2 రాజులు 6
6
గొడ్డలి పైకి తేలింది
1తరువాత ప్రవక్తల సమాజం వారు ఎలీషా దగ్గరికి వచ్చారు. వారు ఎలీషాతో “మేము నీతో ఉంటున్న ఈ స్థలం చాలా ఇరుకుగా ఉంది. 2నీవు దయ చేసి అనుమతిస్తే మేమంతా యొర్దానుకు వెళ్ళి అక్కడ్నించి ఒక్కొక్కరం ఒక్కో చెట్టు కొట్టి తెచ్చుకుంటాం. వాటితో మరో చోట మా కోసం నివాసాలు కట్టుకుంటాం” అన్నారు. దానికి ఎలీషా “అలాగే, వెళ్ళండి” అని జవాబిచ్చాడు. 3వాళ్ళల్లో ఒకడు “నీ సేవకులైన మాతో దయచేసి నువ్వూ రావాలి” అని బతిమాలాడు. ఎలీషా “సరే, నేనూ వస్తాను” అన్నాడు.
4కాబట్టి అతడు వాళ్ళతో వెళ్ళాడు. అందరూ యొర్దానుకి వెళ్ళి చెట్లు నరకడం ప్రారంభించారు. 5ఒకడు కొమ్మ కొడుతున్నప్పుడు వాడి గొడ్డలి ఊడి కింద నీళ్ళలో పడిపోయింది. వాడు “అయ్యో, నా ప్రభూ, అది అరువు తెచ్చిన గొడ్డలి” అంటూ కేకలు పెట్టాడు.
6అప్పుడు దేవుని మనిషి “అదెక్కడ పడింది?” అని అడిగాడు. వాడు అతనికి అది పడిన ప్రాంతం చూపించాడు. అప్పుడతడు ఒక చిన్న కొమ్మని కొట్టి దాన్ని నీళ్ళలో వేశాడు. అప్పుడు ఆ ఇనుప గొడ్డలి నీళ్ళలో తేలి పైకి వచ్చింది. 7ఎలీషా “దాన్ని పైకి తియ్యి” అన్నాడు. వాడు తన చెయ్యి చాపి దాన్ని పట్టుకున్నాడు.
ఎలీషా సిరియానులకు గుడ్డితనం కలుగజేశాడు
8తరువాత సిరియా దేశం రాజు ఇశ్రాయేలుతో యుద్ధం చేయాలనుకున్నాడు. తన సేవకులతో ప్రణాళిక వేసి “ఫలానా చోట నా శిబిరం వేసి ఉంచుతాను” అని చెప్పాడు. 9కానీ దేవుని మనిషి ఇశ్రాయేలు రాజుకి కబురు పంపి “ఆ మార్గం గుండా వెళ్ళకుండా జాగ్రత్త పడు. ఎందుకంటే సిరియా సైన్యం అక్కడకు రాబోతున్నారు” అని తెలియజేశాడు.
10ఇలా ఇశ్రాయేలు రాజు దేవుని మనిషి హెచ్చరిక చేసిన స్థలానికి మనుషులను పంపి అది నిజమని తెలుసుకున్నాడు. ఇలా ఆనేకసార్లు దేవుని మనిషి చేసిన హెచ్చరిక రాజును రక్షించింది. 11దీని వల్ల సిరియా రాజు మనసులో కలవరపడ్డాడు. తన సేవకులను పిలిచి “మనలో ఇశ్రాయేలు రాజుకు సహాయం చేస్తున్నదెవరో నాకు మీరు చెప్పరా?” అని అడిగాడు.
12కాబట్టి అతని సేవకుల్లో ఒకడు “నా ప్రభూ, రాజా, అలా కాదు. ఇశ్రాయేలులో ఉన్న ప్రవక్త ఎలీషా ఇశ్రాయేలు రాజుకి మీరు మీ పడగ్గదిలో పలికిన మాటలు కూడా చెప్పేస్తాడు” అన్నాడు. 13అప్పుడు రాజు “వెళ్ళండి, ఆ ఎలీషా ఇప్పుడు ఎక్కడున్నాడో తెలుసుకోండి. నేను మనుషులను పంపి అతణ్ణి పట్టుకుంటాను” అని జవాబిచ్చాడు. అప్పుడు వారు అతనికి “అతడు దోతానులో ఉన్నాడు” అని సమాచారమిచ్చారు.
14కాబట్టి రాజు దోతానుకి గుర్రాలనూ, రథాలనూ, భారీ సంఖ్యలో సైన్యాలనూ పంపించాడు. వారు రాత్రి వేళ వచ్చారు. ఆ పట్టణాన్ని నాలుగు వైపులా చుట్టుముట్టారు. 15దేవుని మనిషి దగ్గర పనివాడు ఉదయాన్నే లేచి బయటకు వెళ్ళాడు. పట్టణం చుట్టూ గుర్రాలూ, రథాలూ, పెద్ద సైన్యం మోహరించి ఉండటం చూశాడు. అప్పుడు ఆ పనివాడు “అయ్యో ప్రభూ, ఇప్పుడు మనమేం చేద్దాం?” అని దేవుని మనిషితో అన్నాడు. 16దానికి ఎలీషా “భయపడవద్దు, వాళ్ళ వైపు ఉన్నవాళ్ళ కంటే మన వైపు ఉన్నవాళ్లు ఎక్కువ మంది” అని జవాబిచ్చాడు.
17ఆ తరువాత ఎలీషా “యెహోవా, వీడు చూడాలి. అందుకోసం దయచేసి వీడి కళ్ళు తెరువు” అని ప్రార్థన చేశాడు. అప్పుడు యెహోవా ఆ పనివాడి కళ్ళు తెరిచాడు. వాడు ఆ పర్వతమంతా అగ్ని జ్వాలల్లాంటి గుర్రాలూ, రథాలూ ఎలీషా చుట్టూ ఉండటం చూశాడు.
18సిరియా సైన్యం ఎలీషాకి దగ్గరగా వచ్చారు. అప్పుడు ఎలీషా “ఈ సైన్యానికి గుడ్డితనం కలుగజెయ్యి” అని యెహోవాను ప్రార్థించాడు. ఎలీషా అడిగినట్టే యెహోవా వాళ్లకు గుడ్డితనం కలుగజేశాడు. 19అప్పుడు ఎలీషా వాళ్ళతో “మీరు వెళ్ళాల్సిన దారి ఇది కాదు. ఇది పట్టణమూ కాదు. మీరు వెదికే మనిషి దగ్గరికి మిమ్మల్ని తీసుకు వెళ్తాను, నా వెనకాలే రండి” అని చెప్పి వాళ్ళను షోమ్రోను పట్టణంలోకి తీసుకు వెళ్ళాడు.
20వారు షోమ్రోనులోకి వచ్చిన తరువాత ఎలీషా “యెహోవా, వీళ్ళు చూడాలి. వీళ్ళ కళ్ళు తెరువు” అని ప్రార్థన చేశాడు. అప్పుడు యెహోవా వాళ్ళ కళ్ళు తెరిచాడు. తాము షోమ్రోనులో ఉన్నామని వాళ్లకర్థమైంది. 21అప్పుడు ఇశ్రాయేలు రాజు వాళ్ళను చూసి “నా తండ్రీ, వీళ్ళను చంపమంటావా, చంపెయ్యనా?” అని ఎలీషాని అడిగాడు.
22అప్పుడు ఎలీషా “నీవు వాళ్ళని చంపకూడదు. నీ వింటినీ, కత్తినీ ప్రయోగించి బందీలుగా పట్టుకున్న వాళ్ళను ఎలా చంపుతావు? వాళ్లకు రొట్టె, నీళ్ళూ ఇవ్వు. వారు తిని తాగి తమ రాజు దగ్గరికి తిరిగి వెళ్ళిపోతారు” అన్నాడు. 23కాబట్టి రాజు వాళ్ళ కోసం విందు చేయించి అనేక రకాల భోజన పదార్థాలను తయారు చేయించాడు. వారు తిని తాగిన తరువాత వాళ్ళను తిరిగి తమ రాజు దగ్గరికి పంపించి వేశాడు. ఆ తరువాత సిరియా సైన్యం చాలా కాలం వరకూ ఇశ్రాయేలు దేశంలో అడుగు పెట్టలేదు.
షోమ్రోనులో భయంకరమైన కరువు
24ఇదంతా జరిగిన తరువాత సిరియా రాజు బెన్హదదు తన సైన్యాన్నంతా తీసుకుని షోమ్రోనుపై దాడికి వచ్చి పట్టణం చుట్టూ ముట్టడి వేశాడు. 25దానివల్ల షోమ్రోనులో భయంకరమైన కరువు వచ్చింది. వాళ్ళ ముట్టడి ఎంత దారుణంగా ఉందంటే దాని మూలంగా షోమ్రోనులో గాడిద తలను ఎనభై తులాల వెండికీ, పావు కొలత పెన్నేరు దుంప#6:25 పావురం రెట్ట అని తర్జుమా చేసింది బహుశా సెనగ గింజలను గానీ భూమిలో తవ్వి తీసే ఒక రకమైన చవకబారు చప్పిడి దుంపను గానీ అయి ఉండవచ్చు. తెలుగులో దీనికి సమానార్ధకం లేదు గానీ “పెన్నేరు దుంప” అని నిఘంటువు చెబుతున్నది. ఐదు తులాల వెండికీ అమ్మారు. 26ఆ సమయంలో ఇశ్రాయేలు రాజు ప్రాకారం గోడపై నడుస్తూ ఉన్నప్పుడు ఒక స్త్రీ రాజును చూసింది. “రాజా, నా ప్రభూ, సహాయం చెయ్యండి” అంటూ కేకలు పెట్టింది.
27అది విని రాజు “యెహోవాయే నీకు సహాయం చెయ్యడం లేదు. ఇక నేనేం చేస్తాను. ద్రాక్ష గానుగ నుండీ, ధాన్యపు కళ్ళం నుండీ ఏమన్నా వస్తుందా” అన్నాడు. 28రాజు ఇంకా “నీకు వచ్చిన కష్టం ఏమిటి?” అని అడిగాడు. దానికి ఆమె “ఒకామె నాతో ఇలా అంది, ‘ఈ రోజుకి నీ కొడుకుని ఇవ్వు. వాణ్ని ఈ రోజు మనం వండుకుని తినేద్దాం. రేపు నా కొడుకుని ఇస్తా. రేపు తిందాం’ అంది. 29అలాగే మేము నా కొడుకుని వండుకుని తినేశాం. అయితే తరువాత రోజు నేను ‘ఈ రోజు భోజనానికి నీ కొడుకుని ఇవ్వు’ అని అడిగాను. కానీ ఆమె తన కొడుకుని దాచిపెట్టుకుంది” అని చెప్పింది.
30రాజు ఆమె చెప్పింది విని తన బట్టలు చింపుకున్నాడు. ప్రాకారం గోడ పైన నడుస్తున్న రాజును ప్రజలు చూసినప్పుడు వారికి రాజు శరీరం పై గోనె పట్ట కనిపించింది. 31అప్పుడు రాజు “ఈ రోజు షాపాతు కొడుకు ఎలీషా మెడపై తల నిలిచి ఉంటే దేవుడు నన్ను పెద్ద ప్రమాదంలో పడవేస్తాడు గాక” అన్నాడు.
32అప్పుడు ఎలీషా తన ఇంట్లో కూర్చుని ఉన్నాడు. అతనితో పాటు కొందరు పెద్దలు కూడా ఉన్నారు. అప్పుడు రాజు ఒక మనిషిని పంపాడు. ఆ వ్యక్తి ఎలీషా దగ్గరికి రాక ముందే ఎలీషా ఆ పెద్దలతో “ఈ హంతకుని కొడుకు నా తల తీయడానికి మనిషిని పంపాడు చూశారా! మీరు చూస్తూ ఉండండి. అతడు వచ్చిన వెంటనే తలుపుతో వాణ్ని వెనక్కు తోసి తలుపులు మూయండి. వాడి వెనకాలే వాడి యజమాని కాళ్ళ చప్పుడు మనకు విన్పిస్తున్నది కదా” అన్నాడు. 33ఎలీషా మాట్లాడుతూ ఉండగానే రాజు పంపిన మనిషి, వాడి వెనకే రాజూ వచ్చారు. అప్పుడు రాజు “ఈ హాని మనకు యెహోవా వల్ల జరిగింది. ఇక మనం ఆయన కోసం ఎందుకు ఎదురు చూడాలి?” అన్నాడు.
ప్రస్తుతం ఎంపిక చేయబడింది:
2 రాజులు 6: IRVTel
హైలైట్
షేర్ చేయి
కాపీ
మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి
TEL-IRV
Creative Commons License
Indian Revised Version (IRV) - Telugu (ఇండియన్ రేవిజ్డ్ వెర్షన్ - తెలుగు), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.