అపొస్తలుల కార్యములు 28
28
మెలితే దివిలో పౌలుకు పాము కాటు
1మేము తప్పించుకొన్న తరువాత ఆ ద్వీపం మెలితే అని మాకు తెలిసింది. 2అనాగరికులైన అక్కడి ప్రజలు మాకు చేసిన సపర్య అంతా ఇంతా కాదు. అప్పుడు వర్షం కురుస్తూ చలిగా ఉండడంతో వారు నిప్పు రాజబెట్టి మా అందరినీ చేర్చుకున్నారు.
3అప్పుడు పౌలు కొన్ని పుల్లలేరి నిప్పుల మీద వేస్తుండగా ఒక పాము ఆ వేడికి బయటికి వచ్చి అతని చెయ్యి పట్టుకుంది. 4ఆ ప్రజలు ఆ పాము అతని చేతిని పట్టుకుని వేలాడడం చూసి “ఈ మనిషి తప్పకుండా హంతకుడై ఉంటాడు. ఇతడు సముద్రం నుండి తప్పించుకున్నప్పటికీ న్యాయం ఇతణ్ణి వదిలిపెట్ట లేదు” అని తమలో తాము చెప్పుకున్నారు. 5కానీ పౌలు మాత్రం ఆ విష జంతువును మంటలో జాడించివేసి, ఏ హానీ పొందలేదు. 6వారైతే అతనికి హటాత్తుగా జ్వరం వంటిది రావటమో, అతడు అకస్మాత్తుగా పడి చనిపోవడమో జరుగుతుందని కనిపెడుతున్నారు. చాలాసేపు కనిపెట్టిన తరువాత అతనికి ఏ హానీ కలగకపోవడం చూసి తమ అభిప్రాయం మార్చుకుని, “ఇతడొక దేవుడు” అని చెప్పసాగారు.
7పొప్లి అనేవాడు ఆ ద్వీపంలో ముఖ్యుడు. అతనికి ఆ ప్రాంతంలో భూములున్నాయి. అతడు మమ్మల్ని చేర్చుకుని మూడు రోజులు స్నేహభావంతో ఆతిథ్యమిచ్చాడు.
పొప్లి తండ్రికి స్వస్థత
8ఆ సమయంలో పొప్లి తండ్రి జ్వరం, రక్త విరేచనాల చేత బాధపడుతూ పండుకుని ఉన్నాడు. పౌలు అతని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసి, అతని మీద చేతులుంచి స్వస్థపరిచాడు. 9ఇది చూసి ఆ దీవిలో ఉన్న మిగిలిన రోగులు కూడా వచ్చి స్వస్థత పొందారు. 10వారు అనేక సత్కారాలతో మాకు మర్యాద చేసి, మేము ఓడ ఎక్కి వెళ్ళినప్పుడు మాకు కావలసిన వస్తువులు తెచ్చి ఓడలో ఉంచారు. 11కవల దేవుళ్ళ చిహ్నంతో ఉన్న అలెగ్జాండ్రియ పట్టణపు ఓడ ఒకటి ఆ ద్వీపంలో చలికాలమంతా నిలిచి ఉంది. మూడు నెలలు అక్కడున్న తరువాత ఆ ఓడ ఎక్కి బయలుదేరి 12సురకూసై నగరానికి వచ్చి అక్కడ మూడు రోజులున్నాం.
13అక్కడ నుండి చుట్టూ తిరిగి రేగియు పట్టణం వచ్చి ఒక రోజు తరువాత దక్షిణపు గాలి విసరడంతో మరునాడు పొతియొలీ పట్టణం వచ్చాం. 14అక్కడి సోదరులను కలిసినప్పుడు వారు తమ దగ్గర ఏడు రోజులు ఉండమని మమ్మల్ని వేడుకున్నారు. ఆ తరువాత రోమ్ నగరానికి వచ్చాం. 15అక్కడ నుండి సోదరులు మా సంగతి విని అప్పీయా సంతపేట వరకూ, మూడు సత్రాల పేట వరకూ ఎదురు వచ్చి మమ్మల్ని ఆహ్వానించారు. పౌలు వారిని చూసి దేవునికి కృతజ్ఞతా స్తుతులు చెల్లించి ధైర్యం తెచ్చుకున్నాడు.
రోమ్ చేరుకున్న పౌలు, యూదుల మధ్య పరిచర్య
16మేము రోమ్ కు వచ్చినప్పుడు పౌలు తనకు కాపలాగా ఉన్న సైనికులతో కలిసి ప్రత్యేకంగా ఉండడానికి అనుమతి పొందాడు. 17మూడు రోజుల తరువాత అతడు ప్రముఖ యూదులను తన దగ్గరికి పిలిపించాడు. వారు వచ్చినప్పుడు అతడు, “సోదరులారా, నేను మన ప్రజలకూ, పూర్వీకుల ఆచారాలకూ వ్యతిరేకంగా ఏదీ చేయకపోయినా, యెరూషలేములో నన్ను రోమీయుల చేతికి అప్పగించారు.
18వారు నన్ను విచారించి నాలో మరణానికి తగిన కారణం ఏదీ లేకపోవడంతో నన్ను విడిచిపెట్టాలి అనుకున్నారు గాని 19యూదులు అభ్యంతరం చెప్పడం వలన నేను ‘సీజరు ఎదుట చెప్పుకొంటాను’ అనవలసి వచ్చింది. నా స్వజనం మీద నేరం మోపాలని నా అభిప్రాయం కాదు.
20ఈ కారణం చేతనే మీతో మాట్లాడాలని పిలిపించాను. ఇశ్రాయేలు నిరీక్షణ నిమిత్తం ఈ గొలుసులతో నన్ను బంధించి ఉంచారు” అని వారితో చెప్పాడు. 21అందుకు వారు, “యూదయ నుండి మీ గురించి మాకేమీ ఉత్తరాలు రాలేదు, ఇక్కడికి వచ్చిన యూదు సోదరుల్లో ఒక్కడైనా మీ గురించి చెడ్డ సంగతి ఏదీ మాకు తెలుపలేదు. ఎవరూ చెప్పుకోలేదు కూడా. 22అయినా ఈ విషయంలో మీ అభిప్రాయం మీ నోటనే వినగోరుతున్నాం. ఈ మతభేదం గూర్చి అన్ని చోట్లా అభ్యంతరాలు ఉన్నాయని మాత్రం మాకు తెలుసు” అని జవాబిచ్చారు.
23అతనికి ఒక రోజు ఏర్పాటు చేసి, అతడున్న చోటికి చాలా మంది వచ్చారు. ఉదయం నుండి సాయంకాలం వరకూ అతడు దేవుని రాజ్యం గూర్చి పూర్తిగా సాక్షమిస్తూ, మోషే ధర్మశాస్త్రంలో నుండీ, ప్రవక్తల్లో నుండీ సంగతులను వారికి ఎత్తి చూపుతూ, యేసుని గూర్చి వివరంగా బోధిస్తూ వారిని ఒప్పిస్తూ ఉన్నాడు. 24అతడు చెప్పిన సంగతులు కొందరు నమ్మారు, కొందరు నమ్మలేదు. 25వారిలో భేదాభిప్రాయాలు కలిగాయి. పౌలు చివరిగా వారితో ఒక మాట చెప్పాడు. అదేమంటే
26వారు వింటారు గాని అర్థం చేసుకోరు. చూస్తారు కానీ గ్రహించుకోరు’ అని ఈ ప్రజలతో చెప్పండి.
27ఈ ప్రజలు కన్నులారా చూసి, చెవులారా విని, మనసారా గ్రహించి నా వైపు తిరిగి
నా వలన స్వస్థత పొందకుండా వారి హృదయాలు బండబారి పోయాయి.
వారు ఏదీ వినిపించుకోరు, వారు కళ్ళు మూసుకుని ఉన్నారు’
అని పరిశుద్ధాత్మ యెషయా ప్రవక్త ద్వారా మీ పితరులతో చెప్పిన మాట సరైందే. 28కాబట్టి దేవుని వలన కలిగిన ఈ రక్షణ యూదేతరుల దగ్గరికి తరలి పోతున్నదని మీరు తెలుసుకుంటారు. 29వారు దాన్ని అంగీకరిస్తారు.” ఈ మాటలు విని వారంతా వెళ్ళిపోయారు. 30పౌలు రెండు సంవత్సరాలు పూర్తిగా తన అద్దె ఇంట్లో నివసించి, తన దగ్గరికి వచ్చే వారినందరినీ ఆదరిస్తూ 31ఏ ఆటంకమూ లేకుండా పూర్ణ ధైర్యంతో దేవుని రాజ్యం గూర్చి ప్రకటిస్తూ, ప్రభువైన యేసు క్రీస్తును గూర్చిన సంగతులు బోధిస్తూ ఉన్నాడు.
ప్రస్తుతం ఎంపిక చేయబడింది:
అపొస్తలుల కార్యములు 28: IRVTel
హైలైట్
షేర్ చేయి
కాపీ

మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి
TEL-IRV
Creative Commons License
Indian Revised Version (IRV) - Telugu (ఇండియన్ రేవిజ్డ్ వెర్షన్ - తెలుగు), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.