అపొస్తలుల కార్యములు 10
10
యూదేతరులకు సువార్త. కొర్నేలి దర్శనం
1కైసరయ పట్టణంలో కొర్నేలి అనే భక్తిపరుడు ఉండేవాడు. ఇతడు ఇటలీ దళానికి చెందిన ఒక శతాధిపతి. 2అతడు కుటుంబ సమేతంగా దేవుణ్ణి ఆరాధించేవాడు. యూదు ప్రజలకు దానధర్మాలు చేస్తూ ఎప్పుడూ దేవునికి ప్రార్థన చేసేవాడు. 3మధ్యాహ్నం సుమారు మూడు గంటలప్పుడు దేవుని దూత అతని దగ్గరికి వచ్చి, “కొర్నేలీ” అని పిలవడం దర్శనంలో స్పష్టంగా చూశాడు. 4అతడు ఆ దూతను తేరి చూసి చాలా భయపడి, “ప్రభూ, ఏమిటి?” అని అడిగాడు. అందుకు దూత, “నీ ప్రార్థనలూ పేదలకు నీవు చేసే దానధర్మాలూ దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా చేరాయి. 5ఇప్పుడు యొప్పేకు మనుషులను పంపి, పేతురు అనే మారు పేరున్న సీమోనును పిలిపించుకో. 6అతడు సీమోను అనే ఒక చర్మకారుని దగ్గర ఉన్నాడు. అతని ఇల్లు సముద్రం పక్కనే ఉంది” అని చెప్పాడు.
కొర్నేలి పేతురు కోసం పిలవనంపించడం
7ఆ దూత వెళ్ళిన తరువాత కొర్నేలి తన ఇంట్లో పని చేసే ఇద్దర్ని, తనను ఎప్పుడూ కనిపెట్టుకుని ఉండే భక్తిపరుడైన ఒక సైనికుణ్ణి పిలిచి 8వారికి ఈ సంగతులన్నీ వివరించి వారిని యొప్పేకి పంపాడు.
పేతురు దర్శనం
9తరువాతి రోజున వారు ప్రయాణమై పోయి పట్టణానికి దగ్గరగా వచ్చేటప్పటికి పగలు సుమారు పన్నెండు గంటల వేళకి పేతురు ప్రార్థన చేసుకోడానికి ఇంటి పైకి వెళ్ళాడు. 10అతనికి బాగా ఆకలిగా ఉండి, భోజనం చేయాలనిపిస్తే ఇంట్లో వారు వంట సిద్ధం చేస్తూ ఉన్నారు. అదే సమయంలో అతడు పారవశ్యానికి లోనై, 11ఆకాశం తెరుచుకుని, నాలుగు చెంగులు పట్టి దింపిన పెద్ద దుప్పటి లాంటి పాత్ర ఒకటి భూమి మీదికి దిగి రావడం చూశాడు. 12దానిలో భూమి మీద ఉన్న అన్నిరకాల నాలుగు కాళ్ళ జంతువులూ పాకే పురుగులూ ఆకాశ పక్షులూ ఉన్నాయి.
13అప్పుడు, “పేతురూ, లేచి చంపుకుని తిను” అనే ఒక శబ్డం అతనికి వినిపించింది. 14అయితే పేతురు, “వద్దు ప్రభూ. నిషిద్ధమైన దానినీ అపవిత్రమైన దానినీ నేనెప్పుడూ తినలేదు” అని జవాబిచ్చాడు. 15“దేవుడు పవిత్రం చేసిన వాటిని నీవు నిషిద్ధం అనకు” అని మళ్ళీ రెండవసారి ఆ స్వరం అతనికి వినబడింది. 16ఈ విధంగా మూడుసార్లు జరిగింది. వెంటనే ఆ పాత్ర ఆకాశానికి తిరిగి వెళ్ళిపోయింది.
17పేతురు తనకు వచ్చిన దర్శనం ఏమిటో అని తనలో తాను ఆలోచించుకుంటూ అయోమయంలో ఉండగా, కొర్నేలి పంపిన మనుషులు సీమోను ఇంటి కోసం వాకబు చేసి, తలుపు దగ్గర నిలబడి 18“పేతురు అనే పేరున్న సీమోను ఇక్కడుంటున్నాడా?” అని అడిగారు.
19పేతురు ఆ దర్శనాన్ని గురించి ఇంకా ఆలోచిస్తూ ఉండగానే ఆత్మ, “చూడు, ముగ్గురు వ్యక్తులు నీ కోసం చూస్తున్నారు. 20నీవు లేచి కిందికి దిగి వారితో పాటు వెళ్ళు. వారితో వెళ్ళడానికి సంకోచించవద్దు. వారిని నేనే పంపాను” అని అతనితో చెప్పాడు. 21పేతురు ఆ మనుషుల దగ్గరికి దిగి వెళ్ళి, “మీరు వెదికే వాణ్ణి నేనే. మీరెందుకు వచ్చారు?” అని అడిగాడు.
22అందుకు వారు, “నీతిమంతుడు, దేవుణ్ణి ఆరాధించేవాడు, యూదులందరి దగ్గరా మంచి పేరు సంపాదించిన శతాధిపతి కొర్నేలి అనే ఒకాయన ఉన్నాడు. తన ఇంటికి నిన్ను పిలిపించుకుని నీవు చెప్పే మాటలు వినాలని పరిశుద్ధ దూత అతనికి తెలియజేశాడు” అని చెప్పారు. అప్పుడు పేతురు వారిని లోపలికి పిలిచి అతిథ్యమిచ్చాడు.
పేతురు కైసరయ ప్రయాణం
23తెల్లవారగానే పేతురు లేచి, వారితో బయలుదేరాడు. వారితోపాటు కొంతమంది యొప్పే ఊరి సోదరులు కూడా వెళ్ళారు. 24ఆ మరుసటి రోజు వారు కైసరయ చేరుకున్నారు. కొర్నేలి తన బంధుమిత్రులను పిలిపించి వారి కోసం ఎదురుచూస్తున్నాడు.
25పేతురు లోపలికి రాగానే కొర్నేలి అతనికి ఎదురు వెళ్ళి అతని పాదాల మీద పడి నమస్కారం చేశాడు. 26అయితే పేతురు అతనిని లేపి “లేచి నిలబడు. నేను కూడా మనిషినే” అని చెప్పాడు. 27అతనితో మాట్లాడుతూ లోపలికి వెళ్ళి చాలామంది సమావేశమై ఉండడం చూశాడు.
28అప్పుడతడు, “అన్యజాతి వారిని సందర్శించడం, వారితో సాంగత్యం చేయడం యూదునికి నియమం కాదని మీకు తెలుసు. అయితే ఏ వ్యక్తినీ నిషిద్ధమైన వాడుగా, అపవిత్రుడుగా ఎంచకూడదని దేవుడు నాకు చూపించాడు. 29కాబట్టి నన్ను పిలిచినప్పుడు అభ్యంతరం చెప్పకుండా వచ్చాను. ఇప్పుడు నన్నెందుకు పిలిపించావో నాకు చెప్పు” అని కొర్నేలితో చెప్పాడు.
30అందుకు కొర్నేలి, “నాలుగు రోజుల క్రితం ఇదే సమయానికి, మధ్యాహ్నం మూడు గంటలకు నేను మా ఇంట్లో ప్రార్థన చేసుకుంటున్నాను. ఉన్నట్టుండి ధగధగలాడే బట్టలు ధరించిన ఒక వ్యక్తి నా ఎదురుగా నిలబడి 31‘కొర్నేలీ, దేవుడు నీ ప్రార్థన విన్నాడు. పేదవారికి నీవు చేసిన దానధర్మాలను బట్టి నిన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. నీవు యొప్పేకు మనిషిని పంపి 32పేతురు అనే మారు పేరున్న సీమోనును పిలిపించు. అతడు సముద్రం పక్కనే ఉన్న చర్మకారుడు సీమోను ఇంట్లో ఉన్నాడు’ అని నాతో చెప్పాడు. 33వెంటనే మీకు కబురు పెట్టాను. మీరు రావడం మంచిది అయింది. ప్రభువు మీకాజ్ఞాపించిన వాటన్నిటిని వినడానికి ఇప్పుడు మేమంతా దేవుని సన్నిధిలో ఇక్కడ సమావేశం అయ్యాము” అని చెప్పాడు.
కొర్నేలి ఇంట్లో యూదేతరులకు పేతురు సందేశం. విశ్వాసం ద్వారా రక్షణ
అందుకు పేతురు ఇలా అన్నాడు, 34“దేవుడు పక్షపాతం లేకుండా అందరినీ సమదృష్టితో చూస్తాడని నేను ఇప్పుడు స్పష్టంగా తెలుసుకున్నాను. 35ప్రతి జనంలోనూ తనపట్ల భయభక్తులు కలిగి నీతిగా నడుచుకునే వారిని ఆయన అంగీకరిస్తాడు. 36యేసు క్రీస్తు అందరికీ ప్రభువు. ఆయన ద్వారా దేవుడు శాంతి సువార్తను ప్రకటిస్తూ, ఇశ్రాయేలీయులకు పంపిన సందేశం మీకు తెలిసిందే కదా. 37యోహాను ప్రకటించిన బాప్తిసం తరువాత గలిలయ మొదలు యూదయ ప్రాంతమంతా జరిగిన సంగతులు కూడా మీకు తెలుసు. 38అవేవంటే దేవుడు నజరేతువాడైన యేసును పరిశుద్ధాత్మతోనూ, బలప్రభావాలతోనూ అభిషేకించాడు. దేవుడు ఆయనతో ఉన్నాడు కాబట్టి ఆయన మేలు చేస్తూ సాతాను పీడన కింద ఉన్న వారందరినీ బాగుచేస్తూ వెళ్ళాడు.
39ఆయన యూదుల దేశంలో, యెరూషలేములో చేసిన వాటన్నిటికీ మేము సాక్షులం. ఈ యేసుని వారు మానుకు వేలాడదీసి చంపారు. 40దేవుడాయనను మూడవ రోజున సజీవంగా తిరిగి లేపాడు. 41ప్రజలందరికీ కాక దేవుడు ముందుగా ఏర్పరచిన సాక్షులకే, అంటే ఆయన చనిపోయి లేచిన తరువాత ఆయనతో కలిసి అన్నపానాలు చేసిన మాకే, ఆయన ప్రత్యక్షంగా కనిపించేలా అనుగ్రహించాడు. 42దేవుడు సజీవులకూ మృతులకూ న్యాయాధిపతిగా నియమించినవాడు ఈయనే అని ప్రజలకు ప్రకటించి సాక్షమివ్వాలని ఆయన మాకు ఆజ్ఞాపించాడు. 43ఆయనలో విశ్వాసముంచే వారంతా ఆయన నామంలో పాపక్షమాపణ పొందుతారని ప్రవక్తలంతా ఆయనను గూర్చి సాక్షమిస్తున్నారు” అని చెప్పాడు.
యూదేతర విశ్వాసుల పైకి పరిశుద్ధాత్మ దిగి రావడం
44పేతురు ఈ మాటలు చెబుతూ ఉండగానే అతని బోధ విన్న వారందరి మీదికీ పరిశుద్ధాత్మ దిగాడు. 45సున్నతి పొందిన విశ్వాసులంతా, అంటే పేతురుతో పాటు వచ్చినవారంతా, పరిశుద్ధాత్మ వరాన్ని యూదేతరుల మీద కూడా దేవుడు కుమ్మరించడం చూసి ఆశ్చర్యచకితులయ్యారు. 46ఎందుకంటే యూదేతరులు భాషల్లో మాట్లాడుతూ దేవుణ్ణి స్తుతించడం వారు విన్నారు. 47అప్పుడు పేతురు, “మనలాగా పరిశుద్ధాత్మను పొందిన వీరు నీటి బాప్తిస్మం పొందకుండా ఎవరైనా అడ్డు చెప్పగలరా?” అని చెప్పి 48యేసుక్రీస్తు నామంలో వారు బాప్తిస్మం పొందాలని ఆజ్ఞాపించాడు. అటు తరువాత మరికొన్ని రోజులు తమ దగ్గర ఉండమని వారతన్ని బతిమాలారు.
ప్రస్తుతం ఎంపిక చేయబడింది:
అపొస్తలుల కార్యములు 10: IRVTel
హైలైట్
షేర్ చేయి
కాపీ
మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి
TEL-IRV
Creative Commons License
Indian Revised Version (IRV) - Telugu (ఇండియన్ రేవిజ్డ్ వెర్షన్ - తెలుగు), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.