1 సమూ 25
25
దావీదు, నాబాలు, అబీగయీలు
1సమూయేలు చనిపోయాడు. ఇశ్రాయేలీయులంతా సమావేశమై అతని కోసం ఏడ్చారు. రమాలో ఉన్న అతని సొంత ఇంట్లో సమాధి చేశారు. తరువాత దావీదు లేచి పారాను అరణ్య ప్రాంతానికి వెళ్లిపోయాడు.
2మాయోను గ్రామంలో ఒకడున్నాడు. అతని ఆస్తిపాస్తులన్నీ కర్మెలులో ఉన్నాయి. అతడు చాలా ధనవంతుడు, అతనికి మూడువేల గొర్రెలు, వెయ్యి మేకలు ఉన్నాయి. అతడు కర్మెలులో తన గొర్రెల బొచ్చు కత్తిరించడానికి వెళ్ళాడు. 3అతని పేరు నాబాలు, అతని భార్య పేరు అబీగయీలు. ఈమె జ్ఞానం గలదీ, అందగత్తే. అయితే అతడు మాత్రం మొరటు వాడు, తన వ్యవహారాలన్నిటిలో దుర్మార్గుడు. అతడు కాలేబు సంతతివాడు.
4నాబాలు గొర్రెలబొచ్చు కత్తిరిస్తున్నాడని ఎడారిలో ఉన్న దావీదు విన్నాడు. 5తన దగ్గరున్న వారిలో పదిమంది యువకులను పిలిచి వారితో ఇలా అన్నాడు. “మీరు కర్మెలుకు నాబాలు దగ్గరికి పోయి, నా పేరు చెప్పి కుశల ప్రశ్నలడిగి 6ఆ ధనికునితో ఇలా అనండి. మీరు వర్ధిల్లుతారు గాక. మీకూ మీ ఇంటికీ మీ ఆస్తిపాస్తులకూ క్షేమం ఉండాలి.
7మీతో గొర్రెబొచ్చు కత్తిరించే వారున్నారని నాకు తెలిసింది. మీ గొర్రెల కాపరులు మా దగ్గరున్నప్పుడు మేము వారికి ఏ కీడూ తలపెట్టలేదు. వారు కర్మెలు ప్రాంతంలో ఉన్నంతకాలం వారేదీ పోగొట్టుకోలేదు. 8మీ పనివారిని అడగండి, వారే చెబుతారు. కాబట్టి నేను పంపిన కుర్రాళ్ళకు దయ చూపండి. మేము పండగ పూట వచ్చాం గదా. మీ మనసుకు తోచింది మీ దాసులకు, మీ కుమారుడు దావీదుకు ఇచ్చి పంపండి.”
9దావీదు పంపిన యువకులు వచ్చి అతని పేరు చెప్పి ఆ మాటలన్నిటినీ నాబాలుకు తెలియజేసి కూర్చున్నారు. 10దావీదు సేవకులతో నాబాలు “దావీదు ఎవడు? యెష్షయి కొడుకెవడు? ఈ రోజుల్లో తమ యజమానులను విడిచి పారిపోయిన దాసులు చాలా మంది ఉన్నారు. 11నా అన్నపానాలను, నా గొర్రెల బొచ్చు కత్తిరించే వారికోసం సిద్ధపరచిన నా మాంసాన్ని, ఎక్కడి నుంచి వచ్చాడో తెలియని వాడికి ఇవ్వాలా?” అన్నాడు.
12దావీదు కుర్రాళ్ళు తిరుగు ముఖం పట్టి, వచ్చి ఈ మాటలన్నీ అతనికి చెప్పారు. 13అప్పుడు దావీదు వారితో “మీరంతా నడుముకు కత్తులు ధరించుకోండి” అని చెప్పాడు. వారు కత్తులు ధరించుకున్నారు. దావీదు కూడా ఒక కత్తి ధరించాడు. దావీదుతో పాటు దాదాపు 400 మంది బయలుదేరారు. 200 మంది సామాను దగ్గర ఉన్నారు.
14పనివాడొకడు నాబాలు భార్య అబీగయీలుతో “అమ్మా, మన అయ్యగారిని కుశల ప్రశ్నలు అడగడానికి దావీదు అరణ్యంలో నుండి మనుషులను పంపాడు. ఆయన వారితో కఠినంగా మాట్లాడాడు. 15అయితే ఆ మనుష్యులు మాకెంతో ఉపకారం చేసిన వాళ్ళు. మేము గడ్డి మైదానాల్లో వారి మధ్య ఉన్నంత కాలమూ ప్రమాదం గానీ నష్టం గాని మాకు కలగలేదు.
16మేము గొర్రెలను కాచుకొంటూ ఉన్నంత కాలం వారు పగలూ రాత్రీ మా చుట్టూ ప్రాకారం లాగా ఉండేవారు. 17అయితే ఇప్పుడు మా యజమానికీ అతని ఇంటివారందరికీ వాళ్ళు కీడు తలపెట్టారు. కాబట్టి ఇప్పుడు నువ్వు ఏమి చెయ్యాలో జాగ్రత్తగా ఆలోచించు. మన అయ్యగారు పనికిమాలిన దుష్టుడు, ఎవరి మాటా వినడు.”
18అప్పుడు అబీగయీలు నాబాలుతో ఏమీ చెప్పకుండా గబగబా 200 రొట్టెలు, రెండు ద్రాక్షారసం తిత్తులు, వండిన ఐదు గొర్రెల మాంసం, ఐదు మానికల వేయించిన ధాన్యం, 100 ఎండు ద్రాక్షగెలలు, 200 అంజూరు పండ్ల ముద్దలు గాడిదలకెక్కించి 19తన పనివాళ్ళతో “మీరు నాకంటే ముందుగా వెళ్ళండి., నేను మీ వెనుక వస్తాను” అని చెప్పింది.
20ఆమె గాడిద ఎక్కి కొండ లోయలోబడి వస్తుంటే దావీదు, అతని మనుషులు ఆమెకు ఎదురుపడ్డారు. ఆమె వారిని కలుసుకుంది.
21అంతకుముందు దావీదు “నాబాలు ఆస్తిపాస్తులన్నింటిలో ఏదీ పోకుండా ఈ అడివి ప్రాంతంలో అతని ఆస్తి అంతటికీ నేను అనవసరంగా కాపలా కాశాను. అతడు మాత్రం ఉపకారానికి ప్రతిగా నాకు అపకారం చేశాడు గదా” 22అనుకుని “అతనికి చెందిన వారిలో ఒక మగపిల్లవాడి నైనా తెల్లవారే సరికి ఉండయ్యను. లేదా దేవుడు మరి గొప్ప అపాయం దావీదు శత్రువులకు కలుగజేయుగాక” అని శపథం చేశాడు.
23అబీగయీలు దావీదును చూసి, గాడిద మీదనుంచి త్వరగా దిగి దావీదుకు సాష్టాంగ నమస్కారం చేసి అతని పాదాలపై బడి ఇలా అంది. 24“ప్రభూ, ఈ అపరాధం నాదిగా ఎంచు. నీ దాసినైన నన్ను మాటలాడనియ్యి, నీ దాసినైన నేను చెప్పేమాటలు ఆలకించు.
25అయ్యా, దుష్టుడైన ఈ నాబాలును పట్టించుకోవద్దు. అతడు అతని పేరుకు తగిన వాడే. అతనిపేరు నాబాలు కదా, మోటుతనం అతని లక్షణం. నా ప్రభువైన మీరు పంపించిన కుర్రాళ్ళు నీ దాసినైన నాకు కనబడలేదు. 26నా ప్రభూ, యెహోవా జీవం తోడు, నీ జీవం తోడు, రక్తపాతం జరిగించకుండా, నీవే స్వయంగా పగ తీర్చుకోకుండా యెహోవా నిన్ను ఆపాడు. నీ శత్రువులు, నా యేలినవాడవైన నీకు కీడు చేయనుద్దేశించే వారందరికీ నాబాలుకు పట్టే గతే పట్టాలి అని యెహోవా జీవం తోడు, నీ జీవం తోడు అని ప్రమాణం చేస్తున్నాను.”
27“ఇప్పుడు నేను నా యేలినవాడవైన నీకోసం నీ దాసి తెచ్చిన ఈ కానుకను నా యేలినవాడవైన నిన్ను ఆశ్రయించి ఉన్న పనివారికి ఇప్పించు. 28నీ దాసినైన నా తప్పు క్షమించు. నా యేలినవాడవైన నీవు, యెహోవా యుద్ధాలు చేస్తున్నావు గనక నా యేలినవాడవైన నీకు ఆయన శాశ్వతమైన రాజ వంశాన్ని ఇస్తాడు. నీ జీవిత కాలమంతటా నీకు అపాయం కలుగదు.
