1 సమూ 7

7
1అప్పుడు కిర్యత్యారీము ప్రజలు వచ్చి యెహోవా మందసాన్ని తీసుకువెళ్ళి గిబియాలో కొండపై ఉన్న అబీనాదాబు ఇంటి దగ్గర ఉంచి దాన్ని కాపాడడం కోసం అతని కొడుకు ఎలియాజరును నియమించారు.
2మందసాన్ని కిర్యత్యారీములో ఉంచి ఇరవై ఏళ్లు నిండాయి. ఇశ్రాయేలీయులంతా యెహోవాను అనుసరించాలని కోరుతూ చింతిస్తున్నారు.
మిస్పా వద్ద ఇశ్రాయేలీయులు తిరిగి ప్రతిష్టించుకోవడం, ఫిలిష్తీయుల ఓటమి
3సమూయేలు ఇశ్రాయేలీయులందరినీ సమకూర్చి ఇలా చెప్పాడు. “మీరు మనస్ఫూర్తిగా యెహోవా వైపుకు తిరిగి, ఇతర దేవుళ్ళను, అష్తారోతు దేవుళ్ళను మీ మధ్యనుండి తీసివేసి, పట్టుదల గలిగి యెహోవా వైపు మీ మనస్సులను మళ్ళించి ఆయనను ఆరాధించండి. అప్పుడు ఆయన ఫిలిష్తీయుల చేతిలోనుండి మిమ్మల్ని విడిపిస్తాడు.” 4ఆ తరువాత ఇశ్రాయేలీయులు బయలు దేవుళ్ళను, అష్తారోతు దేవుళ్ళను విడిచిపెట్టి యెహోవాను మాత్రమే సేవించడం మొదలుపెట్టారు.
5అప్పుడు సమూయేలు “ఇశ్రాయేలీయులంతా మిస్పా ప్రదేశానికి చేరుకోండి. నేను మీ తరపున యెహోవాకు ప్రార్థన చేస్తాను” అని చెప్పినప్పుడు 6వారు మిస్పాలో సమావేశమై నీళ్లు చేది యెహోవా సన్నిధిలో కుమ్మరించి ఆ రోజంతా ఉపవాసం ఉండి “యెహోవా దృష్టిలో మేమంతా పాపం చేశాం” అని ఒప్పుకున్నారు. సమూయేలు మిస్పాలో ఉంటూ ఇశ్రాయేలీయులకు తీర్పు తీరుస్తూ న్యాయం జరిగిస్తున్నాడు.
7ఇశ్రాయేలీయులు మిస్పాలో సమకూడారని ఫిలిష్తీయులకు తెలిసినప్పుడు ఫిలిష్తీయ దండు వారి మీద దాడికి సిద్ధమయ్యారు. ఈ విషయం ఇశ్రాయేలీయులకు తెలిసినప్పుడు వారు ఫిలిష్తీయులకు భయపడి 8“మన దేవుడైన యెహోవా ఫిలిష్తీయుల చేతిలోనుండి మనలను రక్షించేలా మా కోసం ప్రార్థన చేయడం మానవద్దు” అని సమూయేలును వేడుకున్నారు.
9సమూయేలు ఇంకా పాలు తాగడం మానని ఒక గొర్రెపిల్లను తెచ్చి యెహోవాకు సర్వాంగ హోమం అర్పించి, ఇశ్రాయేలీయుల తరఫున యెహోవాకు ప్రార్థించినపుడు యెహోవా అతని ప్రార్థన విన్నాడు.
10సమూయేలు దహనబలి అర్పిస్తున్న సమయంలో ఫిలిష్తీయులు యుద్ధం చేయడానికి ఇశ్రాయేలీయుల పైకి వచ్చారు. అయితే యెహోవా ఆ రోజు ఫిలిష్తీయుల మీదికి విపరీతంగా ఉరుములు ఉరిమేలా చేసి వారిని కల్లోలపరచడంతో వారు ఇశ్రాయేలీయుల చేతిలో ఓడిపోయారు. 11ఇశ్రాయేలీయులు మిస్పా నుండి మొదలుపెట్టి బేత్కారు వరకూ ఫిలిష్తీయుల వెంటబడి చంపివేశారు.
12అప్పుడు సమూయేలు ఒక రాయి తీసుకుని మిస్పాకు, షేనుకు మధ్య దాన్ని నిలబెట్టి “ఇప్పటి వరకూ యెహోవా మనకు సహాయం చేశాడు” అని చెప్పి ఆ రాయికి “ఎబెనెజరు” అని పేరు పెట్టాడు.
13ఈ విధంగా ఫిలిష్తీయులు అణగారిపోయి ఇశ్రాయేలు సరిహద్దుల్లోకి మళ్ళీ రాలేకపోయారు. సమూయేలు జీవించిన కాలమంతటిలో యెహోవా హస్తం ఫిలిష్తీయులకి విరోధంగా ఉంది. 14ఫిలిష్తీయులు ఇశ్రాయేలీయుల నుండి ఆక్రమించుకొన్న పట్టణాలన్నీ వారికి తిరిగి వచ్చాయి. ఎక్రోను నుండి గాతు వరకూ ఉన్న గ్రామాలనూ వాటిలోని పొలాలనూ ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయుల చేతిలో నుండి విడిపించుకున్నారు. ఇశ్రాయేలీయులకు, అమోరీయులకు మధ్య శాంతి ఏర్పడింది.
15సమూయేలు జీవించిన కాలమంతా ఇశ్రాయేలీయులకు న్యాయాధిపతిగా ఉన్నాడు. 16ప్రతి సంవత్సరమూ అతడు బేతేలుకు, గిల్గాలుకు, మిస్పాకు తిరుగుతూ, వివిధ ప్రాంతాల్లో ఇశ్రాయేలీయులకు న్యాయం జరిగిస్తూ వచ్చాడు. 17అతని నివాసం రమాలో ఉన్నందువల్ల అక్కడికి తిరిగి వచ్చి అక్కడ కూడా న్యాయం జరిగిస్తూ వచ్చాడు. అతడు అక్కడ యెహోవాకు ఒక బలిపీఠం కట్టాడు.

ప్రస్తుతం ఎంపిక చేయబడింది:

1 సమూ 7: IRVTel

హైలైట్

షేర్ చేయి

కాపీ

None

మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి