12
నాతాను దావీదును మందలించడం
1యెహోవా ప్రవక్త అయిన నాతానును దావీదు దగ్గరికి పంపించాడు. అతడు వచ్చి దావీదుతో ఇలా అన్నాడు. “ఒక పట్టణంలో ఇద్దరు మనుషులు ఉన్నారు. 2ఒకడు ధనవంతుడు, మరొకడు దరిద్రుడు. ధనవంతుడికి చాలా గొర్రె మందలూ, పశువులూ ఉన్నాయి. 3బీదవాడికి మాత్రం అతడు కొనుక్కొన్న ఒక చిన్న ఆడ గొర్రెపిల్ల తప్ప ఇంకేమీ లేదు. ఆ గొర్రెపిల్ల అతని దగ్గర, అతని బిడ్డల దగ్గర పెరుగుతూ వారి చేతిముద్దలు తింటూ, వారి గిన్నెలోనిది తాగుతూ ఉండేది. వారి పక్కన పండుకొంటూ అతని కూతురులాగా ఉండేది.
4ఇలా ఉండగా ఒక అతిథి ధనవంతుని దగ్గరికి వచ్చాడు. తన దగ్గరికి వచ్చిన అతిథికి విందు ఏర్పాటు చేయడానికి తన సొంత గొర్రెలను గానీ, పశువులను గానీ ముట్టుకోవడానికి ఇష్టపడక, ఆ బీదవాడి గొర్రెపిల్లను పట్టుకుని, ఆ అతిథికి విందు సిద్ధం చేశాడు.” 5దావీదు ఈ మాటలు విని అలా చేసినవాడి మీద తీవ్రమైన కోపం తెచ్చుకున్నాడు. “యెహోవా మీద ఒట్టు. ఈ పని చేసినవాడు తప్పకుండా మరణశిక్షకు పాత్రుడు. 6వాడు దయ లేకుండా ఈ పని చేశాడు కాబట్టి ఆ గొర్రెపిల్లకు బదులు నాలుగు గొర్రెపిల్లలు తిరిగి ఇవ్వాలి” అని నాతానుతో అన్నాడు.
7నాతాను దావీదును చూసి “ఆ మనిషివి నువ్వే. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా ఏమి చెబుతున్నాడంటే, ఇశ్రాయేలీయులపై నేను నిన్ను రాజుగా పట్టాభిషేకం చేసి, సౌలు నుండి నిన్ను కాపాడాను. నీ యజమాని ఇంటిని నీకు అనుగ్రహించి 8అతడి స్త్రీలను నీ కౌగిటిలోకి చేర్చాను. ఇశ్రాయేలు వారిపై, యూదా వారిపై నీకు అధికారం అప్పగించాను. నువ్వు గనుక ఇది చాలదని భావిస్తే నేను ఇంకా ఎక్కువగా నీకు ఇచ్చి ఉండేవాడిని. 9నీవు యెహోవా మాటను ధిక్కరించి ఆయన దృష్టికి చెడ్డ పని ఎందుకు చేశావు? హిత్తీయుడైన ఊరియాను కత్తి చేత చంపించి అతని భార్యను నీ భార్యగా చేసుకోవడానికి కుట్ర పన్నావు. అమ్మోనీయుల చేత అతణ్ణి చంపించావు.
10నువ్వు నన్ను లక్ష్యపెట్టక హిత్తీయుడైన ఊరియా భార్యను నీ భార్యగా చేసుకొన్నావు కాబట్టి నీ ఇంటివారిపై కత్తి ఎల్లకాలం నిలిచి ఉంటుంది.
11నా మాట విను. యెహోవానైన నేను చెప్పేదేమిటంటే, నీ సంతానం మూలంగా నేను నీకు కీడు కలుగజేస్తాను. నువ్వు చూస్తుండగానే నేను నీ భార్యలను మరొకరికి అప్పగిస్తాను. 12పగలు సమయంలోనే వారు నీ భార్యలతో శయనిస్తారు. నువ్వు నీ పాపం రహస్యంగా చేశావు గానీ ఇశ్రాయేలీయులంతా చూస్తుండగా పట్టపగలే నేను చెప్పినదంతా జరుగుతుంది” అని అన్నాడు.
13అందుకు దావీదు “నేను పాపం చేశాను” అని నాతానుతో అన్నాడు. అప్పుడు నాతాను “నీ పాపాన్ని బట్టి నువ్వు చనిపోయేలా యెహోవా నిన్ను శిక్షించక పోవచ్చు. 14-15అయితే నువ్వు చేసిన ఈ పనివల్ల యెహోవాను దూషించడానికి ఆయన శత్రువులకు నువ్వు ఒక మంచి కారణం చూపించావు. కాబట్టి నీకు పుట్టబోయే పసికందు తప్పకుండా చనిపోతాడు” అని దావీదుతో చెప్పి తన ఇంటికి వెళ్ళిపోయాడు.
16యెహోవా ఊరియా భార్య దావీదుకు కన్నబిడ్డను మొత్తి జబ్బు పడేలా చేశాడు. 17దావీదు ఉపవాసం ఉండి లోపలికి వెళ్లి బిడ్డ కోసం దేవుణ్ణి బతిమిలాడుతూ రాత్రంతా నేల మీద పడి ఉన్నాడు. ఇంట్లో ప్రముఖులు అతణ్ణి నేలపై నుండి లేపడానికి ప్రయత్నించారు. కానీ దావీదు ఒప్పుకోలేదు, వారితో కలసి భోజనం చేయలేదు.
