15
అజర్యా యూదా రాజు
15:1-7; 2దిన 26:3-4, 21-23
1ఇశ్రాయేలురాజు యరొబాము పరిపాలనలో 23 వ సంవత్సరంలో యూదారాజు అమజ్యా కొడుకు అజర్యా పరిపాలన ఆరంభించాడు. 2అతడు 16 సంవత్సరాల వయస్సులో పరిపాలన ఆరంభించి యెరూషలేములో 52 సంవత్సరాలు రాజుగా ఉన్నాడు. అతని తల్లి యెరూషలేము నివాసి యెకొల్యా. 3ఇతడు తన తండ్రి అమజ్యా చేసినట్టు చేసి యెహోవా దృష్టిలో నీతిగా ప్రవర్తించాడు.
4అయితే అతడు ఉన్నత స్థలాలను మాత్రం నాశనం చెయ్యలేదు. ఉన్నత స్థలాల్లో ప్రజలు ఇంకా బలులు అర్పిస్తూ ధూపం వేస్తూనే ఉన్నారు. 5యెహోవా ఈ రాజును దెబ్బ కొట్టిన కారణంగా అతడు చనిపోయే వరకూ కుష్టురోగిగా ఉంటూ వేరుగా ఒక భవనంలో నివాసం ఉన్నాడు గనుక యువరాజు యోతాము పట్టణం మీద అధికారిగా దేశ ప్రజలకు న్యాయం తీర్చే వాడిగా ఉన్నాడు.
6అజర్యా చేసిన పనుల గురించి, అతడు చేసిన దానంతటి గురించి యూదారాజుల చరిత్ర గ్రంథంలో రాసి ఉంది. 7అజర్యా చనిపోయినప్పుడు అతణ్ణి తన పూర్వీకులతోబాటు దావీదు పట్టణంలో తన పితరుల సమాధిలో పాతిపెట్టిన తరువాత అతని కొడుకు యోతాము అతని స్థానంలో రాజయ్యాడు.
ఇశ్రాయేలు రాజైన జెకర్యా
8యూదారాజు అజర్యా పరిపాలనలో 38 వ సంవత్సరంలో యరొబాము కొడుకు జెకర్యా షోమ్రోనులో ఇశ్రాయేలు వాళ్ళను ఆరు నెలలు పరిపాలించాడు. 9ఇతడు ఇశ్రాయేలు వారు పాపం చెయ్యడానికి కారకుడైన నెబాతు కొడుకు యరొబాము చేసిన పాపాలు విడిచిపెట్టకుండా వాటినే అనుసరిస్తూ, తన పూర్వికులు చేసినట్టే తానూ యెహోవా దృష్టిలో చెడుతనం జరిగించాడు.
10యాబేషు కొడుకు షల్లూము అతని మీద కుట్రచేసి, ప్రజలు చూస్తూ ఉండగా అతని మీద దాడి చేసి అతన్ని చంపి అతని స్థానంలో రాజయ్యాడు. 11జెకర్యా చేసిన పనులు గురించి ఇశ్రాయేలు రాజుల చరిత్ర గ్రంథంలో రాసి ఉంది. 12నీ కొడుకులు నాలుగో తరం వరకూ ఇశ్రాయేలు సింహాసనం మీద కూర్చుంటారని యెహోవా యెహూతో చెప్పిన మాట ప్రకారం ఇది జరిగింది.
ఇశ్రాయేలు రాజైన షల్లూము
13యూదారాజు ఉజ్జియా పరిపాలనలో 39 వ సంవత్సరంలో యాబేషు కొడుకు షల్లూము పరిపాలన ఆరంభించి, షోమ్రోనులో నెల రోజులు ఏలాడు. 14గాదీ కొడుకు మెనహేము తిర్సాలో నుంచి బయలుదేరి షోమ్రోనునకు వచ్చి షోమ్రోనులో ఉండే యాబేషు కొడుకు షల్లూము మీద దాడి చేసి అతన్ని చంపి అతని స్థానంలో రాజయ్యాడు.
15షల్లూము చేసిన ఇతర పనుల గురించి, అతడు చేసిన కుట్ర గురించి, ఇశ్రాయేలు రాజుల చరిత్ర గ్రంథంలో రాసి ఉంది. 16మెనహేము వచ్చినప్పుడు తిప్సహు పట్టణం వారు తమ తలుపులు తెరవలేదు గనుక అతడు వాళ్ళందర్నీ హతం చేసి, తిర్సానూ దాని చుట్టూ ఉన్న గ్రామాలన్నిటినీ దోచుకుని అక్కడ ఉన్న గర్భవతుల గర్భాలు కత్తితో చీరివేశాడు.
ఇశ్రాయేలు రాజైన మెనహేము
17యూదారాజు అజర్యా పరిపాలనలో 39 వ సంవత్సరంలో గాదీ కొడుకు మెనహేము ఇశ్రాయేలు వాళ్ళను ఏలడం ఆరంభించి షోమ్రోనులో 10 సంవత్సరాలు ఏలాడు. 18ఇతడు కూడా తన కాలమంతా ఇశ్రాయేలు వారు పాపం చెయ్యడానికి కారకుడైన నెబాతు కొడుకు యరొబాము చేసిన పాపాలను విడిచిపెట్టకుండా వాటినే అనుసరిస్తూ యెహోవా దృష్టిలో చెడుతనం జరిగించాడు.
19అష్షూరు రాజు పూలు ఇశ్రాయేలు దేశం మీదికి దండెత్తి వచ్చినప్పుడు, మెనహేము, తన రాజ్యం నిలిచి ఉండేలా పూలుతో సంధి చేసుకోవాలని పూలుకు 2,000 మణుగుల వెండి ఇచ్చాడు. 20మెనహేము, ఇశ్రాయేలులో ధనవంతులైన గొప్పవాళ్ళల్లో ప్రతి మనిషి దగ్గర 50 తులాల వెండి#15:20 50 తులాల వెండి 570 గ్రాము వసూలు చేసి ఈ ధనాన్ని అష్షూరు రాజుకు ఇచ్చాడు గనుక అష్షూరురాజు దేశాన్ని విడిచి వెళ్లిపోయాడు.
21మెనహేము చేసిన ఇతర పనుల గురించి, అతడు చేసిన దానంతటి గురించి ఇశ్రాయేలు రాజుల చరిత్ర గ్రంథంలో రాసి ఉంది. 22మెనహేము తన పూర్వీకులతోబాటు తానూ చనిపోయిన తరువాత అతని కొడుకు పెకహ్యా అతని స్థానంలో రాజయ్యాడు.
ఇశ్రాయేలు రాజైన పెకహ్యా
23యూదారాజు అజర్యా పరిపాలనలో 50 వ సంవత్సరంలో మెనహేము కొడుకు పెకహ్యా షోమ్రోనులో ఇశ్రాయేలు వాళ్ళను ఏలడం ఆరంభించి రెండు సంవత్సరాలు ఏలాడు. 24ఇతడు కూడా తన కాలమంతా ఇశ్రాయేలు వారు పాపం చెయ్యడానికి కారకుడైన నెబాతు కొడుకు యరొబాము చేసిన పాపాలను విడిచి పెట్టకుండా వాటినే అనుసరిస్తూ యెహోవా దృష్టిలో చెడుతనం జరిగించాడు.
25ఇతని కింద ఉన్న అధిపతీ రెమల్యా కొడుకూ అయిన పెకహు కుట్ర చేసి, తన దగ్గరున్న 50 మంది గిలాదు వారితోనూ, అర్గోబుతోనూ, అరీహేనుతోనూ చేతులు కలిపి షోమ్రోనులో ఉన్న రాజ నగరులోని అంతఃపురంలో పెకహ్యాను చంపి, అతని స్థానంలో రాజయ్యాడు. 26పెకహ్యా చేసిన ఇతర పనుల గురించి, అతడు చేసిన దానంతటి గురించి ఇశ్రాయేలు రాజుల చరిత్ర గ్రంథంలో రాసి ఉంది.
ఇశ్రాయేలు రాజైన పెకహు
27యూదా రాజు అజర్యా పరిపాలనలో 52 వ సంవత్సరంలో రెమల్యా కొడుకు పెకహు షోమ్రోనులో ఇశ్రాయేలును ఏలడం ఆరంభించి 20 సంవత్సరాలు ఏలాడు. 28ఇతడు కూడా తన కాలమంతా ఇశ్రాయేలు వారు పాపం చెయ్యడానికి కారకుడైన నెబాతు కొడుకు యరొబాము చేసిన పాపాలను విడిచి పెట్టకుండా వాటినే అనుసరిస్తూ యెహోవా దృష్టిలో చెడుతనం జరిగించాడు.
29ఇశ్రాయేలు రాజు పెకహు రోజుల్లో అష్షూరు రాజు తిగ్లతు పిలేసెరు వచ్చి ఈయోను పట్టణాన్ని, ఆబేల్బేత్మయకా పట్టణాన్ని, యానోయహు పట్టణాన్ని, కెదెషు పట్టణాన్ని, హాసోరు పట్టణాన్ని, గిలాదు ప్రాంతాన్ని, గలిలయ ప్రాంతాన్ని, నఫ్తాలీ ప్రాంతమంతా చెరపట్టుకుని అక్కడ ఉన్నవాళ్ళను అష్షూరు దేశానికి బందీలుగా తీసుకు పోయాడు. 30అప్పుడు ఇశ్రాయేలు రాజు, రెమల్యా కొడుకు అయిన పెకహు మీద ఏలా కొడుకు హోషేయ కుట్ర చేసి, అతనిపై దాడి చేసి చంపి అతని స్థానంలో తాను రాజయ్యాడు. ఇది యూదా రాజు ఉజ్జియా కొడుకు యోతాము పరిపాలనలో 20 వ సంవత్సరంలో జరిగింది. 31పెకహు చేసిన ఇతర పనుల గురించి, అతడు చేసిన దానంతటి గురించి ఇశ్రాయేలు రాజుల చరిత్ర గ్రంథంలో రాసి ఉంది.
యూదా రాజైన యోతాము
15:33-38; 2దిన 27:1-4, 7-9
32ఇశ్రాయేలు రాజు, రెమల్యా కొడుకు అయిన పెకహు పరిపాలనలో రెండో సంవత్సరంలో యూదా రాజు ఉజ్జియా కొడుకు యోతాము పరిపాలన ఆరంభించాడు. 33అతడు 25 సంవత్సరాల వయస్సులో యెరూషలేములో రాజై 16 సంవత్సరాలు ఏలాడు. అతని తల్లి సాదోకు కూతురు యెరూషా.
34ఇతడు యెహోవా దృష్టిలో నీతిగా ప్రవర్తించి తన తండ్రి ఉజ్జియా ఆదర్శాన్ని పూర్తిగా అనుసరించాడు. 35అయినా ఉన్నత స్థలాలను కూల్చివేయలేదు. ప్రజలు ఉన్నత స్థలాల్లో ఇంకా బలులు అర్పిస్తూ ధూపం వేస్తూనే ఉన్నారు. ఇతడు యెహోవా మందిరానికి ఉన్న ఎత్తయిన ద్వారాన్ని కట్టించాడు. 36యోతాము చేసిన ఇతర పనుల గురించి, అతడు చేసిన దానంతటి గురించి యూదా రాజుల చరిత్ర గ్రంథంలో రాసి ఉంది.
37ఆ కాలంలో యెహోవా సిరియా రాజు రెజీనునూ, రెమల్యా కొడుకు పెకహునూ యూదా దేశం మీదికి పంపించడం ఆరంభించాడు. 38యోతాము తన పూర్వీకులతోబాటు చనిపోగా, అతని పూర్వీకుడు దావీదు పట్టణంలో అతని పితరుల సమాధిలో పాతిపెట్టారు. అతని కొడుకు ఆహాజు అతని స్థానంలో రాజయ్యాడు.