29నిన్ను హింసించడానికైనా, నీ ప్రాణం తీయడానికైనా ఎవడైనా పూనుకుంటే, నా యేలినవాడవైన నీ ప్రాణాన్ని నీ దేవుడైన యెహోవా తన దగ్గరున్న జీవపుమూటలో భద్రపరుస్తాడు. ఒకడు వడిసెలతో రాయి విసరినట్టు ఆయన నీ శత్రువుల ప్రాణాలు విసిరేస్తాడు. 30యెహోవా నా యేలినవాడవైన నిన్ను గురించిసెలవిచ్చిన మేలంతటినీ నీకు చేసి నిన్ను ఇశ్రాయేలీయుల మీద అధిపతిగా నియమిస్తాడు. ఆ తరువాత 31నీవు అకారణంగా రక్తం చిందించినందుకూ పగ తీర్చుకొన్నందుకూ మనోవేదన, పరితాపం నా యేలినవాడవైన నీకు ఎంతమాత్రం కలగకూడదు. యెహోవా నా యేలినవాడవైన నీకు మేలు చేసిన తరువాత నీవు నీ దాసినైన నన్ను జ్ఞాపకం చేసుకో” అంది.
32అందుకు దావీదు అబీగయీలుతో “నాకు ఎదురు రావడానికి నిన్ను పంపిన ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాకు స్తుతి. 33నేను పగ తీర్చుకోకుండా ఈ రోజున రక్తపాతం చేయకుండా నన్ను వివేకంతో ఆపినందుకు నీకు ఆశీర్వాదం కలుగు గాక. 34ఒకవేళ ఈ రోజు నీవు త్వరగా నన్ను ఎదుర్కొనక పోయినట్టయితే, నీకు హాని చేయకుండా నన్ను ఆటంకపరచిన ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా జీవం పైన ఆన బెట్టి చెబుతున్నాను, తెల్లవారేలోగా నాబాలుకు మగవాడొకడు కూడా మిగిలేవాడు కాదు” అని చెప్పాడు. 35ఆమె తెచ్చిన వాటిని ఆమె చేత తీసుకు “నీ మాటలు నేను విన్నాను, నీ విన్నపం అంగీకరించాను. నిశ్చింతగా నీ ఇంటికి వెళ్ళు” అని ఆమెతో చెప్పాడు.
36అబీగయీలు తిరిగి నాబాలు దగ్గరికి వచ్చినప్పుడు, రాజుల్లాగా అతడు ఇంట్లో విందు చేసి, తప్ప తాగుతూ కులుకుతూ మత్తుగా ఉన్నాడు. అందుకని తెల్లవారే వరకూ ఆమె అతనితో ఏమాటా చెప్పలేదు. 37ఉదయాన నాబాలు మత్తు దిగిన తరువాత అతని భార్య అతనితో ఆ విషయం చెప్పగానే భయంతో అతని గుండె పగిలింది. అతడు రాయి లాగా బిగుసుకు పోయాడు. 38పది రోజుల తరువాత యెహోవా నాబాలును దెబ్బ తీయగా అతడు చనిపోయాడు.
39నాబాలు చనిపోయాడని దావీదు విని “నాబాలు చేసిన కీడును యెహోవా అతని తలమీదికే రప్పించాడు. ఆయన సేవకుడినైన నేను కీడు చేయకుండా నన్ను కాపాడి, నాబాలు వలన నేను పొందిన అవమానం తీర్చిన యెహోవాకు స్తుతి కలుగు గాక” అన్నాడు. తరవాత దావీదు అబీగయీలును తాను పెళ్లి చేసుకోవాలని ఆమెతో మాటలాడడానికి తన వారిని పంపాడు. 40దావీదు సేవకులు కర్మెలులో అబీగయీలు దగ్గరికి వచ్చి “దావీదు నిన్ను పెళ్లి చేసుకోడానికి తీసుకు రమ్మని మమ్మల్ని పంపించాడు” అని చెప్పారు.
41ఆమె లేచి సాగిలపడి “నా స్వామి ఇష్టం. నా యేలినవాని సేవకుల కాళ్లు కడగడానికైనా నా యేలినవాని దాసీనైన నేను సిద్దం” అని చెప్పింది. 42ఆమె త్వరగా లేచి గాడిదనెక్కి ఐదుగురు పనికత్తెలు వెంట రాగా దావీదు పంపిన దూతలవెంట వెళ్ళింది. దావీదు ఆమెను పెళ్లి చేసుకున్నాడు.
43దావీదు యెజ్రెయేలు వాసి అహీనోయమును కూడా పెళ్లి చేసుకున్నాడు. వారిద్దరూ అతనికి భార్యలయ్యారు. 44సౌలు కూతురు మీకాలు దావీదు భార్య. సౌలు ఆమెను గల్లీము ఊరివాడైన లాయీషు కొడుకు పల్తీయేలుకు ఇచ్చాడు.
ప్రస్తుతం ఎంపిక చేయబడింది:
1 సమూ 25: IRVTel
హైలైట్
షేర్ చేయి
కాపీ
మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి
TEL-IRV
Creative Commons License
Indian Revised Version (IRV) - Telugu (ఇండియన్ రేవిజ్డ్ వెర్షన్ - తెలుగు), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.