2 రాజులు 7

7
1అప్పుడు రాజుతో ఎలీషా “యెహోవా చెప్తున్న మాట విను. యెహోవా చెప్తున్నదేమిటంటే, రేపు ఇదే సమయానికి షోమ్రోను పట్టణ ద్వారం దగ్గర ఒక తులం వెండికి నాలుగు కిలోల గోదుమ పిండీ, ఒక తులం వెండికి ఎనిమిది కిలోల యవలూ అమ్ముతారు” అన్నాడు. 2అప్పుడు రాజు ఒక అధికారి భుజంపై చెయ్యి వేసి ఉన్నాడు. ఆ అధికారి దేవుని మనిషితో “చూడండి, యెహోవా పరలోకం కిటికీలు తెరిచినా అలాంటిది జరుగుతుందా?” అన్నాడు. దానికి ఎలీషా “చూస్తూ ఉండు. అలా జరగడం నీవు కళ్ళారా చూస్తావు గానీ దాంట్లో దేన్నీ తినవు” అని జవాబిచ్చాడు.
3ఆ సమయంలో పట్టణ ద్వారం దగ్గర నలుగురు కుష్టురోగులున్నారు. వారు “మనం చచ్చే వరకూ ఇక్కడే ఎందుకు కూర్చోవాలి? 4మనం ఊళ్ళోకి వెళ్తే కరువు వల్ల చచ్చిపోతాం. ఇక్కడ ఇలానే కూర్చుని ఉన్నా చావు తప్పదు. అందుకని లేవండి. సిరియా సైన్యం దగ్గరికి వెళ్దాం పదండి. వారు మనలను బతకనిస్తే ఉందాం, చంపితే చద్దాం” అని తమలో తాము చెప్పుకున్నారు.
5ఇలా మాట్లాడుకుని వారు ఉదయం ఇంకా చీకటి ఉండగానే సిరియా సైన్య శిబిరం దగ్గరికి వెళ్లాలని లేచారు. వారు ఆ శిబిరానికి దగ్గరగా వచ్చినప్పుడు అక్కడ ఎవరూ లేరు. 6ఎందుకంటే ఆ శిబిరంలో ఉన్న వారు గుర్రాలూ, రథాలూ పరిగెడుతున్నట్టూ మరో పెద్ద సైనిక దండు కదులుతున్నట్టూ శబ్దాలు వినేలా యెహోవా చేశాడు. దాంతో వారు “మనతో యుద్ధం చేయడానికి ఇశ్రాయేలు రాజు హిత్తీయుల రాజునీ, ఐగుప్తీయుల రాజునీ తోడు తెచ్చుకున్నాడు” అని తమలో తాము చెప్పుకున్నారు.
7కాబట్టి ఆ సైన్యం ఉదయాన్నే తెల్లవారక ముందే లేచి తమ గుడారాలనూ, గుర్రాలనూ, గాడిదలనూ వదిలి కాళ్ళకు బుద్ధి చెప్పారు. శిబిరాన్ని ఉన్నది ఉన్నట్టుగా వదిలి ప్రాణాలు దక్కించుకోడానికి పరుగులు తీశారు. 8అప్పుడు ఆ కుష్టు రోగులు శిబిరం దగ్గరికి వచ్చి ఒక గుడారంలోకి వెళ్ళారు. అక్కడ తిని తాగారు. అక్కడ ఉన్న వెండీ, బంగారం, బట్టలూ తీసుకుని వెళ్లి వాటిని దాచి పెట్టారు. తరువాత వెనక్కి వచ్చి మరో గుడారంలోకి వెళ్ళి అక్కడి వస్తువులు కూడా తీసుకు వెళ్ళి దాచి పెట్టారు.
9తరువాత వారు ఇలా చెప్పుకున్నారు. “మనం చేసేది మంచి పని కాదు. ఈ రోజు శుభవార్త చెప్పాల్సిన రోజు. కానీ మనం దాని విషయంలో మౌనంగా ఉన్నాం. తెల్లవారే వరకూ మనం ఇక్కడే ఉంటే మనకు శిక్ష తప్పదు. కాబట్టి ఇప్పుడు మనం రాజభవనంలో ఈ సంగతి తెలియజేద్దాం.”
10అలా వారు వచ్చి పట్టణ ద్వారం దగ్గర కాపలా ఉన్నవాళ్ళని పిలిచి వాళ్ళతో “మేము సిరియా సైన్య శిబిరానికి వెళ్ళాం. అక్కడ ఎవ్వరూ లేరు. మనుషుల చప్పుడే లేదు. గుర్రాలూ, గాడిదలూ కట్టి ఉన్నాయి. గుడారాలన్నీ అలానే ఉన్నాయి” అని చెప్పారు. 11అప్పుడు కాపలాదార్లు కేక వేసి ఆ వార్తను తెలియజేశారు. రాజభవనంలో ఈ వార్త తెలిసింది.
12అప్పుడు రాజు రాత్రి వేళ లేచి తన సేవకులను పిలిచాడు. వాళ్ళతో “ఇప్పుడు సిరియా వారు మనకేం చేశారో చెప్తాను చూడండి. మనం ఆకలితో నకనకలాడుతున్నామని వాళ్ళకు తెలుసు. వారు ‘వీళ్ళు పట్టణంలో నుండి బయటకు వచ్చినప్పుడు వాళ్ళను సజీవంగా పట్టుకుని మనం పట్టణంలో ప్రవేశిద్దాం’ అని చెప్పుకుని శిబిరం విడిచి బయటకు వెళ్ళి దాక్కున్నారు” అన్నాడు. 13అప్పుడు రాజు సేవకుల్లో ఒకడు “పట్టణంలో ఇంకా మిగిలి ఉన్న ఐదు గుర్రాల పైన కొంతమందిని వెళ్ళనీయండి. ఇశ్రాయేలులో చాలా మంది చనిపోయారు కదా, మరో ఐదుగురు పోతే నష్టమేంటి? వాళ్ళని పంపి చూద్దాం” అని బతిమాలాడు.
14కాబట్టి రాజు వాళ్లకి “సిరియా సైన్యం ఎలా ఉందో వెళ్ళి చూడండి” అని ఆదేశించాడు. వారు రెండు రథాలనూ, వాటి గుర్రాలనూ తీసుకున్నారు. 15సిరియా సైన్యం కోసం యొర్దాను నది వరకూ వెళ్ళారు. సిరియా సైన్యం పారిపోతూ ఆ హడావుడిలో దారి పొడుగునా బట్టలూ, ఇతర సామగ్రీ పారేసుకుంటూ వెళ్ళారు. కాబట్టి వార్తాహరులు తిరిగి వెళ్ళి రాజుకు ఆ సమాచారం ఇచ్చారు.
16ఇక ప్రజలు బయటకు వెళ్ళి సిరియా సైన్యం శిబిరాన్ని దోచుకున్నారు. అప్పుడు యెహోవా వాక్కు ప్రకారం ఒక తులం వెండికి నాలుగు కిలోల గోదుమ పిండీ, ఒక తులం వెండికి ఎనిమిది కిలోల యవలూ అమ్మారు. 17ఎవరి భుజంపై రాజు ఆనుకుని నిలబడ్డాడో ఆ అధికారిని ద్వారం దగ్గర ఉండమని రాజు ఆజ్ఞాపించాడు. అయితే ఆ అధికారి ప్రజల తొక్కిసలాటలో నలిగి చనిపోయాడు. రాజు తనని చూడడానికి వచ్చినప్పుడు దేవుని మనిషి చెప్పిన దాని ప్రకారం ఇది జరిగింది.
18“రేపు ఇదే సమయానికి షోమ్రోను పట్టణ ద్వారం దగ్గర ఒక తులం వెండికి నాలుగు కిలోల గోదుమ పిండీ ఒక తులం వెండికి ఎనిమిది కిలోల యవలూ అమ్ముడవుతాయి” అని దేవుని మనిషి రాజుతో చెప్పినట్టు ఇది జరిగింది. 19అప్పుడు ఆ అధికారి “చూడండి, యెహోవా పరలోకం కిటికీలు తెరిచినా అలాంటిది జరుగుతుందా?” అని ప్రశ్నించాడు. దానికి దేవుని మనిషి “చూస్తూ ఉండు. అలాగే జరగడం నీవు నీ కళ్ళారా చూస్తావు. కానీ దాంట్లో దేన్నీ తినవు” అని జవాబిచ్చాడు. 20అతనికి ఆ విధంగానే జరిగింది. ద్వారం దగ్గర ప్రజల తొక్కిసలాటలో అతడు చనిపోయాడు.

ప్రస్తుతం ఎంపిక చేయబడింది:

2 రాజులు 7: IRVTel

హైలైట్

షేర్ చేయి

కాపీ

None

మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి