చెప్పాడు. అయితే అక్కడ ఉన్నవారిలో ఎవ్వరూ సమాధానం చెప్పలేదు.
40“మీరంతా ఒక పక్కన ఉండండి, నేనూ, నా కొడుకు యోనాతానూ మరో పక్కన నిలబడతాం” అని సౌలు చెప్పినప్పుడు, వారంతా “నీ మనసుకు ఏది మంచిదనిపిస్తే అది చెయ్యి” అన్నారు. 41అప్పుడు సౌలు “ఇశ్రాయేలీయుల దేవుడవైన యెహోవా, తప్పు చేసినది ఎవరో చూపించు” అని ప్రార్థించినపుడు సౌలు, యోనాతానుల పేరున చీటీ పడింది. ప్రజలు తప్పించుకున్నారు.
42“నాకూ నా కొడుకు యోనాతానుకూ మధ్య చీటీ వేయండి” అని సౌలు ఆజ్ఞ ఇచ్చినప్పుడు చీటీ యోనాతాను పేరున పడింది.
43“నువ్వు చేసిన పని ఏమిటో నాకు తెలియజేయి” అని యోనాతానును అడిగినప్పుడు, యోనాతాను “నా చేతికర్ర అంచుతో కొంచెం తేనె తీసుకుని తిన్న విషయం నిజమే, కొంచెం తేనె కోసం నేను చనిపోవలసి వచ్చింది” అని సౌలుతో అన్నాడు. 44అప్పుడు సౌలు “యోనాతానూ, నీవు తప్పకుండా చనిపోవాలి. అందుకు నేను ఒప్పుకోకపోతే దేవుడు నాకు గొప్ప కీడు కలిగిస్తాడు” అన్నాడు.
45అయితే ప్రజలు సౌలుతో “మనకు ఇంత గొప్ప విజయం కలిగేలా చేసిన యోనాతాను చనిపోవాలా? అది ఎన్నటికీ జరగకూడదు. దేవుని సహాయంతోనే ఈ రోజు యోనాతాను మనకు జయం లభించేలా చేశాడు. యెహోవా దేవునిపై ఒట్టు. అతని తలవెండ్రుకల్లో ఒక్కటైనా కింద పడకూడదు” అని చెప్పి యోనాతాను మరణించకుండా అతణ్ణి కాపాడారు. 46తరువాత సౌలు ఫిలిష్తీయులను తరమడం మానివేసి తిరిగి వెళ్లిపోయాడు, ఫిలిష్తీయులు తమ స్వదేశానికి వెళ్ళిపోయారు.
47ఈ విధంగా సౌలు ఇశ్రాయేలీయులను పాలించడానికి అధికారం పొంది, నలు దిక్కులా ఉన్న శత్రువులైన మోయాబీయులతో, అమ్మోనీయులతో, ఎదోమీయులతో, సోబా దేశపు రాజులతో, ఫిలిష్తీయులతో యుద్ధాలు జరిగించాడు. అతడు ఎవరి మీదకు దండెత్తినా వారందరి పైనా గెలుపు సాధించాడు. 48అతడు తన సైన్యంతో అమాలేకీయులను హతమార్చి వారు దోచుకుపోయిన ఇశ్రాయేలీయులను వారి చేతిలో నుండి విడిపించాడు.
సౌలు కుటుంబం
49సౌలు కుమారుల పేర్లు యోనాతాను, ఇష్వీ, మెల్కీషూవ. అతని ఇద్దరు కుమార్తెల్లో పెద్దమ్మాయి పేరు మేరబు, రెండవది మీకాలు. 50సౌలు భార్య అహీనోయము. ఈమె అహిమయస్సు కుమార్తె. అతని సైన్యాధిపతి అబ్నేరు, ఇతడు సౌలు చిన్నాన్న నేరు కొడుకు. 51సౌలు తండ్రి కీషు, అబ్నేరు తండ్రి నేరు, ఇద్దరూ అబీయేలు కుమారులు.
52సౌలు జీవించిన కాలమంతా ఫిలిష్తీయులతో యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి. సౌలు తనకు తారసపడ్డ బలాఢ్యులను, వీరులను చేరదీసి తన సైన్యంలో చేర్చుకున్నాడు.
ప్రస్తుతం ఎంపిక చేయబడింది:
1 సమూ 14: IRVTel
హైలైట్
షేర్ చేయి
కాపీ
మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి
TEL-IRV
Creative Commons License
Indian Revised Version (IRV) - Telugu (ఇండియన్ రేవిజ్డ్ వెర్షన్ - తెలుగు), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.