28
1ఆ రోజుల్లో ఫిలిష్తీయులు ఇశ్రాయేలీయులతో యుద్ధం చేయాలని సైన్యాలను సమకూర్చుకుని యుద్ధానికి సిద్ధమయ్యారు. ఆకీషు దావీదును పిలిచి “నువ్వు, నీ మనుషులు నాతో కలసి యుద్ధానికి బయలుదేరాలని జ్ఞాపకం ఉంచుకో” అన్నాడు. 2దావీదు “నీ దాసుడనైన నేను నీకు చేయబోయే సహాయం ఏమిటో అది నువ్వు ఇప్పుడు తెలుసుకుంటావు” అన్నాడు. ఆకీషు “ఆలాగైతే నిన్ను ఎప్పటికీ నా సొంత సంరక్షకుడుగా నియమించుకుంటాను” అన్నాడు.
ఏన్దోరులోని స్త్రీ దగ్గర సౌలు
3సమూయేలు చనిపోయినపుడు ఇశ్రాయేలు ప్రజలంతా అతని కోసం ఏడ్చి, అతని సొంత పట్టణమైన రమాలో అతణ్ణి పాతిపెట్టారు. సౌలు, చచ్చినవాళ్ళతో, ఆత్మలతో మాట్లాడేవారిని తన దేశం నుండి వెళ్లగొట్టాడు. 4ఫిలిష్తీయులు దండెత్తి వచ్చి షూనేములో శిబిరం వేసుకున్నప్పుడు, సౌలు ఇశ్రాయేలీయులందరినీ సమకూర్చాడు. వారు గిల్బోవ లోయలో మకాం వేసారు.
5సౌలు ఫిలిష్తీయుల సైన్యాన్ని చూసినపుడు మనస్సులో విపరీతమైన భయం పెంచుకుని 6యెహోవా దగ్గర విచారణ చేసాడు. యెహోవా కల ద్వారా గానీ, ఊరీం ద్వారా గానీ, ప్రవక్తల ద్వారా గానీ ఏమీ జవాబివ్వలేదు. 7అప్పుడు సౌలు “నా కోసం మీరు మృతులతో మాట్లాడే ఒక స్త్రీని వెదకండి. నేను వెళ్ళి ఆమె ద్వారా విచారణ చేస్తాను” అని తన సేవకులకు ఆజ్ఞ ఇస్తే, వారు “అలాగే, ఏన్దోరులో మృతులతో మాట్లాడే ఒక స్త్రీ ఉంది” అని అతనితో చెప్పారు.
8సౌలు మారువేషం వేసుకుని వేరే దుస్తులు ధరించి ఇద్దరు సహాయకులను వెంట తీసుకుని వెళ్ళి, రాత్రి సమయంలో ఆ స్త్రీతో “మృతులతో మాట్లాడి నాకు శకునం చెప్పి, నాతో మాట్లాడడానికి నేను నీతో చెప్పే వ్యక్తిని రప్పించు” అని కోరాడు. 9ఆ స్త్రీ, అలాగే “సౌలు ఏం చేయించాడో నీకు తెలియదా? అతడు చచ్చినవాళ్ళతో, ఆత్మలతో మాట్లాడే వారిని దేశంలో లేకుండా తరిమివేశాడు కదా. నువ్వు నా ప్రాణం కోసం ఉరివేసి నాకు చావు వచ్చేలా చేస్తావు” అని అతనితో అంది.
10అప్పుడు సౌలు “దేవుని తోడు, దీన్ని బట్టి నీకు శిక్ష ఎంతమాత్రం రాదు” అని యెహోవా పేరున ఒట్టు పెట్టుకొంటే, 11ఆ స్త్రీ “నీతో మాట్లాడడం కోసం ఎవరిని రప్పించాలి” అని అడిగింది. అతడు “సమూయేలును రప్పించాలి” అని కోరాడు. 12ఆ స్త్రీ సమూయేలును చూసి గట్టిగా కేకవేసి “నీవు సౌలువి గదా, నీవు నన్నెందుకు మోసం చేశావు” అని సౌలును అడిగితే, 13రాజు “నువ్వు భయపడవద్దు. నీకు ఏమి కనబడిందో చెప్పు” అని ఆమెను అడిగితే “దేవుళ్ళలో ఒకడు భూమిలోనుండి పైకి రావడం నేను చూస్తున్నాను” అని చెప్పింది.
14రాజు “అతడు ఏ రూపంలో ఉన్నాడు” అని అడిగాడు. ఆమె “దుప్పటి కప్పుకుని ఉన్న ఒక ముసలివాడు పైకి వస్తున్నాడు” అని చెబితే, సౌలు, అతడు సమూయేలు అని గ్రహించి సాగిలపడి నమస్కారం చేశాడు. 15“నన్ను రమ్మని నువ్వెందుకు తొందరపెట్టావు” అని సమూయేలు సౌలును అడిగాడు. సౌలు “నేను తీవ్రమైన బాధల్లో ఉన్నాను. ఫిలిష్తీయులు నా మీదికి దండెత్తి వస్తే దేవుడు నన్ను పక్కన పెట్టి ప్రవక్తల ద్వారా గానీ, కలల ద్వారా గానీ నాకేమీ జవాబివ్వలేదు. కాబట్టి నేను ఏమి చేయాలో నాకు తెలియజేయడానికి నిన్ను పిలిపించాను” అన్నాడు.
16అప్పుడు సమూయేలు “యెహోవా నిన్ను పక్కన పెట్టి నీకు విరోధి అయ్యాడు. ఇప్పుడు నన్ను అడగడం వల్ల ప్రయోజనం ఏంటి? 17యెహోవా తన జవాబును తానే స్వయంగా వెల్లడిస్తున్నాడు. నా ద్వారా ఆయన సెలవిచ్చినట్టు, నీ చేతిలో నుండి రాజ్యాన్ని తీసివేసి నీ సేవకుడు దావీదుకు దాన్ని ఇచ్చివేశాడు.
18యెహోవా ఆజ్ఞకు నువ్వు లోబడకుండా, అమాలేకీయుల విషయంలో ఆయన తీక్షణమైన ఉగ్రతను అమలు చేయలేదు కాబట్టి దాన్ని బట్టి యెహోవా నీకు ఈ రోజు ఈ విధంగా జరిగిస్తున్నాడు. 19యెహోవా నిన్నూ, ఇశ్రాయేలీయులనూ ఫిలిష్తీయుల చేతికి అప్పగిస్తాడు. రేపు నువ్వు, నీ కొడుకులు నా దగ్గరికి చేరుకుంటారు. యెహోవా ఇశ్రాయేలీయుల సైన్యాన్ని ఫిలిష్తీయుల చేతికి అప్పగిస్తాడు” అని సౌలుతో చెప్పాడు. 20సమూయేలు చెప్పిన మాటలకు సౌలు తీవ్రమైన భయంతో వెంటనే నేలపై సాష్టాంగపడి రాత్రి అంతా భోజనం ఏమీ తీసుకోకుండా ఉన్నందువల్ల బలహీనుడయ్యాడు.
21అప్పుడు ఆ స్త్రీ సౌలు దగ్గరికి వచ్చి, అతడు ఎంతో కలవరపడడం చూసి “నా యజమానీ, నీ దాసినైన నేను నీ ఆజ్ఞకు లోబడి నా ప్రాణాలు అర చేతిలో పెట్టుకుని నువ్వు నాకు చెప్పిన మాటలు విని అలా చేశాను” అని చెప్పింది. 22ఇప్పుడు “నీ దాసినైన నేను చెప్పే మాటలు విను. నేను నీకు కొంత ఆహారం వడ్డిస్తాను, నువ్వు భోజనం చేసి బలం తెచ్చుకుని ప్రయాణమై వెళ్ళు” అని అతనితో అంది.
23అతడు భోజనం చేసేందుకు ఒప్పుకోలేదు. అతని సేవకులు ఆ స్త్రీతో కలసి అతనిని బలవంతం చేస్తే అతడు వారు చెప్పిన మాట విని నేలపై నుండి లేచి మంచంపై కూర్చున్నాడు. 24ఆ స్త్రీ తన ఇంట్లో ఉన్న కొవ్విన దూడ తెచ్చి త్వరగా వధించి, పిండి తెచ్చి పిసికి, పులవని రొట్టెలు కాల్చి 25తీసుకువచ్చి సౌలుకు, అతని సేవకులకు వడ్డిస్తే వారు భోజనం చేసి అక్కడి నుంచి ఆ రాత్రే వెళ్లిపోయారు.