22
జనసమూహం ఎదుట పౌలు సంజాయిషీ. తన మార్పు గురించి సాక్ష్యం
అపొ.కా. 9:1-18; 26:9-18
1“సోదరులారా, తండ్రులారా, నేనిప్పుడు మీ ఎదుట చెప్పుకొనే జవాబు వినండి.” 2అతడు హెబ్రీ భాషలో మాటలాడడం విన్నప్పుడు వారు నిశ్శబ్దమై పోయారు. అతడు ఈ విధంగా చెప్పాడు,
3“నేను కిలికియలోని తార్సు పట్టణంలో పుట్టిన యూదుణ్ణి. అయితే ఈ పట్టణంలో గమలీయేలు పాదాల దగ్గర పెరిగి, మన పూర్వీకుల ధర్మశాస్త్ర సంబంధమైన ఆజ్ఞల్లో శిక్షణ పొందాను. మీరంతా ఈ రోజు ఉన్న విధంగా దేవుని విషయంలో ఆసక్తి కలిగి, 4ఈ విశ్వాస మార్గాన్ని అనుసరిస్తున్న స్త్రీ పురుషులను బంధించి చెరసాలలో వేయిస్తూ, చనిపోయేదాకా హింసించాను. 5ఈ విషయంలో ప్రధాన యాజకుడూ పెద్దలందరూ సాక్షులు. నేను వారి నుండి దమస్కులోని మన సోదరులకు లేఖలు తీసుకుని, అక్కడి విశ్వాసులను కూడా బంధించి శిక్ష వేయడానికి యెరూషలేముకు తీసుకు రావాలని అక్కడికి వెళ్ళాను.
6నేను ప్రయాణం చేస్తూ దమస్కును సమీపించినప్పుడు మధ్యాహ్నం ఆకాశం నుండి ఒక గొప్ప వెలుగు హఠాత్తుగా నా చుట్టూ ప్రకాశించింది. 7నేను నేల మీద పడి ‘సౌలూ సౌలూ, నీవు నన్నెందుకు హింసిస్తున్నావని’ నాతో ఒక స్వరం పలకడం విన్నాను. 8అందుకు నేను ‘ప్రభూ! నీవెవరివి?’ అని అడగగా ఆయన, ‘నేను నీవు హింసిస్తున్న నజరేయుడైన యేసుని’ అని నాతో చెప్పాడు. 9నాతో ఉన్నవారు ఆ వెలుగును చూశారుగానీ నాతో మాటలాడిన స్వరాన్ని వినలేదు. 10అప్పుడు నేను ‘ప్రభూ, నన్నేం చేయమంటావు?’ అని అడిగాను. అప్పుడు ప్రభువు, ‘నువ్వు లేచి దమస్కులోకి వెళ్ళు, అక్కడ నువ్వేం చేయాలని నేను నిర్ణయించానో అవన్నీ నీకు తెలుస్తాయి’ అని నాతో అన్నాడు. 11ఆ వెలుగు ప్రభావం వలన నేను చూడలేకపోయాను. దాంతో నాతో ఉన్నవారు నన్ను నడిపిస్తూ దమస్కు పట్టణంలోకి తీసుకెళ్ళారు.
12“అక్కడ ధర్మశాస్త్రం విషయంలో భక్తిపరుడూ, అక్కడ నివసించే యూదులందరి చేతా మంచి పేరు పొందిన అననీయ అనే వ్యక్తి నా దగ్గరికి వచ్చి 13‘సోదరా సౌలూ, చూపు పొందు’ అని నాతో చెప్పగానే అదే గడియలో నేను చూపు పొంది అతణ్ణి చూశాను. 14అప్పుడు అతడు ‘మన పూర్వీకుల దేవుని సంకల్పాన్ని తెలుసుకోడానికీ, ఆ నీతిమంతుణ్ణి చూడటానికీ, ఆయన నోటి మాట వినడానికీ నిన్ను నియమించాడు. 15నీవు చూసిన వాటిని గురించీ, విన్న వాటిని గురించీ ప్రజలందరి ముందూ ఆయనకు సాక్షివై ఉంటావు. 16కాబట్టి ఆలస్యమెందుకు? లేచి బాప్తిసం పొంది, ఆయన నామంలో ప్రార్థన చేసి నీ పాపాలను కడిగి వేసుకో’ అన్నాడు.
17ఆ వెంటనే నేను యెరూషలేముకు తిరిగి వచ్చి దేవాలయంలో ప్రార్థన చేస్తుండగా పరవశానికి లోనై ప్రభువుని చూశాను. 18ఆయన నాతో, ‘నీవు వెంటనే యెరూషలేము విడిచి వెళ్ళు. నన్ను గూర్చి నీవిచ్చే సాక్ష్యం ఇక్కడి వారు అంగీకరించరు’ అని చెప్పాడు. 19అందుకు నేను, ‘ప్రభూ, ప్రతి సమాజ మందిరంలో నీపై నమ్మకముంచిన వారిని నేను చెరసాలలో వేయించి కొట్టించానని వారికి తెలుసు. 20అంతేగాక నీ సాక్షి అయిన స్తెఫను రక్తం ఒలికించినప్పుడు నేను కూడా అక్కడ నిలబడి అందుకు సమ్మతించి అతణ్ణి చంపినవారి వస్త్రాలకు కాపలా ఉన్నాను’ అని చెప్పాను. 21అందుకు ఆయన ‘వెళ్ళు, ఎందుకంటే నేను నిన్ను దూరంగా యూదేతరుల దగ్గరికి పంపుతాను’ అని నాతో చెప్పాడు.”
22ఇంతవరకూ అతడు చెప్పింది వారు చక్కగా విన్నారు. కానీ ఆ వెంటనే వారు, “ఇలాటివాడు బతకడానికి అర్హుడు కాదు. భూమి మీద ఉండకుండా వాణ్ణి చంపివేయండి” అని కేకలు వేశారు. 23వారు కేకలు వేస్తూ తమ పై వస్త్రాలు విదిలించుకుంటూ ఆకాశం వైపు దుమ్మెత్తి పోశారు. 24ఈ విధంగా వారు అతనికి వ్యతిరేకంగా కేకలు వేయడానికి కారణమేమిటో తెలుసుకోవడం కోసం సహస్రాధిపతి అతనిని కొరడాలతో కొట్టి, విచారణ కోసం కోటలోకి తీసుకుని పొండని ఆజ్ఞాపించాడు.
రోమా పౌరుని ఆధిక్యత
25వారు పౌలును తాళ్ళతో కట్టేటప్పుడు అతడు తన దగ్గర నిలబడిన శతాధిపతిని, “శిక్ష విధించకుండానే ఒక రోమా పౌరుణ్ణి కొరడాలతో కొట్టడానికి మీకు అధికారం ఉందా?” అని అడిగాడు. 26శతాధిపతి ఆ మాట విని సైనికాధికారి దగ్గరికి వెళ్ళి, “నీవేం చేస్తున్నావు? ఈ వ్యక్తి రోమీయుడు, తెలుసా?” అన్నాడు. 27అప్పుడు సహస్రాధిపతి వచ్చి పౌలుతో, “నీవు రోమ్ పౌరుడివా? అది నాతో చెప్పు” అన్నాడు. 28పౌలు “అవును” అన్నాడు. అప్పుడు ఆ సైనికాధికారి, “నేను చాలా వెల చెల్లించి ఈ పౌరసత్వం సంపాదించుకున్నాను” అన్నాడు. అందుకు పౌలు, “నేనైతే పుట్టుకతోనే రోమా పౌరుణ్ణి” అని చెప్పాడు. 29కాబట్టి వారు వెంటనే పౌలుని విడిచిపెట్టారు. పైగా అతడు రోమీయుడని తెలుసుకున్నప్పుడు అతణ్ణి బంధించినందుకు సైనికాధికారి కూడా భయపడ్డాడు.
30మరునాడు, యూదులు అతని మీద మోపిన నేరాన్ని కచ్చితంగా తెలుసుకోవడం కోసం, సైనికాధికారి అతని సంకెళ్ళు విడిపించి, ప్రధాన యాజకులూ, మహా సభవారంతా సమావేశం కావాలని ఆజ్ఞాపించి, పౌలును తీసుకొచ్చి వారి ముందు నిలబెట్టాడు.