2 కొరింతీ పత్రిక 8

8
రెండవ భాగం-పేదలకై చందా
1సోదరీ సోదరులారా, మాసిదోనియ ప్రాంతంలోని సంఘాలపై దేవుడు చూపిన కృపను గూర్చి మీకు తెలియజేస్తున్నాం. 2విపరీతమైన బాధలు వారిని పరీక్షిస్తున్నప్పుడు సైతం, వారు అత్యధికంగా సంతోషించారు. వారు నిరుపేదలైనా వారి దాతృత్వం చాలా గొప్పది. 3వారిని గురించి నా సాక్ష్యం ఏమిటంటే, పరిశుద్ధులకు సేవ చేయడానికి తమకు కూడా భాగం ఇవ్వాలని ఎంతో బతిమాలారు. 4వారు స్వయంగానే ఇవ్వగలిగినంతా ఇచ్చారు. వాస్తవానికి, దానికంటే ఎక్కువే ఇచ్చారు.
5అంతేకాక వారు మొదట ప్రభువుకూ, తరువాత దేవుని సంకల్పం వలన మాకూ తమను తామే అప్పగించుకున్నారు. ఇలా చేస్తారని మేమెన్నడూ తలంచలేదు. 6కాబట్టి మీ దగ్గర తీతు ఇప్పటికే మొదలు పెట్టిన ఈ కృపా పరిచర్యను పూర్తి చేయమని మేము అతన్ని ప్రోత్సహించాము.
ఉద్బోధలు
7మీరు ప్రతి విషయంలో అంటే విశ్వాసంలో ఉపదేశంలో జ్ఞానంలో శ్రద్ధ అంతటిలో మీకు మా పట్ల ఉన్న ప్రేమలో ఎలా రాణిస్తున్నారో అలానే మీరు ఈ కృపా పరిచర్యలో కూడా తప్పక రాణించండి.
8ఆజ్ఞలా మీతో చెప్పడం లేదు. ఇతరుల శ్రద్ధాసక్తులు మీకు తెలియజేసి మీ ప్రేమ ఎంత యథార్థమైనదో పరీక్షిస్తున్నాను. 9మీకు మన ప్రభు యేసు క్రీస్తు కృప తెలుసు గదా? ఆయన ధనవంతుడై ఉండీ తన పేదరికం వలన మీరు ధనవంతులు కావాలని, మీ కోసం పేదవాడయ్యాడు.
10ఈ విషయంలో మీకు ఉపయోగపడే సలహా ఇస్తాను. ఏడాది క్రితం ఈ పని చేయాలని మొదలు పెట్టారు. అంతే కాదు, తలపెట్టడంలో మొదటి వారు కూడా మీరే. 11కాబట్టి మీరిప్పుడు ఆ పని పూర్తి చేయండి. పని చేయాలనే ఆశ, ఉత్సాహం అప్పుడు మీకెలా ఉన్నాయో ఆ విధంగానే మీరిప్పుడు దాన్ని ముగింపుకు తీసుకు రండి. 12అసలు ఈ పని చేయాలనే శ్రద్ధ ఉంటే అది మంచిదీ, ఆమోదయోగ్యమైనది కూడా. ఈ ఆమోదం ఒక వ్యక్తి, తనకున్న దాన్ని బట్టే గానీ లేని దాన్ని బట్టి కాదు. 13ఇతరుల బాధ ఉపశమనం చేసి మీకు భారంగా ఉండాలని ఇలా చెప్పడం కాదు. అందరికీ ఒకే విధంగా ఉండాలనే.
14“ఎక్కువ ఉన్న వాడికి ఏమీ మిగల్లేదు. తక్కువ ఉన్న వాడికి కొదువ లేదు” అని రాసి ఉంది.
15ప్రస్తుతం మీ సమృద్ధి వారి అవసరానికీ మరొకప్పుడు వారి సమృద్ధి మీ అవసరానికీ ఉపయోగపడాలని ఇలా చెబుతున్నాను.
వార్తాహరులు
16మీ పట్ల నాకున్న ఈ ఆసక్తినే తీతు హృదయంలో పుట్టించిన దేవునికి వందనాలు. 17అతడు మా విన్నపాన్ని అంగీకరించడమే గాక దాని గురించి ఎంతో ఆసక్తితో తన ఇష్టప్రకారమే మీ దగ్గరికి వస్తున్నాడు. 18క్రీస్తు ప్రభువు సంఘాలన్నిటిలో సువార్త ప్రకటించే పనిలో ప్రసిద్ధి చెందిన సోదరుణ్ణి అతనితో పంపిస్తున్నాం. 19అంతేకాక మన ప్రభువు మహిమ కోసం, మాకున్న ఆసక్తికి అనుగుణంగా మేము చేస్తున్న ఈ కృపా పరిచర్యలో మాతో కలిసి ప్రయాణం చేయడానికి సంఘాలు అతన్ని నియమించాయి.
20మేము సేకరిస్తున్న ఈ విరాళాల విషయంలో ఎవరూ మమ్మల్ని విమర్శించకుండా ఉండాలని జాగ్రత్త పడుతున్నాం. 21ఎందుకంటే ప్రభువు దృష్టిలోనే కాక మనుషుల దృష్టిలో కూడా గౌరవించదగిన వాటినే చేయాలని మేము జాగ్రత్త పడుతున్నాం. 22వారితో కూడా మరొక సోదరుణ్ణి మేము పంపుతున్నాం. అతన్ని చాలా విషయాల్లో చాలా సార్లు పరీక్షించి, ఆసక్తి గలవాడని గ్రహించాం. అతనికి మీమీద నమ్మకం కుదిరింది. అతడిప్పుడు మరింత ఆసక్తితో ఉన్నాడు.
23తీతు విషయంలోనైతే, అతడు నా సేవలో భాగస్థుడు, మీ విషయంలో నా జత పనివాడు. మన సోదరులయితే సంఘ ప్రతినిధులూ క్రీస్తుకు మహిమ తెచ్చేవారు. 24కాబట్టి వారికి మీ ప్రేమ చూపించండి. ఇతర సంఘాల్లో మీ గురించి మేము ఎందుకు గొప్పగా చెప్పామో వారికి రుజువు చేయండి.

ప్రస్తుతం ఎంపిక చేయబడింది:

2 కొరింతీ పత్రిక 8: IRVTel

హైలైట్

షేర్ చేయి

కాపీ

None

మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి