2 దిన 20
20
మోయాబీయులు, అమ్మోనీయుల ఓటమి
1ఇది జరిగిన తరువాత, మోయాబీయులు, అమ్మోనీయులు, మెయోనీయుల్లో కొంతమంది దండెత్తి యెహోషాపాతు మీదికి వచ్చారు. 2అంతలో కొంతమంది వచ్చి “మృత సముద్రం అవతల ఉండే అరాము వైపు నుంచి ఒక గొప్ప సైన్యం నీ మీదికి వస్తూ ఉంది. గమనించండి. వారు హససోన్ తామారు అనే ఏన్గెదీలో ఉన్నారు” అని యెహోషాపాతుకు తెలియచేశారు.
3అందుకు యెహోషాపాతు భయపడి యెహోవా దగ్గర విచారించడానికి మనస్సు పెట్టి, యూదా అంతటా ఉపవాసం ఆచరించాలని చాటించాడు. 4యూదావారు యెహోవా సహాయాన్ని అడగడానికి సమావేశమయ్యారు. యెహోవా దగ్గర విచారించడానికి యూదా పట్టణాలన్నిటిలో నుంచి ప్రజలు వచ్చారు.
5యెహోషాపాతు యెహోవా మందిరంలో కొత్త ఆవరణం ముందు సమాజంగా కూడిన యూదా యెరూషలేము ప్రజల మధ్య నిలబడి, 6“మా పూర్వీకుల దేవా, యెహోవా, పరలోకంలో దేవుడివి నీవే గదా! అన్ని రాజ్యాలనూ పాలించే బలం గలవాడవు, పరాక్రమం గలవాడవు, నిన్నెదిరించడం ఎవరి తరమూ కాదు. 7నీ ప్రజలైన ఇశ్రాయేలీయుల ఎదుటి నుంచి ఈ దేశవాసులను తోలివేసి, నీ స్నేహితుడైన అబ్రాహాము సంతతికి దీన్ని శాశ్వతంగా ఇచ్చిన మా దేవుడవు నువ్వే.”
8“వారు అందులో నివాసం చేసి, మాకేదైనా విపత్తు జరిగితే, అంటే యుద్ధపు తీర్పు గానీ రోగం గానీ కరువుగానీ, మా మీదికి వస్తే మేము ఈ మందిరం ముందు నిలబడి మా బాధలో నీకు మొర్రపెడితే 9నీవు ఆలకించి మమ్మల్ని కాపాడతావని, ఇక్కడ నీ పేరు కోసం ఈ పరిశుద్ధ స్థలాన్ని కట్టించారు. నీ పేరు ఈ మందిరానికి ఉంది గదా.
10ఇశ్రాయేలీయులు ఐగుప్తునుంచి వచ్చినప్పుడు నీవు వారిని అమ్మోనీయులతోనూ మోయాబీయులతోనూ శేయీరు కొండ ప్రాంతం వారితోనూ యుద్ధం చేయనివ్వలేదు కాబట్టి ఇశ్రాయేలీయులు వారిని నాశనం చేయకుండా వారి దగ్గర నుంచి వెళ్ళిపోయారు. 11మేము స్వతంత్రించుకోవాలని నీవు మాకిచ్చిన నీ స్వాస్థ్యంలో నుంచి మమ్మల్ని తోలివేయడానికి వారు బయలుదేరి వచ్చి మాకు ఎలాంటి ప్రత్యుపకారం చేస్తున్నారో చూడండి. 12మా దేవా, నీవు వారికి తీర్పు తీర్చవా? మా మీదికి వచ్చే ఈ గొప్ప సైన్యంతో యుద్ధం చేయడానికి మాకు శక్తి చాలదు. ఏమి చేయాలో మాకు తెలియదు. నువ్వే మా దిక్కు” అని ప్రార్థన చేశారు. 13యూదావారంతా తమ పసికందులతో భార్యలతో పిల్లలతో యెహోవా సన్నిధిలో నిలబడ్డారు.
14అప్పుడు ఆసాపు సంతతివాడూ లేవీయుడు అయిన యహజీయేలు, సమాజంలో ఉన్నాడు. అతని తండ్రి జెకర్యా, జెకర్యా తండ్రి బెనాయా, బెనాయా తండ్రి యెహీయేలు, యెహీయేలు తండ్రి మత్తన్యా. యెహోవా ఆత్మ యహజీయేలు మీదికి రాగా అతడు ఇలా ప్రకటించాడు, 15“యూదాప్రజలారా, యెరూషలేము నివాసులారా, యెహోషాపాతు రాజా, మీరంతా వినండి. యెహోవా చెప్పేదేమిటంటే, ఈ గొప్ప సైన్యానికి మీరు భయపడవద్దు, నిస్పృహ చెందవద్దు. ఈ యుద్ధం మీది కాదు, దేవునిదే.
16రేపు మీరు వారిమీదికి వెళ్ళాలి. వారు జీజు అనే కనుమ గుండా వస్తారు. మీరు యెరూవేలు అరణ్యం ముందున్న వాగు చివర, వారిని కనుగొంటారు. 17ఈ యుద్ధంలో మీరు పోరాడవలసిన అవసరం లేదు. యూదా ప్రజలారా, యెరూషలేము వాసులారా, మీరు మీ స్థానాల్లో అలాగే నిలబడండి. మీతో ఉన్న యెహోవా అందించే రక్షణను మీరు చూస్తారు. భయపడవద్దు, నిస్పృహ చెందవద్దు. రేపు మీరు వారి మీదికి వెళ్ళాలి. యెహోవా మీతో ఉంటాడు.”
18అప్పుడు యెహోషాపాతు సాష్టాంగ నమస్కారం చేశాడు. యూదావారు, యెరూషలేము నివాసులు యెహోవా సన్నిధిలో సాగిలపడి నమస్కరించారు. 19కహాతీయుల సంతతివారు, కోరహీయుల సంతతివారైన లేవీయులు నిలబడి బిగ్గరగా ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాను స్తుతించారు.
20వారు ఉదయాన్నే లేచి తెకోవ అరణ్యానికి వెళ్ళారు. వారు వెళ్తూ ఉంటే యెహోషాపాతు నిలబడి “యూదా, యెరూషలేములో నివసించే మీరంతా నా మాట వినండి! మీ దేవుడైన యెహోవాను నమ్మండి, అప్పుడు మీకు సహాయం దొరుకుతుంది. ఆయన ప్రవక్తలను నమ్మండి, అప్పుడు మీకు విజయం కలుగుతుంది” అని చెప్పాడు.
21అతడు ప్రజలతో చర్చించిన తరువాత యెహోవాను స్తుతించడానికి గాయకులను ఏర్పరచి, వారు సైన్యం ముందు నడుస్తూ “యెహోవా కృప ఎల్లప్పుడూ ఉంటుంది. ఆయనకు కృతజ్ఞత తెలియచేయండి.” అని పలకాలని నియమించాడు.
22వారు పాడడం, స్తుతించడం మొదలు పెట్టినప్పుడు, యూదావారి మీదికి వచ్చిన అమ్మోనీయులమీదా మోయాబీయుల మీదా శేయీరు కొండ ప్రాంతం వారి మీదా యెహోవా ఆకస్మిక దాడి చేసే మనుషులను పెట్టాడు. శత్రువులు ఓడిపోయారు. 23అమ్మోనీయులు, మోయాబీయులు కలిసి శేయీరు కొండప్రాంతం వారిని పూర్తిగా చంపి వేసి నాశనం చేద్దామని పొంచి ఉండి, వారిమీద పడ్డారు. వారు శేయీరు నివాసులను తుదముట్టించిన తరువాత ఒకరినొకరు చంపుకోవడం మొదలుపెట్టారు.
24యూదావారు అరణ్యం దగ్గరికి వచ్చి, సైన్యం వైపు చూస్తే, వారంతా నేలమీద పడి ఉన్నారు. ఏ ఒక్కడూ తప్పించుకోలేదు. 25యెహోషాపాతూ, అతని ప్రజలూ వారి వస్తువులను తీసుకోడానికి వస్తే, ఆ శవాల మీద విస్తారమైన ధనం, ప్రశస్తమైన నగలు దొరికాయి. తాము మోయలేనంతగా వారు సొమ్ము దోచుకున్నారు. కొల్లసొమ్ము ఎంత ఎక్కువగా ఉందంటే, వాటిని మోసుకు పోవడానికి వారికి మూడు రోజులు పట్టింది. 26నాలుగవ రోజు బెరాకా లోయలో వారు సమావేశమయ్యారు. అక్కడ వారు యెహోవాను స్తుతించారు. అందుకే ఇప్పటి వరకూ ఆ స్థలానికి “బెరాకా లోయ” అని పేరు.
27ఆ తరువాత యూదావారూ యెరూషలేమువారూ వారికి ముందు యెహోషాపాతు, ఆనందంగా యెరూషలేము తిరిగి వెళ్లాలని బయలు దేరారు. ఎందుకంటే యెహోవా వారి శత్రువుల మీద వారికి జయం అనుగ్రహించాడు. 28వారు యెరూషలేములో ఉన్న యెహోవా మందిరానికి తీగె వాయిద్యాలను సితారాలను వాయిస్తూ బాకాలు ఊదుతూ వచ్చారు.
29ఇశ్రాయేలీయుల శత్రువులతో యెహోవా యుద్ధం చేసాడని అన్ని రాజ్యాల వారు విని, దేవుని భయంతో వణికిపోయారు. 30ఈ విధంగా యెహోషాపాతు రాజ్యం ప్రశాంతంగా ఉంది. ఎందుకంటే అతని దేవుడు, అతని చుట్టూ నెమ్మది ఇచ్చాడు.
యెహోషాపాతు మరణం
20:31-21:1; 1రాజులు 22:41-50
31యెహోషాపాతు యూదారాజ్యాన్ని పరిపాలించాడు. అతడు పరిపాలించడం మొదలు పెట్టినపుడు 35 ఏళ్ల వాడై యెరూషలేములో 25 ఏళ్ళు పాలించాడు. అతని తల్లి షిల్హీ కుమార్తె, ఆమె పేరు అజూబా. 32అతడు యెహోవా దృష్టికి యథార్ధంగా ప్రవర్తించి తన తండ్రి ఆసా మార్గంలో నడుస్తూ దానిలోనుంచి తొలగిపోకుండా ఉన్నాడు.
33అయితే అప్పటికి ఇంకా ప్రజలు తమ పూర్వీకుల దేవుణ్ణి అనుసరించడానికి తమ హృదయాల్లో నిశ్చయం చేసుకోలేదు, అతడు అన్య దైవ మందిరాలను తీసివేయలేదు. 34యెహోషాపాతు చేసిన పనులన్నిటిని గురించి హనానీ కొడుకు యెహూ రచించిన గ్రంథంలో రాసి వుంది. ఈ యెహూ పేరు, ఇశ్రాయేలు రాజుల గ్రంథంలో ఉంది.
35ఇది జరిగిన తరువాత, యూదా రాజు యెహోషాపాతు, చాలా దుర్మార్గంగా ప్రవర్తించిన ఇశ్రాయేలు రాజు అహజ్యాతో స్నేహం చేశాడు. 36తర్షీషుకు వెళ్ళగలిగిన ఓడలను చేయించాలని యెహోషాపాతు అతనితో స్నేహం చేశాడు. వారు ఎసోన్గెబెరులో ఆ ఓడలను చేయించారు. 37అప్పుడు మారేషా వాడు దోదావాహు కొడుకు, ఎలీయెజెరు “నీవు అహజ్యాతో స్నేహం చేసుకున్నావు కాబట్టి యెహోవా నీ ప్రయత్నాలను నాశనం చేశాడు” అని యెహోషాపాతుకు వ్యతిరేకంగా ప్రవచనం చెప్పాడు. ఆ ఓడలు తర్షీషుకు వెళ్లలేక బద్దలైపోయాయి.
ప్రస్తుతం ఎంపిక చేయబడింది:
2 దిన 20: IRVTel
హైలైట్
షేర్ చేయి
కాపీ
మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి
TEL-IRV
Creative Commons License
Indian Revised Version (IRV) - Telugu (ఇండియన్ రేవిజ్డ్ వెర్షన్ - తెలుగు), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.