అపొస్తలుల కార్యములు 5:1-11

అపొస్తలుల కార్యములు 5:1-11 IRVTEL

అననీయ అనే ఒక వ్యక్తి తన భార్య సప్పీరాతో కలిసి పొలం అమ్మాడు. భార్యకు తెలిసే అతడు ఆ డబ్బులో కొంత దాచుకుని కొంత తెచ్చి అపొస్తలుల పాదాల దగ్గర పెట్టాడు. అప్పుడు పేతురు, “అననీయా!, నీ భూమి ఖరీదులో కొంత దాచుకుని సాతాను ప్రేరణకు లొంగి పరిశుద్ధాత్మను ఎందుకు మోసగించావు? అది నీ దగ్గరున్నపుడు నీదే గదా? అమ్మిన తరువాత ఆ డబ్బు నీ ఆధీనంలోనే ఉంది కదా! ఈ సంగతిని ఎందుకు నీ హృదయంలో ఉద్దేశించుకున్నావు? నీవు మనుషులతో కాదు దేవునితోనే అబద్ధమాడావు” అని అతనితో చెప్పాడు. అననీయ ఈ మాటలు వింటూనే కుప్పకూలి ప్రాణం విడిచాడు. అది విన్న వారందరికీ చాలా భయం వేసింది. అప్పుడు కొందరు యువకులు వచ్చి అతణ్ణి గుడ్డలో చుట్టి మోసుకుపోయి పాతిపెట్టారు. సుమారు మూడుగంటల తరువాత అతని భార్య ఏం జరిగిందో తెలియక లోపలికి వచ్చింది. అప్పుడు పేతురు, “మీరు ఆ పొలాన్ని ఇంతకే అమ్మారా? నాతో చెప్పు” అని ఆమెనడిగాడు. అందుకామె, “అవును, యింతకే అమ్మాము” అని చెప్పింది. అందుకు పేతురు, “ప్రభువు ఆత్మను పరీక్షించడానికి మీరెందుకు ఒకటయ్యారు? ఇదిగో, నీ భర్తను పాతిపెట్టిన వారింకా లోపలికైనా రాలేదు. వారు నిన్నూ మోసికుని పోతారు” అని ఆమెతో చెప్పాడు. వెంటనే ఆమె అతని కాళ్ళ దగ్గర పడి ప్రాణం విడిచింది. ఆ యువకులు లోపలికి వచ్చి ఆమె చనిపోయిందని చూసి ఆమెనూ మోసికొనిపోయి, ఆమె భర్త పక్కనే పాతిపెట్టారు. సంఘమంతటికీ, ఇంకా ఈ సంగతులు విన్న వారందరికీ చాలా భయం వేసింది.