18ఏడవ రోజు బిడ్డ చనిపోయాడు. దావీదు సేవకులు “బిడ్డ బతికి ఉన్నపుడు అతనితో ఏమి చెప్పినా అతడు మన మాట వినలేదు. 19ఇప్పుడు బిడ్డ చనిపోయాడని చెబితే తనకు తాను ఏదైనా హాని చేసుకొంటాడేమో” అనుకున్నారు. వారు బిడ్డ చనిపోయాడన్న సంగతి అతనితో చెప్పడానికి భయపడ్డారు. అయితే దావీదు తన సేవకులు గుసగుసలాడుకోవడం గమనించి బిడ్డ చనిపోయాడని అర్థం చేసుకున్నాడు. “బిడ్డ చనిపోయాడా?” అని తన సేవకులను అడిగాడు. వారు “చనిపోయాడు” అని జవాబిచ్చాడు.
20అప్పుడు దావీదు నేలపై నుండి లేచి స్నానంచేసి నూనె రాసుకుని వేరే బట్టలు ధరించాడు. యెహోవా మందిరంలో ప్రవేశించి దేవునికి మొక్కి, తన ఇంటికి తిరిగి వచ్చి భోజనం తీసుకురమ్మన్నాడు. వారు భోజనం తెచ్చి వడ్డించినప్పుడు అతడు భోజనం చేశాడు.
21అతని సేవకులు “బిడ్డ బతికి ఉన్నప్పుడు ఉపవాసంతో బిడ్డ కోసం ఏడుస్తూ ఉన్నావు, వాడు చనిపోయినప్పుడు లేచి భోజనం చేశావు. నువ్వు ఇలా చేయడంలో అర్థం ఏమిటి?” అని దావీదును అడిగారు. 22అప్పుడు దావీదు “బిడ్డ బతికి ఉన్నప్పుడు దేవుడు నన్ను కరుణించి బిడ్డను బతికిస్తాడన్న ఆశతో నేను ఉపవాసముండి ఏడుస్తూ వేడుకొన్నాను. 23ఇప్పుడు బిడ్డ చనిపోయాడు కనుక నేనెందుకు ఉపవాసముండాలి? బిడ్డను నేను తిరిగి రప్పించగలనా? నేనే వాడి దగ్గరకు వెళ్తాను గానీ వాడు నా దగ్గరికి మళ్ళీ రాడు కదా” అని వారితో చెప్పాడు.
24తరువాత దావీదు తన భార్య బత్షెబ దగ్గరికి వెళ్లి ఆమెను ఓదార్చి ఆమెతో శయనించాడు. ఆమె ఒక కొడుకును కన్నది. దావీదు అతనికి సొలొమోను అని పేరు పెట్టాడు. 25యెహోవా అతణ్ణి ప్రేమించి నాతాను ప్రవక్తను పంపాడు. అతడు యెహోవా చెప్పినట్టు ఆ బిడ్డకు యదీద్యా#12:25 యదీద్యా యెహోవా ప్రేమించినవాడు అని పేరు పెట్టాడు.
అమ్మోనీయుల మీద విజయం
26యోవాబు అమ్మోనీయుల ముఖ్య పట్టణం రబ్బా మీద యుద్ధం చేసి ఆక్రమించుకున్నాడు. మిగతా నగరాలకు నీరు ఇక్కడినుండే సరఫరా అవుతుంది. 27యోవాబు దావీదు దగ్గరికి మనుషులను పంపి “నేను రబ్బా మీద యుద్ధం చేసి నీరు సరఫరా చేసే పట్టణాన్ని అక్రమించుకొన్నాను. 28నేను ఆక్రమించుకొన్న పట్టణానికి నా పేరు పెట్టుకోకుండేలా మిగిలిన సైన్యాన్ని సమకూర్చి పట్టణంపై దాడి చెయ్యి” అని కబురు చేశాడు.
29కాబట్టి దావీదు సైన్యాన్ని సమకూర్చి రబ్బాకు వచ్చి దానిమీద యుద్ధం చేసి దాన్ని పట్టుకుని, వారి రాజు కిరీటాన్ని అతని తలమీద నుండి తీసివేయించాడు. దాన్ని దావీదు తల మీద పెట్టారు. దాన్ని విలువైన రత్నాలతో చెక్కారు. దాని బరువు సుమారు నాలుగు కిలోలు. 30ఇంకా అతడు ఆ పట్టణంలో నుండి ఎంతో విస్తారమైన దోపుడు సొమ్ము తీసుకుని వెళ్ళాడు. 31పట్టుకున్న వారిని బయటికి తీసుకువచ్చి రంపాలతో, పదునైన ఇనుప పనిముట్లతో, ఇనుప గొడ్డళ్ళతో పని చేసేవారిగా, ఇటుక బట్టీల్లో పనిచేసేవారిగా నియమించాడు. అమ్మోనీయుల పట్టణాలన్నిటిలో అతడు ఇలాగే చేశాడు. ఆ తరువాత దావీదు, అతని మనుషులూ తిరిగి యెరూషలేము చేరుకున్నారు.