2 దిన 30

30
హిజ్కియా పస్కాపండగ ఆచరించడం
1హిజ్కియా ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాకు పస్కాపండగ ఆచరించడానికి యెరూషలేములో ఉన్న యెహోవా మందిరానికి రావాలని ఇశ్రాయేలు, యూదావారందరికీ వార్తాహరులనూ, ఎఫ్రాయిమీయులకు మనష్షే వారికి ఉత్తరాలనూ పంపాడు. 2అప్పుడు తమను పవిత్రం చేసుకున్న యాజకులు చాలినంతమంది లేరు గనక ప్రజలు యెరూషలేములో సమకూడలేదు. కాబట్టి మొదటి నెలలో పస్కాపండగ జరపలేక పోయారు. 3రాజూ, అతని అధికారులూ, యెరూషలేములో ఉన్న సమాజం వారంతా పస్కాను రెండవ నెలలో ఆచరించాలని నిర్ణయించారు.
4ఈ విషయం రాజుకూ సమాజం వారందరికీ సమంజసం అనిపించింది. 5చాలా కాలం నుంచి లేఖనంలో రాసినట్టు ఎక్కువమంది ప్రజలు పండగ ఆచరించ లేదు. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాకు యెరూషలేములో పస్కా పండగ ఆచరించడానికి రావాలని బెయేర్షెబా నుంచి దాను వరకూ ఇశ్రాయేలు దేశమంతా చాటించాలని వారు నిర్ణయించారు.
6కాబట్టి వార్తాహరులు రాజు దగ్గరా అతని అధికారుల దగ్గరా ఉత్తరాలు తీసుకు, యూదా ఇశ్రాయేలు దేశాలంతా తిరిగి రాజాజ్ఞను ఇలా చాటించారు, “ఇశ్రాయేలు ప్రజలారా, అబ్రాహాము ఇస్సాకు ఇశ్రాయేలు దేవుడైన యెహోవా వైపు తిరగండి. మీరు ఆయన వైపు తిరిగితే, అప్పుడు అష్షూరు రాజుల చేతిలోనుంచి తప్పించుకుని మిగిలిన మీ వైపు ఆయన తిరుగుతాడు. 7తమ పూర్వీకుల దేవుడైన యెహోవా పట్ల ద్రోహంగా ప్రవర్తించిన మీ పూర్వీకులలాగా మీ సోదరులలాగా మీరు ప్రవర్తించవద్దు. మీరు చూస్తున్నట్టు ఆయన వారిని నాశనానికి అప్పగించాడు. 8మీ పూర్వికుల్లాగా మీరు అవిధేయులుగ ప్రవర్తించ కండి. యెహోవాకు లోబడి, ఆయన శాశ్వతంగా పరిశుద్ధ పరచిన ఆయన పరిశుద్ధ మందిరంలో ప్రవేశించి, మీ దేవుడైన యెహోవా మహోగ్రత మీ మీది నుంచి తొలగి పోయేలా ఆయన్ని సేవించండి.
9మీరు యెహోవా వైపు తిరిగితే మీ సోదరుల పైనా, మీ పిల్లల పైనా వారిని బందీలుగా తీసుకు పోయిన వారికి దయ కలుగుతుంది. వారు ఈ దేశానికి తిరిగి వస్తారు. మీ దేవుడైన యెహోవా కృప, జాలి గలవాడు కాబట్టి మీరు ఆయనవైపు తిరిగితే ఆయన మీ వైపునుంచి తన ముఖం తిప్పుకోడు.”
10వార్తాహరులు జెబూలూను దేశం వరకూ, ఎఫ్రాయిము మనష్షేల దేశాల్లో ఉన్న ప్రతి పట్టణానికీ వెళ్ళారు గాని అక్కడి వారు ఎగతాళి చేసి వారిని అపహసించారు. 11అయినా, ఆషేరు మనష్షే, జెబూలూను గోత్రాల్లో కొంతమంది తమను తాము తగ్గించుకుని యెరూషలేము వచ్చారు. 12యెహోవా ఆజ్ఞను బట్టి రాజు, అతని అధికారులు, ఆజ్ఞాపించిన వాటిని నెరవేర్చేలా యూదా వారికి ఏక మనస్సు కలిగించ డానికి దేవుని హస్తం వారి మీద ఉంది.
13రెండవ నెలలో పొంగని రొట్టెల పండగ ఆచరించడానికి ప్రజలు గొప్ప సమూహంగా యెరూషలేములో సమకూడారు. 14యెరూషలేములో ఉన్న బలిపీఠాలను ధూపవేదికలను తీసివేసి, కిద్రోను వాగులో పారవేశారు. 15రెండవ నెల 14 వ రోజున వారు పస్కాగొర్రెపిల్లను వధించారు. యాజకులు లేవీయులు సిగ్గుపడి, తమను ప్రతిష్ఠించుకుని దహనబలిపశువులను యెహోవా మందిరంలోకి తీసుకు వచ్చారు.
16దేవుని సేవకుడు మోషే నియమించిన ధర్మశాస్త్రంలోని ఉపదేశం ప్రకారం, వారు తమ స్థలం లో నిలబడ్డారు. యాజకులు, లేవీయుల చేతికి బాలి రక్తం అందించగా వారు దాన్ని చిలకరించారు. 17సమాజంలో తమను పరిశుద్ధ పరచుకొనని వారు అనేకమంది ఉన్నారు. అలా పరిశుద్ధ పరచుకొనని వారి కోసం పస్కా పశువులను లేవీయులు వధించాల్సి వచ్చింది.
18ఎఫ్రాయిము మనష్షే ఇశ్శాఖారు జెబూలూను ప్రదేశాలనుంచి వచ్చిన ప్రజల్లో చాలామంది తమ్మును తాము ప్రతిష్ఠించుకొనకుండా లేఖనాలకు విరుద్ధంగా పస్కా భుజించారు. వారి కోసం హిజ్కియా ఇలా ప్రార్థించాడు, 19“పరిశుద్ధమందిర శుద్ధీకరణ ప్రమాణాల ప్రకారం అశుద్ధంగా ఉన్నవారు, తమ పూర్వీకుల దేవుడైన యెహోవాను వెదకడానికి తమ హృదయాన్ని సిద్ధపరచుకుంటే, అలాటి వారినందరినీ దయ గల యెహోవా క్షమించును గాక.” 20యెహోవా హిజ్కియా చేసిన ప్రార్థన అంగీకరించి ప్రజలను బాగుచేశాడు.
21యెరూషలేములో ఉన్న ఇశ్రాయేలువారు ఏడు రోజులు తను పరిశుద్ధ పరచుకోకుండా ఉండిపోయిన వారు అనేకమంది ఉన్నారు. అలా పరిశుద్ధ పరచుకొనని వారి కోసం పస్కా పశువులను లేవీయులు వధించాల్సి వచ్చింది. ఏడూ రోజులపాటు రొట్టెల పండగను చాలా ఆనందంగా ఆచరించారు. లేవీయులూ, యాజకులూ సంగీత వాద్యాలతో పాటలు పాడుతూ ప్రతిరోజూ యెహోవాను స్తుతించారు. 22యెహోవా సేవను అర్థం చేసుకున్న లేవీయులందరితో హిజ్కియా ప్రోత్సాహకరమైన మాటలు పలికాడు. ఏడురోజులపాటు వారు సమాధాన బలులు అర్పిస్తూ, తమ పూర్వీకుల దేవుడైన యెహోవాకు కృతజ్ఞతా స్తుతులు చెల్లిస్తూ ఏడు రోజులు పస్కా పండగ సమయమంతా తమ నియమిత భాగం తింటూ ఆచరించారు.
23సమాజమంతా ఇది చూసి, ఇంకా 7 రోజులు పండగ ఆచరించాలని ఆలోచించి మరి 7 రోజులు ఆనందంగా దాన్ని ఆచరించారు. 24యూదా రాజు హిజ్కియా, సమాజానికి బలి అర్పణల కోసం 1,000 కోడెలను, 7,000 గొర్రెలను ఇచ్చాడు. అధికారులు 1,000 కోడెలను, 10,000 గొర్రెలూ మేకలూ ఇచ్చారు. చాలామంది యాజకులు తమ్మును తాము ప్రతిష్ఠించుకున్నారు.
25అప్పుడు యాజకులు, లేవీయులు, యూదా, ఇశ్రాయేలువారిలో నుంచి వచ్చిన సమాజమంతా, ఇశ్రాయేలు దేశంలోనుంచి వచ్చి యూదాలో నివాసమున్న అన్యులు కూడా సంతోషించారు. 26యెరూషలేము నివాసులు ఎంతో ఆనందించారు. ఇశ్రాయేలు రాజు దావీదు కొడుకు సొలొమోను కాలం తరువాత ఇలా జరగలేదు. 27అప్పుడు లేవీయులైన యాజకులు లేచి ప్రజలను దీవిస్తే వారి మాటలు వినబడ్డాయి. వారి ప్రార్థన దేవుడు ఉండే పరిశుద్ధ స్థలం, అంటే పరలోకానికి చేరింది.

ప్రస్తుతం ఎంపిక చేయబడింది:

2 దిన 30: IRVTel

హైలైట్

షేర్ చేయి

కాపీ

None

మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి