అపొస్తలుల కార్యములు 21
21
తూరు పట్టణానికి ప్రయాణం
1మేము వారిని విడిచి ఓడ ఎక్కి నేరుగా వెళ్ళి కోసు పట్టణానికి, మరునాడు రొదు పట్టణానికి, అక్కడ నుంచి పతర రేవుకు వచ్చాం. 2అక్కడ ఫేనీకే బయలుదేరుతున్న ఒక ఓడను చూసి దానిలో ఎక్కాం. 3దానిపై వెళ్తూ కుప్ర కనిపిస్తూ ఉండగా దానికి ఎడమ పక్కగా ప్రయాణించి, సిరియా వైపుగా వెళ్ళి, తూరులో దిగాం. అక్కడ ఓడలోని సరుకు దిగుమతి చెయ్యాల్సి ఉంది.
యెరూషలేముకు వెళ్ళవద్దని పౌలుకు హెచ్చరిక
4మేమక్కడి శిష్యులను కలుసుకుని అక్కడ ఏడు రోజులు ఉన్నాం. వారు ఆత్మ ద్వారా “నీవు యెరూషలేములో కాలు పెట్టవద్దు” అని పౌలుతో చెప్పారు. 5ఆ రోజులు గడిచిన తరువాత మేము ప్రయాణమైనప్పుడు వారంతా భార్యా పిల్లలతో వచ్చి మమ్మల్ని పట్టణం బయటి వరకూ సాగనంపారు. వారూ, మేమూ సముద్రతీరంలో మోకాళ్ళపై ప్రార్థించి ఒకరి దగ్గర మరొకరు సెలవు తీసుకున్నాం. 6మేము ఓడ ఎక్కిన తరువాత వారు తమ ఇళ్ళకు తిరిగి వెళ్ళారు.
7మేము తూరు నుండి ప్రయాణించి, తొలెమాయికి వచ్చి, అక్కడి సోదరులను పలకరించి వారి దగ్గర ఒక రోజు గడిపాం. 8మరునాడు బయలుదేరి కైసరయ వచ్చి, అపొస్తలులు నియమించిన ఏడుగురిలో ఒకడైన సువార్తికుడు ఫిలిప్పు ఇంటికి వచ్చి అతనితో ఉన్నాం. 9ప్రవచన వరం ఉన్న నలుగురు కుమార్తెలు అతనికి ఉన్నారు. వారంతా కన్యలు.
యెరూషలేముకు వెళ్ళవద్దని మళ్లీ హెచ్చరిక
10మేమక్కడ చాలా రోజులు ఉన్నాం. అగబు అనే ఒక ప్రవక్త యూదయ నుండి వచ్చాడు. 11అతడు వచ్చి పౌలు నడికట్టు తీసుకుని, దానితో తన చేతులను కాళ్ళను కట్టుకుని, “యెరూషలేములోని యూదులు ఈ నడికట్టుగల వ్యక్తిని ఈ విధంగా బంధించి, యూదేతరుల చేతికి అప్పగిస్తారని పరిశుద్ధాత్మ చెబుతున్నాడు” అన్నాడు. 12ఈ మాట విన్నప్పుడు మేమూ, అక్కడివారూ యెరూషలేముకు వెళ్ళవద్దని పౌలును బతిమాలుకొన్నాం. 13కానీ పౌలు, “ఇదేమిటి? మీరు ఏడ్చి నా గుండె బద్దలు చేస్తున్నారు? నేను ప్రభు యేసు నామం నిమిత్తం యెరూషలేములో బంధకాలకే కాదు, చనిపోవడానికి సైతం సిద్ధంగా ఉన్నాను” అని చెప్పాడు. 14అతడు మనసు మార్చుకోడని గ్రహించాక మేము, “ప్రభువు చిత్తం జరుగుతుంది గాక” అని ఊరుకున్నాం.
యెరూషలేములో పౌలు
15ఆ రోజులు గడచిన తరువాత మాకు కావలసిన సామగ్రి తీసుకుని యెరూషలేముకు ప్రయాణించాం. 16మాతో కలిసి కైసరయ నుంచి కొందరు శిష్యులు, మొదటి నుండి శిష్యుడుగా ఉన్న సైప్రసు వాసి మ్నాసోను దగ్గరికి మమ్మల్ని తీసుకుపోయారు. అతని ఇంట్లో మాకు బస ఏర్పాటు చేశారు. 17మేము యెరూషలేము చేరినప్పుడు సోదరులు మమ్మల్ని సంతోషంతో చేర్చుకున్నారు.
18మరునాడు పెద్దలంతా అక్కడికి వచ్చినపుడు పౌలు మాతో కలిసి యాకోబు దగ్గరికి వచ్చాడు. 19అతడు వారిని కుశల ప్రశ్నలు అడిగి, తన పరిచర్య వలన దేవుడు యూదేతరుల్లో చేసిన కార్యాలను వివరంగా తెలియజెప్పాడు.
20అది విని వారు దేవుణ్ణి మహిమపరచి అతనితో, “సోదరా, యూదుల్లో విశ్వాసులు ఎన్ని వేలమంది ఉన్నారో చూశావు గదా? వారంతా ధర్మశాస్త్రంలో ఆసక్తి గలవారు. 21యూదేతరుల మధ్య నివసించే యూదులు తమ పిల్లలకు సున్నతి చేయకూడదనీ, మన ఆచారాలను పాటించకూడదనీ నీవు చెప్పడం వలన వారంతా మోషేను విడిచిపెట్టాలని నీవు బోధిస్తున్నట్టుగా ఇక్కడి వారికి సమాచారం ఉంది.
22కాబట్టి మనమేం చేద్దాం? నీవు వచ్చిన సంగతి వారికి తప్పకుండా తెలుస్తుంది. 23మేము నీకు చెప్పినట్టు చెయ్యి. మొక్కుబడి ఉన్న నలుగురు వ్యక్తులు మా దగ్గర ఉన్నారు. 24నీవు వారిని తీసుకుపోయి వారితో కూడా శుద్ధి చేసుకుని, వారు తల క్షౌరం చేయించుకోడానికి అయ్యే ఖర్చు నువ్వే భరించు. అప్పుడు నిన్ను గూర్చి తాము విన్న సమాచారం నిజం కాదనీ, నువ్వు కూడా ధర్మశాస్త్రాన్ని యథావిధిగా పాటించే వ్యక్తివనీ వీరు గ్రహిస్తారు.
25అయితే విశ్వసించిన యూదేతరుల విషయంలో విగ్రహాలకు అర్పించిన వాటినీ, రక్తాన్నీ, వారికి రాశాం, జారత్వాన్నీ మానాలని నిర్ణయించి వారికి రాశాం” అని చెప్పారు.
26కాబట్టి పౌలు ఆ మరునాడు మొక్కుబడి ఉన్న ఆ వ్యక్తులను వెంటబెట్టుకుని వెళ్ళి, వారితో కలిసి శుద్ధి చేసుకుని, దేవాలయంలో ప్రవేశించి, వారందరి పక్షంగా కానుక అర్పించే వరకూ శుద్ధిదినాలు నెరవేరుస్తానని చెప్పాడు.
ఆలయంలో యూదులు పౌలును బంధించడం
27ఏడు రోజులు పూర్తి కావచ్చినప్పుడు ఆసియ నుండి వచ్చిన యూదులు దేవాలయంలో అతన్ని చూసి, బలవంతంగా పట్టుకుని అక్కడి ప్రజలందరినీ కలవర పరచి 28“ఇశ్రాయేలీయులారా, వచ్చి సహాయం చేయండి. ప్రజలకీ, ధర్మశాస్త్రానికీ, ఈ స్థలానికీ విరోధంగా అందరికీ, అన్నిచోట్లా బోధిస్తున్నవాడు వీడే. పైగా వీడు గ్రీకు వారిని దేవాలయంలోకి తెచ్చి ఈ పరిశుద్ధ స్థలాన్ని అపవిత్రం చేశాడు” అని కేకలు వేశారు.
29ఎఫెసు వాడైన త్రోఫిము అంతకు ముందు పౌలుతో కలిసి ఉండడం వారు చూశారు కాబట్టి పౌలు అతణ్ణి కూడా దేవాలయంలోకి తీసుకుని వచ్చాడని వారు భావించారు. 30పట్టణమంతా గందరగోళంగా ఉంది. ప్రజలు గుంపులు గుంపులుగా పరుగెత్తుకు వచ్చి, పౌలును పట్టుకుని దేవాలయంలో నుండి బయటికి ఈడ్చి తలుపులు మూసేశారు.
31వారు అతణ్ణి చంపడానికి ప్రయత్నించారు. యెరూషలేము నగరమంతా అల్లకల్లోలంగా ఉందని ప్రధాన సైన్యాధికారికి సమాచారం వచ్చింది. 32వెంటనే అతడు సైనికులనూ, శతాధిపతులనూ వెంటబెట్టుకుని వారి దగ్గరికి పరుగెత్తుకు వచ్చాడు. వారు ఆ అధికారినీ, సైనికులనీ చూసి పౌలును కొట్టడం ఆపారు.
33అతడు వచ్చి పౌలును పట్టుకుని, రెండు సంకెళ్లతో అతనిని బంధించమని ఆజ్ఞాపించి, “ఇతడెవడు? ఏమి చేశాడు?” అని అడిగాడు. 34అయితే జనం వివిధ రకాలుగా కేకలు వేస్తూ అల్లరి చేయడం చేత అతడు నిజం తెలుసుకోలేక పౌలును కోటలోకి తీసుకుపొమ్మని ఆజ్ఞాపించాడు.
35పౌలు మెట్ల మీదికి వచ్చినప్పుడు ప్రజలు గుంపులుగా పోగై దాడికి దిగడం వలన సైనికులు అతణ్ణి మోసుకుపోవలసి వచ్చింది. 36ఎందుకంటే అతణ్ణి చంపమని ఆ జనసమూహం కేకలు వేస్తూ వారి వెంటబడ్డారు.
37వారు పౌలుని కోటలోకి తీసుకు పోతుండగా అతడు ఆ సేనాధిపతిని, “నేను నీతో ఒక మాట చెప్పవచ్చా?” అని అడిగాడు. అందుకు అతడు, “నీకు గ్రీకు భాష తెలుసా?’ 38ఇంతకు ముందు నాలుగు వేలమంది ఉగ్రవాదులను తీసుకుని అరణ్యంలోకి పారిపోయిన ఐగుప్తీయుడివి నువ్వే కదా?” అని అడిగాడు.
39అందుకు పౌలు, “నేను కిలికియలోని తార్సు పట్టణానికి చెందిన యూదుణ్ణి. ఒక మహా పట్టణపు పౌరుణ్ణి. నాకు ఈ ప్రజలతో మాటలాడే అవకాశం ఇవ్వమని నిన్ను వేడుకుంటున్నాను” అన్నాడు. 40అతడు దానికి అనుమతించాడు. అప్పుడు పౌలు మెట్ల మీద నిలబడి ప్రజలకి చేతితో సైగ చేశాడు. వారు సద్దుమణిగాక అతడు హెబ్రీ భాషలో ఇలా అన్నాడు.
ప్రస్తుతం ఎంపిక చేయబడింది:
అపొస్తలుల కార్యములు 21: IRVTel
హైలైట్
షేర్ చేయి
కాపీ
మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి
TEL-IRV
Creative Commons License
Indian Revised Version (IRV) - Telugu (ఇండియన్ రేవిజ్డ్ వెర్షన్ - తెలుగు), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.