2 సమూ 23

23
దావీదు చివరి మాటలు
1దావీదు చివరి మాటలు ఇవే. యెష్షయి కుమారుడు, యాకోబు దేవుని చేత అభిషిక్తుడైన వాడు, మహా ఘనత పొందినవాడు, ఇశ్రాయేలీయుల మధుర వాగ్గేయకారుడు అయిన దావీదు పలికిన దేవోక్తి ఇదే.
2“యెహోవా ఆత్మ నా ద్వారా పలుకుతున్నాడు ఆయన వాక్కు నా నాలుకపై ఉంది.
3ఇశ్రాయేలీయుల దేవుడు మాటలాడుతున్నాడు. ఇశ్రాయేలీయుల ఆశ్రయదుర్గం పలికాడు. మనుషులను నీతిన్యాయాలతో పరిపాలించేవాడు, దేవునిపట్ల భయభక్తులు కలిగి ఏలేవాడు,
4అతడు సూర్యోదయాన తొలిసంధ్య కాంతిలాగా మబ్బు లేని ఉదయం లాగా వాన వెలిసిన తరువాత కాంతులీనే కిరణాల్లో మొలకెత్తిన లేత గడ్డిలాగా ఉంటాడు.
5నా సంతానం దేవుని ఎదుట అలాటి వారు కాకపోయినా ఆయన నాతో నిత్య నిబంధన చేయలేదా? ఆ నిబంధన అన్నివిధాలా సంపూర్ణమైనది, సుస్థిరమైనది కాదా? ఆయన నాకు ధారాళమైన రక్షణ చేకూర్చి, అంతా సఫలమయ్యేలా చేస్తాడు.
6ముళ్ళను అవతల పారవేసినట్టు దుర్మార్గులను విసిరి వేయడం జరుగుతుంది. ఎందుకంటే వారు చేత్తో పట్టుకోలేని ముళ్ళలాగా ఉన్నారు.
7ఇనుప పరికరమైనా, ఈటె కోల అయినా లేకుండా మనుషులు ముళ్ళను తాకరు. దేనినీ వదలకుండా వాటన్నిటినీ ఉన్న చోటనే తగలబెడతారు.”
దావీదు యోధులు
8దావీదు యోధుల పేర్లు ఇవి: ముఖ్య వీరుల్లో మొదటివాడు యోషే బెష్షెబెతు. ఇతడు తక్మోనీ వంశం వాడు. అతడు ఒక యుద్ధంలో ఎనిమిది వందల మందిని హతం చేశాడు.
9ఇతని తరువాతి వాడు అహోహీయుడైన దోదో కొడుకు ఎలియాజరు. ఇతడు దావీదు ముగ్గురు యోధుల్లో ఒకడు. ఫిలిష్తీయులు యుద్ధానికి వస్తే, ఇతడు వారిని ఎదిరించాడు. ఇశ్రాయేలీయులు వెనక్కు తగ్గితే ఇతడు నిలబడి 10అరచెయ్యి బిగుసుకు పోయి చేతికి కత్తి అతుక్కుపోయే దాకా ఫిలిష్తీయులను ఎదుర్కొన్నాడు. ఆ రోజున యెహోవా ఇశ్రాయేలీయులకు గొప్ప విజయాన్ని ప్రసాదించాడు. దోపుడు సొమ్ము తీసుకుపోవడానికి మాత్రం ప్రజలు అతని వెనకాల వచ్చారు.
11ఇతని తరువాత హరారు ఊరివాడైన ఆగే కొడుకు షమ్మా. ఒకసారి ఫిలిష్తీయులు అలచందల చేలో గుంపు గూడి ఉండగా ఇశ్రాయేలు సైన్యం ఫిలిష్తీయులను ఎదిరించి నిలవలేక పారిపోయారు. 12అప్పుడితడు ఆ పొలం మధ్యలో నిలబడి ఫిలిష్తీయులు దాని మీదికి రాకుండా అడ్డుకున్నాడు. వారిని హతం చేశాడు. యెహోవా ఇశ్రాయేలీయులకు గొప్ప విజయాన్నిచ్చాడు.
13ముప్ఫై మంది వీరుల్లో ముఖ్యులైన ముగ్గురు కోతకాలంలో అదుల్లాము గుహలో ఉన్న దావీదు దగ్గరికి వచ్చారు. ఫిలిష్తీయుల సైన్యం రెఫాయీము లోయలో ఉన్నారు. 14దావీదు తన సురక్షితమైన చోట, గుహలో ఉన్నాడు. ఫిలిష్తీయ సేన బేత్లెహేములో శిబిరం వేసుకుని ఉన్నారు. 15దావీదు మంచి నీటి కోసం తహ తహ లాడుతూ “బేత్లెహేము పురద్వారం దగ్గరున్న బావి నీళ్లు ఎవరైనా నాకు తెచ్చి ఇస్తే ఎంత బావుణ్ణు!” అన్నాడు. 16ఆ ముగ్గురు బలాఢ్యులు ఫిలిష్తీయుల సైన్యం కావలి వాళ్ళను ఛేదించుకుని పోయి, బేత్లెహేము ద్వారం దగ్గరున్న బావి నీళ్లు తోడుకుని దావీదు దగ్గరికి తెచ్చారు. అయితే అతడు ఆ నీళ్లు తాగలేదు. యెహోవా సన్నిధిలో అ నీళ్ళు పారబోసి “యెహోవా, ఈ నీళ్ళు తాగడం నాకు దూరం అగు గాక. 17వీళ్ళు ప్రాణాలకు తెగించి పోయి ఇవి తెచ్చారు కదా. ఈ నీళ్ళు వీరి రక్తంతో సమానం” అని చెప్పి తాగడానికి నిరాకరించాడు.
ఆ ముగ్గురు మహావీరులు ఈ పరాక్రమ కార్యాలు చేశారు.
18సెరూయా కొడుకు, యోవాబు సోదరుడు అబీషై ఈ ముప్ఫై మందికి నాయకుడు. ఇతడొక యుద్ధంలో మూడు వందల మందిని ఈటెతో సాము చేసి హతం చేశాడు. ఇతడు ఆ ముగ్గురితో సమానంగా పేరు పొందాడు. 19ఇతడు ఆ ముప్ఫై మందిలో గొప్పవాడై, వారికి అధిపతి అయ్యాడు. కానీ ఆ మొదటి ముగ్గురికీ సాటి కాలేదు.
20కబ్సెయేలు ఊరివాడైన బెనాయా యెహోయాదా కొడుకు. అతడు పరాక్రమశాలి. మహా ప్రతాపం చూపించాడు. ఇతడు ఇద్దరు మోయాబు శూరులను హతం చేశాడు. మంచు కురుస్తున్న కాలంలో ఇతడు బావిలో దాక్కుని ఉన్న ఒక సింహాన్ని చంపేశాడు. 21ఇంకా అతడు మహాకాయుడైన ఒక ఐగుప్తు వాణ్ని చంపాడు. ఈ ఐగుప్తీయుడి చేతిలో ఈటె ఉంటే బెనాయా దుడ్డుకర్ర తీసుకు అతడి మీదికి పోయాడు. వాడి చేతిలోని ఈటె ఊడలాగి దానితోనే వాణ్ణి చంపేశాడు. 22ఈ పరాక్రమ క్రియలు యెహోయాదా కొడుకు బెనాయా చేశాడు కాబట్టి ఆ ముగ్గురు బలాఢ్యులతోబాటు లెక్కలోకి వచ్చాడు. 23ఆ ముప్ఫై మందిలోకీ ఘనుడయ్యాడు. అయినా మొదటి ముగ్గురితో సాటి కాలేదు. దావీదు ఇతన్ని తన దేహ సంరక్షకుల నాయకునిగా నియమించాడు.
24ఆ ముప్ఫై మంది ఎవరంటే, యోవాబు సోదరుడు అశాహేలు, బేత్లెహేము వాడైన దోదో కొడుకు ఎల్హానాను, 25హరోదీయుడైన షమ్మా, హరోదీయుడైన ఎలీకా, 26పత్తీయుడైన హేలెసు, తెకోవీయుడైన ఇక్కేషు కొడుకు ఈరా, 27అనాతోతు వాడైన అబీయెజరు, హుషాతీయుడైన మెబున్నయి, 28అహోహీయుడైన సల్మోను, నెటోపాతీయుడైన మహరై, 29నెటోపాతీయుడైన బయనాకు పుట్టిన హేలెబు, బెన్యామీనీయుల గిబియాలో పుట్టిన రీబై కుమారుడు ఇత్తయి, 30పిరాతోనీయుడైన బెనాయా, గాయషు లోయప్రాంతాల్లో ఉండే హిద్దయి, 31అర్బాతీయుడైన అబీయల్బోను, బర్హుమీయుడైన అజ్మావెతు, 32షయల్బోనీయుడైన ఎల్యహ్బా, యాషేను కొడుకుల్లో యోనాతాను, 33హరారీయుడైన షమ్మా, హరారీయుడైన షారారుకు పుట్టిన అహీయాము, 34మాయాకాతీయుడైన అహస్బయి కొడుకు ఎలీపేలెటు, గిలోనీయుడైన అహీతోపెలు కొడుకు ఏలీయాము, 35కర్మెలీయుడైన హెస్రో, అర్బీయుడైన పయరై, 36సోబావాడైన నాతాను కొడుకు ఇగాలు, గాదీయుడైన బానీ, 37అమ్మోనీయుడైన జెలెకు, బెయేరోతీయుడైన నహరై. ఇతడు సెరూయా కొడుకు యోవాబు ఆయుధాలు మోసేవాడు. 38ఇత్రీయుడైన ఈరా, ఇత్రీయుడైన గారేబు, 39హిత్తీయుడైన ఊరియా. ఈ కోవలో చేరినవారు మొత్తం ముప్ఫై ఏడుగురు.

ప్రస్తుతం ఎంపిక చేయబడింది:

2 సమూ 23: IRVTel

హైలైట్

షేర్ చేయి

కాపీ

None

మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి