2 రాజులు 17

17
ఇశ్రాయేలు చివరి రాజు హోషేయ
17:3-7; 2రాజులు 18:9-12
1యూదారాజు ఆహాజు పరిపాలనలో 12 వ సంవత్సరంలో ఏలా కొడుకు హోషేయ షోమ్రోనులో ఇశ్రాయేలును ఏలడం ఆరంభించి, తొమ్మిది సంవత్సరాలు ఏలాడు. 2అతడు తన పూర్వికులైన ఇశ్రాయేలు రాజులు చేసినంత చెడుతనం చెయ్యకపోయినా, యెహోవా దృష్టిలో చెడుతనమే జరిగించాడు. 3అతని మీద అష్షూరురాజు షల్మనేసెరు యుద్ధానికి రాగా, హోషేయ అతనికి దాసోహమై కప్పం కట్టేవాడిగా అయ్యాడు.
4అతడు ఐగుప్తు రాజు సో దగ్గరికి వార్తాహరులను పంపి, ఇంత వరకూ తాను ప్రతి సంవత్సరం చేస్తున్నట్టు అష్షూరు రాజుకు కప్పం కట్టడం ఆపి వేశాడు. హోషేయ చేసిన కుట్ర అష్షూరు రాజు తెలుసుకుని అతనికి సంకెళ్లు వేయించి ఖైదు చేశాడు. 5అష్షూరురాజు దేశమంతటి మీదకీ, షోమ్రోను మీదకీ వచ్చి మూడు సంవత్సరాలు షోమ్రోనును ముట్టడించాడు. 6హోషేయ పరిపాలనలో తొమ్మిదో సంవత్సరంలో అష్షూరు రాజు షోమ్రోను పట్టణాన్ని చెరపట్టి ఇశ్రాయేలు వాళ్ళను అష్షూరు దేశంలోకి బందీలుగా తీసుకువెళ్ళాడు. గోజాను నది దగ్గర ఉన్న హాలహు, హాబోరు అనే చోటా, మాదీయుల పట్టణాల్లోనూ వాళ్ళను ఉంచాడు.
పాపం ఇశ్రాయేలు పతనానికి, చెరకు కారణం
7ఎందుకంటే, ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశంలో నుంచీ, ఐగుప్తు రాజు ఫరో బలం నుంచీ, తమను విడిపించిన తమ దేవుడైన యెహోవా దృష్టిలో పాపం చేసి ఇతర దేవుడు పట్ల భయభక్తులు కనపరిచారు. 8తమ ఎదుట నిలవ లేకుండా యెహోవా వెళ్లగొట్టిన ప్రజల కట్టుబాట్లూ, ఇశ్రాయేలు రాజులు నిర్ణయించిన కట్టుబాట్లూ పాటిస్తూ ఉన్నారు.
9ఇంకా ఇశ్రాయేలు వారు తమ దేవుడైన యెహోవాకు వ్యతిరేకమైన పనులు రహస్యంగా చేస్తూ, తమ పట్టణాలన్నిటిలో బురుజుల మీదా ప్రాకారాల మీదా పూజా స్థలాలు కట్టుకున్నారు. 10ఎత్తయిన కొండలన్నిటి మీదా, ప్రతి పచ్చని చెట్టు కిందా విగ్రహాలు నిలబెట్టి దేవతా స్తంభాలు కట్టించారు. 11తమ యెదుట నిలబడకుండా యెహోవా వెళ్లగొట్టిన ప్రజల ఆచారాల ప్రకారం ఉన్నత స్థలాల్లో ధూపం వేస్తూ, దుర్మార్గంగా ప్రవర్తించి యెహోవాకు కోపం పుట్టించారు. 12“చెయ్యకూడదు” అని వేటి గురించి యెహోవా తమకు ఆజ్ఞాపించాడో వాటినే చేస్తూ పూజిస్తూ ఉన్నారు.
13“అయినా మీ గోపురాలను విడిచిపెట్టి, నేను మీ పితరులకు ఆజ్ఞాపించి, నా సేవకులైన ప్రవక్తల ద్వారా మీకు అప్పగించిన ధర్మశాస్త్రంలో ఉన్న నా ఆజ్ఞలు, కట్టడలు ఆచరించండి” అని ప్రవక్తలందరి ద్వారానూ, దీర్ఘదర్శుల ద్వారానూ యెహోవా ఇశ్రాయేలు వాళ్ళకూ, యూదా వాళ్ళకూ సాక్ష్యం పలికించాడు.
14అయినా వారు వినలేదు. తమ దేవుడైన యెహోవాకు నమ్మకంగా లేని తమ పూర్వికుల వలే వారు కూడా తలబిరుసుగా ఉన్నారు. 15వారు ఆయన కట్టడలనూ, తమ పితరులతో ఆయన చేసిన నిబంధననూ, ఆయన తమకు నిర్ణయించిన ధర్మశాస్త్రాన్నీ విడిచి పెట్టి వ్యర్థమైన వాటిని చేశారు. “వాళ్ళ ఆచారాల ప్రకారం మీరు చెయ్యకూడదు” అని యెహోవా ఎవరి గురించి అయితే తమకు చెప్పాడో తమ చుట్టూ ఉన్న ఆ ప్రజల ఆచారాలనే వారు అనుసరించారు.
16వారు తమ దేవుడైన యెహోవా ఆజ్ఞలన్నిటినీ అనుసరించకుండా రెండు దూడల పోత విగ్రహాలను చేసి దేవతాస్తంభాలు నిలబెట్టి, నక్షత్రాలనూ, బయలు దేవుణ్ణి పూజించారు. 17ఇంకా, తమ కొడుకులనూ, కూతుళ్ళనూ దహన బలులుగా అర్పించి, భూతవైద్యం, మంత్రాలు, అలవాటు చేసుకుని యెహోవా దృష్టిలో చెడుతనం చెయ్యడానికి తమ్మును తాము అమ్ముకుని, ఆయనకు కోపం పుట్టించారు. 18కాబట్టి యెహోవా ఇశ్రాయేలు వాళ్ళ మీద చాలా కోపంతో తన ఎదుట నుంచి వాళ్ళను వెళ్లగొట్టాడు గనుక యూదా గోత్రం తప్ప ఇంక ఏ గోత్రమూ మిగలలేదు.
19అయితే యూదా వారు కూడా తమ దేవుడైన యెహోవా ఆజ్ఞలను విడిచిపెట్టి ఇశ్రాయేలు వారు పెట్టుకొన్న కట్టడలనే అనుసరించారు. 20అప్పుడు యెహోవా ఇశ్రాయేలు వంశస్థులను తృణీకరించి, వాళ్ళను బాధపెట్టి, దోపిడీగాళ్ళ చేతికి అప్పగించి, వాళ్ళను తన ఎదుట నుంచి వెళ్లగొట్టాడు.
21ఆయన ఇశ్రాయేలు#17:21 ఇశ్రాయేలు ఉత్తర రాజ్యం గోత్రాలను దావీదు సంతానం#17:21 దావీదు సంతానం దక్షిణ రాజ్యం నుంచి విడగొట్టినప్పుడు వారు నెబాతు కొడుకు యరొబామును రాజుగా చేసుకున్నారు. యరొబాము ఇశ్రాయేలు వారు యెహోవాను అనుసరించకుండా, వారు ఆయన మీద తిరుగుబాటు చేసేలా చేసి, ఘోరమైన పాపం చెయ్యడానికి కారకుడయ్యాడు. 22ఇశ్రాయేలు వారు యరొబాము చేసిన పాపాల్లో దేన్నీ విడిచిపెట్టకుండా వాటిని అనుసరిస్తూనే ఉన్నారు. 23తన సేవకులైన ప్రవక్తల ద్వారా యెహోవా చెప్పిన మాట ప్రకారం ఆయన ఇశ్రాయేలు వాళ్ళను తన ఎదుట నుంచి వెళ్ళగొట్టాడు. అందువల్ల వారు తమ స్వదేశం నుంచి అష్షూరు దేశానికి బందీలుగా వెళ్ళారు. ఈ రోజు వరకూ వారు అక్కడే ఉన్నారు.
పరదేశులు ఇశ్రాయేల్లో కాపురం ఉన్నారు
24అష్షూరు రాజు బబులోను, కూతా, అవ్వా, హమాతు, సెపర్వయీము అనే తన దేశాల్లో నుంచి మనుషులను రప్పించి, ఇశ్రాయేలు వాళ్లకు బదులుగా షోమ్రోను పట్టణాల్లో వాళ్ళను ఉంచాడు. వారు షోమ్రోను ప్రాంతాన్ని స్వాధీనం చేసుకుని, ఆ పట్టణాల్లో కాపురం ఉన్నారు. 25అయితే వారు అలా ఉండడం ఆరంభించినప్పుడు వారు యెహోవా పట్ల భయభక్తులు లేని వారు గనుక యెహోవా వాళ్ళ మధ్యకు సింహాలను పంపాడు. అవి వాళ్ళల్లో కొంతమందిని చంపాయి. 26అప్పుడు వారు “మీరు పట్టుకొన్న షోమ్రోను పట్టణాల్లో మీరు ఉంచిన ప్రజలకు ఆ దేశపు దేవుని ఆచారాలు తెలియదు గనక ఆయన సింహాలను పంపించాడు. ఇశ్రాయేలు దేవుని ఆచారాలు వాళ్లకు తెలియని కారణంగా సింహాలు వాళ్ళను చంపుతున్నాయి” అని అష్షూరు రాజుతో చెప్పారు.
27అష్షూరు రాజు “అక్కడ నుంచి తెచ్చిన యాజకుల్లో ఒకణ్ణి మీరు అక్కడికి తీసుకెళ్ళండి. అతడు అక్కడికి వెళ్లి కాపురం ఉండి, ఆ దేశపు దేవుని ఆచారాలను వాళ్లకు నేర్పాలి” అని ఆజ్ఞాపించాడు. 28అప్పుడు షోమ్రోనులోనుంచి వారు పట్టుకు వచ్చిన యాజకుల్లో ఒకడు వచ్చి బేతేలు ఊళ్ళో కాపురం ఉండి యెహోవా పట్ల భయభక్తులుగా ఉండవలసిన విధానాన్ని వాళ్లకు బోధించాడు.
29అయితే కొంతమంది ప్రజలు తమ సొంత దేవుళ్ళను పెట్టుకుని షోమ్రోనీయులు కట్టుకొన్న ఉన్నత స్థలాల మందిరాల్లో వాటిని ఉంచుకున్నారు. ఇంకా, వారు తమ తమ పట్టణాల్లో తమ కోసం దేవుళ్ళను తయారు చేసుకున్నారు. 30బబులోను వారు సుక్కో తు బెనోతు దేవుణ్ణి, కూతా వారు నెర్గలు దేవుణ్ణి, హమాతు వారు అషీమా దేవుణ్ణి, 31ఆవీయులు నిబ్హజు దేవుణ్ణి, తర్తాకు దేవుణ్ణి, ఎవరి దేవుళ్ళను వారు పెట్టుకుంటూ ఉన్నారు. సెపర్వీయులు తమ పిల్లలను ఆద్రమ్మెలెకు, అనెమ్మెలెకు అనే సెపర్వయీము దేవుళ్ళకు అగ్నిలో బలిగా అర్పిస్తూ ఉన్నారు.
32ఆ ప్రజలు యెహోవాను కూడా పూజించారు. ఉన్నత స్థలాల్లో సామాన్యుల్లో కొంతమందిని యాజకులుగా చేసుకున్నారు. అ యాజకులు ప్రజల పక్షంగా ఆ ఉన్నత స్థలాల్లో కట్టిన మందిరాల్లో బలులు అర్పిస్తూ ఉన్నారు. 33ఈ విధంగా వారు యెహోవా పట్ల భయభక్తులు చూపుతూనే, తాము ఏ ప్రజల్లో నుంచి వచ్చారో ఆ ప్రజల ఆచారాల ప్రకారం తమ దేవుళ్ళను కూడా పూజిస్తూ ఉన్నారు.
34ఈ రోజు వరకూ తమ పూర్వాచారాల ప్రకారం వారు చేస్తున్నారు. ఇశ్రాయేలు అని పేరు పెట్టిన యాకోబు సంతానం, యెహోవా పట్ల భయభక్తులు చూపలేదు. ఆయన ఆజ్ఞాపించిన కట్టడలు గాని, విధులు గాని, ధర్మశాస్త్రం గాని, ఆజ్ఞల్లో దేనినీ గానీ అనుసరించలేదు. 35ఆయన ఎవరితోనైతే నిబంధన చేసి “మీరు ఇతర దేవుళ్ళకు భయపడకూడదు. వాటికి మొక్కకూడదు. పూజ చేయకూడదు. బలులు అర్పించకూడదు. 36ఎవరైతే మిమ్మల్ని ఐగుప్తు దేశం నుంచి గొప్ప బలప్రభావాలతో చాచిన తన బహువుతో బయటికి తెచ్చాడో ఆయన్నే మీరు పూజించాలి. ఆయనకే మొక్కాలి. ఆయనకే బలులు అర్పించాలి. 37శాశ్వతంగా మోషే మీకు రాసి ఇచ్చిన కట్టడలు, విధులు, అంటే ధర్మశాస్త్రం, ఆజ్ఞలు, అన్నీ మీరు పాటించాలి. ఇతర దేవుళ్ళకు భయపడ కూడదు. 38నేను మీతో చేసిన నిబంధన మర్చిపోకుండా, ఇతర దేవుళ్ళను పూజించకుండా ఉండాలి. 39మీరు భయభక్తులు చూపవలసింది యెహోవా దేవుని పైనే. ఆయన మీ శత్రువుల బలం నుండి మిమ్మల్ని రక్షిస్తాడు” అని యెహోవా చెప్పాడు.
40అయినా వారు ఆయన మాట వినకుండా తాము గతంలో చేసినట్టే చేశారు. 41ఆ ప్రజలు ఆ విధంగా యెహోవా పట్ల భయ భక్తులు కలిగి ఉంటూనే, తమ చెక్కిన విగ్రహాలను కూడా పూజిస్తూ వచ్చారు. వారి పిల్లలూ, పిల్లల పిల్లలూ అలానే చేశారు. వారి పూర్వికులు చేసినట్టే ఈ రోజు వరకూ చేస్తూనే ఉన్నారు.

ప్రస్తుతం ఎంపిక చేయబడింది:

2 రాజులు 17: IRVTel

హైలైట్

షేర్ చేయి

కాపీ

None

మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి