అయితే పేతురు ఆ పదకొండు మందితో లేచి నిలబడి బిగ్గరగా వారితో ఇలా అన్నాడు, “యూదయ ప్రజలారా, యెరూషలేములో నివసిస్తున్న సమస్త జనులారా, ఇది మీకు తెలియాలి. నా మాటలు జాగ్రత్తగా వినండి.
“మీరనుకున్నట్టు వీరు మద్యపానం చేయలేదు. ఇప్పుడు ఉదయం తొమ్మిదయినా కాలేదు. యోవేలు ప్రవక్త చెప్పిన సంగతి ఇదే,
‘అంత్యదినాల్లో నేను మనుషులందరి మీదా నా ఆత్మను కుమ్మరిస్తాను.
మీ కుమారులూ కుమార్తెలూ ప్రవచిస్తారు.
మీ యువకులు దర్శనాలు చూస్తారు.
మీ వృద్ధులు కలలు కంటారు,
ఆ రోజుల్లో నా దాసుల మీదా దాసీల మీదా నా ఆత్మను కుమ్మరిస్తాను కాబట్టి వారు ప్రవచిస్తారు.
పైన ఆకాశంలో మహత్కార్యాలనూ కింద భూమ్మీద సూచకక్రియలనూ రక్తం, అగ్ని, పొగ, ఆవిరినీ చూపిస్తాను.
ప్రభువు ప్రత్యక్షమయ్యే మహిమాయుక్తమైన ఆ మహాదినం రాక ముందు సూర్యుడు చీకటిగా, చంద్రుడు రక్తంగా మారతారు.
ప్రభువు నామంలో ప్రార్థన చేసే వారంతా పాప విమోచన పొందుతారు’ అని దేవుడు చెబుతున్నాడు.
“ఇశ్రాయేలు ప్రజలారా, ఈ మాటలు వినండి, దేవుడు నజరేయుడైన యేసు చేత అద్భుతాలూ మహత్కార్యాలూ సూచకక్రియలూ మీ మధ్య చేయించి, ఆయనను తన దృష్టికి యోగ్యుడుగా కనపరిచాడు. ఇది మీకే తెలుసు. దేవుని స్థిరమైన ప్రణాళికనూ ఆయనకున్న భవిష్య జ్ఞానాన్నీ అనుసరించి ఆయనను అప్పగించడం జరిగింది. ఈయనను మీరు దుష్టుల చేత సిలువ వేయించి చంపారు. మరణం ఆయనను బంధించి ఉంచడం అసాధ్యం కాబట్టి దేవుడు మరణ వేదనలు తొలగించి ఆయనను లేపాడు.
“ఆయన గూర్చి దావీదు ఇలా అన్నాడు,
‘నేనెప్పుడూ నా ఎదుట ప్రభువును చూస్తున్నాను,
ఆయన నా కుడి పక్కనే ఉన్నాడు కాబట్టి ఏదీ నన్ను కదల్చదు.
నా హృదయం ఉల్లాసంగా ఉంది. నా నాలుక ఆనందించింది.
నా శరీరం కూడా ఆశాభావంతో నిశ్చింతగా ఉంటుంది.
ఎందుకంటే నీవు నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టవు,
నీ పరిశుద్ధుణ్ణి కుళ్ళు పట్టనియ్యవు.
నాకు జీవమార్గాలు తెలిపావు.
నీ ముఖదర్శనంతో నన్ను ఉల్లాసంతో నింపుతావు.’
“సోదరులారా, పూర్వికుడైన దావీదును గురించి మీతో నేను ధైర్యంగా మాట్లాడగలను. అతడు చనిపోయి సమాధి అయ్యాడు. అతని సమాధి ఇప్పటికీ మన మధ్య ఉంది. అతడు ప్రవక్త కాబట్టి ‘అతని గర్భఫలం నుంచి ఒకడిని అతని సింహాసనం మీద కూర్చోబెడతాను’ అని “దేవుడు తనతో ప్రమాణపూర్వకంగా శపథం చేసిన సంగతి అతనికి తెలుసు. క్రీస్తు పాతాళంలో నిలిచి ఉండి పోలేదనీ, ఆయన శరీరం కుళ్ళి పోలేదనీ దావీదు ముందే తెలుసుకుని ఆయన పునరుత్థానాన్ని గూర్చి చెప్పాడు.
“ఈ యేసును దేవుడు లేపాడు. దీనికి మేమంతా సాక్షులం. కాబట్టి ఆయనను దేవుడు తన కుడి స్థానానికి హెచ్చించాడు. ఆయన తన తండ్రి వాగ్దానం చేసిన పరిశుద్ధాత్మను ఆయన వలన పొంది, మీరు చూస్తున్న, వింటున్న ఈ కుమ్మరింపును జరిగించాడు. దావీదు పరలోకానికి ఆరోహణం కాలేదు. అయితే అతడిలా అన్నాడు,
‘నేను నీ శత్రువులను నీ పాదాల కింద పాదపీఠంగా ఉంచే వరకూ
నీవు నా కుడి పక్కన కూర్చోమని ప్రభువు నా ప్రభువుతో చెప్పాడు.’
“మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగా క్రీస్తుగా నియమించాడు. ఇది ఇశ్రాయేలు జాతి అంతా కచ్చితంగా తెలుసుకోవాలి.”
వారీ మాట విన్నప్పుడు తమ హృదయంలో గుచ్చినట్టయి, “సోదరులారా, మేమేం చేయాలి” అని పేతురునూ మిగతా అపొస్తలులనూ అడిగారు. దానికి పేతురు, “మీలో ప్రతివాడూ పశ్చాత్తాపపడి, పాపక్షమాపణ కోసం యేసుక్రీస్తు నామంలో బాప్తిసం పొందండి. అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందుతారు. ఈ వాగ్దానం మీకూ మీ పిల్లలకూ, దూరంగా ఉన్న వారందరికీ, అంటే ప్రభువైన మన దేవుడు తన దగ్గరికి పిలుచుకొనే వారందరికీ చెందుతుంది” అని వారితో చెప్పాడు. ఇంకా అతడు అనేక రకాలైన మాటలతో సాక్షమిచ్చి, “మీరు ఈ దుష్ట తరం నుండి వేరుపడి రక్షణ పొందండి” అని వారిని హెచ్చరించాడు. అతని సందేశం నమ్మిన వారు బాప్తిసం పొందారు. ఆ రోజు దాదాపు మూడువేల మంది విశ్వాసుల గుంపులో చేరారు.